స్వప్నమే నా శాశ్వత చిరునామా

ఎప్పుడో కూల్చేసిన ఇల్లు
ఇంకా వున్నట్లే కల

అనుకుంటాం కానీ-
కట్టడాన్ని కూల్చినంత సులభం కాదు
కలల్ని కూల్చటం!

నాలుగు మూరల పూరిల్లే కావచ్చు
నాకది
నాలుగు దశాబ్దాల స్వప్నవారసత్వం

ఎంత నాజూకయిన పరుపు మీద నడుం వాల్చినా
కళ్ళుమూసుకుంటే చాలు
నా నులక మంచం మీదకు నేను వెళ్ళిపోతాను

స్టార్‌హొటల్‌ గదయినా సరే
ముడుచుకునే పడుకుంటాను
కాళ్ళు చాపితే
అమ్మ అలికిన మట్టిగోడ తగలదూ..!?

పగలంతా విశాలమే
రాత్రే ఇరుకు

ఇలలో ఎంతోకొంత సంపన్నుణ్ణే
కలలోనే కటిక దరిద్రుణ్ణి

కారణం చిన్ననాటి మా ఇల్లే కావచ్చు
కూల్చేసినట్టు ఖచ్చితంగానే తెలుసు
అదే చోట దేవుడు కూడా వెలిశాడు
మరో అయిదారిళ్ళ అంతర్థానంలో ఆలయం కూడా లేచింది

అయినా సరే-
కునుకు పడితే చాలు
ఇప్పటికీ ఇరుకిల్లూ, నులక మంచం.
ఏ మార్పూలేదు
ఇరుకును విశాలం చేద్దామనుకున్నా.
కలలన్నవి కబ్జాలకు లొంగవు కదా!

నన్ను చిన్నబుచ్చుతున్న లోగిలికలను
పెంచలేను, తుంచలేను.
అదొక త్రిశంకు నరకం
వెలుగుతున్నంత సేపూ విర్రవీగినా
చీకటి పడ్డాక తలదించాల్సిందే.
నాలుగడుగుల నా స్వప్నద్వారబంధం
నా శిరస్సుకెప్పుడూ అడ్డుతగులుతూనే వుంటుంది

స్వర్గంలోని నటనలు
నరకంలో చెల్లవు
నడుము వంచాల్సిందే

స్వర్గమొక భ్రమా, నరకమొక నిజమని
తేల్చటానికి నా కలలోని ఇల్లే
చెరగని సాక్ష్యం

ఎన్ని ఇళ్ళు మారినా
ఆ ఇరుకిల్లే అసలు ఇల్లయ్యింది
కొంపల్ని తెగనమ్మినట్లు కలల్ని అమ్ముకోలేం
కలకు విలువవున్నా, ధరలేదు.

తెలివిలేని రోజుల్లో ఇల్లూ, తల్లీ వేర్వేరు కాదు
ఎప్పుడూ ఏదో అలుకుతూ వుండే అమ్మను
ఎన్నో సార్లు చేతులు కడిగి,
కలలోంచి వెలుపలికి తెస్తానా-
ఎలా వస్తుందో
పొద్దు కుంగితే చాలు నా కలల లోగిలిలోకి ప్రవేశిస్తుంది.
తెల్లవారే వేళ దాహం వేసి
నులక మంచం కింద రాగి చెంబుకోసం తడిమితే-
కుషన్‌బెడ్‌ మీద నుంచి నిద్రలేపి ఫ్రిజ్‌ వాటరిస్తుంది.
ఈ తల్లి
ఆ అమ్మలాగా వుండదు.
అలుగు గుడ్డ అమ్మ, ఫ్రిజ్‌వాటర్‌ మమ్మీగా ఎలా మారుతుందో..!

తెల్లవారితే
అన్నీ అబధ్ధాలే
టేబుల్‌ మీద ప్లాస్టిక్‌ పువ్వూ,
పనిమీద వచ్చిన వాడి నవ్వూ…

కల్లల పగలూ
కలల రాత్రీ
ఇదే నా జీవితం

సాయింత్రమవుతుందనగా
కిటికీలోంచి చూస్తే-
వెళ్ళిపోయిన పగటి రైలు
మిగిలిపోయిన రాత్రి పొగ

పొగే నిజం
రైలు భ్రమ

ఎప్పటిలాగే ఇరుకు ఇల్లూ, నులక మంచం,
అమ్మ చేతి అలుకు గుడ్డా వున్న
నా కలలోకి నేను

స్వప్నమే నా శాశ్వత చిరునామా

– సతీష్ చందర్
(రచనా కాలం:2002)
(ఈ కవిత ’ఆదిపర్వం‘ కవితా సంకలనం (2008) లోనిది)

6 comments for “స్వప్నమే నా శాశ్వత చిరునామా

Leave a Reply