జగన్‌ జర్నీలో ‘మజిలీ’స్‌!

జగన్‌ ప్రణబ్‌కు వోటేశారు.

కాంగ్రెస్‌తో ‘మ్యాచ్‌ ఫిక్సింగా’? వెంటనే అనుమానం.

ఇంకేముంది? యుపీయే అభ్యర్థి, కాంగ్రెస్‌లో కీలకమయిన వ్యక్తి ప్రణబ్‌ ముఖర్జీకి వోటెయ్యటమంటే కాంగ్రెస్‌లో కలవటం కాదూ?

నిజంగానే ఇది ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ల సీజన్‌. సంకీర్ణ రాజకీయ యుగంలో- ఇది సహజం.

కానీ, జగన్‌ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ అంటూ వెంటనే చేసుకోవలసి వస్తే, కాంగ్రెస్‌ తో చేసుకోరు. ఒక వేళ అలా చేసుకుని కలిసిపోతే, అది తన పార్టీ(వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ)కి మంచిది కాదు, కాంగ్రెస్‌ పార్టీకీ మంచిది కాదు. నిన్న కత్తులు దూసుకున్న వారు నేడు కౌగలించుకుంటే, అంతే వేగంగా రెండు పార్టీల్లోని కార్యకర్తలూ చెయ్యలేరు.

జైలుపాలు కావటం వల్లే, జగన్‌ మెత్తబడి యుపీయేకు మద్దతు ఇచ్చారని భావించటంలో కూడా పసలేదు. అసలు ఆయన మీద ఇన్నికేసులు సిబిఐ పెట్టముందే, ఒక జాతీయ చానెల్లో జగన్‌ తాను జాతీయంగా ‘యూపీయే’కు మద్దతు ఇస్తానని సూచన ప్రాయంగా చెప్పేశారు. రాష్ట్రంలో మాత్రమే కాంగ్రెస్‌తో తలపడతానని తేట తెల్లం చేశారు.

అసెంబ్లీ(2014) ఎన్నికల లోపు, కాంగ్రెస్‌తో కలవటం తప్పని సరిగా జగన్‌కు నష్టదాయకమవుతోంది. ఈ లోపుగా జగన్‌ రాజకీయంగా పూర్తి చేయవలసిన పెద్ద పని ఒకటి వుంది. రూపాయి విలువ పడిపోతున్నప్పుడు, ఉన్న కరెన్సీని డాలర్లలోకి మార్చుకోవాలని మదుపుదారులు ఎలా తాపత్రయ పడతారో, జగన్‌ కూడా అదే హడావిడిలో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ వోటు పడిపోతోంది. అయితే 2009 లో కాంగ్రెస్‌కు పడ్డ వోట్లను, ఆఘమేఘాల మీద వైయస్సార్‌ కాంగ్రెస్‌ వోట్లగా మార్చేసుకోవాలి. సీమాంధ్రలో ఆపని సులభంగానే జరిగిపోతోంది. అందుకు జూన్‌ నెలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే తాజా ఉదాహరణ. ఈ దశలో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ లుండవా? ఉంటాయి. ఎవరితో కలిస్తే ఈ ‘వోట్ల మారకం’ వేగవంతమూ, సులభతరమూ అవుతుందో, వారితోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అవుతుంది.

అలా చూసినప్పుడు, ముందు వరసలో వుండేది ‘మజ్లిస్‌’ (ఆల్‌ ఇండియా మజ్లిస్‌-ఇ-ఇత్తెహదుల్‌ ముసిల్‌మీన్‌) పార్టీ. వినటానికే ఆశ్చర్యకరంగా వుంటుంది. అది ఒక్క నగరానికి(హైదరాబాద్‌కి), ఒక మైనారిటీ మతానికి(ఇస్లాంకి) పరిమితమైన పార్టీ. ఈ పార్టీతో ప్రయాణం చేయటం వల్ల వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే ప్రయోజనం ఏముంటుంది? ఒక వేళ వుంటే, రాష్ట్ర విభజన అయినప్పుడు ఎక్కువ ప్రయోజనమా? లేక రాష్ట్రం కలిసి వున్నా లాభమేనా? ఒకవేళ జగన్‌ ‘మ్యాచ్‌ ఫిక్సింగే’ చేసుకోవాల్సి వస్తే రాష్ట్రంలో అంతకు మించి పార్టీలే లేవా? ఇవన్నీ ప్రశ్నలే.

 

‘గులాబీ’ పువ్వు కాదు, ముల్లే!

తెలంగాణ ఉద్యమ ప్రభావం వల్ల, వామనుడు విశ్వరూపం దాల్చినట్టు, 2009 ఎన్నికల్లో చిన్నబోయినా, తర్వాత తెలంగాణ ప్రాంతమంతటా అత్యంత ప్రజాదరణను సంతరించుకున్నది. సీమాంధ్రలో జగన్‌ ఎలాగో, తెలంగాణకు కేసీఆర్‌ అలాగా జనాకర్షక నేతలయ్యారు. ఒక దశలో వీరిద్దరూ ‘జంట కవుల్లా’గా కలిసి తిరిగితే, కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు అడ్రస్‌లేకుండా చేసి ప్రభుత్వాన్ని స్థాపించ వచ్చు కదా- అంటూ సలహాలూ, పుకార్లూ కలిసి షికార్లు చేశాయి.

వెనకటికి గుఱ్ఱం జాషువా కవీ, దీపాల పిచ్చయ్య శాస్త్రి కవీ- కలిసి ‘జంట కవుల్లా’ కవిత్వ రాద్దామనుకున్నారట. ఆలోచన బాగానే వుంది కానీ, పేర్లను కలపడం దగ్గర ఇబ్బంది వచ్చింది. ‘జాషువా పిచ్చి’ లేదా ‘పిచ్చి జాషువా’- ఇలావస్తున్నాయి. కాబట్టి ఎలా చూసినా ‘పిచ్చి’, జాషువాకే పట్టే ప్రమాదం వుందని గమనించి-ఆయన వెనక్కి తగ్గారట.

జగన్‌-కేసీఆర్‌లు కలవటం వల్ల ఏ ఒక్కరికో కాదు, ఇద్దరికీ ప్రమాదమే. జగన్‌కు ఎంత కాదన్నా, ‘తెలంగాణ ఇవ్వటం మా చేతుల్లో లేదన్నా’, ‘సమైక్యాంధ్ర ముద్ర’ వుంది. ఎప్పుడో ఒక సారి పార్లమెంటులో ఒక సారి సీమాంధ్ర సభ్యులందరితో పాటు, జగన్‌ కూడా ‘సమైక్యాంధ్ర’ ప్లకార్డు పట్టుకున్నారని ఇప్పటికీ అంటూ వుంటారు. అలాంటి నేతతో కలిసారంటే, కేసీఆర్‌కు జనాదరణ తగ్గే ప్రమాదం వుంటుంది. ఇలాంటి చిక్కే జగన్‌కూ వచ్చి పడుతుంది. సీమాంధ్రలో తనకు మద్దతు ఇస్తున్న వోటు బ్యాంకుల్లో ‘సమైక్యాంధ్ర’నినాదమే నేటికీ మార్మోగుతోంది. కేసీఆర్‌తో కలిస్తే, ఆమేరకు జగన్‌ సీమాంధ్రలో నష్టపోతారు. కలిస్తే ఇద్దరూ బలహీనపడే చోట ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ ఏమిటి? ఇద్దరు జాతకాలు కలవటం పోయి, ఇద్దరి జాతకాలు మారిపోయే చోట ఏ ముడీ పడదు కదా?

‘పసుపు’ ‘అశుభ’ సూచకమా?

ఇక మిగిలిన అతి పెద్ద ప్రతిపక్షం ‘తెలుగుదేశం’ పార్టీ. ‘సీమాంధ్ర నాదే, తెలంగాణ నాదే’ అన్న ‘రెండు కళ్ళ’ సిధ్ధాంతం వల్ల, రెంటికీ చెడ్డ రేవడి గా మారింది. రాష్ట్ర రాజకీయాల్లో పసుపు రంగు ‘అశుభ’ సూచకంగా మారింది. వైయస్సార్‌ కాంగ్రెస్‌ కే కాదు, టీఆర్‌ఎస్‌ కు ‘దేశం’తో చెలిమి నష్టదాయకంగా మారింది. అందుకే అంతకు ముందు వున్న చెలిమినే తెగతెంపులు చేసుకున్నారు.

అదీ కాక, చరిత్రలో ప్రధాన ప్రతిపక్షంగా వున్న ఏ పార్టీకీ రాని విచిత్రమైన కష్టం తెలుగుదేశం పార్టీ వచ్చింది. అర్థాంతరంగా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం వచ్చినప్పుడు, ప్రతిపక్షం ఎప్పుడయినా, ఎక్కడయినా ఎగిరి గెంతులేస్తుంది. కానీ, ఇక్కడ అలా కాలేదు. సర్కారు కూలి పోతుందంటే చాలు, కాంగ్రెస్‌ కన్నా ముందు తెలుగుదేశం గుండెలు బాదుకుంటోంది. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారును 2014 వరకూ కాపాడుకోవాల్సిన ‘దిక్కుమాలిన కర్తవ్యం’ తెలుగుదేశం మీద పడింది. ఒక పక్క వైయస్‌పై సానుభూతి, మరొకపక్క తెలంగాణపై సెంటిమెంటూ- వుండగా ‘మధ్యంతర ఎన్నికలు’ వచ్చి పడితే, కాంగ్రెస్‌తో పాటు, తెలుగుదేశం పార్టీ అడ్రసు కూడా గల్లంతవుతుంది. కాబట్టి, తెలుగు దేశం కాంగ్రెస్‌ను కొట్టాలి; కానీ తగిలేటట్టు కొట్ట కూడదు. అవిశ్వాస తీర్మానం పెట్టాలి; కానీ కూలిపోదన్న భరోసాతో పెట్టాలి. పాపం. తెలుగుదేశం పార్టీ కున్న ఈ దీన స్థితిని అర్థం చేసుకోకుండా, కాంగ్రెస్‌తో ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ పెట్టుకుందని శత్రుపక్షాల వారు ఆడిపోసుకుంటారు. అలాంటి స్థితిలో వున్న ‘తెలుగుదేశం’ పార్టీ, వైయస్సార్‌ కాంగ్రెస్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పనికి వస్తుందా?

 

అసెంబ్లీలో ‘కమల’ నియంత్రణ

ఇక భారతీయ జనతా పార్టీ నేతలో కర్ణాటకలో వున్న పరిచయాలను పునరుధ్దరించుకుని, ఆ పార్టీతో రాష్ట్రంలో జగన్‌ పొత్తు పెట్టుకోవచ్చు కదా! కానీ ఏం లాభం? రాష్ట్రశాసన సభలో ఆ పార్టీ ‘కుటుంబ నియంత్రణ’ పాటిస్తోంది. 2004 ఎన్నికల్లోనూ, 2009 ఎన్నికల్లోనూ ‘జంట కమలాల'(ఇద్దరి సభ్యులతోనే) సరిపెట్టుకొంది. ఆ మధ్య జరిగిన ఉపఎన్నికలలో కాంగ్రెస్‌ వ్యూహపరమైన తప్పిదం వల్ల, మహబూబ్‌ నగర్‌లో మాత్రమే గెలిచింది. పోసీ అసెంబ్లీలో ఆ పార్టీ బలం అంతంతంగా మాత్రంగానే వుండి, జనంలో ఆదరణ పెరిగిందని అనుకోవటానికి దాఖలాలే లేవు. ‘ప్రత్యేక తెలంగాణ’ విధానం వల్ల, సీమాంధ్రలో ఈ పార్టీ నిలబడటానికి స్థానమే కోల్పోయింది. తెలంగాణలో కూడా, తన స్థానమేమిటో పరకాల ఉప ఎన్నికల్లో తేట తెల్లమయింది. అదీకాక, ‘క్రైస్తవ’ ముద్ర వున్న జగన్‌, పచ్చి ‘హిందూత్వ’ పార్టీతో చేతులు కలిపితే, తన వోటు బ్యాంకు కుప్ప కూలిపోతోంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సీమాంద్ర మొత్తం మీద దళితులూ, దళిత క్రైస్తవులూ, కాంగ్రెస్‌ను కాదని వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపు వచ్చేశారు. ఈ విషయంలో ముందు చూపు వుండ బట్టే ఆది నుంచీ జగన్‌ సెక్యులర్‌ మంత్రాన్ని జపిస్తున్నారు. అందులోని భాగంగానే తనను కాంగ్రెస్‌ ఎన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నా, జాతీయంగా, యుపియే వైపే చూశారు. అంతే కాదు, రాష్ట్రంలో సిధ్ధాంత పరంగా బీజేపీ ఏకాకి. అందుకు రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ పార్టీలు తీసుకున్న వైఖరే కారణం. కాంగ్రెస్‌ మీద వ్యతిరేకత వున్నా సరే ఎన్డీయే బలపరచిన అభ్యర్థి సంగ్మాకు మద్దతు ఇవ్వకుండా, టీడీపీ, టీఆర్‌ఎస్‌లు ఎన్నికలను బహిష్కరించాయి.

సిటీ పార్టీ స్టేట్‌ పార్టీ అవుతుందా?

ఈ స్థితిలో కలసి నడవటానికీ, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కూ అనువయిన పార్టీగా జగన్‌కు మజ్లిస్‌ కనిపించి వుండాలి. వైయస్సార్‌ కాంగ్రెస్‌కూ, మజ్లిస్‌కూ ముందునుంచీ మంచి సంబంధాలే వున్నాయి. మజ్లిస్‌ శాసన సభాపక్షనేత అక్పరుద్దీన్‌ ఓవైసీ పై దాడి జరిగిన తర్వాత ఆయనను మర్యాద పూర్వకంగా జగన్‌ పరామర్శించి వచ్చినప్పుడే ఆయన రాజకీయాలు చర్చించారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత యుపీయే అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీని బలపరచమని జగన్‌ను అడగటానికి, యుపీయే లో భాగస్వామ్య పక్ష నేతగా మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ చంచల్‌ గుడా జైల్లోకి వెళ్ళి వచ్చారు. అయితే ఇది కేవలం రాష్ట్రపతి ఎన్నికల కోసం మాత్రమే కాదనీ, భవిష్యత్తులో రెండు పార్టీలూ కలసి నడిచే అవకాశాన్ని చర్చించరాన్న ఊహాగానాలు కూడా గుప్పుమన్నాయి. వైయస్‌ జీవించి వున్నంత కాలం, వైయస్‌, ఓవైసీ కుటుంబంతో సత్సంబంధాలే కలిగి వున్నారు.

గత దశాబ్ద కాలంగా మజ్లిస్‌ రాజకీయంగా పెరుగుతోంది. 2004 అసెంబ్లీ ఎన్నికలలో ఏడు స్థానాలకు పోటీ చేసి, నాలుగు గెలుచుకుంటే, 2009లో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసి ఏడింటిని గెలుచుకుంది. అలాగే హైదరాబాద్‌ పార్లమెంటు స్థానం( అసదుద్దీన్‌ ఓవైసీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.) తో పాటు, నగర మేయర్‌ పదవిని రెండో విడత కైవసం చేసుకున్నారు. అయితే ఈ పార్టీ కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కలిగి వుంది. కానీ, క్రమేపీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ వోటు బ్యాంకు దివాళా వైపు వెళ్ళిపోవటంతో 2014లో ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయని మజ్లిస్‌ నేతలు అంచనా కొచ్చినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ మాత్రం మజ్లిస్‌ మైత్రిని ఏమాత్రం జారవిడుచుకోవటానికి సిధ్దంగా లేదు.

తెలంగా సమస్యకు పరిష్కారంగా కాంగ్రెస్‌ అనధికారికంగా ముందుకు తెచ్చిన ‘రాయల-తెలంగాణ’ ప్రతిపాదన ఒక మేరకు మజ్లిస్‌ కు అనుకూలమైనదే. ఎందుకంటే, ముస్లిం వోటు బ్యాంకు, ఉత్తర తెలంగాణలోనూ, రాయల సీమలోని కొన్ని ప్రాంతాలలోనూ బలంగా వుంది. ఫలితంగా ‘మజ్లిస్‌’ను హైదరాబాద్‌ దాటి విస్తరించాలన్న ఓవైసీల కోరింగా ఫలిస్తుంది. అయితే రాయల-తెలంగాణ ప్రతిపాదన వెనుక కాంగ్రెస్‌ ఆంతర్యం ఓవైసీలు ఊహించనిది కాదు. ఇటు జగన్‌నూ, అటు చంద్రబాబునూ రాష్ట్రానికి కాకుండా, రాయలసీమకు కుదించాలన్నదే కాంగ్రెస్‌ ఆంతర్యం. అయితే ఈ తరహా విభజనకు టీఆర్‌ఎస్‌ కూడా పూర్తి సుముఖంగా కనిపించటం లేదు. ఈ స్థితిలో కాంగ్రెస్‌ను మాత్రమే నమ్ముకుని అడుగులు వేయటం- మజ్లిస్‌కు ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

 

మైనారిటీ+మైనారిటీ=మెజారిటీ!

కాబట్టి రాష్ట్రం కలిసి వున్నా, రెండు ముక్కలుగా విడిపోయినా, మూడు ముక్కలుగా విడిపోయినా ఈక్షణంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌తో చెలిమి చేయటం మజ్లిస్‌కు లాభదాయకంగా కనిపిస్తోంది. అందుకు కారణాలు:

ఒకటి: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హిందూత్వ రాజకీయాలను వ్యతిరేకించే పార్టీ.

రెండు: జగన్‌ బలంగా వున్న రాయలసీమలో ముస్లింల వోట్లు గణనీయంగా వున్నాయి.

మూడు: సీమాంధ్రతో పాటు, తెలంగాణ(పరకాల)లో కూడా జగన్‌కు జనాదరణ తక్కువేమీ లేదు.

నాలుగు: జగన్‌ స్వతహాగా మైనారిటీ(క్రైస్తవ) మతస్తుడు.

 

ఈ కారణాలు ఓవైసీలకుంటే, మరి మజ్లిస్‌ తో స్నేహం చెయ్యటానికి జగన్‌కుండే కారణాలు ఏముంటాయి?

ఒకటి: టీఆర్‌ఎస్‌ వల్ల జగన్‌ తెలంగాణలో ప్రవేశించటం ఆలస్యమయింది. పరకాలలో గట్టి పోటీ యిచ్చినప్పటికీ పార్టీ సీటు దక్కించుకోలేక పోయింది. మజ్లిస్‌తో మైత్రి చేస్తే వేగ వంతంగా (ముస్లింలు ఎక్కువగా వున్న) ఉత్తర తెలంగాణలో ప్రవేశించ వచ్చు. అప్పుడు, టీఆర్‌ఎస్‌ స్థానంలో తన ప్రభంజనాన్ని చూపి, 2014లో విజయం వైపు పయినించ వచ్చు.

రెండు: ‘తెలంగాణ ఇదిగో వచ్చేస్తోంది. అదిగో వచ్చేస్తోంది’ అంటూ, కేసీఆర్‌ ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్‌ కు చేరువగా వెళ్తున్నారు. ‘తెలంగాణ ఇచ్చేస్తే, టీఆర్‌ఎస్‌’ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం బలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌-టీఆర్‌ఎస్‌లు కలసి, జగన్‌ని శాశ్వతంగా తెలంగాణకు దూరం చేసే ప్రమాదం వుంది. అదీకాక, ఇటీవల టీఆర్‌ఎస్‌ నేతలు పరకాల ఉప ఎన్నిక తర్వాత జగన్‌ నీడను కూడా సహించలేక పోతున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవటానికి మజ్లిస్‌ పార్టీ తోడు అవసరమవుతుంది.

మూడు: ఒక వేళ 2014లో హంగ్‌ ఏర్పడితే, ముందుగానే నమ్మకమైన మిత్ర పక్షాలను ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి మిత్ర పక్షంగా మజ్లిస్‌ వుండగలదు. ఎన్నికల ముందు పొత్తు మజ్లిస్‌తో పెట్టుకుంటే, కాంగ్రెస్‌ లాంటి పార్టీలు వెలుపలనుంచి మద్దతు ఇస్తాయి. ఎందుకంటే, కేంద్రంలో యుపీయేకు అలాంటి మద్దతే వైయస్సార్‌ కాంగ్రెస్‌నుంచి అవసరమవుతుంది.

 

ఎలా చూసినా, జగన్‌-ఓవైసీల మైత్రి రానున్న కాలంలో మరింత చిగురించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బహుశా జగన్‌ పొత్తుల రాజకీయాల్లో తొలి మజిలీ ‘మజ్లిస్‌’ కావచ్చు.

-సతీష్‌ చందర్‌

 

 

4 comments for “జగన్‌ జర్నీలో ‘మజిలీ’స్‌!

  1. well saying about future politics of AP , its worth more , if one para to be added in a angle of Babasaheb’s political philosophy, any how very useful msg to jagan n co!?

Leave a Reply