శత్రు సూక్తం

మిత్రుడేం చేస్తాడు? నా అభిప్రాయాన్ని వినకుండానే సమర్థించేస్తాడు, నా పనులకు అనాలోచితంగానే సహకరించేస్తాడు, నా ప్రవర్తన ఎలా వున్నా మురిసి పోతాడు. ఒక్క ముక్కలో అద్దం లో నా ప్రతిబింబం లాంటి వాడు. నాలాంటి నన్ను చూసి నేను నేర్చుకునేదేముంటుంది- నటన తప్ప. అదే శత్రువనుకో. నా అభిప్రాయాన్నివ్యతిరేకిస్తాడు. నన్ను రెచ్చగొడతాడు. నా లోని శక్తియుక్తుల్ని బయిటకు తీస్తాడు. నా లోపాలని నాకు పటం కట్టి ప్రజెంట్ చేస్తాడు. అందుకే నేను నా మిత్రుడి కన్నా, శత్రువుకే ఎక్కువ రుణపడతాను.

photo by camera vijaya kumar


నేర్చుకోవాలే కానీ,
విషనాగు దగ్గరా-
పాఠాలుంటాయి.
తల యెత్తటం
బుస కొట్టటం
కాటు వెయ్యటం
ఈ మూడు తెలిసిన వాడే
శత్రుసాహచర్యాన్ని
చిద్విలాసంగా చెయ్యగలడు
– సతీష్ చందర్
(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

3 comments for “శత్రు సూక్తం

  1. శత్రువు కోపంతో, కసితో చంపేస్తాడు. మిత్రులు, శ్రేయోభిలాషులు జాలితో, సానుభూతితో చంపేస్తారు. అమ్మో… వీళ్ళను తట్టుకోవడమే చాలా కష్టం. శత్రువును గుర్తు చేసుకుంటే జీవితాన్ని సాధించాలన్న కాంక్ష పెరుగుతుంది. శ్రేయోభిలాషులతో ఆత్మస్థయిర్యం, మనోనిబ్బరం సన్నగిల్లిపోతాయి.
    ఈ విషయం చెప్పడానికో అవకాశమిచ్చినందుకు థ్యాంక్స్.

Leave a Reply