అవినీతా? అంతా ‘గ్యాస్‌’!!

Photo By: Harsh Agrawal

దేవుళ్ళేనా అవతరాలెత్తేదీ..? దయ్యాలెత్తవూ..?!

హీరోలు మారినప్పుడు.. విలన్లు మారరూ?

అలాగే, నీతి మారినప్పుడు, అవినీతీ మారుతుంది.

ఒకప్పటి అవినీతి అంటే- మామూలు, బల్లకింద చెయ్యి, అమ్యామ్యా..! ‘సంతోషం’. అవును ఇది కూడా అంచానికి ‘పర్యాయ పదం’. పుచ్చుకునే వాడు ముఖమాట పడుతూంటే ఇచ్చే వాడు ‘ఏదో, మా సంతోషం కొద్దీ..!’ అని నాలుగు కట్టలు చేతిలో పెడతాడు. లోపల మాత్రం కట్టలు తెగిన దు:ఖం వుంటుంది లెండి. ఈ పనులు ఉద్యోగులు దగ్గరనుంచి రాజకీయ నాయకుల వరకూ చేసేవారు. చెయ్యాల్సిన పనే. చేయ దగ్గ పనే చెయ్యటానికి మాత్రం ‘సర్‌ చార్జ్‌’. (అంటే సార్‌ వేసే చార్జి లెండి.) ఇవి కాక, అర్హులైన కొందరిని పక్కన పెట్టే పనీ, చేయకూడని పనీ చేస్తారు. దాని చార్జి మోతెక్కి పోతుంది.

అర్హుడయిన వాడికి రేషన్‌ కార్డూ, చచ్చిన వాడికి ‘డెత్‌ సర్టిఫికెట్టూ’- ఇలాంటివన్నీ చేయాల్సిన పనులు. వీటికి లంచం ఇవ్వాలి. ఇవ్వక పోయినా వస్తాయి. కానీ మనిషి ‘పోయి’ నంత స్పీడులో సర్టిఫికెట్‌ రాదు. అంతే. దీనిని వేగవంతం చేసేదే లంచం. బండికి గ్రీజూ, చమురు లాగా, వ్యవస్థకు ఈ లంచం అవసరమని జనం దాదాపు ఒప్పేసుకున్నారు. కాదు. కాదు. జనం చేత ఒప్పించేశారు. మరొకరి అవకాశాన్ని లాక్కోవటానికి చెల్లించే ‘అపరాథ రుసుము’ లాగా జనంలో భావించి జనంలో కొందరు ప్రత్యేక సౌకర్యాలను పొందుతుండే వారు. ఇంత వరకూ మాత్రమే జనానికి తెలిసిన అవినీతి. అయితే దీనిని వ్యతిరేకించేది అవినీతి. ఈ ‘ఆమ్యామ్యాల’ వల్ల, జనం సొమ్మును ప్రత్యక్షం గా తినటమే కాకుండా, వారు కట్టిన పన్నుల్ని అపహరిస్తున్నారని వాదించే వారు.

అవినీతికి సరిపోయే నీతి ఇది. ‘భారతీయుడు’ సినిమాలో కమల హాసన్‌కీ, ‘అపరచితుడు’ సినిమాలో విక్రమ్‌కీ తెలిసిన నీతి కూడా ఈ మాత్రమే. ఇది కేవలం ప్రాథమిక విద్య మాత్రమే. మనదేశంలోకి ‘లిబరలైజేషన్‌’ వచ్చేంతవరకూ(1990 వరకూ) ఇంతకు మించిన జ్ఞానం అబ్బలేదు. ఆ జ్ఞానంతోనే ఇప్పటికీ సినిమాలు తీస్తున్నారు.

ఇంతవరకూ ఇచ్చే వాడు సామాన్యుడు, పుచ్చుకునే అసమాన్యుడు. కానీ తర్వాత దృశ్యం మారింది. ఇచ్చే వాడు అసమాన్యుడు. పుచ్చుకునే వాడు సామాన్యుడు. ఇది విశ్వవాణిజ్య యుగం. దాంతో ఇచ్చే వాడు వ్యాపారి అవుతున్నాడు. పుచ్చుకునే వాడు నేత అవుతున్నాడు. ఈ యుగంలో సర్కారు తన పనిని తగ్గించుకుంటూ వుంటుంది. అన్నింటినీ ‘అవుట్‌ సోర్స్‌’ చేస్తుంటుంది. పాపం! సర్కారుకు ఎంత బధ్ధకమంటే. గనులుంటాయి తవ్వుకోలేదు. చమురు బావులుంటాయి. తవ్వుకోగలదు కానీ, అమ్ముకోలేదు. అందుకోసం.వేల, లక్షల కోట్ల రూపాయిలిచ్చి తవ్వించుకుంటుంది. అమ్మించుకుంటుంది. అమ్ముకోవటంలో కూడా సర్కారుకు వొళ్లు వంగదు. అందుకే బేరమాడదు. వ్యాపారి ఎంత చెబితే అంతే. బొగ్గయినా ఇచ్చేస్తుంది. బంగారమైనా ఇచ్చేస్తుంది. ఫలితంగా పారిశ్రామిక వేత్తల సామ్రాజ్యాలు విస్తరిస్తాయి. వారు పచ్చగా వుంటేనే దేశం పచ్చగా వుంటుందనే ‘మాక్రో’ ఆర్థిక పండితులు ఆనందిస్తారు కూడా. ఈ యుగంలో వుండే అవినీతి సాదా సీదా ‘ఆమ్యామ్యా’ లాగా వుండదు. ఎందుకంటే వాణిజ్య సామ్రాజ్యాలు విస్తరిస్తే, ఒక సామ్రాజ్యానికీ, మరొక సామ్రాజ్యానికీ మధ్య ఘర్షణ పెరుగుతుంది. తనను పక్కకు పెట్టి వేరొక వ్యాపారికి ఈ బధ్దకపు సర్కారు మేలు చేసిందంటే, వొళ్ళు మండి పోతుంది. అప్పుడు తానే ‘పరిశోధనాత్మ పాత్రికేయుడి’గా అవతారమెత్తుతాడు. ‘స్టింగు’లు చేయిస్తాడు, చేస్తాడు కూడా. లీకులు చేస్తాడు. చేయిస్తాడు. ‘క్విడ్‌ ప్రోకో’ అని కేకలు పెడతాడు. (సర్కారలు లో నేతలు ప్రతిఫలం పొంది లబ్ది చేకూర్చారని అరుస్తాడు. ఈ అరుపులో జనం సొమ్ము పోయిందన్న ఆర్తి వుండదు. తనకు రావల్సిన కాంట్రాక్టు పోయిందన్న ఉక్రోషం వుంటుంది.) అందుకనే ఇప్పుడు బయిల్పడే అవినీతి కుంభకోణాలన్నీ వేల, లక్షల కోట్లలో వుంటున్నాయి. ఇది మాధ్యమిక స్థాయి అవినీతి.

ఇది కాక ఉన్నత స్థాయి అవినీతి ఒకటి వుంది. ఇది చట్ట సమ్మతంగా జరిగిపోతుంది. ఆ మాట కొస్తే అవినీతే ఆర్థిక విధానంగా మారిపోతుంది. ఇందుకు సర్కారులో వుండే అధికారులూ, మంత్రులూ తల వొగ్గాల్సిందే. పెద్ద సామ్రాజ్యానికి మేలు చేసిపెట్టటానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారిచేస్తారు. శిరసా వహించాల్సిందే. ఆ మాటకొస్తే ఇలా సర్కారే, వాణిజ్యసామ్రాజ్యాన్ని పెంచి పెద్ద చేయటం ఒక సిధ్ధాంతం కూడా. దీనిని ప్రపంచ వ్యాపితంగా ‘క్రోనీ కాపిటలిజం’ అని ముద్దుగా పిలుస్తారు.

అందుకనే గ్యాస్‌ ధరను పెంచి ‘రిలయన్స్‌’ సర్కారుకు అమ్మినప్పుడెల్లా గుండెలు బాదుకోనవసరం లేదు. మహాఅయితే ఏమవుతుంది? గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు ఖరీదవుతుంది. రైతుకు విద్యుత్తు అందదు. ఆ తర్వాత ఖర్చులు ఊపిరీ అందదు. అందే దొక్కటే ఉరి తాడు.

నిర్మించండి! అన్నదాత ఆత్మహత్యల మీద ఎన్ని ‘సామ్రాజ్యాల’ మీద నిర్మిస్తారో నిర్మించండి.

అవినీతి అవతారం మార్చినప్పుడు, నీతి మాత్రం కొత్త గెటప్‌లో రాకుండా వుంటుందా..?!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 2-8 నవంబరు 2012 సంచికలో ప్రచురితం)

Leave a Reply