బుల్లి పెట్టె లో ‘బూతో’డు!

టాపు(లేని) స్టోరీ:

‘టెర్రరిస్టు ఎలా పుడతాడు?’

‘దేశం మీద మరో దేశం పడినప్పుడు’

‘ఎక్స్ట్రీమిస్టు ఎలా పుడతాడు?

‘వర్గం మీద మరో వర్గం పడినప్పుడు’

‘రేపిస్టు ఎలా పుడతాడు?’

‘… ….. ….. ……!’

అవును. ఈ ప్రశ్నకు సమాధానం లేదు.

ఆ మాటకొస్తే న్యాయమూర్తులే తలపట్టుకుంటున్నారు. నాలుగయిదేళ్ళ పసిపిల్లల పై అత్యాచారాలు ఎలా జరిగిపోతున్నాయి? చేస్తున్న వీళ్లు ఎవరు? అర్థం కావటం లేదు.

పోలీసులు వాళ్ళ ముఖాలు కప్పి మరీ కోర్టులకు హాజరు పరుస్తున్నారు. వాళ్ళని పాఠకులూ, ప్రేక్షకులూ చూసి వుండక పోవచ్చు. కానీ న్యాయమూర్తులు చూస్తారు.

ఇంతకీ నిందితుల చేతులు చూశారో? లేదో? అవి కాళ్ళలాగా వుండి వుండాలి.

వెనక వైపు పరీక్షగా చూశారో లేదో? తోక ఒకటి తప్పకుండా వుండి వుండాలి.

కోతి నుంచి మనిషి పుట్టాడూ అన్న పరిణామ క్రమం ఎప్పుడో పూర్తయి పోయి వుంటుంది. ఇప్పుడు కొత్తది మొదలయి వుంటుంది. మనిషి నుంచి ఒక వికృత మృగం తయారయ్యే క్రమం అయి వుండాలి. ఇందుకు తగ్గ ప్రయోగాలు ఎక్కడో జరిగిపోతున్నాయి.

ఆ ప్రయోగశాలల మీద నిఘా వేయమని న్యాయమూర్తులు పోలీసులకు ఆదేశించారో లేదో? ఏమో అలాంటి ప్రయోగ శాలలు పోలీసు లాకప్పుల్లో కూడా వున్నాయేమో?

చిన్న సమాచారం. ఈ ప్రయోగాలు పబ్లిగ్గా కూడా జరిగిపోతున్నాయి. ‘ఇంటర్నెట్‌’కు దాపరికాలు వుండవు. నీతినీ చూపిస్తుంది. బూతునీ చూపిస్తుంది.

చిత్రమైనది మార్కెట్‌. ఒక చేతిలో దరిద్రాన్ని పెట్టి, ఇంకో చేతిలో నేరాన్ని పెడుతుంది. ఏడవతరగతి దగ్గరో, పదవతరగతి దగ్గరో దరిద్రం కారణంగా పల్టీలు కొట్టే కుర్రవాళ్ళుంటారు. ఒకప్పుడు మహాఅయితే బాల కార్మికులు అయ్యేవారు. ఇప్పుడు వారికున్న సౌకర్యాలు రీత్యా బాల నేరస్తులు కూడా కాగలరు. ఏదో పనిలో ఒళ్ళు నలగ్గొట్టుకుని వచ్చి, వచ్చిన వందనో, రెండొందల్నో ఖర్చు చేసే తీరులో నేరానికి బీజం పడి వుండవచ్చు.

ఇళ్ళ మధ్యనే వుండే ‘వైన్‌ షాపు’లో చీప్‌ లిక్కరు కొనుక్కొని, ఆ పక్కకొచ్చి పట్టేశాక, వాడు నేరుగా సినిమాకే వెళ్ళాలని రూలు లేదు. ఎదురుగ్గా వాడి కోసం ఇంటర్నెట్‌ కేఫ్‌లు వుంటాయి. పదిరూపాయిలిచ్చి గంటసేపు, క్యూబికిల్‌ లో కూర్చుంటాడు. వాడు ఏ సైట్లకు వెళ్ళాలో, ముందున్న ‘హిస్టరీ’ యే చెబుతుంది. చూడగా చూడగా వాడికో విషయం అర్థమవుతుంది: స్త్రీ అంటే అవయవాల దొంతర అని. ‘పోర్న్‌’ (బూతు) చూపేవాడికి అడ్డూ అదుపూ వుండదు. వృధ్ధ, గర్భిణీ, బాలింత స్త్రీలనుంచి పసిపిల్లల అవయవాలను పరిచేస్తాడు. ఆ తక్షణం ఒక్కొక్కడి ఒక్కొక రకం పిచ్చి పుడుతుంది. పిచ్చికుక్క పలానా వారినే కలవాలని రూలు లేదు. ఎవర్నయినా కరిచేస్తుంది. అలా కరిచేశాక, కాల్చేసిన సిగరెట్టును కాలి బూటుకింద నలిపేసినట్టూ, తాగేసిన మందు సీసాను అక్కడికక్కడే పగలగొట్టినట్లూ, కరిచిన వాళ్ళను కొట్టి చంపేస్తారు కూడా. వీడే నేటి రేపిస్టు. రేపిస్టులు అన్ని వర్గాలలోనూ వుంటారు. భూస్వాముల్లో, పెత్తందారుల్లో వీరు ఎక్కువగా వుండేవారని లోకం కూడా భావించేది. కాని కూటికి గతిలేని వాడూ, కూలీనాలీ చేసుకునే వాడు, ఇంకా బొడ్డూడని వాడూ- రేపిస్టు అవుతున్నాడు. మార్కెట్టే ‘రేపిస్టుల’ రేసును వృధ్ధి చేసే ప్రయోగశాల పెట్టింది. వేరే చోట వారికోసం వెతికితే ఎలా?

 

న్యూస్‌ బ్రేకులు

‘రోబో’నామా!

బొగ్గు కుంభకోణానికి బాధ్యత వహించి ప్రధాని మన్‌ మోహన్‌ సింగ్‌ రాజీనామా చెయ్యాలి

-రవి శంకర్‌ ప్రసాద్‌, బీజేపీ జాతీయ నేత

పోదురూ బడాయీ? రోబోలు ఎక్కడన్నా రాజీనామా చేస్తాయా? చెప్పండి.

కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరవయింది.

-నన్నపనేని రాజకుమారి, తెలుగు దేశం పార్టీ మహిళా నేత

మీరంటున్నది ఎవరి గురించీ? శ్రీలక్ష్మి, సబితా ఇంద్రారెడ్డిల గురించా?!

ట్విట్టోరియల్‌

ఆవిడ ‘సైకిలు’ దిగుతారు, ‘చెయ్యి’వ్వండి!

jayaprada‘సైకిలు’ ఎక్కడయిన ‘సైకిల’నే కదా- సినీ నటి జయప్రద రాష్ట్రంలోని ‘తెలుగుదేశం’ నుంచి వెళ్ళి ఉత్తరప్రదేశ్‌లోని ‘సమాజ్‌ వాదీ పార్టీ’లో చేరారు?( రెంటి గుర్తూ ‘సైకిలే’ కదా). అయితే పార్టీ ఏదయినా నటీమణులను ఒకేరీతిగా చూస్తారు. వారి ‘గ్లామర్‌’ను ప్రచారం వరకే పరిమితం చేస్తారు. ఒక వేళ టిక్కెట్టిచ్చి పోటీ చేయించినా, అసెంబ్లీలోనూ, పార్లమెంటులోనో అలా ‘తళుక్కు’మంటే చాలు- అనుకుంటారు కానీ, వారికి కూడా ఓ మంత్రి పదవి ఇవ్వాలన్న యోచన చెయ్యరు. జయప్రద లోకం చుట్టి వచ్చారు. సినిమాల్లో ఎలా రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఖ్యాతి సాధించారో, రాజకీయాల్లోనూ అలాంటి పేరే తెచ్చుకున్నారు. కానీ పేరు వేరు పదవి వేరు కదా! భూమి గుండ్రంగా వుందని ఇప్పుడు కొత్తగా గ్రహించి, రాష్ట్రానికి వచ్చారు. ఇప్పటికే సినీనటుల పునరావాస కేంద్రంగా వున్న కాంగ్రెస్‌లో ఆమెకూ ఓ చోటు దొరక వచ్చు. అంతే!?

‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

బురదాంధ్ర ప్రదేశ్‌!

పలు ట్వీట్స్‌: మురికి వాడల్లో మన రాష్ట్రానికి ప్రత్యేక స్థానం వుందిట!

కౌంటర్‌ ట్వీట్‌: అందుకేనా? ఒకరి మీద ఒకరు విరివిగా బురద జల్లుకుంటుంటారు!!

ఈ- తవిక

పోలీసులు

ఆడ వారి మీద

అకృత్యాలు జరుగుతున్నాయని

అడగటానికి వస్తే-

‘ఆడ వాళ్ళూ కూడా

అడిగేవాళ్ళయ్యారా? ‘

అని నాలుగు తగిలించారట!

ఎవరో చెప్పుకోండి చూద్దాం!?

 బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘నేటి చెడిన బాలలే రేపటి రేపిస్టులు’

‘కాదు. కాదు, నేటి రేపిస్టులే రేపటి బాలలు!( వాళ్ళ వయసు చూసి మాట్లాడండి. ఇప్పటి రేపిస్టులు బాలల కన్నా చిన్నవాళ్ళు!)

కొట్టేశాన్‌( కొటేషన్‌):

నవ్వు గనుల్ని తవ్వు. తర్వాత గనులు నిన్ను తవ్వేస్తాయి- గాలి మాట!

(సూర్య దినపత్రిక 27 ఏప్రిల్ 2013 వ తేదీ సంచికలో ప్రచురితం) 

3 comments for “బుల్లి పెట్టె లో ‘బూతో’డు!

Leave a Reply