ఆడితప్పని లంచగొండులు!

Photo By: Harsh Agrawal

‘లంచం తీసుకుంటున్నావ్‌ కదా! పట్టుబడితే..?’

‘అంచమిచ్చి బయిట పడతా!’

ఇది ఒక సంభాషణా శకలం కాదు; ఒక జీవన విధానం.

లంచం వజ్రం లాంటిది. లంచాన్ని లంచంతోనే కొనగలం; కొయ్యగలం. లంచగొండిని కొనాలన్నా లంచమివ్వాలి. వాడిని పట్టుకోవాలన్నా లంచం ఎర చూపాలి.

లంచానికి ఓ నీతి వుంది. రాతకోతలుండవు. లంచం పుచ్చుకున్నట్టు ఎవడూ రశీదు ఇవ్వడు. అయినా పుచ్చుకుంటే పని చేసిపెడతాడు. చేసిపెట్టక పోతే, అడిగేవాడుండడు. వినియోగదారుల సంఘం ద్వారా కోర్టుకు ఎక్కే వాడుండడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అసలయిన లంచగొండి సత్యహరిశ్చంద్రుడు లాంటి వాడు. ఆడి తప్పడు.

నిరుపేద వోటర్నే తీసుకోండి. పైసలు తీసుకున్నాడంటే పనిచేసి పెడతాడు. అయితే పైసలు ఎందుకు తీసుకుంటే ఆపనే చేస్తాడు. మరో పని చెయ్యడు.

‘తాతల దగ్గరనుంచి మేమంతా ఆ పార్టీకే యేత్తాం బాబయ్యా. మీరు ఇంకో పార్టీకెయ్యమంటే ఎలాగయ్యా?’ అని ముందుగా నిరుపేద వోటరు తన నిబధ్దతను ప్రకటిస్తాడు.

‘అయిదొందలు ఇస్తానంటున్నాను కదా?’ అంటాడు బ్రోకరు.( ఈ మాట బాధాకరంగా వుంది కదా! పోనీ పంపిణీ దారు- అందాం లెండి!)

‘అదే బాబయ్యా! బూతు కాడికి ఎల్తే, నా చెయ్యి ఆ పార్టీ మీదకే ఎల్లిపోద్ది’ అంటాడు.

‘ఓహో అలాగా? వెయ్యిత్తాను. ఈ రేటు నువ్వు బూతుకు వెళ్ళకుండా వుండటానికి’ అని పంపిణీదారు వెయ్యి చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు.

ఇప్పుడా పేద వోటరు మాటకు కట్టుబడతాడు. బుల్డోజర్లూ, క్రేన్లూ వచ్చినా అతణ్ణి అక్కడనుంచి కదలించలేరు. బూతుకు తరలించారు.

నీతి లంచం పుచ్చుకునే వాడికే కాదు, పంపిణీ చేసే వాడికి కూడా వుండాలి. ఉంటుంది. మొత్తం పంపిణీ వ్యవస్థకే ఈ నీతి వుంటుంది. దేశంలోనూ రాష్ట్రంలోనూ పౌర పంపిణీ వ్యవస్థ విఫలం కావచ్చు. బియ్యం,కిరోసిన్‌ను దారిద్య్ర రేఖ దిగువన వున్న వారికి అందించ లేక పోవచ్చు. ఈ వ్యవస్థలో లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులతో నిండిన యంత్రాంగం వుంటుంది. అయినా అందరికీ అందవు.

కానీ అయిదొందల నోటూ, బీరూ, బిర్యానీ- ప్రతీ వోటరుకూ అందచేయాలని అభ్యర్థో, పార్టీయో నిర్ణయించిందనుకోండి. లంచ పంపిణీ వ్యవస్థ ను ఆశ్రయిస్తే సరిపోతుంది. ప్రతీ వోటరుకూ దానంతటదే చేరిపోతుంది.

ప్రజాస్వామ్యమంటే మీకు తెలుసు. నాకు తెలుసు. కానీ దరిద్రమంటే ఈ దిక్కుమాలిన వోటరుకు తెలుస్తుంది. నూకల జావ తినే ఆ నోటికి బిర్యానీ చేరినప్పుడు, ఇచ్చినవాడు ‘పుణ్యాత్ముడే’ అవుతాడు. గుక్కెడు నీరు తెచ్చుకోవటానికి మెళ్ళదూరం నడిచి వెళ్ళే వాడి కడుపులోకి ఏకంగా బీరే చల్లగా జారవిడిచే వాడు ‘భగీరథుడే’ అవుతాడు. లోక్లాసులో కూర్చుని సినిమా చూట్టానికి పదిరూపాయిల కోసం ఇల్లంతా తడుముకునే వాడికి, ఒక్కసారిగా అయిదు వందలు ఇచ్చిన వాడు ‘దాన కర్ణుడే’ అవుతాడు. దరిద్రమేమిటంటే దరిద్రానికి ధరలు తప్ప విలువలు తెలీవు.

బిర్యానీ పంపించిన వాడు, తమ గుడిసెల్ని గుత్తగా బహుళజాతి సంస్థకు అమ్మేసిన వాడని అప్పుడు తెలియదు.

బీరు పోసిన వాడు, తమ భూముల్ని లాక్కోవటానికి వచ్చినప్పుడు, అదేమిటని అడిగితే కడుపులో పోలీసు తూటాలు దించిన వాడని అప్పుడు తెలియదు.

పచ్చనోటు ఇచ్చిన వాడు తమకున్న స్మశానాలను కూడా ఆక్రమించుకుని తమకు చచ్చే అవకాశం కూడా లేకుండా చేసిన వాడని అప్పుడు తెలియదు.

అప్పుడే కాదు ఎప్పుడూ తెలియదు.

III III III

వాళ్ళకే కాదు.అవన్నీ చదువుకున్న నీతిమంతులకీ తెలీవు. కనీసం ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వందరూపాయిలు లంచమడిగితే రచ్చ రచ్చ చేసే ‘అన్నా హజారే’ అనుచరులకీ తెలీవు. కమల్‌ హాసన్‌ ‘భారతీయుడు’, విక్రమ్‌ ‘అపరిచితుడు’ చూస్తూ, లంచగొండులను హతమారుస్తుంటే చప్పట్లు కొట్లే మధ్యతరగతి యువకులకూ తెలీవు.

కాబట్టే, వోటరు పుచ్చుకుంటున్నాడు కాబట్టి మేం ఇస్తున్నాం. అవినీతికి ఆద్యుడు వోటరే అని రాజకీయ నాయకులే బుకాయిస్తుంటే నమ్మేస్తున్నాం.

ప్రేక్షకులు చూస్తున్నారు కాబట్టే, బూతు సినిమాలు తీస్తున్నాం- అని దర్శక నిర్మాతలన్నప్పుడు నమ్మలేదూ? ఇదీ అంతే. కట్నం ఇస్తున్నారు కాబట్టే పుచ్చుకున్నానని నిత్య పెళ్ళికొడుకు అంటే నమ్మక చస్తామా?

‘III III III

అందుకే ఈ దేశంలో అవినీతి వ్యతిరేకోద్యమానికీ జనం పోటెత్తి వస్తున్నారు.

పచ్చనోట్లు పుచ్చుకోవటానికీ జనం ‘వోటె’త్తి వస్తున్నారు.

ఒకరు ఆకలెరుగని నీతిని చూశారు.

మరొకరు నీతెరుగని ఆకలిని చూశారు.

అందుకే ఆకలికెప్పుడూ అవినీతే అందుబాటులో వుంటుంది.

నీతి అలా కాదు. ఆకలి గల్లీలో వుంటే, అది ఢిల్లీలోని ఇండియాగేట్‌ దగ్గర వుంటుంది.

నీతీ, ఆకలీ కలిసినప్పుడే అవినీతికి చరమగీతం! అందాకా, ఎవరి పాట వారిదే. ఎవరి బాట వారిదే.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక లో17జూన్ 2012 నాడు వెలువడింది)

 

 

 

 

 

 

 

 

 

 

 

1 comment for “ఆడితప్పని లంచగొండులు!

Leave a Reply