‘కుట్టు’పనికి సమ్మె లేదు!

కుట్టింది దోమే..!
కానీ ఎంత చికాకు? ఎంత అసహ్యం? ఎంత ఉక్రోషం?
అదెంత? దాని సైజెంత?
ఏనుగంత మనిషిని పట్టుకుని కుట్టెయ్యటమే..?(అవునూ, ఎంఆర్‌ఎఫ్‌ టైరంత ముతగ్గా వుండే ఏనుగు చర్మాన్ని …ఈ దోమ కుడితే మాత్రం దానికి ఏం
తెలుస్తుంది?)

సగటు మనిషి
(photo by Kishen Chandar)


కానీ, ముద్దుచేసిన మనిషి సున్నితమైన చర్మం మీద, అందునా, బుగ్గమీద వాలింది కాకుండా, డిగ్రీలేని డాక్టరు సూదిని దించినట్టు కుట్టిపారేసే, అతనికి ఆగ్రహం కట్టలు తెంచుకొని రాదూ..?
అంతటి కోపం వస్తే మాత్రం ఆ మనిషి ఏం చెయ్యగలడు- కళ్ళు మూసుకుని కుట్టించుకోవటం తప్ప!
ఈ సహనం అతని వట్టినే అబ్బలేదు.
అన్ని హింసలు చేసాకనే కదా- అహింస గొప్పదని ప్రకటించేది?
అనేక సార్లు ఆ మనిషి, దోమ మీద ప్రతీకారేఛ్ఛతో, పరమ వీరోచితంగా దాడి చేశాడు.
దోమ దోమే! ప్రతీ దాడినీ తప్పించుకున్నది.
అలా ఇప్పటికి తన చెంపను తాను వందసార్లు వాయించుకున్నాడు.(దోమ ఆ ప్రాంతం మీదే ఎప్పుడూ వాలేది లెండి.) అప్పుడు కానీ జ్ఞానోదయం కాలేదు.. ప్రతీ సారీ, తన బుగ్గలే తనకు ‘సాఫ్ట్‌ టార్గెట్స్‌’ అవుతున్నాయని. ఈ హింసలో దాడి చేసేది తానే. దాడికి గురయ్యేది తానే. కానీ తన అతి చిన్న శత్రువయిన దోమ ఎప్పుడూ తప్పించుకుంటూనే వుంటుంది.
చాలా సార్లు కడుపు మండి పోయి రోడ్డు మీదకు వచ్చే ఆందోళన కారులు కూడా ఇలాంటి అనుభవాల్నే చవి చూస్తారు. సర్కారు దిగిరావాలనే, వారు చాచిపెట్టి సమ్మె దెబ్బ కొడితే, సర్కారు దోమలా తప్పించుకుంటుంది. కొట్టిన వాళ్ళకే గూబ గుయ్యిమంటుంది. కోపం తీరకుండానే, దు:ఖం తన్నుకుంటూ వస్తుంది.
పేదవాని కోపం పేదవానికే చేటయ్యిందంటే, లక్ష్యం తప్పిందనే అర్థం, వ్యూహం బెడిసి కొట్టిందనే భావం.
కార్మికుడు అలిగితే, యజమాని వణకాలి.
కూలి నిరసిస్తే, భూస్వామి బెదరాలి.
ప్రజలు ఉద్యమిస్తే, ప్రభుత్వానికి చ్కులు కనపడాలి.
కానీ, తెలంగాణ కోసం తెగించి కట్టిన ‘సకల జనుల సమ్మె’వల్ల సర్కారు ఎన్ని మిల్లీమీటర్లు కిందకు దిగివచ్చిందో తెలియదు కానీ, తెలంగాణ ప్రజలకు ఒక కంట తీరిన కోపం, ఇంకో కంట కలిగిన దు:ఖం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కార్మికులను నిలుపు చేసి, బొగ్గు ఉత్పత్తిని, తద్వారా విద్యుదుత్పత్తినీ నిలుపగలిగినందుకు విజయోత్సాహం. ఆ వెనువెంటనే, ఈ వంకతో, సర్కారు రైతుకు విద్యుత్‌ నిలుపు చేసినందుకు దు:ఖం.
ఒక పక్క గ్రూప్‌ వన్‌ పరీక్షలు ఆపగలిగేంత జనశక్తి. కానీ రాయక పోతే అదే జనుల పిల్లలు భవిష్యత్తు పోతుందన్న బెంగ.
బస్సులు ఆపేస్తాం. ఎక్కడి పేదలు అక్కడే. కానీ కార్లు తిరిగేస్తాయి. ఎక్కడకు వెళ్ళాలనుకున్న సంపన్నుడు అక్కడికి. కొట్టిన ప్రతీ కొరడా దెబ్బా, మనకే తగులుతుంటే, ఎంత సేపని కొట్టుకుంటాం?
నిజానికి, జనానికి నొప్పయితే, సర్కారుకు కూడా నొప్పికావాలి. కానీ ఎప్పుడూ..? ఎన్నికలు నెత్తిమీద కొచ్చినప్పుడు.
అలా కాకుండా ఎన్నికలకు ఇంకా సమయమున్నప్పుడు.. సర్కారు చాలా తాపీగా మాట్లాడుతుంది.
తీరిగ్గా చర్చిస్తుంది. తేల్చేస్తున్నట్టు నటిస్తుంది.లేదా సమస్యకు వున్న ముడులు చాలనట్లు కొత్త ముడులు వేస్తుంది.
లేదా, ప్లేటులో రాష్ట్రాన్ని కేకు మాదిరిగా పెట్టుకుని, చేత్తో చాకు పట్టుకుని, ‘ఇదిగో అయిపోయింది.’ అని అంటుంది.
ఎన్ని ముక్కలు చేస్తుందో?
ఏ ముక్క ఎవరికి ఇస్తుందో?
అసలు కోస్తుందో లేదో?
ఈ సందేహాలతో ఇరవయినాలుగు గంటలూ బతికెయ్యమని మీడియాకు మేత వేస్తుంది.
ఏ మాత్రం నొప్పి కలగని సర్కారు, ఇంకోలా ఎలా మాట్లాడుతుంది?
కానీ, సమ్మెలోకి దించబడ్డ జనం ఎదురు చూపులు ఆందోళన కలిగిస్తుంటాయి.
మూసిన ప్రభుత్వ ఆసుపత్రి గుమ్మం ముందు నొప్పులు పడుతున్న నిండు గర్బిణీ చూసినంత అత్యవసరంగా వారు చూస్తుంటారు.
జనాన్ని రోడ్డెకించామంటే, సర్కారుకు చూపించాల్సింది, వారి విశ్శరూపాన్ని కానీ, హ్రస్య రూపాన్ని కాదు.
అలా జరగలేదు కాబట్టే, సర్కారుదోమ తన ‘కుట్టు’పని తాను మానలేదు.

-సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి దినపత్రిక 2 అక్టబోరు 2011 సంచికలో ప్రచురితం)

Leave a Reply