తిన్నదెక్కువ, తినిపించింది తక్కువ!

 

గాలి సోదరులకు బిజెపి నేత సుష్మా స్వరాజ్ కటాక్షం

గాలి సోదరులకు బిజెపి నేత సుష్మా స్వరాజ్ కటాక్షం

తిను, తినిపించు, లైఫ్‌ అందించు.

ఇదేదో ‘ఎఫ్‌ ఎమ్‌’ రేడియో నినాదం కాదు. చక్కటి రాజకీయ నినాదం. రాజకీయాల్లో వున్నవారు ‘తినటం’ సర్వ సాధారణం. అయితే తాను మాత్రమే ‘తిని’ ఊరుకునే నేతకు పేరు రాదు. ‘వంద’లో ‘తొంభయి’ తాను తిని, ఇతరుల చేతిలో ‘పద’న్నా పెట్టే వాడు ‘మారాజు’ అయిపోతాడు. ఇదీ అవినీతిలో కూడా జనం తీయగల నీతి. ఇన్నాళ్ళూ ఈ ‘నీతి’కి మార్కెట్టుందనుకున్నారు.

కానీ కళ్ళ ముందు ‘కర్ణాటకం’ కనిపించింది. ‘తిని’ ఊరుకున్న వారే కారు, ‘తిని, తినిపించి’న వారు కూడా 2013 అసెంబ్లీ ఎన్నికలలో మట్టి కరిచారు.

దాంతో ‘తిను, తినిపించు’ స్కీముకు- కాలం చెల్లిందా? అన్న అనుమానం కలిగింది.

అంతే కాదు, ‘నోట్లు తీసుకుని వోట్లేసే’ అతి సాధారణ జనానికి కూడా ‘అవినీతి’ మీద కోపం వచ్చింది. కాస్త ఆశ్చర్యమే.

‘బీరూ, బిర్యానీ’ పుచ్చుకుని లారీ లెక్కి సభల్ని జయప్రదం చేసే జనానికీ, అయిదు వందలో, వెయ్యో(రూపాయిలు) తీసుకుని పోలింగు బూతులకు వెళ్ళే వోటర్లకీ- ఇంత కోపం ఎలా వస్తుంది?

ఈ ప్రశ్నకు సమాధానం దొరక్క ఒక్క కర్ణాటకలోని రాజనీతి కోవిదులే కాదు, ఇతర రాష్ట్రాలలోని రాజకీయ పండితులు కూడా తలలు పట్టుకున్నారు.

తా చెడ్డ నేత వనమెల్లా చెరిచినట్లు, యెడ్యూరప్ప తాను పార్టీ(కెజెపి) పెట్టి చిత్తయి పోవటమే కాకుండా, అధికారంలో వున్న బీజేపీని కూడా చిత్తు చేశారు. యెడ్యూరప్ప, గాలి సోదరుల మీద వున్న అవినీతి ఆరోపణలూ, కేసుల వల్ల అధికారంలో వున్న బీజేపీ రాష్ట్రంలో కుప్ప కూలి పోయింది.

ఇన్నాళ్ళూ ఒక నమ్మకం మీద అన్ని రాజకీయ పక్షాలూ బతికేస్తున్నాయి. ‘అవినీతి ఆరోపణల’ వల్ల ప్రభుత్వాలు కూలిపోవూ- అని. ఎందుకంటే ఎన్ని అవినీతి కేసుల్లో ఇరుక్కున్నా, ‘సంక్షేమ పథకాల’ పేరుమీద జనానికి నాలుగు పైసలు విదల్చి అధికారాన్ని నిలుపుకోవటానికి మహా మహా నేతలు ప్రయత్నించి సఫలీకృతులయ్యారు.

ఇప్పుడు ఆ పప్పులు ఉడికేటట్లు లేవని ‘కర్ణాటకం’ నిరూపించింది.

అంటే, జనం ఆలోచనల్లో ఎంతోకొంత మార్పు వచ్చిందని నమ్మితీరాల్సి వస్తోంది.

‘ఎవరు తినటంలేదు? ఆయన తిన్నారు. పెట్టారు’ ఇదీ నిన్నటి వరకూ వున్న జనవాక్కు.

‘మనకే ఇంత పెట్టాడంటే, ఆయనెంత తిన్నాడో?’ ఇది నేడు జనానికి వచ్చిన సందేహం.

రెండో దశకు జనం రావటం కష్టమే. కానీ మార్కెట్టే, ముక్కుపిండి జనాన్ని ఈ స్థితికి రప్పిస్తుంది.

నేతలు వేల, లక్షల కోట్లు మింగేసినా పట్టని జనానికి ఈ స్పృహ ఎవరో పనిగట్టుకుని కలిగించరు?

లారీ ఎక్కక ముందు తాగిన బీరు, లారీ దిగగానే దిగిపోతుంది. పోలింగు బూతుకు ముందు చేతిలో పడ్డ అయిదు వందలనోటు, బూతులోంచి బయిటకు రాగానే ఖర్చయి పోతుంది.

ఇంటికి రాగానే, ఉప్పు, పప్పూ, కూరగాయలు ధరలు పెరిగి వుంటాయి. కరెంటు చార్జీల బాదుడు వుంటుంది. చిన్న రైతయితే, పంటే చేతికి రాదు. చౌక దుకాణల్లో ఇచ్చిన సరుకులు వారం తిరగకుండానే నిండుకుంటాయి. ధరలో ఏ స్థాయిలో పెరుగుతాయో ఆ స్థాయిలో అధికారంలో వున్న రాజకీయ పార్టీ మీద విసుగు పెరుగుతుంటుంది.

ఇదిలా వుంటే, వెలుపల వేల, లక్షల కోట్ల రూపాయిలకు అవినీతికి పాల్పడ్డ నేతల భాగోతాలు మీడియాలో వస్తుంటాయి.

‘అంటే మన చేతిలో అయదు వందలు పెట్టి, ఏభయివేల కోట్లు తినేశాడన్నమాట.’ అన్నదెక్కడో మనసులో కలుగుతుంది. మార్కెట్టు కు వెళ్ళి ఏ సరుకు కొన్నా మనసులో ఈ భావనే వెంటాడుతుంది.

దాంతో ‘వోటుకు ఎవడు డబ్బిచ్చినా తీసుకుంటాను. కానీ, అసలు తిననివాడికో, తక్కువ తిన్న వాడికో వోటేస్తాను.’ అన్న తీర్మానం అదే మనసులో చేసుకుంటాడు.

ఈ మాత్రం పరివర్తన ప్రజాస్వామ్యంలో గొప్ప పరివర్తన అయిపోతుంది.

అలా కాకుండా ‘నేను వోటును అమ్ముకోను. వోటు పవిత్రం. నా సొంత ఖర్చులమీద పోలింగ్‌ బూతుకు వెళ్ళి, నా సొంత కాళ్ళ మీద నిలబడి, ఒక రోజు సొంత కూలి కోల్పోయి వోటు వేస్తాననే’ంత చైతన్యాన్ని వెంటనే కోరుకోవటం అత్యాశే అవుతుంది.

ఎన్నికల కమిషన్లు, ఎన్నికల నిబంధనలు – ఏవీ ఎన్నికలప్పుడు ధన ప్రవాహాన్ని ఆపలేక పోతున్నాయి. కారణం జనం ధనాన్ని తీసుకుంటూనే వున్నారు. సమీప భవిష్యత్తులో తీసుకుంటారు కూడా.

కానీ మార్పు ‘నాకు ఇంతే ఇచ్చి, వాడు ఎంత కొట్టేస్తున్నాడో’ అన్న కడుపు నొప్పి దగ్గర వచ్చింది.

వోటరు కు వచ్చిన ఈ మాత్రపు నొప్పికే అధికారం లోవున్న పక్షం గింగిరాలు తిరిగింది.త

ఇప్పుడు ఈ కడుపునొప్పి తమనెక్కడ బలిగొంటుందోనని, కేంద్రంలోనూ ఇతర రాష్ట్రాలలోనూ బెంగలు పెట్టుకున్నారు. కేంద్రంలో అయితే ‘కర్ణాటక’ ఫలితాలు వచ్చిన మరుక్షణమే ‘కళంకితుల’యిన ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికింది. వోటరుకి వచ్చిన ఈ ‘కడుపు నొప్పి’ కొన్నాళ్ళ పాటు ఇలాగే వుండాలని భావిద్దాం.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 12 మే 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

 

Leave a Reply