అందితే బేరం! అందకుంటే నేరం!

కళ్ళు మూసుకుంటే పదేళ్ళు గడిచిపోయాయి.
కాదు.. కాదు.. మనమంతా కళ్ళు మూసుకుంటూనే గడిచిపోయాయి..
పులులు ప్రోటీన్లున్న గడ్డి తిని బలుస్తున్నాయన్నారు. కళ్ళు తెరిచి చూడలేక పోయాయి.
లేళ్ళు కేవలం కార్బోహైడ్రేట్లు అన్నం తిని చిక్కి పోతున్నాయన్నారు. చూసే ధైర్యం చెయ్యలేక

పోయాం.
నీళ్లు లేని చోటకు నీళ్ళొస్తున్నాయి- అంటే పొలాల్లో వెతికాం. కానీ మునిగినవి కొంపలు.

చూసినా ప్రయోజనం లేదని కళ్ళు తెరవలేదు.
రైతుల ఆత్మహత్యలు వుండవు. అన్నారు. ఈ మాట మాత్రం నిజం. రేపు రైతే వుండడు. ఆ

పని కార్పోరేటు వ్యాపారి చేస్తాడు. ఆ సుందర దృశ్యం రేపు తర్వాత చూడవచ్చని కళ్ళు తెరవలేదు.
అతనెవరో ‘నాటు బాంబు నెత్తిమీద ఖద్దరు టోపీ’ పెట్టి- ‘అహింసా వర్థిల్లాలి’ అన్నాడు. చాలా

మంది ప్రత్యర్థులు నెత్తుటి మడుగుల్లో తేలారు. భయం వేసి కళ్ళు తెరవలేదు.
మిగిలిన ఒకరిద్దరూ ‘కంప్యూటర్‌’లో దాక్కుండి పోయి, సౌకర్యవంతంగా సవాళ్లు విసిరారు.

చూడటానికి విసుగనిపించి కళ్ళు తెరవలేదు.
అందితే బేరం! అందకుంటే నేరం!
మనమంతా కళ్ళు మూసుకుంటేనే పదేళ్ళూ గడిచిపోయాయి.
…. …. ….

పది రూపాయిల నోటు తీశాను… పొద్దున్నే కాఫీహొటల్లో.
అందులో పదేళ్ళ చరిత్ర కనిపించింది.
వెయిటరు పరిమితంగా నవ్వాడు. అంతకు తక్కువ ఇస్తే ఏడ్చేవాడు కాదు కానీ. ఒకే చూపు

చూసేవాడు.
సేవకుడి వైపు ‘సుల్తాను’ చూసే చూపు అది. దాంతో నేను నలిగి ముక్కలయి ఖాళీ టీప్పులో

కలిగి చచ్చే వాణ్ణి.
పది రూపాయిలకు కూడా హత్య చేయవచ్చా?
హైటెక్‌ సిటీకి కాస్త దూరంలో…పది రూపాయిలకొక ప్రాణం చొప్పన తీసుకుంటూ పోయాడొకడు.
పల్లెనుంచి వలస నుంచి పనిలేని వలస కూలీల జేబుల్లో అదే పెద్ద సొమ్ము.
హంతకుడూ కూలీయే. పొద్దుకుంగే వేళ, పక్కకు తీసుకు వెళ్ళి బండరాయితో తలపగలగొట్టి

రోజుకొకణ్ణి చంపేవాడు. కూలి రేటు పెరగనట్లే, వాడికి హత్యరేటూ పెరిగేది కాదు. ఎప్పుడూ పదిరూపాయిలే

దక్కేది.
కడకు వాడి అదృష్టం బాగుండి దయగల పోలీసులకి దొరికి పోయాడు. ‘ఉపాధి హామీ పథకం’

లాంటి ‘జైలుకూడుహామీ పథకం’ కింద వాడి తిండిసమస్యను వారు సులభంగా పరిష్కరించేశారు.
పక్కనే ‘పది రూపాయిలకో హత్య’ నడుస్తున్న వేళలోనే, హైటెక్‌సిటీలో సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులకు

కనిష్ట కూలిరేటు పదిలక్షల రూపాయిలు( ఏడాదికి లెండి) నడుస్తోంది.
ఇంత డబ్బును ఏం చేస్కోవాలి?
జూదంలో పెడితే, పదిపదికి రాకపోవచ్చు.
అదే ప్రేమలో పెడితే పదిపదికి గ్యారంటీ.
చీచీచీ.. చీనీవాడు… చౌచౌచౌ చౌనీ దాన్ని ప్రేమించి నట్లు, పదిలక్షల జీతగాడు పదిలక్షల

జీతగత్తెనే ప్రేమించాడు. వీరందరినీ ‘వైట్‌హౌస్‌లో భగవంతుడు’ ప్రేమించాడు.
కానీ ఇన్వెస్ట్‌మెంట్‌ భస్మాసుర బ్యాంకర్లు ‘భగవంతుడి’ నెత్తిమీద చేతులు పెట్టారు.
భగవంతుడు మాయమయ్యాడు.
పది నుంచి పది తీసేశారు.
ప్రేమ మాయమయ్యింది. జీతమూ మాయమయ్యింది.
బతి చెడ్డ వారిని దయగలపోలీసులు కూడా ఆదుకోలేరు. వారిని చంప లేరు, బతికించ లేరు,

జైలు కూడు తినిపించలేరు.
నిరుద్యోగం ఒక నేరం!
ఉద్యోగం ఒక బేరం!!
ఇది కొత్త సహస్రంలోని తొలి దశకం నేర్పిన ఆర్ధిక గుణపాఠం

…. …. ….
అనుకుంటాం కానీ,
బతుక్కీ, చావుకీ మధ్య దూరం కూడా
పదిరూపాయిల నోటు కన్నా తక్కువే.
ఎంత తక్కువ అంటే …’ఉచితంగా’ (పైసలు తీసుకోకుండా) వేసి పెట్టేసిన వోటంత తక్కువ.
సార్వత్రిక ఎన్నికల(2009)ను తెలుగు నాట రెండు గ్రామాలు రెండు సరసమైన కారణాలతో

బహిష్కరించాయి.
‘ఏం మేం మాత్రం వోటర్లం కామా.. మాకు మాత్రం రేషన్‌ కార్డులూ, వోటరు గుర్తింపు కార్డులూ

లేవా..? రేషన్‌ కార్డు బియ్యం ఇప్పించటం చేతనయిన పెద్దమనుషులకు వోటరు కార్డు మీద పైసలు ఇప్పించటం

చేత కాదా..? ఒక పార్టీ కాక పోతే.. ఒకపార్టీ… ఎవ్వడూ మా పల్లెకు డబ్బుతేక పోతే.. మాకెంత అవమానం!

అంత చౌకగా కనిపిస్తున్నామా?’
ఈ తరహాలో వారు టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలిచ్చారు.
పులిహోరా పొట్లాలందని వరద బాధితుల్లాగా, వోటు కు రేటందని ఆ గ్రామస్తులు విలవిల లాడి

పోయారు.
తమని నీతిమంతుల లెక్కల్లో వేసి తమ పరువును గంగలో కలిపారని అన్నీ పార్టీలనూ కట్టకట్టి

మరీ తిటిప
అందుకనే మొత్తం గ్రామస్తులందరూ వోటెయ్యకూడదని ఒక్క మాట మీద వుండిపోయారు.
ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ఊరి బతుకు కథ.

‘ఎక్కడ చావాలో తెలియటం లేదు’ కాబట్టి వోటువెయ్యమని ఇంకో వూరు వారు తెంపుచేశారు.
ఎక్కడయినా బతకటానికి ఎప్పుడో అలవాటు పడ్డారు.
కాబట్టే ప్లాట్‌ ఫాంలమీదా, పేవ్‌మెంట్‌ల మీదా సుఖవంతమైన కాపురాలను

చూడగలుగుతున్నాం.
కానీ, ఎందుకనో ఇంకా మనవాళ్లు ఎక్కడబడితే అక్కడ చావటానికి సిధ్దపడటంలేదు.
షోగ్గా చావాలని ఏదో చిన్న ముచ్చట.
అందుకోసం ఓ ఊరుమ్మడి స్మశానం అన్నా ఒకటి వుండాలి కదా!
కానీ ఇళ్ళూ, రోడ్లూ, మరుగుదొడ్లూ వాగ్దానం చేసే అభ్యర్థులొచ్చారు. కానీ ఒక్కడంటే

ఒక్కడు.. ‘ఒరేయ్‌ నా వోటర్ల లారా! మీకు అందమైన స్మశాన వాటిక’ ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తే కదా!
పైపెచ్చు ‘జనం చచ్చే చోటే తాను చస్తానన్నాడంట ఎవడో ఎస్సీజెడ్‌ వోడు’!
అందుకే ఆ గ్రామస్తులు అన్ని పార్టీలతో ఓ ‘చావు బేరం’ పెట్టారు: ‘ఎవడు స్మశానం ఇస్తాడో,

వాడికే సింహాసనం’.
వారు స్మశానం ఇవ్వలేదు. వీళ్ళు వోటు ఇవ్వలేదు.
అవును.
బతుకొక నేరం!
చావొక బేరం!!

పదేళ్ళలో ఎన్నికలే కూడా ఎన్నికల బహిష్కరణలు కూడా మైల పడ్డాయి. ఇదో పెద్ద రాజకీయ

గుణపాఠం.

…. …. ….

ఎంత చెప్పండి! ప్రేమ ప్రేమే! పెళ్ళి పెళ్ళే!
ఆడజీవి మీద పూర్వం పెళ్ళాతేనే కానీ రాని హక్కులు ఇప్పుడు ప్రేమిస్తే వచ్చేస్తున్నాయి.
హక్కులంటే పెద్దవేమీ కావు. రెండే రెండు: కామించే హక్కు, కడతేర్చే హక్కు. ఈ రెంటిని

వినియోగించుకుంటే కాసులు వాటంతవే వస్తాయని ఎప్పుడో గ్రహించేశారు.
బాగాచదువుకున్న అందగత్తె!
ఈమెను ఎవరు ప్రేమిస్తే బాగుంటుంది. బాగా చదువుకున్న అందగాడు ప్రేమించాలి.
కానీ అందుకు వాడు టైం తీసుకుంటాడు. తీరిక దొరకదు. వాడు చదువుకోవాలి కదా!
ఈలోగా చదువు ఎగవేసినవాడికి కన్నుకుట్టేస్తుంది.
బాగా చదువుకున్నామె ‘నెలసరి కట్నం’ తెస్తుంది. కొంచెం ప్రయత్నిస్తే ఆమెకు ‘జీత’

భాగస్వామి కావచ్చు.
ఆమెతో పదోతరగతివరకూ చదివి, తర్వాత పల్టీలు కొడుతున్నవాడో, లేదా ఒక ఏడాది

రెండేళ్లుగా ఆమె కంటే వెనకబడ్డవాడో ‘ప్రేమికుడి’ గా ముస్తాబయి వస్తాడు.
మర్యాదగా ప్రేమ బేరం చేయబోతాడు.
‘శుంఠలు’ క్కూడా ప్రేమలా? అని నోటితో కాకుండా, చర్యలతో వాణ్ణి ప్రశ్నిస్తుంది.
వాడికి ఆమె దక్కదని తేలిపోతుంది.
అంతే కాదు, ఇంకొకడెవడో చదువుకున్న వాడికి దక్కుతుందని కూడా తెలిసిపోతుంది.
తనకి రావలసిన కట్నం ఇంకెవడోతన్నుకు పోతున్నాడన్నమాట.
కట్నం తేక పోతేనే కట్టుకున్న భర్తలకు కోపం వస్తుందే…?
తనకు రావలసిన ‘నెలసరి కట్నం’ అలవెన్సులతో సహా తనకి రాకపోగా, ఇంకొకడు కొట్టుకు

పోతున్నాడంటే, ప్రేమికుడి పాషాణ హృదయం ఎంతగా క్షోభిస్తుందో- పాపం!
భర్తకయితే తన భార్య చంపుకోవటానికి వంటగదిలో అందుబాటులో వుంటుంది. గ్యాస్‌ స్టౌలు

వంటి సాధనాలను కూడా మామగారు కొనిపెట్టి వుంటారు. కాబట్టే అక్కడ తీరిగ్గా సాక్ష్యాల్లేకుండా చంపుకుంటాడు.
కానీ ప్రేమికుడికి ‘అవుట్‌ డోర్‌’ తప్పదు. అందుకని ఒక యాసిడ్‌ సీసాతో తయారవుతాడు.

లేదా ఈ గొడ్డలితోనో, కత్తులతోనో, లేదా హకీ స్టిక్కులతోనో సిధ్ధమవుతాడు.
సానుభూతితో సామాజిక శాస్త్ర వేత్తలు అధ్యయనం చేస్తే
ప్రేమికులు చేసే హత్యలు కూడా, వరకట్నం కోసం భర్తలు ధర్మబధ్దమైన పోరాటం చేసిచేసి

విసిగిపోయి చేసే వరకట్న హత్యలే.
దురాచారాలను ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటూ వస్తుంటాం.
పెళ్ళికి ముందే భర్తలా చెలరేగేవాడే ప్రేమోన్మాది!
ఇరవ్యయొకటవ శతాబ్దపు తొలిదశకంలో తెలుగువాడు నేర్చుకున్న గొప్ప సాంఘి గుణపాఠం:

ప్రేమోన్మాదం.

ప్రేమ ఒక బేరం
పెళ్ళి ఒక నేరం

మనం కళ్ళుమూసు కోబట్టే…పదేళ్ళు గడిచిపోయాయి!!
ఈ ‘గతమంతా తడిసెను బేరంతో… కాకుంటే నేరంతో!!’

-సతీష్‌ చందర్‌

( ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం 26 డిశంబరు 2010 న ప్రచురితమైనది)

1 comment for “అందితే బేరం! అందకుంటే నేరం!

Leave a Reply