వలసలే భయం -ఉప ఎన్నికలు నయం

ఎన్నికలంటే ఏమిటి?

హామీలూ, వరాలూ, తిట్లూ, శాపనార్థాలూ – ఇవి కదా!

కానీ, కేసులూ, ఖాతాల స్తంభనలూ, ఆస్తుల జప్తులూ, అరెస్టులూ… ఇవేమిటి?

ఎన్నికలప్పుడు- పలు అధికారాలు ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్‌(ఇసి) కొచ్చేస్తాయి. అందుచేత ఈ వేళల్లో ఆ సంస్థే తీర్పరిగా వుంటుంది. కానీ ఇప్పుటి (18 అసెంబ్లీ స్థానాల) ఉప ఎన్నికలు చూడండి. హడావిడి ‘ఇసి’ కాదు. అంతా ‘సిబిఐ’ దే.

ఇసి ఎన్నికల షెడ్యూలు ఇసి కుంటే, సిబిఐ అరెస్టుల షెడ్యూలు సిబిఐ కున్నది.

ముందు నామినేషన్లు, తర్వాత నామినేషన్ల ఉపసంహరణ, ఆపై ప్రచార ఘట్టం- ఇలా వుంటుంది ఇసి షెడ్యూలు.

మరి సిబిఐ షెడ్యూలో..!? జగన్‌ ఆస్తుల కేసులో ముందు అధికారుల, ఆడిటర్ల ఆరెస్టు, తర్వాత ఆయన మీడియా సంస్థల ఖాతాల నిలుపుదల, ఆపై ఆస్తుల జప్తు.

సిబిఐ-సర్వస్వతంతంగా పనిచెయ్యాల్సిన సంస్థ. కానీ ఆ సంస్థ మీద కేంద్రంలో ఎవరు వుంటే వారి వత్తిడి వుంటుందని, అనేక మార్లు అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. సరే ప్రతిపక్షంలో వున్న బీజేపీ పలుమార్లు సిబిఐను ‘కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌’ సాగదీసి చెప్పింది. (బీజేపీ అధికారంలో వున్నప్పుడు అది ‘బీజేపీ బ్యూరో’ గా వ్యవహరించిందన్న నీలాపనిందలు కూడా వున్నాయి లెండి.)

అదే నిజమైతే ‘సిబిఐ’ కదలికలను కేంద్రంలో వున్న కాంగ్రెస్‌ కదలికలుగా భావించాల్సి వుంటుంది.

ముందు ఉప ఎన్నికలను పెట్టుకుని, జగన్‌ మీద ఇన్ని చర్యలు తీసుకుంటుంటే, జగన్‌ పై సానుభూతి మరింత పెరగదా? ఆ సానుభూతి వోట్ల ఆయన పార్టీ కొచ్చే వోట్ల శాతాన్ని పెంచదా? ఇలా చేస్తే కాంగ్రెస్‌ కొరివితో తలగోక్కున్నట్టే కదా! పార్లమెంటు స్థానంతో పాటు, 18 స్థానాల మీద కాంగ్రెస్‌ ఆశలు వదలుకుంటే తప్ప, ఈ పనికి సన్నద్ధం కాదు.

జగన్‌ పై ఈ చర్య జరగక పోయినా వీటిలో మూడు లేదా నాలుగు స్థానాలు కన్నా కాంగ్రెస్‌ ఆశించటం లేదని, కాంగ్రెస్‌ నేతలే తమ వ్యక్తిగత స్థాయి సంభాషణల్లో అంటున్నారు.

ఆ మూడూ వస్తే ఎంత? పోతే ఎంత?- అని కాంగ్రెస్‌ భావిస్తుందా?

అంత గుండె నిబ్బరమే వుంటే, మొన్న తెలంగాణలో జరిగిన 7 స్థానాల ఉప ఎన్నికలలోనూ ఒక్క సీటూ రానందుకు, ఎందుకు అంత ఆందోళన చెందింది. మరీ ముఖ్యంగా ‘చేతి’లోని మహబూబ్‌నగర్‌ స్థానం పోయినందుకు ఎంత హడావిడి అయ్యింది?

ఏమయితే అయిందని, ‘చట్టాన్ని తన పనిని తాను చేసుకుపోనిద్దామని’ తెంపు చేసుకుందా?

కాదు.

రాబోయే 18 స్థానాల్లో అత్యధిక స్థానాల్ని జగన్‌ వైయస్సార్‌ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంటే, సీమాంధ్ర లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి గెంత వచ్చు. తగిన ‘లబ్ధి’ పొందవచ్చు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల సంఖ్య తగ్గితే, సభలో ఆ మేరకు బలాన్ని పొందటం కోసం, ఇతర పక్షాల వైపు చూడాలి. ఇలాంటి అవస్థ వస్తే గతంలో అయితే కలుపుకోవటానికి చిరంజీవి పార్టీ(పీఆర్పీ) వుందనుకునే వారు. ఇప్పుడు ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌ లో కలిసి పోయింది. ఇటీవలనే ఉప ఎన్నికలతో సంఖ్యాబలాన్ని పెంచుకున్న టీఆర్‌ ఎస్‌ వుంది. సులువుగా మద్దతు పలుకటానికి టీఆర్‌ ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు, చిరంజీవి అంత అనుభవ శూన్యుడు కారు. నిజంగా మద్దతు ఇవ్వాల్సి వస్తే ఆయన పెట్టే ‘షరతులూ’ కోరే ‘కోరికలూ’ మామూలు స్థాయి లో వుండవు. ఎలా చూసినా ఈ 18 ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల తర్వాత చిత్రం- కాంగ్రెస్‌ కు గొప్ప ‘హారర్‌’ ఫిల్మ్‌లాగా కనిపిస్తోంది.

కాబట్టి జగన్‌కు ‘ఉచ్చు’ బిగించే కార్యక్రమాన్ని ముందుకు జరిపేశారు.

జగన్‌ మీడియా సంస్థల ఖాతాలను నిలుపుదలచేసి, వాటి ఆస్తుల జప్తుకు సిబిఐ ఈ సమయంలో ముందుకు దూకటంలో అంతరార్థం ఇదనే భావించాల్సి వుంటుంది.

ఒక వేళ ఈ పనంతా సిబిఐ యే స్వతంత్రంగా చేసుకుపోతుందని భావించటానికి, కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ పొరపాటున కూడా ఆస్కారం ఇవ్వటం లేదు.

రాష్ట్ర పౌరసమాచార శాఖ ప్రకటనలు ఇదే వరవడిలో నిలుపు చేశారు. ఆస్తుల జప్తు కు సిబిఐ కోరగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది.

ఆర్థిక నేరాల విషయంలో విచారణ జరపొచ్చు, అందుకు సాక్ష్యాలు తారు మారు కాకుండా వుండటానికి నిందితులను అరెస్టుల్ని కూడా చేయవచ్చు. దర్యాప్తు సంస్థల బాధ్యతే అది.

కానీ దర్యాప్తును వేగవంతం చేసే తీరులోనూ, ముహూర్తాలూ పెట్టే పద్ధతిలోనూ పక్షపాతం తొంగి చూసినట్టు అనిపిస్తుంది.

జగన్‌ ఆస్తుల కేసుల్లో ‘లభ్ధికి ప్రతిగా పెట్టుబడులు’ పెట్టిన వారిని సైతం అరెస్టులును ఈ వేళప్పుడే చెయ్యటం చూస్తుంటే, నిజంగా జగన్‌ 18 సీట్లనూ గెలిచేసుకున్నా ఏం చెయ్యగలరు? వారితోనే సంతుష్టి చెందాల్సి వుంటుంది.

వలసలు పచ్చగా వున్న వైపే వుంటాయి. ఈ ‘ఆర్థిక దిగ్బంధనం’ తర్వాత, జగన్‌ పరిస్థితి ‘చుట్టూ సముద్రం, తాగటానికి చుక్క లేదు’ అన్న తీరుగా వుంటుంది. జగన్‌ దగ్గర వేల కోట్ల రూపాయిలు వుండవచ్చు. కానీ రూపాయి తీయలేని స్థితి వుంటుంది.

మరీ ముఖ్యంగా జగన్‌ స్వరపేటికలు ‘సాక్షి’ చానెల్‌, ‘సాక్షి’ దినపత్రికలు మూగబోతాయి.

అంటే జగన్‌ పై జరిగే విచారణ శైలి చూస్తుంటే, జగన్‌ ఆర్థికంగా పరిపుష్టిగా వుండే అవకాశం వుండదు. ఒక వేళ వున్నా, ఆయన అలా వున్నాడని చెప్పే ప్రసార మాధ్యమం వుండదు. కాబట్టి వలసల ఆలోచనకే కాంగ్రెస్‌ పార్టీ శాసన సభ్యులు స్వస్తి చెప్పే అవకాశం వుంటుంది.అయితే,, జగన్‌ను అరెస్టు చేస్తారా?

ఈ ఉత్కంఠే అందరినీ వేధిస్తోంది. ఆయనకు కోర్టుకు హాజరు కమ్మని నోటీసులు అందాయి. ఈ నెల 28న హాజరు కానున్నారు. అప్పుడు అరెస్టు చేస్తారు.

మొదటి నిందితుడి(ఏ-వన్‌)గా అభియోగ పత్రాల్లోకి ఎక్కాక, ఆయన తర్వాత నిందితుల్ని ఇప్పటికే ఆరెస్టులు సాగించేశాక, కడకు జగన్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళను సైతం నిర్బంధించటం మొదలు పెట్టేశాక, జగన్‌ అరెస్టన్నది తప్పదు. అది అనివార్యం.

అయితే, ముహూర్తమే సమస్య.

అంతకు ముందటి లెక్కల ప్రకారం అయతే, ఉప ఎన్నికలకు ముందు జగన్‌ను కదపరు- అన్న భరోసాతో ఆయన పార్టీ వారు కూడా వున్నారు.

ఇప్పుడా నమ్మకాలు సడలి పోయాయి.

కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఉప ఎన్నికలకు ముందు చేస్తేనే ‘పొంచి వున్న ప్రమాదం’ నుంచి కాంగ్రెస్‌ గట్టెక్కుతుంది.

ఫలితాలు వచ్చే వేళకి జగన్‌ వెలుపల లేక పోతే, కాంగ్రెస్‌నుంచి ఎమ్మెల్యేలను దూకించే ‘ఆపరేషన్‌ ఆకర్ష్‌’ కు చక్రం తిప్పే నాథుడు వుండరు. అందుకే జగన్‌ను అరెస్టు చేయటానికి కూడా ‘ఇదే అదను’ కావచ్చు.

జగన్‌ అరెస్టు అంత సులువా?

ఈ ప్రశ్నకు సమాధానం కష్టమే. సీమాంధ్రలో ‘జనసమ్మోహన శక్తి’ గా మారిపోయిన జగన్‌ను ఒక సాధారణ నిందితుడిలాగా అరెస్టు చేసి జైలుకు పంపుతుంటే, సీమాంధ్ర ప్రశాంతంగా వుంటుందా?

‘శాంతి భద్రతల’ సమస్య తల ఎత్తదా? బహుశా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు సిద్ధ మయ్యే వున్నాయి. ఇందు తగిన కసరత్తును కూడా సిబిఐ మన కళ్ళ ముందే చేస్తోంది.

ఈ కేసుల్లో-

అధికారులను జైలుకు పంపించారు. ఏమీ కాలేదు

ఆడిటర్‌ విజయసాయి రెడ్డిని పంపారు- ఆందోళనలు జరగలేదు.

జగన్‌ ను ఏ-వన్‌గా ప్రకటించారు- రాష్ట్రం అట్టుడికిపోలేదు.

జగన్‌ మీడియా ఖాతాలు నిలుపు చేశారు- జర్నలిస్టులు సంఘాలు మాత్రం కదిలాయి.

ఇప్పుడు ఆస్తులు జప్తు చేశారు- శాంతియుత నిరసనలు జరుగుతాయి.

ఇంతే కదా..

ఇప్పుడు అరెస్టు చేస్తే మాత్రం, ఏమవుతుంది?- అన్న తరహాలో సిబిఐ జనాన్ని సిధ్దం చేస్తున్నట్టున్నది.

ఒక వేళ అల్లర్లు జరిగినా, నిలువరించగలమన్న భరోసాలో రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌ ప్రభుత్వం వున్నట్టున్నది.

ఉప ఎన్నికలలో గెలుపు వోటముల మీద తన భవితవ్యం ఆధారపడలేదని కిరణ్‌కుమార్‌ రెడ్డికి కూడా తెలిసి పోయినట్టుంది. ఆయన నిశ్చింతగా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. జనాకర్షణ కోసం కూడా చిరంజీవిని పెద్దగా వినియోగించుకోవటం లేదు. జగన్‌ దిగ్బంధనాన్ని విజయవంతం చెయ్యటమే ఆయన ప్రధాన విధిగా కనిపిస్తోంది. ఈ పని చేస్తే తన (ముఖ్యమంత్రి) ఉద్యోగం నిలుస్తుందన్న నమ్మకమూ ఆయనకు కలుగుతోంది.

ఎలా చూసినా ఉప ఎన్నికల కన్నా, ఉప ఎన్నికల తర్వాత జరిగే వలసలే కాంగ్రెస్‌ను వణికిస్తున్నాయి.
-సతీష్ చందర్
(ఈ వ్యాసం 1-5-12 నాడు ఒక రాజకీయ వారపత్రిక కోసం రాసింది.)

1 comment for “వలసలే భయం -ఉప ఎన్నికలు నయం

Leave a Reply