మేతకు ముందు! నీతికి వెనుక!!

ఒకటి: కామన్‌ వెల్త్‌!
రెండు: ఆదర్శ్‌!!
మూడు:స్పెక్ట్రమ్‌!!!
ఈ మూడింటి గురించి నీ కేమి తెలియును?
ఇలా ఏ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రంలో నైనా ఇస్తే, సమాధానాలు ఎలాగుంటాయి?
ఒకటి: యూ…జర్‌ ఛార్జ్‌
రెండు: పీ…నాల్టీ
మూడు:ఎ…డిషనల్‌ టాక్స్‌.
వెరసి ‘యూ. పీ, ఎ’ సర్కారు తిరిగి రెండవ సారి ఎన్నుకున్న ప్రజలకు ఇచ్చే పరిహారం.
దీని పేరే అవినీతి.
దేశఖ్యాతిని దశదిశలా చాటే  కామన్‌ వెల్త్‌ గేమ్స్‌ ఆదిలోనే అభాసుపాలయ్యాయి. ఈ ఆటల
నిర్వాహక కమిటీ అధ్యక్షుడు సురేష్‌ కల్మాడీ పీకలోతు అవినీతి ఆరోపణలలో కూరుకు పోయి కేంద్ర సర్కారు
పరువును అంతర్జాతీయంగా మంట కలిపారు.
దేశభద్రత కోసం కార్గిల్‌ యుధ్ధంలో అసువులు బాపిన వారి భార్యలకోసం నిర్మించిన 31
అంతస్తుల గృహసముదాయ భవంతిలో ఫ్లాట్లను చనిపోయిన తన అత్తగారితో పాటు, ముగ్గురు బంధువులకు
ముఖ్యమంత్రి హోదాలో వుండి కట్టబెట్టిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ
కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠను సముద్రం పాలు చేశారు.
దేశ ప్రజలకు చెందాల్సిన1.76 లక్షల కోట్ల రూపాయిల ఆదాయానికి గండి కొడుతూ టూజీ
స్పెక్ట్రమ్‌ లైసెన్సుల నిబంధనలకు నీళ్ళు వదిలి కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) కు కేంద్ర కమ్యూనికేషన్‌
టెక్నాలజీ మంత్రిగా పట్టుబడ్డ ఎ.రాజా యుపీయే గౌరవాన్ని నిలువునా మంట గలిపారు.
దేశవ్యాపితంగా వచ్చిన వత్తిడి వల్ల ముగ్గురునీ వారి వారి పదవులనుంచి తప్పించారు.
విచారణలు మొదలుపెట్టారు. ఇదంతా బట్టబయిలయిన ‘అవినీతి’. మరి పట్టుబడని సొమ్ము?
దొరికిన మేరకే లక్షల కోట్ల రూపాయిలలో వుంటే, దొరకనిది ఎంత వుంటుందో..?
ఇవన్నీ వరసగా బయిటపడ్డ కుంభకోణాలు. అలాగని ‘అవినీతి’ మీద ‘పేటెంటు’ను ఒక్క
యుపియేకో, లేక కాంగ్రెస్‌ పార్టీకో, లేక డిఎంకె పార్టీకో ఇవ్వటం అన్యాయం అవుతుంది. ‘తిలా పాపం తలా
పిడికెడు’ ఎప్పుడూ వుంటూనే వుంటుంది. ‘కామన్‌ వెల్త్‌’ అవినీతిని తవ్వబోతే, అందులో ఒకటి రెండు బిజెపి
నేతల పేర్లు కూడా వచ్చాయి.
సందట్లో సడేమియాలాగా, ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రముఖ మహిళానేతలు ఆసక్తికరమైన
బహిరంగ ప్రకటనలు చేశారు. ఒకరు: ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి,
మరొకరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఎఐడిఎంకె అధ్యక్షురాలు జయలలిత.
మాయావతి మీద కూడా అవినీతి ఆరోపణలు వున్నాయి. వాటిని సిబిఐ దర్యాప్తు చేసింది. తాజ్‌
కారిడార్‌ లో ముడుపుల వ్యవహారం ఒకటీ, ఆదాయానికి మించిన ఆస్తుల వున్న కేసు మరొకటీ. యుపియే కీ
మద్దతు ఇస్తే, ఈ రెండు కేసులనూ ఉపసంహరించుకుంటామని యుపియే ఆమె ఒక ‘బంపర్‌ ఆఫర్‌’ ఇచ్చిందని
మాయావతి ఇప్పుడు వెల్లడించారు. అయితే ఆమె ఈ ‘ఆఫర్‌’ను తిరస్కరించారు.
ఇక జయలలిత విషయం వేరు. ఆమే యుపియేకు ఇంతకుమించిన ‘బంపర్‌ ఆఫర్‌’ ఇచ్చారు.
మంత్రివర్గం నుంచి ఎ. రాజాను తొలగిస్తే, ( డిఎంకె మద్దతు ఉపసంహరించుకునే ప్రమాదం వుంటే) తమ పార్టీ
మద్దతు ఇస్తుందని చెప్పారు. ఈ ఆఫర్‌కు యుపియే నుంచి కాకుండా, ఆమె బధ్ధ విరోధి డిఎంకె అధినేత,
తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి నుంచి స్పందన వచ్చింది. ఆయనే  రాజా చేత రాజీనామా చేయించారు.
అవినీతికి పాల్పడకుండా వుండటం ఈ రాజకీయ నేతలకూ ఎలాగూ చేతకావటం లేదు.
కనీసం అవినీతిలో పట్టుబడ్డప్పుడు కూడా
శిక్షించటానికి ‘ఆఫర్‌’.( జయలలిత మార్కు ఆఫర్‌)!
శిక్షించకుండా వుండటానికి ‘ఆఫర్‌'(కాంగ్రెస్‌ మార్కు ఆఫర్‌)!
రాజకీయంతో అవినీతి చేయటమే కాదు…
అవినీతిని సైతం రాజకీయం చేయటం నేర్చుకున్నారు.
బహుశా మొదటి విద్యలో మన నేతలకు, ఇతర దేశాల నేతలూ కూడా పోటీపడవచ్చు.
కానీ, రెండో విద్యలో మాత్రమే, భారత్‌కే అగ్రస్థానం లభించాలి!?

3 comments for “మేతకు ముందు! నీతికి వెనుక!!

Leave a Reply