బాబూ! చినబాబు వచ్చారా?

డాక్టర్‌ కొడుకు డాక్టరే ఎందుకవ్వాలి? పొడవటానికి. ఎవర్నీ? పేషెంట్‌ కొడుకుని.

పేషెంట్‌ కొడుకు పేషెంట్‌ గానే పుడతాడు. ఆరోగ్యవంతుడిగా పుట్టడు. అది రూలు. కొడుకును రంగంలోకి దించాలనుకున్న ఏ డాక్టరూ, కుటుంబానికి సంపూర్ణారోగ్యం ప్రసాదించడు.

 

యాక్టరు కొడుకు యాక్టరే ఎందుకవుతాడు? ఎక్కడానికి? దేనిమీద? అభిమాని భుజాల మీద.

అభిమాని కొడుకు వీరాభిమానిగానే పుడతాడు. విమర్శకుడిగా పుట్టడు. అది నియమం. కొడుకును తెరకెక్కించాలనుకున్న ఏ యాక్టరూ అభిమానిని ఆలోచింప చెయ్యడు. లేకుంటే కేవల పిక్చర్లుఫ్లాపులయితే అభిమానులు ఆత్మహత్యలెందుకు చేసుకుంటారు?

 

లాయరు కొడుకు లాయరే ఎందుకవుతాడు? వాయిదాల వేయించటానికి? ఏ కేసుకీ? తాతల ఆస్తి కేసుకి.

క్లయింటు కొడుకు క్లయింటుగానే పుడతాడు. గెలిచిన వాడిగా పుట్టడు. అది విధానం. కొడుక్కి కేసులు మిగల్చానకున్న ఏ లాయరూ, కేసును కనీసం రెండుతరాలన్నా సాగదీస్తాడు.

 

వాళ్ళకే తమ పుత్రరత్నాల మీద, అంతంత ముందుజాగ్రత్తలుంటే, లీడర్లకు మాత్రం వుండవూ? లీడ రు కొడుకు లీడరే అవుతాడు. ఎందుకూ? ఎందుకేమిటి?! ‘దండు కోవటాని’కి! నోట్లను కాదు లెండి. కేవలం వోట్లని. ఎందుకంటే వోటరు కొడుకు వోటరుగానే పుడతాడు. అలాగని వోటరు జీవితంలో ఏ మార్పూరాదని కాదు. వందకి వోటమ్ముకున్న వోటరుకి వెయ్యికి నోటమ్ముకునే వోటరు పుడతాడు. పది రెట్లు పెరిగింది.

బ్యాంకుల్లో వేసిన నోట్ల డిపాజిట్లు వేరు. వోట్ల డిపాజిట్లతో ఏర్పడ్డ బ్యాంకులు వేరు. మొదటివి లీడరు ఎవరికి రాసిస్తే వారికి వెళ్ళిపోతాయి. కానీ ‘వోటు బ్యాంకు డిపాజిట్లు’ అలాకావు. వాటిని డ్రా చేయాలంటే, లీడర్ల తర్వాత వారి కొడుకులకే తొలి అవకాశం వుంటుంది. వారు లేకుంటే వోటరు కూతుళ్ళను అనుమతిస్తారు. నెహ్రూకు కొడుకుల్లేరు .అందుకని కూతురుని అనుమతించారు. ఆతర్వాత ఆయన కుటుంబంలో కొడుకులే కొడుకులు: ముందు రాజీవ్‌ ,తర్వాత రాహుల్‌. (కూతురు ప్రియాంక వున్నా, కొడుకు కోసం వెనక్కి తప్పుకొని దారివ్వాల్సి వచ్చింది.)

ఈ కొడుకుల ప్రవేశం- జాతీయ పార్టీలలోనే కాదు. ప్రాంతీయ పార్టీలలో కూడా ఎక్కువ వుంటుంది.జమ్ము కాశ్మీర్‌ లో నేషనల్‌ కాన్పరెన్స్‌ పార్టీలో అబ్దుల్లా తర్వాత అబ్దుల్లా లాలా ముగ్గురు అబ్దుల్లాలు వచ్చేశారు. షేక్‌ అబ్దుల్లా, ఆయన కొడుకు ఫరూక్‌, ఫరూక్‌ కొడుకు ఓమర్‌- మూడు తరాలనూ చూపించేశారు. తమిళనాడులోని ద్రవిడమున్నేట్ర కజగమ్‌(డిఎంకె) పార్టీలో కరుణానిధి ఇద్దరు కొడుకులూ రంగ ప్రవేశం చేసేశారు. శివసేన పార్టీలో బాల్‌ థాకరే కొడుకు ఉధ్ధవ్‌ థాకరే వారసత్వాన్ని కొనసాగంచేశాడు.(కొడుకు లాంటి కొడుకు, కాస్త పేగు ఎడమయిన కొడుకు రాజ్‌ థాకరే మాత్రం పార్టీ వదలి వేరు కుంపటి పెట్టుకోవాల్సి వచ్చింది.) ఉత్తర ప్రదేశ్‌లోని సమాజ్‌ వాదీ పార్టీలో ములాయం సింగ్‌ కొడుకు అఖిలేష్‌ను దించేశారు.

అయితే కొడుకులు వుండగా కూతుళ్ళకు అవకాశం వుండదా? ఉంటుంది. కొడుకులతో పాటు పాటు వుంటుంది. నిన్న మెన్నటి దాకా నేషలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌.సి.పి) లో వున్న రాష్ట్రపతి అభ్యర్థి పి.ఎ.సంగ్మా కొడుకుని రాష్ట్రంలో(మేఘాలయ) తన వారసుడిగా కొడుకు కొన్రాడ్‌ సంగ్మాను ప్రతిష్టించే మార్గాన్ని వేసుకుని కూతురు అగాథా సంగ్మాను జాతీయ రాజకీయాలకు పరిచయం చేశారు. కరుణానిధి కూడా ఇద్దరి కొడుకులకూ వారసత్వాని అనుగ్రహించాక, కూతురు కనిమొళికి దారి చూపారు.

మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) అధినేత కె. చంద్రశేఖరరావు ముందు కొడు కె. తారక రామారావుకు బాట వేశాకే, కూతురు కవితకు రాజకీయాల్లో చురుకయిన పాత్రను ఇచ్చారు.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనూ అలాగే జరిగింది. వైయస్‌ రాజశేఖరరెడ్డి జీవించి వుండగా తన వారసుడిగా కొడకు వై.యస్‌. జగన్మోహన రెడ్డినే రాజకీయ ప్రవేశం చేయించారు. దాంతో ఆ వారసత్వం కోసం ఆయన మరణానంతరం కాంగ్రెస్‌ తో తగవులాడి, కొత్త పార్టీ పెట్టుకున్నారు. ఆయన వివిధ కేసుల్లో నిందితుడిగా జైలుకు వెళ్ళాక గాని వైయస్‌ రాజశేఖ రెడ్డి కూతురు షర్మిల తెలుగు వోటర్లకు పరిచయం కాలేదు. అప్పుడు కూడా ఆమె కేవలం ‘రాజన్న కూతురు’గా కాకుండా ‘జగనన్న చెల్లెలు’గా వచ్చారు.

అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్‌ మాత్రం కొడుకులనూ, కూతుళ్ళనూ కాకుండా తొలుత ‘అల్లుళ్ళ’ను గుర్తించి కుటుంబ వారసత్వానికి కొత్త భాష్యం చెప్పారు. అందులోని ఒక అల్లుడే(చంద్రబాబు) ఎన్టీఆర్‌నుంచి ముఖ్యమంత్రి పదవిని ‘ప్రజాస్వామ్యం’పేరిట లాక్కొన్నారు. అదే చంద్రబాబుకు ఇప్పుడు వారసుడు సిధ్దమయ్యాడు. ఆయనే కొడుకు లోకేష్‌. కానీ. తనకు తానుగా జనాకర్షణశక్తి లేని చంద్రబాబు వోటుబ్యాంకు రక్షణార్థం మళ్లీ ఎన్టీఆర్‌ తనయుడినో(బాలయ్యనో), తనయుడి తనయుడినో( జూనియర్‌ ఎన్టీఆర్‌నో) ఆశ్రయించాల్సి వస్తుంది. అది వేరే విషయం.

ఈ ఉదాహరణలన్నీ చెప్పి ఏదయినా పరాయిదేశపు సామాజిక శాస్త్ర వేత్తనీ, రాజనీతి కోవిదుడినీ అడగాలి: ‘మా దేశంలో వున్నది ప్రజాస్వామ్యమేనా? అని.

‘కాదు. పితృస్వామ్యం’ అంటాడు మొదటి వాడు.

‘కాదు. రాచరికం’ అంటాడు రెండవ వాడు.

‘ఏదుంటే ఎవడికీ? నావోటుకు వెయ్యిచ్చారా? లేదా?’ అంటాడు పరమ పవిత్రమయిన వోటరు.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 28జూన్-5జులై2012 వ సంచికలో ప్రచురితం)

 

 

 

2 comments for “బాబూ! చినబాబు వచ్చారా?

Leave a Reply