‘సెన్సేషనల్‌’ కుమార్‌ షిండే.

cved-2పేరు : సుశీల్‌ కుమర్‌ షిండే

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘హోమ్‌’ మేకర్‌( ఇల్లు అనగా దేశాన్ని చక్కదిద్దే ఉద్యోగం. అయినా మహిళల సమస్యల్ని అర్థం చేసుకోవటం లేదని ఆడిపోసుకుంటారు.)

ముద్దు పేర్లు : ‘షిండేలా'(నల్లజాతి నుంచి మండేలా వచ్చినట్లు, దేశంలో అట్టడుగు వర్గాలనుంచి నేను వచ్చానని నా భక్తులూ, అభిమానులూ భావిస్తారు.), పెద్ద పోలీసు. ‘సెన్షేషనల్‌ కుమార్‌ షిండే’

విద్యార్హతలు : మాస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ మెంట్స్‌.( నేనేదయినా స్టేట్‌మెంట్‌ ఇస్తే, సంచలనం కావాల్సిందే. ఆ మఢ్య ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను నక్సలైట్లతో పోల్చాను. దేశం మొత్తం ఉలిక్కి పడింది.)

హోదాలు : పోలీసు శాఖలో పెద్ద పెద్ద హోదాలు వుండవచ్చు. కానీ పవర్‌లో సబ్‌ ఇన్స్పెక్టర్‌ కు మించిన పోస్టు వుండదు. చెప్పాలంటే,నేను చేస్తున్న హోం మినిస్టర్‌ కన్నా పెద్ద పోస్టు. జనానికి న్యాయం చేయాలన్నా, అన్యాయం చేయాలన్నా అంతకు మించిన పోస్టు లేదు. లాకప్‌ డెత్‌లలోనూ, ఎన్‌కౌంటర్లలోనూ వారి పాత్ర అత్యంత గణనీయమైనది. (అయితే నాకు అలాంటి చరిత్ర లేదు లెండి.)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: నేను ఏ శాఖకు మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తానో, ఆ శాఖకు వెంటనే గుర్తింపు వస్తుంది.( నేను విద్యుత్‌ శాఖా మంత్రి అయ్యాను. రెండు ‘గ్రిడ్‌’లు పోయి ఉత్తర భారతం వె చీకట్లోకి వెళ్ళిపోయింది. కాబట్టే శాఖ వెలుగులోకి వచ్చింది.) నేను హోం మంత్రి అయ్యాను. గ్యాంగ్‌ రేప్‌ ఘటనతో ఢిల్లీ అట్టుడికి పోయింది.ఆందోళనలు చెలరేగాయి. దీంతో హోంశాఖకు గుర్తింపు వచ్చింది.

రెండు: నాకు హాస్య చతురత మెండు. కానీ నా మాటల్ని ఎప్పుడూ అపార్థం చేసుకుంటారు. బొగ్గు గనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ‘కోల్‌గేట్‌’ స్కామ్‌ మీద కూడా ఇలాగే హాస్యాలాడితే ఇబ్బంది అయ్యింది. బోఫోర్స్‌ను మరచిపోయినట్టే, జనం రేపు ‘కోల్‌8గేట్‌ను కూడా మరచిపోతారన్నాను. మరీ హాస్య చతురత లేక పోతే ఎలా చెప్పండీ..?

అనుభవం :అనుభవం వున్నా కొన్ని అంశాల మీద అవగాహన కుదరదు. ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా రెండేళ్ళు పనిచేశాను. అయినా జోక్‌ తెలుసా? నాకు తెలంగాణ గురించి తెలియదు. ఈ విషయం పై ట్యూషన్‌ చెప్పించుకోవటానికే తెలంగాణపై అఖిల పక్షం సమావేశం పెట్టించుకున్నాను. ‘హోం’ ట్యూషన్‌ అనుకోరాదూ…!?

సిధ్ధాంతం : తగవులు తీర్చిన పెద్దను వెంటనే మరచిపోతారు. ఉన్న తగవుల్ని పెంచిన వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. తెలంగాణ విషయంలో చిదంబరాన్ని ఎవరయినా మరచిపోతారా?

వేదాంతం : ఏదయినా ఒక పనిచేసేటప్పుడు అపఖ్యాతి వస్తుందని వెరవకూడదు. అపఖ్యాతిలోనే ఖ్యాతి వుంది. ఢిల్లీ గ్యాంగ్‌ రేప్‌ కు జరిగే అందోళనల వల్ల నాకు ముందు అపఖ్యాతే వచ్చింది. కానీ, దానిని క్షణాల్లో ఖ్యాతిగా మార్చుకోగలను

వృత్తి : పాత వృత్తి పోలీసింగ్‌, కొత్త వృత్తి రాజకీయం. శరద్‌ పావారే నారూటు మార్చారు.

హాబీలు :1. పదవుల పొందటానికి ‘దళిత’ కార్డును వాడటం.

2. పదే పదే ఫ్లాష్‌ బ్యాక్‌లను వినిపించటం. (ఎస్సయి, హోం మంత్రి అవటాన్ని ఇప్పటికీ నమ్మలేను. అందుకే కథలు కథలుగా చెప్పుకుంటాను. హైదరబాద్‌ లో నేషనల్‌ పోలీస్‌ అకాడమీకి వచ్చినప్పుడు అప్పట్లో నాపై అధికారిగా పనిచేసిన ఓ పెద్దాయన్ను కలసి కొని మురిసి పోయాను.)

మిత్రులు : పార్టీ వెలుపల కూడా వుంటారు. నన్ను రాజకీయాల్లోకి తెచ్చింది శరద్‌ పవారే.

శత్రువులు : బాధితులూ కారు, నేరస్తులు కారు. అకృత్యాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసేవాళ్ళే. అందుకే వారిని ‘మావోయిస్టుల’ కన్నా ప్రమాద కారులగా గుర్తించాను.

జపించే మంత్రం : సోనియా ఈజ్‌ ఇండియా, ఇండియా ఈజ్‌ సోనియా (ఒకప్పుడు ‘ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిర- అని ఒకప్పుడు డి.కె. బరూవా అన్నారు.)

విలాసం : తల్ల ‘ఢిల్లి’ ( ఆందోళనలతో నేనే కాదు, నగర మంది జనం అతలాకుతలం – అయిపోతున్నారు.)

గురువు : నిజం చెప్పొద్దూ.. రాజకీయాల్లో శరద్‌ పవరే.

జీవిత ధ్యేయం : ముందు మహరాష్ట్ర ముఖ్యమంత్రి, తర్వాత ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌, ఆ పైన కేంద్ర మంత్రి పదవి. తప్పితే ఉన్నత పదవి ఏముంటుందీ..? రాష్ట్రపతే.

-సతీష్ చందర్

(గ్రేట్  ఆంధ్ర వార పత్రిక 5జనవరి 2012 వ తేదీ సంచిక కోసం రాసింది)

Leave a Reply