ఎవరెస్టు పై ఎవరెస్టు

pada-everest(భూగర్భాన్నీ, గగనతలాన్నీ, కడలి కడుపునీ తడిమి చూడగల మానవుడికి, ఇంకా తనకూ తన తోటిమానవుడికీ మధ్య దూరాన్నిెెఎలా  లెక్కించాలో తెలియటం లేదు. రోదసి లో గ్రహానికీ గ్రహానికీ వున్నంత దూరమా? మనిషే సాటి మనిషిని చేరాలంటే ఇంకా ఎన్ని కాంతి సంవత్సరాలు ప్రయాణించాలో? తెల్లవాడు నల్లవాడికి చేరువ కావటానికి యుగాలు పట్టింది. ఇంకా ఈ పుణ్యభారతంలో ఊరు, వెలివాడను చేరనే లేదు. మెదానం అరణ్యాన్ని తాకనేలేదు. అయినా వాడబిడ్డ, అడవి పుత్రికా హిమశిఖరాన్ని తాక గలిగారు.)

కడలి లోతుకీ,

నింగి ఎత్తుకీ

మధ్య దూరాన్ని కొలవగలిగేది

గణితం కాదు,

కేవలం సాహసం.

ఊరికి వెలుపల వున్న వారికి

గుళ్ళూ గోపురాలూ

ఇంకా ఎత్తుగానే వున్నా,

హఠాత్తుగా ఎవరెస్టు

చిన్నదయి పోయింది.

అందుకేనేమో వారు,

అక్కడ జాతీయ జెండాతో పాటు

భారత రాజ్యాం నిర్మాత ఫోటో

కూడావుంచి వచ్చారు.

చిత్రం కాకపోతే,

ఎవరెస్టు మీద ఇంకో ఎవరెస్టా..?

-సతీష్ చందర్ 

(గిరిజన బాలి పూర్ణ, దళిత బాలుడు ఆనంద్ ప్రపంచంలో అత్యున్నత శిఖరం ఎవరెస్టును అధిరోహించిన రోజున రాసినది. గ్రేట్ ఆంద్ర వారపత్రిక 30 మే- 6జూన్ 2014 సంచికలో ప్రచురితం.)

1 comment for “ఎవరెస్టు పై ఎవరెస్టు

Leave a Reply