‘గుజ’ బలుడు మోడీ

ఓడలు బళ్ళవుతాయి: అద్వానీలు మోడీలవుతారు.

బళ్ళు ఓడలవుతాయి: మోడీలు అద్వానీలవుతారు.

అలనాడు అద్వానీకి అనుంగు శిష్యుడు మోడీ. కానీ ఇప్పుడు, అదే అద్వానీ ‘న.మో’ అంటున్నారు.

రేపో, మాపో, అద్వానీ తాను వెనక్కి తగ్గి పోయి- ప్రధానివి నువ్వే- అని మోడీతోఅన్నా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే పోటీలో వున్న వాళ్ళంతా ఇలాంటి ఆశీస్సులే ఇచ్చేస్తున్నారు.

అద్వానీ ఎప్పుడూ అంతే. ‘ఆయన ఎక్కదలచిన ప్రధాని సీటు, ఒక జీవితం కాలం లేటు.’

సరిగ్గా ఆయన కూర్చోబోయే సరికి- ‘హాచ్‌!’ అని ఎవరో ఒకరు తుమ్మేస్తున్నారు.

అద్వానీయే లేక పోతే ‘అయోధ్య'( వివాదం) లేదు.

అయోధ్యే లేక పోతే బీజేపీ లేదు.

అలాంటి బీజేపీ రాక, రాక కేంద్రంలో అధికారంలోకి వస్తే, ఎవరు ప్రధాని కావాలి? అనివార్యంగా అద్వానీయే కావాలి. కానీ, ఎవరయ్యారు? వాజ్‌పేయీ అయ్యారు.

గెలించి అద్వానీ రథ యాత్ర వల్ల. రథం దిగి తీరా కుర్చీ ఎక్కబోయే సరికి అక్కడ వాజ్‌ పేయీ కూర్చుంటే ఎలా వుంటుంది.

అదేమిటో ప్రధాని పదవి ఎప్పుడూ అంతే. కోరుకున్న వారికి దూరమవుతూ వుంటుంది.

వద్దన్న వారిని వెంటాడుతూ వుంటుంది. అంతే కాదు, ఊహించిన వారిని వరిస్తూ వుంటుంది.

అప్పట్లో వాజ్‌ పేయీ ఈ పదవి కోసం ఎగబడలేదు. కానీ వచ్చి పడింది. తొలుత 13 రోజుల పాటు ప్రధానిగా వున్నారాయన. తర్వాత అవకాశంలో పూర్తి పదవీ కాలం ప్రధానిగా కొనసాగారు.

పార్టీ విజయానికి ‘హిందూత్వ’ పనికి వచ్చింది కానీ, పదవికి మాత్రం ‘సెక్యులరిజమే’ బాసట అయింది. సంకీర్ణ రాజకీయాల పుణ్యమా- అని బీజేపీ తనంతట తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక- మిత్రుల మద్దతు కోరాల్సి వచ్చింది. అప్పట్లో అద్వానీ పేరు చెబితే అదిరి పడ్డారంతా. ఉన్నంతలో వాజ్‌పేయీ మేలనుకున్నారు. ఫలితంగా ప్రధాని పదవి వాజ్‌ పేయీకి దక్కింది.

ఏనాటికయినా బీజేపీ సొంతంగా( మిత్రుల సాయం లేకుండా) ప్రభుత్వాన్ని స్థాపించక పోతుందా? తాను ప్రధాని కాకుండా పోతానా- అని అద్వానీ- ఆశించారు కానీ, ఆ భాగ్యం ఆయనకు కలగలేదు. ఆ తర్వాత కూడా ‘ఇండియా ప్రకాశిస్తోంది’ అంటూ వాజ్‌పేయీ ఫోటోలతోనే బీజేపీ పోటీకి దిగింది. తర్వాత ఎలాగూ కాంగ్రెస్‌ నేతృత్వంలో ‘యూపీయే’ వరసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.

ఇంకేముంది? పుణ్యకాలం కాస్తా గడచిపోయింది. ఇప్పుడు 2014 ఎన్నికల సందర్భం వచ్చేసరికి మళ్ళీ కొత్త సమస్య వచ్చింది. ఈ సారి ‘హిందూత్వ’ కాదు సమస్య. ఆయనకున్న సుదీర్ఘానుభవమే ఆయనకు అడ్డయింది. అనుకూలురు అనుభవం మాత్రమే చూశారు. వ్యతిరేకులు అనుభవంతో మీద పడ్డ వయసును చూశారు. అప్పటి నుంచీ ప్రధాని పదవికోసం పార్టీలో పలువురికి కన్నుపడింది. కానీ పార్టీలో కార్యకర్తలు మాత్రం నరేంద్ర మోడీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే, కేంద్రంలోనే కాదు. రాష్ట్రాలలో ఎక్కడి కక్కడ, కాషాయ సామ్రాజ్యాలు కూలిపోయాయి. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులతో పాటు బీజేపీ ముఖ్యమంత్రులు కూడా అవినీతి ముద్రలువేయించుకున్నారు. (కర్ణాటకలో యెడ్యూరప్ప పెద్ద ఉదాహరణ.) అలా చూసినప్పుడు కాషాయతటాకంలో ముమ్మారు వికసించిన ఏకైక ‘కమలం’గా మోడీ కనిపించారు. కడకు పార్టీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ ముఖం మీద కూడా కేజ్రీవాల్‌ ‘అవినీతి’ ముద్ర వేశారు. జైట్లీలూ, స్వరాజ్‌లూ కేవలం ఢిల్లీకే పరిమతమయ్యారు. ఇప్పుడు కావాల్సింది దేశం మొత్తాన్ని ఆకర్షించగల నేత కాబట్టి మోడీ ని మించిన ప్రత్యామ్నాయం పార్టీ ముందు లేదు. అదీకాక బీజేపీని వెనకనుంచి నడిపించే ఆర్‌.ఎస్‌.ఎస్‌కు మోడీ అత్యంత ప్రీతి పాత్రుడు( అయితే ఆర్‌.ఎస్‌.ఎస్‌లో కూడా ఒక వర్గం మోడీని వ్యతిరేకిస్తోంది.) ఈ విషయాలను ముందే గ్రహించిన మోడీ గెలిచిన రోజునే తాను జాతీయ స్థాయి నాయకుణ్ణని గుర్తు చేశారు.( నా హిందీకి ఇకనుంచి మీరు అలవాటు పడాలి అని మీడియాకు చెప్పారు.)

అయితే మోడీ అభ్యర్ధిత్వం బీజేపికి సమ్మతమయినట్లుగా, ఎన్డీయేలో ఇతర మిత్ర పక్షాలకు సమ్మతం కాడు. బీహార్‌ అసెంబ్లీ ప్రచారంలో ‘మోడీ నారాష్ట్రం రావద్దు’ అని మిత్రపక్షమైన జనతాదళ్‌(యు) ముఖ్యమంత్రి తెగేసి చెప్పేశారు. కారణం మోడీ కున్న ‘ముస్లిం వ్యతిరేక’ ముద్ర. ఈ ముద్ర ఇప్పటి విజయంతో కూడా అంత తేలిగ్గా చెదరిపోదు. గుజరాత్‌లో ముస్లింల స్థితి వేరు. మోడీని కాదంటే వారికి కాంగ్రెస్‌ ఒక్కటే మార్గం. కాంగ్రెస్‌ వరుసగా ఓడిపోతూ వస్తోంది. కానీ మిగిలిన రాష్ట్రాలలో ముస్లింలను బీసీ, ఎస్సీలతో జత చేయగల రాజకీయప్రత్యామ్నాయాలున్నాయి. అలాంటి రాష్ట్రాలలో మోడీ మార్కు రాజకీయ నడవదు. ఈ ఒక్క ఇబ్బందీ తప్ప మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించటానికి బీజేపీకి ఇబ్బంది వుండక పోవచ్చు.

-సతీష్ చందర్

(గ్రేట్  ఆంధ్ర 22-28 డిశంబరు 2012 వ సంచిక లో ప్రచురితం)

1 comment for “‘గుజ’ బలుడు మోడీ

  1. భా.జ.పా, ఆద్వానీ, మోడీల మనుగడకు కారణం హిందూత్వ నినాదం, అయోధ్య. భాజపా తన ఉనికి కారణాన్ని మరచి కాంగ్రెస్ మార్కు సూడో-సెక్యులరిజమునే తన ముఖానికీ పులుముకుంది. హిందువులకు దీని వల్ల ఏమి ఒరుగుతుంది?తమ అవకాశాన్ని భాజపా ఆద్వానీ వదులుకోని నిరుపయోగమైన సంస్థ, నాయకుడూ అయ్యారు. మోడీ రాష్ట్ర ప్రజల ఏకైక నాయకునిగానిలబడ్డాడు. దేశ స్థాయిలో చూడాలి. ఆద్వానీకి సానుభూతి అనవసరం.

Leave a Reply