కుటుంబాలే ముందు.. పార్టీలు తర్వాత…!

కుటుంబం ఒక్కటే, పార్టీలు వేరు. ఇలా అంటే ఒకప్పుడు నమ్మేవారు. కానీ ఇప్పుడు నమ్మడం మానేశారు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబాలే పార్టీలయిపోయాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయిందంటున్నారు కానీ, అది రాజకీయాల్లో బతికి వుంది. ప్రాంతీయ పార్టీలొచ్చాక, వాటి సారథ్యాన్ని కుటుంబాలే చేపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశాన్ని ఎన్టీఆర్‌ కుటుంబం, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ కుటుంబం, మహరాష్ట్రలో శివసేనను థాకరే కుటుంబం, బీహార్‌ లో ఆర్జేడీని లాలూ కుటుంబం, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌ వాదీ పార్టీని ములాయం కుటుంబం… ఇలా పలు పార్టీలను ఉదహరించుకుంటూ పోవచ్చు. దాంతో ఈ పార్టీల్లోకి వలస రావాలన్నా, పార్టీల్లోనుంచి వెలుపలికి పోవాలన్నా ‘ఫ్యామిలీ ప్యాకేజీ’లను ఉపయోగించుకోవాల్సిందే.

ఒకప్పుడు అన్నదమ్ములే, ఒకరు ఒక పార్టీలో వుంటే, మరొకరు ఇంకో పార్టీటో వుండేవారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాలలోనూ ఈ అంశం కనిపిస్తూ వుండేది. ముఖ్యంగా ఒకప్పుడు సంస్థానాలను నిర్వహించిన రాజకుటుంబీకుల్లో ఈ చిత్రం కనిపిస్తుండేది. రాజకుమారి సింధియా బీజేపీలో వుంటే, ఆమె తనయుడు మాధవరావు సింధియా కాంగ్రెస్‌లో వుండేవారు. ఇప్పటికీ సింధియాలు ఇంకా ఇదే వరస పాటిస్తున్నారు. వసుంధరాజె సింధియా బీజేపీలో ( రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా ) వుంటే, ఆమె బంధువు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌లో వుంటున్నారు. తెలుగు నాట అశోక్‌గజపతి రాజు తెలుగుదేశంలో వుంటే, ఆయన సోదరుడు ఆనంద గజపతి రాజు కాంగ్రెస్‌లో వుంటూ వుండేవారు.

ఇలా ఒకే కుటుంబానికి చెందిన వారు తలొకరు తలో పార్టీ లో వుండటానికి ఇతర కారణాలు కూడా వుండేవి. ఏ పార్టీ అధికారంలో వున్నా, తమ కుటుంబం కింద వుండే ఆస్తులూ, సంస్థానాలూ, పరిశ్రమలూ చెక్కు చెదరకుండా వుంటాయి. ఎప్పుడూ తమ కుటుంబ సభ్యులు వున్న ఏదో ఒక పార్టీ అధికారంలో వుంటుంది.

అయితే ఇతర కుటుంబాల విషయంలో అలా వుండటంలేదు. నెల్లూరు లో ఆనం సోదరులు ఇద్దరూ ఎఉ్పడూ ఒకే పార్టీలో వుంటుంటారు. ఇలాంటి సోదరులు తెలంగాణలో కూడా వున్నారు. అలాగే భార్యా భర్తలు కూడా. భర్త ఏపార్టీలో వుంటే, భార్య కూడా విధిగా అదే పార్టీలో కొనసాగటం ఆనవాయితీ అయిపోయిది. అందుకే ఒకే కుటుంబంలో వుంటూ, వేర్వేరు పార్టీల పట్ల తాము విధేయతలు చూపుతున్నామంటే నమ్మే పరిస్థితి లేదు. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు తాజా ఉదాహరణలు వున్నాయి.

     ఇటీవలి కాలం వరకూ అంధ్రప్రదేశ్‌లో పరకాల దంపతులు, చెరో పార్టీకి విధేయంగా వుంటూ వచ్చారు. పరకాల ప్రభాకర్‌ తెలుగుదేశం ప్రభుత్వంలో మీడియా సలహాదారుగా వుంటే, ఆయన సతీమణి నిర్మలా సీతారామన్‌ బీజేపీలో వుంటూ కేంద్ర రక్షణ మంత్రి హోదా వరకూ ఎదిగి పోయారు. రెండు పార్టీ ల మధ్య పొత్తు కొనసాగించినంత వరకూ బాగానే వుంది. కానీ రెంటి మధ్య పొత్తు చిత్తయ్యాక, ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా విషయంలో, బీజేపీ, టీడీపీల తీరు వేరయ్యింది. దానికి తోడు ముందు ‘ప్యాకేజీ’ తో సర్దుకు పోదామన్న టీడీపీయే ‘ప్యాకేజీ’ కుదరదు ‘హోదా’కావాల్సిందే నని ప్రతిపక్షాల కన్నా తీవ్ర స్వరంతో అడగటం మొదలు పెట్టి, అంతిమంగా విడివడింది. దాంతో పరకాల ప్రభాకర్‌ ను తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకహోదాను అనుభవించటాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. ఆయన భార్య ఇంకా బీజేపీలో కొనసాగుతున్నప్పుడు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన ఎందుకూ- అన్నాయి. రక్షణ మంత్రిగా ఆమె దేశ రహస్యాలను భర్తతోనూ పంచుకుంటారా లేదా అన్నది తర్వాత విషయం. కానీ, ప్రత్యేక హోదా అడిగే విషయంలో, తీవ్రంగా బీజేపీని వ్యతిరేకించటం ఆమె భర్త ప్రభాకర్‌ కు సాధ్యమౌతుందా- అనే సందేహాన్ని ప్రతిపక్షాలు వెలిబుచ్చాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామం. సరిగ్గా ఇదే సమయానికి, టీఆర్‌ఎస్‌ నేత డి.శ్రీనివాస్‌ మీద కూడా, సరిగ్గా ఇలాంటి అనుమానాలే వచ్చాయి. ఆయన తనయుడు డి. అరవింద్‌ ఇటీవలనే బీజేపీ పార్టీలో చేరారు. దాంతో పార్టీ పట్ల శ్రీనివాస్‌ నిబధ్దతపై నిజామాబాద్‌ జిల్లాలోని టీఆర్‌ఎస్‌ శాసన సభ్యులకు అనుమానాలు వచ్చాయి. కొన్నాళ్ళకు ఈ అనుమానాలే, ఆరోపణలుగా మారాయి. అదే జిల్లానుంచి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయిన, టీఆర్‌ఎస్‌ అధినేత తనయ కల్వకుంట్ల కవిత వరకూ చేరాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఆయన పాల్పడుతున్నారని ఆయన మీద టీఆర్‌ఎస్‌ వర్గాలు ధ్వజమెత్తాయి. అంతేకాదు మరో తనయుడు కాంగ్రెస్‌ కు చేరువవుతున్నాడన్న పుకార్లు కూడా వ్యాపించాయి. డి.శ్రీనివాస్‌ ఈ విషయంలో కేసీఆర్‌ను కలవటానికి ప్రయత్నించారు కానీ, వీలు పడలేదు. అంతే కాకుండా ఇటీవల డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్‌ నేత గులామ్‌ నబీ అజాద్‌ ను కలిసినట్లు కూడా వార్తలు రావటంతో , అగ్నికి ఆజ్యం తోడయినట్లయింది.

ఆంధ్రప్రదేశ్‌లో అయితే ప్రభాకర్‌ తన పదవికి రాజీనామా చెయ్యాల్సి వచ్చింది. మరి డి.శ్రీనివాస్‌ ఏం చెయ్యాలి? ఆయన పార్టీ నుంచి వైదొలగాల్సిందేనా?

కుటుంబాలు నడిపే పార్టీల్లో పనిచేసే ఇతర నేతలు కూడా ‘సకుటుంబ సపరివారంగ’గా పనిచెయ్యాల్సిందే? ఒకరు ఒక పార్టీలో, మరొకరు మరొక పార్టీలో పని చేస్తూ, తమకు ‘కుటుంబం కన్నా పార్టీ చాలా ముఖ్యం’ అంటే వినే స్థితిలో ఎవరూ లేరు. కారణం చిన్నది. కులానికి హ్రస్వ రూపం కుటుంబం. కుటుంబానికి విశ్వరూపం కులం. నేడు ఒక్కో రాజకీయపక్షం ఒక్కో కులం చేతిలో వున్నది. కాబట్టి ఆయా కులాల్లో పేరుమోసిన కుటుంబాలన్నీ ఆయా కులాల పార్టీల్లోకే చేరుకుంటాయి. అందుకే ‘నాకు పార్టీయే ముఖ్యం; కుటుంబం కాదు’ అని ఎవరన్నా ఏడ్చేటంత నవ్వొస్తుంది.

-సతీష్ చందర్

(గ్రేట్ఆంధ్ర వార పత్రికలో ప్రచురితం)

6 comments for “కుటుంబాలే ముందు.. పార్టీలు తర్వాత…!

Leave a Reply