గాంధీ బొమ్మ ముందు గాంధారీ పుత్రులు!

tenali1‘గాంధీ గారి దేశంలో గజానికో గాంధారీ పుత్రుడు’ అని కవి కాస్త ముందు అనేశాడు. ఇప్పుడయితే ఈ వాక్యాన్ని ఇంకొంచెం మార్పు చేసి,’గాంధీగారి బొమ్మ ముందు గజానికో గాంధారీ పుత్రుడు’ అని పలికేవాడు.

అనగనగా తెనాలి. ఏ ఊరు వారికి ఆ ఊరు మది వల్లమాలిన అభిమానం వుంటుంది. మరీ ముఖ్యంగా ఆ ఊరు వదిలాక, ఈ అభిమానం ఇంకా పెరిగిపోతుంది. కొన్ని ఊళ్ల వారికి ఈ అభిమానం మోతాదు మరీ ఎక్కువగా వుంటుంది. ఒకప్పుడు బరంపురం వారి గురించి ఇలాగే చెప్పుకునే వారు. అందుకనే ‘మనం మనం బరంపురం’ అనే నానుడి పుట్టింది. అలాంటి లోకోక్తే ‘మీది తెనాలి, మాది తెనాలి’ కూడా. కోస్తా ఆంధ్రయే అభివృద్ధిలో ముందు వుందంటే, ఆంధ్రలోనే మిగిలిన ఊళ్ళ కన్నా ముందు నాగరీకమయిన ఊళ్ళలో తెనాలి ఒకటి. ‘ఆంధ్రా ప్యారిస్‌’ అని ముద్దుగా పిలుచుకునే వారు. హేతువాద, అభ్యుదయ ఉద్యమాలలో కీలక పాత్ర వహించిన వారు ఈ పట్టణం నుంచి వచ్చారు. కవులూ, కళాకారులయితే చెప్పనవసరంలేదు. అంతే కాదు, తొలితరం తెలుగు పత్రికల్లో ముఖ్యమైనవి కొన్ని ఈ పట్టణం నుంచే వచ్చాయి. అలాంటి తెనాలి లో గాంధీ గారి బొమ్మ వుంది. దానికి చేరువలోనే ఓ బ్రాందీ షాపు. అదీ ఎవరదని అడగరే..? గాంధీ గారు పెంచి పోషించిన కాంగ్రెస్‌ పార్టీ నేతది. ఆ నేతకూడా ఈ చారిత్రక. నాగరీక పట్టణానికి మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ గా చేశారు. ఆయన పేరు ఉమ్మలనేని జానకీ రామచంద్రరావు. ఆయనకో పుత్ర రత్నం వున్నాడు. అతని పేరు ఉమ్మలనేని నాగరాజు. ఇన్ని సదుపాయాలన్ను ‘యువ కిషోరం’ కుదురుగా వుంటారా? అతనికో మిత్రమండలి. ఆ రోజు సోమవారం( 8 ఏప్రిల్‌ 2013). రాత్రి తొమ్మిది కూడా కాలేదు. ఓ బడిపంతులు భార్య, బిటెక్‌ చదివే తన కూతుర్ని వెంటబెట్టుకొని వస్తున్నారు. నాగరాజుతో పాటు ఎనిమిది మంది ‘దుశ్శాసనులు’ కూతురిపై ‘లైంగిక దాడి’కి పాల్పడబోయారు. తల్లి సహించలేక, అందులో ఒకరికి ‘చెంప మీద’ ఒక్కటిచ్చారు. దాంతో తల్లిని రోడ్డు మీద వెళ్తున్న లారీ కిందకు తోసేశారు. లారీ చక్రం కింద కొరప్రాణాలతో కొట్టుకుంటున్న తల్లిని( బేతల సునీల)ను రక్షించటానికి బిడ్డ ప్రయత్నించింది. కేకలు పెట్టింది. అదే సమయానికి ఒక పోలీసు కానిస్టేబులూ, సబ్‌ ఇన్స్పెక్టరూ అంటూ వెళ్తుంటే, తన తల్లిని కాపాడమని బిడ్డ ప్రాధేయపడింది. వాళ్ళు చూస్తూ వెళ్ళిపోయారు. చివరికి మెల్లమెల్లగా పోగయిన జనం సాయంతో ఆమెను ఆస్పత్రికి చేర్చారు. కానీ ఫలితం లేదు. ఆమె చనిపోయింది.

ఈ ఘటన విషయంలో ముందు మీడియా( హిందూ అనే ఆంగ్ల పత్రిక పతాక శీర్షికగా ప్రకటించింది.) తర్వాత న్యాయస్థానం(హైకోర్టు) స్పందించాయి. ఆ తర్వాత రాజకీయ నేతలూ, పోలీసులూ స్పందించాల్సి వచ్చింది. సరే. ఎలాగూ అన్యాయం జరిగింది తమ సామాజిక వర్గం మహిళలకే కాబట్టి, దళిత సంఘాలు ముందే వున్నాయి.

ఈ విషాదం రెండు ప్రశ్నల్ని లేవనెత్తింది?

ఒకటి: ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురయిన స్పందన ఎందుకు రాలేదు?

రెండు: తల్లి బలికాకుండా వుంటే ఆడ బిడ్డ పరిస్థితి ఏమయ్యి వుండేది?

‘నిర్భయ’ పై రాత్రి పూట ఢిల్లీలో బస్సులో జరిగిన అత్యాచారం అత్యంత కిరాతకమయినదే. కానీ ఢిల్లీ కి అత్యాచారాలు కొత్త కాదు. ఢిల్లీకే ‘అత్యాచారాల రాజధాని’ అని మరో పేరు కూడా వుంది. కానీ 2012లో ఈ ఘటనకు దేశవ్యాపితంగా నిరసన రావటం కొత్త. ఇందులో చదువుకున్న యువతీ,యువకులు ‘సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌’ ద్వారా స్ఫూర్తి పొంది, ఢిల్లీని ముట్టడించారు. అయితే అప్పటికీ బొత్స సత్యనారాయణ లాంటి నేతలు ‘రాత్రి పూట స్త్రీలు ఒంటరిగా తిరగాల్సిన పనేమిటి?’ అని ప్రశ్నించారు. కానీ ఉద్యమం వచ్చిందే స్త్రీలు రాత్రి పూట ఎందుకు తిరగ కూడదని? ఐటి, హాస్పిటాలిటీ వంటి పరిశ్రమల్లో నేడు యువకులతో సమానంగా యువతులు కూడా రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. కాబట్టి ఈ ఢిల్లీ అత్యాచారం చదువుకున్న యువతుల్నే కాదు, యువకుల్ని కూడా బాధించింది. బాధితురాలి స్థానంలో తన భార్య వుండవచ్చు. తన చెల్లెలు వుండవచ్చు. లేక తన స్నేహితురాలు వుండవచ్చు. ఈ ఆలోచనే వారిని రోడ్డు మీదకు తెచ్చింది.

కానీ తెనాలి చిన్న పట్టణం. అక్కడ పై సామాజిక వర్గాల్లో విద్యావంతులయిన యువకుల్లో అధికభాగం. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు ఉద్యోగార్థమో, వాణిజ్యార్థమో వెళ్ళిపోయి వుంటారు. అయితే ఈ సదుపాయి దళిత వర్గాలకు లేదు. బాగా చదివినా పరిసర ప్రాంతాల్లోనే ప్రభుత్వరంగాలలో పనిచేసుకుంటూ వుంటారు. విద్యావంతురాలయిన దళిత యువతుల పట్ల, అగ్రవర్ణాలకు చెందిన చదువులు సగంలోనే అపేసిన( డ్రాప్‌ అవుట్స్‌) వారి ప్రవర్తన పలు సందర్భాల్లో అనుచితంగానే వుంటుంది. ‘తాము అంటే వారు ఎందుకు పడరనే’ పాతకాలపు ‘ఫ్యూడల్‌’ అహంకారం వారిలో పూర్తిగా పోదు. దానికి తోడు రాజకీయ పార్టీలు కూడా చిన్నపట్టణాల్లో ఇలాంటి వారినే కార్యకర్తలుగానూ, ఒక్కొక్క సారి పార్టీ అభ్యర్థులుగానూ ప్రకటిస్తుంటాయి. వీరికి స్థానిక పోలీసులపై అజమాయిషీ, పెత్తందారీ తనం కూడా వుంటుంది.

కాబట్టే ఒకప్పుడు నాగరికతకూ, సభ్యతకూ సంకేతంగా వున్న చారిత్రక పట్టణమైన తెనాలిలో ఈ ఘటన జరిగింది. దేశమంతటా మధ్యతరగతి యువతీ యువకులు భావించినట్టుగా, ‘ ఈ దారుణం మా ఆడవాళ్ళకు జరిగి వుంటే..?’ అనే ప్రశ్న తలయెత్త లేదు. ఎందుకంటే ఆ పట్టణంలో వున్న ఇతర వర్గాల వారికి ఓ భరోసా వుండి వుంటుంది. ‘దళిత మహిళలు కాబట్టి, వారు చనువు తీసుకున్నారు కానీ, మన మహిళల పట్ల అలా వుండదరు కదా!’ అని. అందుకే సకలజన ప్రజాస్పందన ఈ ఘటనకు లభించలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఒక్కసారి సభ్యత మరచిన వాడికి, ఏ వర్గం స్త్రీయైనా ఒక్కటే..!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 13-19 ఏప్రిల్ 2013 వ సంచికలో ప్రచురితం)

1 comment for “గాంధీ బొమ్మ ముందు గాంధారీ పుత్రులు!

Leave a Reply