‘క్వశ్చన్‌’ రెడ్డి!

 

caricature: Balaram

caricature: Balaram

పేరు : జి.కిషన్‌ రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: భావి(2019) తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి.( ప్రధాని అభ్యర్థిని ముందుగా ప్రకటించే ఆనవాయితీ మా పార్టీకి ఎలాగూ వుంది కాబట్టి, తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ముందుగా ప్రకటించవచ్చు. )

ముద్దు పేర్లు : ‘క్వశ్చన్‌’ రెడ్డి( అసెంబ్లీలో నిత్యమూ ప్రతి పక్షంలో వుండటం వల్ల ప్రశ్నించటం అలవాటయి పోయింది. సమాధానాలతో నాకు పని వుండదు అధ్యక్షా! ఇంతకీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చినా, నేను తెలంగాణ అంతా తిరిగినా మా పార్టీ తెలంగాణలో ఎందుకు ఓడిపోయినట్లు అధ్యక్షా?)

‘విద్యార్హతలు : బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ పోస్ట్‌ మార్టెమ్‌ ( కాబట్టే తెలంగాణలో బీజేపీ ఓటమికి గల కారణాలను విశ్లేషించగలిగాను. అఫ్‌ కోర్స్‌ కారకుల్లో నేనూ ఒకణ్ణని కొందరు సభ్యులు తేల్చారు.)

హోదాలు : ఓటమికి బాధ్యత తీసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి. (కిట్టని వాళ్ళు బీజేపీని ఓటమి వైపు నడిపించిన అధ్యక్షుణ్ణి అంటారు. నేను ఒప్పుకోను.)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: వందలో ఒకణ్ణి కాను, ఇద్దరి ముగ్గురిలో ఒకణ్ణి. ( ఉమ్మడి అంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో బీజేపీ శాసన సభ్యులుగా 2004లోనూ 2009 ఇద్దరేసే ఎన్నికయ్యారు. ఏ ఇద్దరులోనయినా నేను ఒకణ్ణి వుండేవాడిని. ఒక రకంగా కుటుంబ నియంత్రణలా సభలో పార్టీ నియంత్రణను పాటించాం. ఇప్పుడూ పెద్దగా పెరిగింది లేదు.)

రెండు: కురు వృద్ధుల మధ్య వృధ్ధుడూ, వృధ్ధుల మధ్య మధ్యవయస్కుడూ యువకుడిగా రాణిస్తాడు. బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో నేను 50 ఏళ్ళ నవ యువకుణ్ణి. ( అద్వానీ ముందు మోడీ యువకుడిగా నిలబడలేదూ అలాగన్నమాట.)

సిధ్ధాంతం : చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం; ‘పంక్చర్‌’ అయ్యాక అంతవరకూ ఎక్కికూర్చున్న ‘సైకిల్‌’ను ‘డొక్కు సైకిలు’ అని తిట్టుకోవటం; తెలంగాణలో ఎన్నికల్లో చిత్తయ్యాక కానీ, తెలుగుదేశంతో పొత్తును తిరస్కరించక పోవటం. ( ఇవి నా సిధ్ధాంతాలు కావు, తెలంగాణ రాష్ట్రంలో మా పార్టీ సిధ్ధాంతాలు.)

వృత్తి : అందరూ చతికిల బడ్డప్పుడు నిలబడటం( 2004లో ఎన్నికయ్యాను), అందరూ నిలబడ్డప్పుడు నడిచి వచ్చాను( తెలంగాణ యాత్ర చేశాను), అందరూ నడుస్తున్నప్పుడు పరుగెత్తాను.(2014 లో అదే పనిచేశాను. కానీ ఫలితాలు వచ్చాక తెలిసింది. అభ్యర్థిగా ముందుకే పరుగెత్తినా, అధ్యక్షుడిగా వెనక్కి పరుగెత్తానని)

హబీలు :1.ఈత. ఎదురీతే ఎక్కువ అలవాటు. పార్టీకి ప్రతికూల పరిస్థితుల్లో నాయకత్వం వహించటం అలవాటయిన తర్వాత, అనుకూల పరిస్థితుల్లో నాయకత్వం వహించటం ‘వాలు ఈత’ లా కొత్తగా అనిపించింది. అందుకే తెలంగాణలో ఫలితాలు ఇలా వున్నాయి.

2. ప్రచార ప్రియత్వం. ప్రచారంలేకుండా ఏ పనిచేసినా వృధా- అని నవ్వుతాను. కెమెరాకు వీలుగా ముఖాన్నీ, మైకుకు వీలుగా స్వరాన్నీ మార్చుకోక పోతే ప్రచారం రాదు. కానీ ఈ ఎన్నికల్లో అదేమిటో ఎంత ప్రచారం చేసుకుందామనుకున్నా మీడియా ‘పసుపు’ ను చూపి ‘కాషాయం’ అని నమ్మించేసింది. తెలంగాణలో ఫలితాలు చూశారు కదా!

అనుభవం : రెడ్డి రెడ్డే, నాయుడు నాయుడే. తెలంగాణ తెలంగాణాయే, అంధ్ర ఆంధ్రయే. లోక్‌ సభలోక్‌ సభే, రాజ్యసభ రాజ్యసభే. బీజేపీ ఒక్కటే అయినా వాదనలు రెండయ్యాయి. ఇందుకు ‘భద్రాద్రి రాముడే’ సాక్ష్యం. ఏడు ముంపు మండలాలే నిదర్శనం.

మిత్రులు : ‘ఓ..వైసీ’… సారీ ‘ఓ.. ఐసీ’ అని అనబోయి అలా అన్నాను. అయితేనేం, అనేశాను కాబట్టి చెబుతున్నాను. ఎక్కడ ‘మజ్లిస్‌’ వుంటే అక్కడ ‘బీజేపీ’ వుంటుంది. ‘మైనారిటీ’ని చూపితే చాలు, కాస్సేపు కులాలను కూడా మరిపించి హిందువులను ‘మెజారిటీ’గా చూపించవచ్చు. విజయాలు పొందవచ్చు.

శత్రువులు :డుపునకు కత్తులు కట్టుకుని, కౌగలింతల్లో పొత్తులు ప్రకటిచేవారు. రాజకీయాల్లో ఈ కౌగిలినే ‘దృతరాష్ట్ర కౌగిలి’ అంటాడు. ఈ కౌగిలిలో బలాఢ్యుడైన భీముడు సైతం నలిగి ముక్కలు కాగలడు. 1999లో రాష్ట్రంలో ఈ అనుభవాన్ని చవి చూసింది. మా కన్నా ముందూ కమ్యూనిస్టులకూ ఇదే అనుభవం ఎదురయింది. అయినా ముచ్చట కొద్దీ మరో సారి అదే (‘పచ్చని’) కౌగిలి లోకి వెళ్ళాం. తెలంగాణలో ఫలితాన్ని చూశాం.

మిత్రశత్రువులు : ఎన్నికలకు ముందు ‘ఓడ’ కిషన్‌, ఎన్నికలయ్యాక ‘బోడి’ కిషన్‌ అంటున్న మా పార్టీ రాష్ట్ర నేతలు.

వేదాంతం :’కాషాయం’ కట్టినంత మాత్రాన కోరికలు వుండకూడదని రూలు లేదు.

జీవిత ధ్యేయం : ముఖ్యమంత్రి కావాలన్న నా చిన్న కోరిక తప్పు కాదనుకుంటాను.

-సతీష్ చందర్
(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 21-27 జూన్ 2014 సంచికలో ప్రచురితం)

Leave a Reply