అన్నా ‘బేజారే’!

పేరు : అన్నా హజారే

దరఖాస్తు చేయు ఉద్యోగం: మాజీ మహాత్ముడు ( అంతా రాని ‘లోక్‌పాల్‌’ మహిమ. లేకుంటే, మాజీ సైనికుడిగానే మిగిలిపోయేవాణ్ణి)

ముద్దు పేర్లు : అన్నా( ముచ్చటొచ్చి ‘అన్నా’నంటారు. నిజంకాదు. నేనేదయినా ‘అన్నా’నా? కేవలం విన్నానంతే-కిరణ్‌ బేడీ చెప్పిందీ,కేజ్రీవాల్‌ చెప్పిందీ.), ‘బేజారే'(లక్షల్లో జనాన్ని చూసి ఏడాది తర్వాత వందల్లో చూడాల్సి వస్తే బేజారు గా వుండదూ!)

విద్యార్హతలు : నేనొప్పుకోను.. విద్యే అర్హత అంటే నేనొప్పుకోను. ఏడవతరగతి వరకూ చదువుకున్నాను. మనదేశంలో రాజ్యాంగాన్ని విమర్శించటానికి, మార్చటానికి చదువు అవసరమంటారా?(రాయటానికయితే చదువులు కావాలేమో లెండి.)

హోదాలు : సైజు తక్కువయినా సైన్యంలోకి తీసుకున్నారు. అప్పటి యుధ్ధావసరం అలాంటిది. కానీ హోదా అక్కడ లేదు. ఒక మాజీ సైనికుడి పక్కన కూర్చుని ఒక మాజీ సైన్యాధిపతి నిమ్మరసం ఇవ్వటం చరిత్రలో చూశారా? నా విషయంలో వి.కె.సింగ్‌ అలాగే చేశారు. నాది ఉద్యమం. ఆయనది ఉద్యోగం. కాకపోతే, ఏడాది ముందే నేను ఉద్యమాన్ని వదిలేస్తే ఆయన ఉద్యోగాన్నీ వదిలేశారు.(పుట్టిన సంవత్సరం తప్పు పడిందట. బాగా,చదువుకుంటే ఇలాంటివే సమస్యలు.)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: పూర్తిగా దుస్తులు వేసుకుని టోపీ పెట్టుకున్న గాంధీలా వుంటాను. సగం దుస్తులే వేసుకుంటే బెన్‌ కింగ్స్‌లే (‘గాంధీ’ సినిమాలో గాంధీ పాత్ర ధారి)కూడా గాంధీలాగానే కనిపిస్తాడు.

                             రెండు: ఎగువ మధ్యతరగతి, సంపన్న వర్గాల మధ్యే నిరాహార దీక్షలు చేస్తుంటాను. పేదవాళ్ళ దగ్గర చేస్తే ప్రత్యేకత వుండదు. వాళ్ళు రోజూ పస్తులే వుంటారు కదా!

సిధ్ధాంతం : గాంధేయవాదం. (మోడీ నన్ను గాంధేయ వాదిగానే సంబోధిస్తారు. కిట్టని వారే నన్ను మోడీ వాదినంటారు.) నా జీవిత చరిత్ర చూస్తే, నేను గాంధేయ వాదినో, కాదో తెలిసి పోతుంది. ఒక చెంప కొడితే, మరో చెంప చూప మన్నాడు గాంధీ. రాలేగావ్‌ సిధ్దిలో(నా స్వగ్రామంలో) చెంప కొట్టే వాళ్ళను కాదు, ‘కంపు’ కొట్టే వాళ్ళను చూశాను. (మందు కొడతారు లెండి.) వాళ్ళను చెట్టుకు కట్టి కొట్టాను. తప్పా? చెప్పండి.

వృత్తి : ఒకప్పుడు పూలు మీద బతికాను( దాదర్‌ స్టేషన్లో పూలమ్మాను.) ఇప్పుడు ఉద్యమాల మీద బతుకుతున్నాను. రెండూ సాయింత్రానికి వాడి పోతాయి.

హాబీలు :1. నావీ, అద్వానీవీ ఒకే రకం హాబీలు. పాడుపడిన గుడులు కనపడితే బాగుచేయాలనిపిస్తుంది. మూ వూళ్ళో నేను చేసిన మొదటి పని- గుడిని బాగుచేయించటం.(గుడిసెలు వేద్దామంటే రాని జనం గుడి పేరు చెబితే వస్తారు.)

2. ఎప్పుడూ చేసేదాన్ని వృత్తి, ఎప్పుడో ఒక సారి చేసే దాన్ని హాబీ అంటారు. దేశంలో చాలా మందికి ‘తినటం’ వృత్తయింది. నాకు తిండి తినటం కూడా హాబీ. అంటే, నిత్యనిరాహార దీక్షల మధ్య ఎప్పుడయినా వీలు దొరికితే భోజనం చేస్తాను.

అనుభవం : అవినీతి మీద దేశంలో అందరికీ కోపం వుంది. కానీ ఎదుటి వాడి అవినీతి మీదే.

మిత్రులు : యోగా గురు రామ్‌ దేవ్‌ బాబా.(గుర్తొచ్చారా? అన్నివేళలా కాషాయమే కడతారు. ఆపదలోనే ‘సల్వార్‌ కమీజ్‌’ వేస్తారు. శిబిరం మీద పోలీసులు దాడి చేసినప్పుడు ఆయనకు తోచిన ఉపాయం అది.) ‘పొట్టలు’ తగ్గించాలన్న విషయంలో మాఇద్దరికీ భావసారూప్యం వుంది. దొరికిన కాడికి ‘తినేస్తే’ పొట్టలు రావూ?

శత్రువులు : ఒకప్పుడు రాజకీయ నాయకులూ, ప్రజాప్రతినిథులూ మా శత్రువులు. ఇప్పుడు కాదు. ఎందుకంటే మా వాళ్ళూ రాజకీయాల్లో చేరుతున్నారు కదా!

మిత్రశత్రువులు : నా అభిమానులే. 2011 లో నా వెంట వద్దన్నా పడ్డారు. 2012లో నేను వారి వెంట పడాల్సి వచ్చింది. పడతానా? దీక్ష విరమించేశాను.

వేదాంతం : జీవితం ‘బుల్లి తెర’ మీద బొమ్మ లాంటిది. అంతా మాయ. నిన్న వుంటుంది. నేడు పోతుంది. నా బొమ్మ అని కాదు. ఎవరి బొమ్మయినా అంతే.

జీవిత ధ్యేయం : నా కంటూ వ్యక్తిగతంగా ఎలాంటి కోరికలూ లేవు. కానీ ఒక మాజీసైనికుడు, త్రివిధ దళాధిపతి (రాష్ట్రపతి) అయితే ఎలా వుంటుంది? పాపం, నా అబిమానులు కొందరు ఆశించారు. అయితేనేం, మాజీ సైన్యాధిపతి నాకు సపర్య చేశారు కదా! ప్రజాస్వామ్యం వర్థిల్లు గాక!!

-సతీష్ చందర్

9-8-12

 

 

 

 

2 comments for “అన్నా ‘బేజారే’!

Leave a Reply