‘పోవోయ్‌’ అంటే-‘మావో’య్‌ అన్నారు!

వాళ్ళ ముందు ఇస్లామిక్‌ టెర్రరిస్టులూ చిన్నవారే.

హిందూ ఉగ్రవాదులూ పిపీలకాలే.

అండర్‌ గ్రౌండ్‌ మాఫియాలూ అంగుష్ట మాత్రులే.

వాళ్ళ పేరు చెబితే-

ఒక్క రాష్ట్రమే కాదు. అన్ని రాష్ట్రాలూ హడలెత్తిపోతాయి.

ఆ మాట కొస్తే ప్రభుత్వమే కాదు.

దేశీయ కాంట్రాక్టర్లూ, విదేశీ బహుళజాతి సంస్థలూ బిక్కచచ్చిపోతాయి.

వారున్న చోటా భయమే. వారు లేకున్నా భయమే.

వారి మౌనమూ, అలికిడీ – రెండూ ఆందోళన కరమే.

ఎవరూ వారు? బరినీ, గిరినీ తెగించిన వారు.

‘చావో, మావో’ అని తెంపుచేసుకున్నవారు.

అవతరించినప్పుడు నక్సలైట్లు. ఇప్పుడు మావోయిస్టులు.

ఆంధ్రప్రదేశ్‌ లో వీరిని అణచివేశామనుకుని ఆ రాష్ట్ర సర్కారు సంబరపడింది. అందుకు ముందు ఎవరూ చేయలేని పనిని అప్పటి ముఖ్యమంత్రి వై.యస్‌ రాజశేఖరరెడ్డి చేశారని ఆయనకు కితాబులు ఇచ్చారు. అప్పటినుంచీ, దేశంలో నక్సలైట్ల చర్చ వస్తే చాలు.. ఆదర్శనీయమైన ‘ఆంధ్రప్రదేశ్‌ నమూనా’ గురించే అందరూ మాట్లాడతారు.

ఇంతకీ ఆంధ్రప్రదేశ్‌లో వైయస్‌ ఏం చేశారు?

ముందు చర్చలకు పిలిచారు. తర్వాత ‘చావగొట్టారు’.( చట్టానికి అడ్డంగా దొరికిపోతే తప్ప, చాలా హత్యలు ‘ఎదురు కాల్పుల’ జాబితాలోనే పడిపోతాయి.) చనిపోగా మిగిలిన వారిని పక్కరాష్ట్రాలకు తరిమి కొట్టారు.

ఈ నమూనాను ప్రతీ రాష్ట్రమూ పాటించాలని కేంద్రంలో హోంమంత్రులుగా వున్న వారు(శివరాజ్‌ పాటిల్‌, చిదంబరం) నక్సల్‌ప్రభావిత రాష్ట్రాలకు పలుమార్లు హితవు పలికేశారు. అంటే దానర్థం: మీ రాష్ట్రంలో వున్న మావోయిస్టులను పక్కరాష్ట్రాలకు తరిమేయండనేనా..వారి ఉద్దేశ్యం? ఒక రాష్ట్రం సమస్యను మరో రాష్ట్రానికి బదలాయించటమేనా పరిష్కారం?
‘ఆంధ్రప్రదేశ్‌ నమూనా’లో వున్న లొసుగు ఇదొక్కటే కాదు.

చర్చలకొచ్చేటంత వరకే వారు ‘సుత్తీ కొడవలి’ని జపించారు. తర్వాత వారి ‘కొండ’ గుర్తు ‘పొత్తూ, కొడవలి’ అయ్యింది.

చర్చలకొచ్చేంత వరకూ వారు ‘పీపుల్స్‌ వార్‌ గ్రూపు’ నక్సలైట్లు, చర్చలకొచ్చి వెళ్ళే ముందు తమని తాము ‘మావోయిస్టులు’ గాప్రకటించుకున్నారు. ‘దేశంలోని పాలక వర్గాలికేనా సంకీర్ణాలు? మాకు మాత్రం ఉండవా?’  అని భావించారో ఏమో, పీపుల్స్‌ వార్‌ ను, ఇతర రాష్ట్రాలలో బలంగా వున్న మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌ తో  శాశ్వతమైన పొత్తును( విలీనాన్ని) కుదుర్చుకున్నారు. దాంతో వారు ఒక జాతీయ శక్తిగా అవతరించారు. దేశంలోని దాదాపు సగం రాష్ట్రాలలో తమ కార్యకలాపాలను విస్తరింప చేసుకున్నారు. ఈ జాతీయ శక్తికి ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వారి వ్యూహాత్మక నాయకత్వాన్ని అందిస్తున్నారు.  అలాంటి వారిలో రామకృష్ణ( ఆర్కే) ఒకరు. ఈయన ఒరిస్సా సరిహద్దుల్లో వున్నట్టు వార్తలందాయి. ఈయనను చూడటానికి వెళ్ళినప్పుడే ఈయన భార్య పద్మను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్లను అణచివేసినట్లుగా,అందరితో పాటు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు నమ్మడం కూడా విశేషమే. నగరం నడిబొడ్డులో టీచర్‌ గా జీవనం సాగిస్తున్న పద్మను కోరాపుట్‌ వెళ్లేవరకూ పోల్చుకోలేక పోయారు. అయితే ఈ మావోయిస్టులు ఒకరకంగా తాము ఆధారపడే పీడిత జన సమూహాలకు మెల్లమెల్లగా దూరమవుతూ వచ్చారు. ముఖ్యంగా ఉధృతంగా వచ్చిన దళిత ఉద్యమాలలోనూ, సారా వ్యతిరేక ఉద్యమాలలాంటి స్త్రీల ఉద్యమాలలోనూ వీరిది ప్రేక్షక పాత్రే. పైపెచ్చు ఈ రెండు సమస్యలూ( కులమూ, జెండర్‌) అన్ని నక్సలైట్‌ గ్రూపులతో పాటు, మావోయిస్టులనూ అంతర్గతంగా వేధించాయి. రైతులే ఆత్మహత్యలు చేసుకోవటంతో వర్గశత్రువుల పేరు మీద ఏ పెద్దరైతునూ సంహరించే పనిని చేయలేరు. కాకుంటే, ప్రజల భూములనే ప్రభుత్వాలు లాక్కొని కార్పోరేట్‌ సంస్థలకూ, సెజ్‌లకూ, గనుల కాంట్రాక్టర్లకూ కట్టబెట్టటంతో పేద ప్రజలకు వీరి అవసరం ఏర్పడింది. ఆ విధంగా బలహీనపడ్డ నక్సలైట్‌ ఉద్యమాన్ని పరోక్షంగా ప్రభుత్వాలే బతికించాయి. ఇప్పుడు వగచి లాభం లేదు.

5 comments for “‘పోవోయ్‌’ అంటే-‘మావో’య్‌ అన్నారు!

Leave a Reply