‘మసి’ మోహనుడు

చిత్రం: బలరామ్

చిత్రం: బలరామ్

పేరు : మన్‌మోహన్‌ సింగ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: మాజీ నెహ్రూ-గాంధీ కుటుంబేతర విధేయ ప్రధాని

ముద్దు పేర్లు :‘మసి’ మోహనుడు( ‘కోల్‌’గేట్‌ తోముతా నల్లగా ) ‘మర’మోహనుడు( ‘రోబో’ సినిమాలో ‘చిట్టి’లాంటి వాడిని. కమాండ్స్‌ తీసుకుంటాను.అన్ని కమాండ్స్‌ ఇవ్వగలిగింది ‘హై కమాండ్‌)

విద్యార్హతలు : ‘మన్‌ మోహనా మిక్స్‌’ లో డాక్టరేట్‌. అందుకే పి.వి ప్రధానిగా, నేను ఆర్థిక మంత్రిగా వున్నప్పుడు ‘గూబలదర’యిజేషన్‌ (గ్లోబలయిజేషన్‌ ) తెచ్చాను.

హోదాలు : రాష్ట్రపతి తర్వాత తర్వాత హోదాలో రెండ ప్రధానమైన హోదా ప్రధాని. అధికారంలో మాత్రం- యూపీయే ఛైర్‌ పర్సన్‌ దే అగ్రస్థానం.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: ‘రోబో’ లక్షణాలన్నీ నాకుంటాయి. (కొన్ని రోబోలు నవ్వుతాయి. ఏడుస్తాయి. కానీ అలాంటి ఎమెషన్స్‌ నాకుండవు.)

రెండు: నా కళ్ళ ముందు ఏం జరుగుతున్నా, ‘కమాండ్‌’ రాకుండా పట్టించుకోను. కడకు ఫైల్స్‌ మాయమవుతున్నా సరే.

సిధ్ధాంతం : సరళీ కృత ఆర్థిక విధానం. ( అంటే రూపాయి కింద పడటానికి ఎలాంటి కఠినమైన ఆంక్షలు విధించకుండా, మార్గాన్ని సరళం చేయటం.

వృత్తి : దేశాన్ని స్వారీ చేయించటం: ద్రవ్యోల్బణాన్ని ‘జోడంకెల’ మీదా, ఆర్థిక వృధ్ధిని ఒక అంకె మీదా( అసలు ముందు ఇందుకు విరుధ్ధంగా అనుకున్నాను లెండి.)

హబీలు :1. విదేశీ పర్యటనలకు వెళ్ళిరావటం.(నాతో చర్చలు ఎంతో సౌకర్యవంతంగా వుంటాయని పలు దేశాల అధినేతలు అంటారు. ‘రోబో’లు వాదించవు కదా! అందుకే అయి వుంటుంది.)

2. విగ్రహాలను ఆవిష్కరించటం. వాటికి శంకు స్థాపనలు చేయటం (అందుకోసం అవసరమయితే, శత్రుపక్షం వారు పిలిచినా వెళ్తాను)

అనుభవం : పెట్టమన్న చోటా, పెట్టాల్సిన చోటా సంతకాలు పెట్టటంలో దశాబ్దాల అనుభవం.( రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌ గా కరెన్సీ నోట్ల మీద పెట్టలేదూ!)

మిత్రులు : సారీ, ఈ మాట నా ‘మెమరీ’ లో లేదు. నాకు ‘యజమానులు’ మాత్రమే వుంటారు.

శత్రువులు : నాలోని ‘చిప్‌’ మార్చేంత వరకూ నాకు శత్రువులు వుండరు.

మిత్రశత్రువులు :మంచి మాట. చరిత్రలో సర్దార్‌ వల్లభ భాయ్‌ పటేల్‌, నెహ్రూకు మిత్ర శత్రువే. కానీ నేను మోడీని అలా చూడలేను. మోడీ పటేల్‌ లాగా, సెక్యులరిస్టు కాడు.

వేదాంతం :మచ్చలేని మనిషిలా జీవించాలనుకున్నాను. ఇప్పటికీ నా ముఖానికి ఇలాంటి మచ్చా లేదు. కాకుంటే, నాపక్కన రాహుల్‌ ప్రకాశించాలంటే, నాకు ‘అగ్లీ స్పాట్‌’ ( బ్యూటీ స్పాట్‌ లాగా) అవసరమయింది.

జీవిత ధ్యేయం : ప్రధాని పోస్టును అప్రధానంగా మార్చటం.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్  ఆంధ్ర వార పత్రిక 1-6నవంబరు 2013 సంచికలో ప్రచురితం)

 

3 comments for “‘మసి’ మోహనుడు

Leave a Reply