కడుపులు నింపేదే రాజకీయం!

Photo By: Le Rétroviseur

ఒక్క ముక్కలో చెప్పాలి.

రెండో మాట వినే స్థితి లేదెవ్వరికీ. అది సినిమా కావచ్చు. రాజకీయం కావచ్చు.

తెలంగాణ వెళ్ళితే ఒక్కటే ముక్క: ప్రత్యేక రాష్ట్రం.

సీమాంధ్ర వెళ్ళితే కూడా ఒక్కటే ముక్క: ఓదార్పు.

దేహానికి ఎన్నిరోగాలున్నా ఔషధం ఒక్కటే వుండాలి. ఇంకా చెప్పాలంటే ఒక్కటే గుళిక. అదే సర్వరోగ నివారిణి.ఈ మధ్య అందరూ, అలోపతి వదలి ఆయుర్వేదం, హోమియోపతిలకు వెళ్ళిపోతున్నది కూడా ఇందుకే. ఒక్కటే చూర్ణం. లేదా ఒక్కటే మూలిక. దేహంలో రకరకాల వ్యవస్థలకు, రకరకాల పరీక్షలు జరిపి, రకరకాల బిళ్ళలూ, ఇంజెక్షన్లూ- సామాన్యులకు ఎక్కి చావటం లేదు. అందుకు తగ్గ వ్యయ, ప్రయాసలకు వారు సిధ్ధంగా లేరు.

వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలలో ఏయే పార్టీ వస్తే, ఏయే విధానం పాటిస్తుందో ఎవరికి కావాలి. పరిశ్రమల్ని జాతీయం చేస్తే ఏమిటి? లేక ప్రయివేటు పరం చేస్తే ఎవరికి?

‘వాల్‌ మార్ట్‌’కు చిల్లర రంగంలో కిటికీలు తెరిస్తే ఏమిటి? తలుపులు తెరిస్తే ఏమిటి?

గనుల్నీ, గ్యాస్‌ బావుల్నీ,- తవ్వేసుకోమని బడా పారిశ్రామిక వేత్తలకి ధారాదత్తం చేస్తే ఏమిటి? చెయ్యక పోతే ఏమిటి? వందల కోట్లున్న నేత అధికారంలోకి వచ్చాక, లక్షల కోట్లు సంపాదించుకుంటే ఏమిటి? సంపాదించుకోక పోతే ఏమిటి? అధికారంలో వున్న నేతలు, వ్యాపారస్తులతో ‘ఇచ్చి పుచ్చుకోవటాన్ని’ ‘క్విడ్‌ప్రోకో’ అని పిలిస్తే ఏమిటి? పిలవక పోతే ఏమిటి? అసలు- బహుళజాతి సంస్థలకూ, ప్రభుత్వాలకు మధ్య వున్న ‘అక్రమ సంబంధాన్ని’ ‘క్రోనీ కాపిటలిజం’ అని పిలిస్తే ఏమిటి? పిలవక పోతే ఏమిటి?

ఇదంతా రాజకీయమయితే కావచ్చు. కానీ సామాన్యుడికి అనవసరం.

వ్యాపారస్తుడికీ, నాయకుడికీ కాలెండర్‌ అవసరం. ఈ ఆర్థిక సంవత్సరంలో లాభమెంత- అని వ్యాపారస్తుడూ, ఈ పదవీకాలం( అయిదేళ్ళయితే అయిదేళ్ళు)లో ఆర్జన ఎంత- అన్నది నాయకుడూ చూసుకుంటారు.

సామాన్యుడు మాత్రం- కేలండర్‌ కాకుండా- ‘గంట’ల పంచాంగంతో సర్దుకు పోతాడు.

ఈ ‘గంట’ గడిస్తే చాలు. లేదా ఈ ‘పూట’ గడిస్తే చాలు.

ఈ గంటకు అతడి చేతిలో ఏమి పెడతారన్నదే పాయింటు.

ఎన్టీఆర్‌ ‘కిలో రెండు రూపాయిల బియ్యం’ పెట్టాడు. ఆకలి ఒక పూటే తీరింది.

వైయస్సార్‌ ‘ఉచిత విద్యుత్తు’ పెట్టాడు. బోరు ఆ గంటే తిరిగింది.

వోటు వేసి రావటానికి కూడా గంట చాలు. గంటకు కూలి వస్తుంది. పుచ్చుకుంటే సారా వస్తుంది. బేరమాడితే బిర్యానీ వస్తుంది. అంతా ఆ పూటకే. అయినా ఆ ఒక్క గంటా చాలు- రాజకీయాలు మారిపోవటానికి.

కాబట్టి ఎంతటి పరిణతి చెందిన రాజకీయ పండితులయినా పప్పులో కాలేసేది ఇక్కడే. పార్టీ పేరు మీద భారీప్రణాళికలు రచిస్తారు. సుధీర్ఘోపన్యాసాలు ఇస్తారు. అవన్నీ పట్టవు. ఆ గంటలో వోటరు మనసుకు ఏది ఎక్కుతుందో అది పట్టుకోవాలి. అదే ఒక్క ముక్క. అది పట్టుకోవటమే వోటరు నాడి పట్టుకోవటం.

ప్రతీసారీ ఏదో ఒక తాయిలమే ఇవ్వాలనో, వోటరు కడుపు నింపాలనో లేదు.

ఆ గంటా అతడి కడుపాకలి మరచిపోయేటట్టు చేసినా, వోటేసేస్తాడు.

అంటే, అదే కడుపును మండించ వచ్చు, కడుపు తరుక్కుపోయేటట్టు చేయవచ్చు.

స్పష్టంగా చెప్పాలంటే ద్వేషాన్ని రగిలించవచ్చు. లేదా దు:ఖాన్ని కలిగించ వచ్చు.

ద్వేషం గొప్ప రాజకీయం? మైనారిటీవోటర్ల మీద, మెజారిటీ వోటర్ల కోపాన్ని రగిలించవచ్చు. వేరే దేశంలో వుండాల్సిన వారు, ఈ దేశంలో వుండి పోయారన్న పేరు మీద కొత్తగా దేశభక్తిని పుట్టించ వచ్చు.

లేదా, మనం పెంచుకున్న రాజధాని నగరాన్ని మనకి కాకుండా చేస్తున్నారని కూడా ద్వేషాన్ని పుట్టించ వచ్చు. ప్రాంతం, భాష, మతం- ఏ పేరుమీదనయినా కడుపు మండించ వచ్చు.

ఇలా మండిన కడుపులు, తమ కున్న ఆకలిని మరచిపోతాయి. అయితేనేం? రాజకీయాలు మారి, అధికార బదాలయింపులు జరిగి పోతాయి.

కడుపు తరుక్కు పోయేట్టు చేసేంత దు:ఖాన్ని కూడా వోటరుకు పంచవచ్చు.

అదేమిటో కానీ, సొంత ఇంట్లో మనిషి పోయినా అంతగా రోదించని వోటరు- నేతో, మహానేతో వెళ్ళిపోతే, రోజుల తరబడి శోకిస్తాడు. హత్యకు గురయినా, హఠాన్మరణం చెందినా- వోటర్లను ఓదార్చటం ఎవరి వల్లా కాదు. ఈ శోకాన్ని ఎన్నికల వరకూ పదిల పరచుకోగలిగితే, మరీ ముఖ్యంగా వోటరు నిర్ణయంతీసుకునే ఆ గంట వరకూ దాచగలిగితే చాలు.

దు:ఖం నిండిన కడుపులో ఆకలి దానంతటదే మాయమవుతుంది.

అందుకే సామాన్యుడికి చెందినంత వరకూ నాయకులు తెలుసుకోవాలనుకునే రాజనీతి ఒక్కటే,

ఈ గంటకు ఏం కోరుతున్నాడు?

గుప్పెడు బియ్యమా? పుట్టెడు దు:ఖమా? గుక్కెడు మద్యమా? చిటికెడు ద్వేషమా?

ఏది కోరుతున్నాడో అది ఆ సమయానికి వోటరు కడుపులో కొడితే చాలు- రాజ్యం వచ్చేస్తుంది.

కిట్టని విశ్లేషకులూ, పాత్రికేయులూ, సామాజిక కార్యకర్తలూ, ఉద్యమకారులూ- ఈ ప్రక్రియను కడుపు కొట్టటమని- అంటారు. కానీ, పట్టించుకుంటే కుర్చీలు ఎలా వస్తాయి చెప్పండి!?

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 4 నవంబరు 2012 వ తేదీ సంచికలో ప్రచురితం)

1 comment for “కడుపులు నింపేదే రాజకీయం!

Leave a Reply