శ్రీదేవి: మూడక్షరాలు కాదు; మూడు తరాల పేరు!

ఒక దిగ్భ్రాంతి; ఒక ఉత్కంఠ; ఒక విషాదం- వెరసి నటి శ్రీదేవి మరణ వార్త. కూర్చున్న చోటనుంచి ఒకరు చివాల్న లేచి వెళ్ళిపోతారు. ఖాళీ. వెళ్ళింది ఒక్కరే. కానీ లక్షమంది వెళ్ళితే ఏర్పడ్డ వెలితిలాగా వుంటుంది. ఏ రంగంలో అయినా అంతే. కళారంగంలో అయితీ మరీను. చార్లీ చాప్లిన్‌ ఇలాగే చటుక్కున వెళ్ళిపోయాడు. ఎంత పెద్ద లోటు! ఎవడు నవ్వించాడని అంతలా! పోనీ ఎవడు ఏడ్పించాడని అంతలా! ఊహూ.. ఎవవడు నవ్వేడ్పించాడని అంతలా! మైఖేల్‌ జాక్సన్‌ కూడా అంతే…ఏదో ‘మూన్‌ వాక్‌’ చేస్తున్నాడంటే.. భూమితో సంబంధంలేనట్లూ, భూమ్యాకర్షణకు తన పాదాలు గురి కానట్లూ నడుస్తున్నాడునుకున్నాం కానీ.. నిజంగానే అలా నడుచుకుంటూ లోకాన్ని దాటి పోయాడు. ఎంత ఖాళీ..?

మరీ అంతంత దూరాలు ఎందుగ్గానీ..నటిస్తున్నాడని లిప్త పాటు కూడా అనుమానం రాకుండా తెరపై జీవించిన ఎస్వీరంగారావు.. ఇలాగే వెళ్ళిపోయాక.. మళ్ళీ అలాంటి వాడు వచ్చాడా..? కళకు ఆడేమిటి? మగేమిటి? ఎంత చిన్నగా నవ్వితే అంత గొప్పగానూ.. ఎంత పెద్దగా నవ్వితే అంత హాయిగానూ కనిపించే సావిత్రమ్మ కళ్ళ ముందే క్షీణించి వెళ్ళిపోతే… ఎవరిని తెచ్చి ఆ జాగాను నింపగలిగారు?

ఇలాంటి వాళ్ళతో ఒక్కటే చిక్కు. తమ కళలో ప్రమాణాలను ఎక్కడో ఆకాశంలో పెట్టేస్తారు. పోటీ పడాలన్న కోరిక సమకాలికులకు కలలో కూడా రాదు; ఈర్ష్య పడేంత ధైర్యమూ కూడదీసుకోలేరు. నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యపోవటం తప్ప వారికి వేరే అవకాశం వుండదు.

శ్రీదేవి చేసింది కూడా అదే. శ్రీదేవి అంటేనే ఒక సుదూరలక్ష్యం. అలాకావాలని కోరుకోవటం అత్యాశ మాత్రమే కాదు; దురాశ కూడా. బతికింది 54 ఏళ్ళు. అందులో నటిగా బతికింది 50 ఏళ్ళు. తెరమరుగయింది- బాల్యానికి ముందు బాల్యంలో మాత్రమే. గత నూరేళ్ళలో ‘భారతదేశపు అత్యుత్తమ నటి’ ఎవరూ అని ఊరికే ఒక చానెల్‌(సిఎన్‌ఎస్‌- ఐబిన్‌) అడిగింది. దేశం మొత్తం ఒక్కటే సమాధానం: శ్రీదేవి. దరిదాపుల్లో కూడా మరొకరు వచ్చే అవకాశమే లేదు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌- ఎన్ని పేర్లెందుగ్గాని, ఎటునుంచి ఎటు చూసినా ఒకే ఒక్క ‘లేడీసూపర్‌ స్టార్‌’ శ్రీదేవి. భాష, ప్రాంతం, రంగు- ఏదీ అడ్డు రాలేదు ఆమెకు. తెలుగింటి ఆడపడుచుగా (తల్లి ఆంధ్రవాసి) ఇంతెత్తుకు ఎదిగి బారతీయ చిత్రపరిశ్రమను పరిపాలించేసింది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రజనీ కాంత్‌, ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, చిరంజీవి వంటి వాళ్ళ సరసన నటించింది. వాళ్ళు వాళ్ళ ‘వుడ్స్‌’లోనే సూపర్‌ స్టార్స్‌. వేరే భాషల్లో సాధారణ నటులు. కానీ శ్రీదేవి దేశానికే సూపర్‌ స్టార్‌. మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలూ, నిర్మాతలూ, దర్శకులూ- ఆమెకు ఘనంగానే నివాళులర్పించారు. ఒక తెలుగింటి ఆడపడుచు- ఇలా ఉత్తరాదికి వెళ్ళి కూడా అగ్రతారగా నిలబడితే- మనమింకా ఉత్తరాది ‘పసుపు రంగు’ చర్మం వున్న నటీమణులకోసమే ఎందుకు అర్రులు చాస్తున్నాం- అని నివాళులర్పించేటప్పుడయినా విచారించి వుంటారా.. అన్నది అనుమానమే.

అందం, అభినయం- రెండూ కలవటం అరుదు. భారతీయ తెరకు ‘డ్రీమ్‌ గాళ్సూ’, ‘విశ్వసుందరీమణులూ’ కొత్త కాదు. వారు తెరను అలంకరించినంతగా, కళను అలంకరించరు. శ్రీదేవి అలా కాదు.చిలికితే నటన. పాత్రలోకి ఆమె వెళ్తుందా.. ఆమెలోకి పాత్ర వెళ్తుందా- అని అడిగితే బహుశా ఆమె చిత్రాలకు దర్శకత్వం వహించిన ఉద్దండుల దగ్గరే సమాధానం వుండదు. ఏళ్ళుగడుస్తున్న కొద్దీ ఆమెకు అభినయమే కాదు, అందం కూడా రెట్టింపవుతూ వచ్చింది. ఇది నటీమణుల్లో అరుదైన పరిణామం.

ఎంతకాదన్నా, సినిమా కూడా పురుషాధిక్య ప్రపంచమే. తారల్లో పురుషులు సహజంగా రిటయిరయితే, స్త్రీలు బలవంతంగా రిటయిర్‌ ‘చేయబడతారు’. ఆరవై, డెభ్భైలు వచ్చినా, హీరోలు గెంతుతూనే వుంటారు. కానీ హీరోయిన్లు అలా కాదే..!? వారిని ఏ హీరో సరసన హీరోయన్‌గా చేశారో, అదే హీరోకు ముందు వదినగా.. ఆ తర్వాత మెల్లమెల్లగా తల్లిగా.. అత్తగా.. చేయించి పదవీ విరమణ చేయిస్తారు. కానీ ఈ ‘పురుష ధర్మాన్ని’ తిరగరాసిన నటి శ్రీదేవి. ఆమె ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌ పక్కనే హీరోయిన్‌గా వుండలేదు. కృష్ణ శోభన్‌ ల పక్కనా, ఆ తర్వాత చిరంజీవి పక్కనా, ఆ పైన ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌ల తనయుల పక్కనా వారి సమవయస్కుల పక్కనా సరసనా హీరోయన్‌గా నటించింది. నాయకుల తరాలు మారినా ఆమె నాయికగానే నిలిచింది.

అభిమానగణంలోనూ పురుషుల రికార్డులను ఏనాడో బద్దలు కొట్టింది. అయితే అభిమానుల అభిమానంలోనూ చిన్న తేడా వుంటుంది. మగతారలకుండే అభిమానులు తమ హీరోల మీద ఈగ వాలినా ఒంటి కాలి మీద లేస్తారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఎవరు వ్యాఖ్యానించినా, వారి మీద విరుచుకు పడతారు. ఒక్కొక్క సారి దాడులు కూడా చేసిన సందర్భాలున్నాయి. కానీ అదేమిటో ఆడతారలకు వున్న అభిమానులు ఎందుకనో ఇలాంటి విషయాల్లో కిమ్మనరు. కాబట్టే మీడియా హీరోయిన్ల మీద ఇష్టం వచ్చినన్ని పుకార్లను నడిపించగలుగుతుంది. ఈ ప్రసార సాధనాలు ఆమె జీవితం వేసిన పుకార్లు చాలవన్నట్లు, ఆమె మృత్యువు మీద కూడా వేశాయి. ఆమె ప్రమాదవశాత్తూ పడిపోయిన ‘బాత్‌ టబ్‌’ చుట్టూ అల్లిన ఊహాగానాలు అన్నీ, ఇన్నీ కావు.

ఇంత ఎత్తు ఎదిగిపోయిన తారనే గౌరవించటం చేతకాని వారికి, ఒక సాధారణ స్త్రీని గౌరవంగా చూడటం తెలియవస్తుందా? కొన్ని తరాల పాటు పదిలంగా చదువుకునే చరిత్ర పేరు శ్రీదేవి. అది టీవీస్క్రీన్‌లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే స్క్రోలింగూ కాదు; ఆ క్షణం రేటింగ్స్‌ కోసం యాంకర్‌ చేసే వెర్రి వ్యాఖ్యా కాదు. శ్రీదేవి ఒక నటి పేరు కాదు. భారతీయ తెర ఇంటి పేరు. గౌరవించుకుందాం!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వారపత్రికలో ప్రచురితం)

8 comments for “శ్రీదేవి: మూడక్షరాలు కాదు; మూడు తరాల పేరు!

Leave a Reply