ఇక్కడి బాల్యానికి ‘డబ్బు’ చేసింది..!!

చెడిపోవాలన్న కోరిక పుట్టాలే కానీ, ఎలాగయినా చెడిపోవచ్చు. డబ్బుండీ చెడిపోవచ్చు; డబ్బులేకా చెడిపోవచ్చు. వెనకటికి కవి కాళోజీ అన్నాడు -ఉన్నవాడిదీ లేని వాడిదీ ఒకటే బాధ:’తిన’లేక- అని. ఇప్పుడు డబ్బున్న పిల్లలకీ, డబ్బులేని పిల్లలకీ ఒక్కటే జబ్బొస్తోంది. మైనారిటీ తీరకుండానే, బాల్యం వదలకుండానే, పెద్ద పెద్ద పనులు చేసేస్తున్నారు. క్రూరమైన, ఘోరమైన నేరాలు చేసేస్తున్నారు. ఖరీదయిన కార్పోరేటు స్కూళ్ళల్లో చదివే పిల్లలూ, దిక్కుమాలిన వీధి బడిలో చదివే పిల్లలూ ఒక తీరులో బరితెగిస్తున్నారు. పైసల్లేక ఒకరు నేరం చేస్తుంటే, పైసలెక్కువయి ఇంకొకరు నేరం చేస్తున్నారు.

పైసల్లేని వారిని నేరప్రపంచం తనలో ఇముడ్చుకుందో చెప్పటానికి వెయ్యినొక్క ఉదాహరణలు ఇవ్వవచ్చు. కానీ పైసలెక్కువయి పసిపిల్లలు చేస్తున్న నేరాలకు ఇటీవల హైదరాబాద్‌ సాక్షిగా నిలిచింది. నేరం అంటేనే సమాజం మీద లేచిన వ్రణం. సమాజ సంరక్షకుల (ప్రభుత్వాలు కావచ్చు, కుటుంబాలు కావచ్చు) నిలువెత్తు నిర్లక్ష్యానికి నేరాలు నిదర్శనాలు.

ఆ మధ్య ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ఒక సినీనటుడు తాగి డ్రైవ్‌ చేస్తూ ప్రమాదానికి గురయి మరణించాడు. అతని దగ్గర దొరికిన డైరీ మామూలు డైరీ కాదుట. అది ‘డ్రగ్‌ డైరీ’. తనకి డ్రగ్‌ సరఫరాల చేసే వ్యక్తి అడ్రస్‌ దొరికింది. సాధారణంగా తీగ లాగితే డొంక కదులుతుంది. ఇక్కడ ‘డ్రగ్‌’ని తవ్వితే, రెండు పెద్ద పరిశ్రమలు బయిటకు వచ్చాయి. ఒకటి: సినిమా, రెండు: కార్పోరేటు స్కూలు విద్య. రెండు చోట్లా డ్రగ్స్‌ సరఫరా అవుతున్నట్టు తెలుసుకున్నారు. విశేషమేమిటంటే, విచారణ బృందాలు సినిమా వారి మీద పెట్టిన దృష్టిని, ఎందుకనో కార్పోరేటు స్కూళ్ళ మీద పెట్టలేక పోయాయి. రోజుకొక సినీ తార విచారణకు వస్తుంటే తీసిన దృశ్యాలను,జనం డెయిలీ సీరియల్‌ చూసినట్లు తిలకించి, తరించారు. పోలీసులే కాదు, మాధ్యమాలు కూడా సినీ తారల సందడిలో పడి, కార్పోరేటు స్కూళ్ళలో డ్రగ్స్‌ ఎలా సరఫరా అవుతున్నాయన్న విషయంలో పెద్దగా ఆరాలు తీయలేదు. అప్పటికే ఏడు, ఎనిమిది తరగతులు చదివే పలువురు విద్యార్థులు ( అంటే 12, 13 ఏళ్ళ వున్న వారు సైతం) డ్రగ్స్‌కు బానిసలయ్యారు. వీరంతా అంతో ఇంతో పైసలున్న కుటుంబాలనుంచి వచ్చిన వారే.

ఈ లోపుగా కార్పోరేట్‌ స్కూళ్ళలో చదివేవారిపై మరో నీలి నీడ పడింది. అది చాందినీ జైన్‌ అనే అమ్మాయి హత్య. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెను సాటి విద్యార్థి సాయి కిరణ్‌ రెడ్డే అంతమొందించాడని విచారణలో తేలింది. అతడికీ పదిహేడేళ్ళు దాటలేదు. ప్రేమించేశాడు. చనువుగా చాలాకాలం గడిపేశాడు. వదలించేసుకోవాలనుకున్నాడు. ఆమె పెళ్ళికి పట్టుపట్టింది. అంతే ఆమె పని పట్టేశాడు. చంపి కొండమీదనుంచి తోసేశాడు. ఏమీ ఎరగనట్టు ఆమె శవాన్ని వెతకటానికి అందరితో పాటు వెళ్ళాడు కూడా. సరే ఇంకా ఈ కేసు విచారణ జరుగుతోంది. అయితే చాందినీ హత్య ఎంత భయానకంగా వుందో, చాందినీ హత్య విచారణలో వెల్లడవుతున్న విషయాలు అంతకన్నా భయానకంగా వున్నాయి: దాదాపు ఈ వయసులో వున్న 52 మంది స్కూలు పిల్లలు లకిడీకాపూల్‌ లోని ఒక హొటల్లో ‘యుఎన్‌ సమావేశాలు ఎలా జరగుతాయో ప్రదర్శించే ఒక కార్యక్రమం’ లో పాల్గొన్నారు. ఇది ఏర్పాటు చేసింది కూడా ఒక విద్యార్థే. ఇక తర్వాత చూడాలి. పబ్‌లో మందూ, హొటల్లో ఆడామగా కలసి బస. మైనారిటీ తీరవారని వారికి రూమ్‌లు ఎలా ఇచ్చారో, పబ్‌లో మద్యం ఎలా సరఫరా చేశారో- అని పోలీసులు కొత్తగా ఆశ్చర్యపోతూ విచారణ కొనసాగిస్తున్నారు. ఇలా ఎప్పటినుంచో జరగకపోతే, ఇప్పుడు కొత్తగా జరిగే అవకాశం వుండకపోవచ్చు. సరే, ఇప్పుడయినా విచారణ చేసి, చర్యలు తీసుకోవచ్చు. కానీ విద్యాసంస్థల యాజమాన్యాలకు తెలియకుండా ఇలాంటివి ఎలా జరిగిపోతున్నాయి? అలాగే తల్లిదండ్రులు ఎంతెంత పైసలు ఇస్తుంటే, ఇంత విచ్చలవిడి వ్యయం చేస్తున్నారు?

స్కూలు విద్యార్థులు డ్రగ్స్‌ తీసుకుంటున్నారన్నప్పుడు కూడా, ఈ ప్రశ్నలు వచ్చాయి. ఒక్కొక్కరికీ పాకెట్‌ మనీ కింద రోజుకి 5 వేల రూపాయిలూ, 10 వేల రూపాయిలు ఇచ్చేస్తుంటే ఏంచేస్తుంటారు. అన్నింటినీ చాక్లెట్లమీదా, ఐస్‌క్రీంల మీద తగలెయ్యలేరు కదా! అలాంటప్పుడే మద్యమూ, మాదక ద్రవ్యమూ అందుబాటులోకి వస్తాయి; వచ్చాయి కూడా.

నిర్భయ అత్యాచారం కేసులో, అత్యంత పాశవికంగా ప్రవర్తించిన రేపిస్టు ‘బాల నేరస్తుడు’. కానీ అతను ఇలా జైలుకు వెళ్ళి ఏడాది తిరగకుండా అలా బయిటకు వచ్చేశాడు. అప్పుడు బాల నేరస్తుల వయోపరిమితిని కుదించాలన్న డిమాండ్లు వచ్చాయి. ఆ బాల నేరస్తుడు. సంపన్న కుటుంబాలనుంచి రాలేదు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. పేదరికం అతణ్ణి నేరం వైపు విసిరేసింది. ఇప్పుడు చాందినీ జైన్‌ కేసులో హత్యనేరారోపణ కు గురయిన నిందితుడు కూడా ఇదే వయసు గల వాడు. విద్యావ్యవస్థలో విలువలకు బదులు రూపాయిలూ, కుటుంబ వ్యవస్థలో అనుబంధాలకు బదులు ప్రయోజనాలూ ముఖ్యమయిపోయాక, నేరవ్యవస్థ ఉచ్చులోకి పిల్లలు చాలా సులభంగా వెళ్ళిపోతున్నారు. వీటిని సంస్కరించుకునే చిత్త శుధ్ధీ, తెగువా లేక పోవటం వల్ల, మనం ఇతర కారణాలను వెతుక్కుంటున్నామేమో..! సినిమాల, సామాజిక మాధ్యమాలనూ వాటి ప్రభావాలనూ తప్పుపట్టి తాత్కాలికంగా తప్పించుకుంటున్నామేమో!

-సతీష్ చందర్

3 comments for “ఇక్కడి బాల్యానికి ‘డబ్బు’ చేసింది..!!

Leave a Reply