‘గురివింద్‌’ కేజ్రీవాల్‌!

కేరికేచర్: బలరాం

కేరికేచర్: బలరాం

పేరు : అరవింద్‌ కేజ్రీవాల్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: రెండు నెలల ముఖ్యమంత్రి.( మొదటి సారి ఢిల్లీకి ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడు 49 రోజులు చేసి రాజీనామా చేశాను. ఈ సారి 60 రోజులు చేసి రాజీనామా చెయ్యాలన్నది నా కోరిక.)

ముద్దు పేర్లు :”గురివింద్‌’ కేజ్రీవాల్‌ (గురివిందకి అంతా ఎరుపే. ఎక్కడో కొంచెం నలుపు. అందుకే కోబోలు వచ్చిన ఢిల్లీ పీఠాన్ని వదలు కొన్నాను.’కాశీ’ వెళ్ళి ఓటమిని తెచ్చుకున్నాను.) ‘శోక్‌’ పాల్‌. ( లోక్‌ పాల్‌ బిల్లు రానంతవరకూ ‘లోక్‌ పాల్‌ … లోక్‌ పాల్‌’ అంటాను. తీరా వచ్చాక, అది ‘జన లోక్‌ పాల్‌’ కాదే..! అని శోకిస్తాను.)

‘విద్యార్హతలు : ఐ.ఆర్‌.ఎస్‌.( అంటే ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అనుకున్నారా? అక్కడే ‘తప్పు’లో కాలేశారు. మనది ఇండియన ‘రిజైనింగ్‌’ సర్వీస్‌. రాజీనామాలు చెయ్యటంలో మనకి వున్న మనకి వున్న శిక్షణ మరెవ్వరికీ లేదు.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: ఆఫీసర్‌కి ఎక్కువ; లీడర్‌కి తక్కువ. ( ఆఫీసర్‌ పదవి నాకు చిన్నదయి పోయిందని రాజీనామా చేశాను. ముఖ్యమంత్రి పదవి పెద్దదయి పోయిందని వదలుకున్నాను. కానీ ఇప్పుడు రెండూ కావాలని పిస్తున్నాయి. ఏదయినా అంతే….! పోగొట్టుకుంటేనే కానీ, దాని విలువ తెలీదు.

రెండు: ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’లో నేనే ‘ప్రైమ్‌’ ఆద్మీని. అనగా అతి ముఖ్య సామాన్యుణ్ణి. ఎక్కడయినా ‘అతిముఖ్యసామాన్యుడు’ ఇద్దరు ముగ్గురుంటారా? ఉండరు కదా! అందుకే నేనొక్కణ్ణే వుంటాను. ఈ రహస్యాన్ని జీర్ణించుకోలేక, పార్టీనుంచి కొందరు వైదొలగుతున్నారు.

సిధ్ధాంతం : ఢిల్లీ కానీ, దేశం కానీ నిత్యం కళకళ లాడాలంటే, ఎప్పుడూ ఎన్నికలు జరగాలి. అప్పుడే నేతలు వీధుల్లో వుంటారు. అందుకే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు పెట్టమంటున్నాను. కానీ అక్కడి లెఫ్ట్‌నెంట్‌ గవర్న్‌ర్‌కి ఈ విషయం అర్థం కాదూ…!

వృత్తి : తుడవటం. కానీ నా వృత్తిని నరేంద్రమోడీ చేపట్టేశారు. ఆయన ‘స్వఛ్చ భారత్‌’ పేరు మీద వీధుల్నీ తుడిచేస్తున్నాడు; ఎన్నికల పేరు మీద ‘సీట్ల’నీ ‘స్వీప్‌’ చేస్తున్నాడు. మా పార్టీ ఎన్నికల గుర్తు అయిన ‘చీపురు కట్ట’ను ఆయన చేతపట్టటం వల్లనే ఇది సాధ్యమవుతుంది. నా గుర్తు నాకివ్వమని నేను ధర్మ పోరాటాం చేస్తే మంచిదేమో!

హాబీలు :1. రోడ్డు మీద పడక వెయ్యటం. అపార్థం చేసుకోకండి. నిద్ర కోసం కాదు, నిరసన కోసం. 2.పొత్తులు పెట్టుకున్న వారి మీద కత్తులు దూయటం. (కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకుని, దెబ్బ తిన్నాను లెండి. ‘చీపురు’ ని ‘చేతి’ కిస్తే తుడిచేది ‘చెయ్యా’? ‘చీపురా?’ కానికిప్పటకీ అర్థం కాదు. )

అనుభవం : అనుభవమంతా, మా గురువు గారు అన్నా హజారే దగ్గరే నేర్చుకున్నాను. ఆయన నాకు రెండే రెండు పాఠాలు చెప్పారు. ఒకటి: టోపీ పెట్టుకోవటం. ( పెట్టటం కాదు.) రెండు: జెండా ఊపటం( మార్చటం కాదు.) కానీ ఈ రెండు పాఠాలూ ఎందుకనో అధికార రాజకీయాల్లో అక్కరకు రావటం లేదు.

మిత్రులు : యధార్థ వాది లోక శత్రువు అంటారు. నాకు మిత్రులెవరుంటారు. ఉన్నవారంతా ‘ఫేస్‌ బుక్‌’ ఫ్రెండ్సే.

శత్రువులు : ముల్లు ముల్లును ముల్లుతో తీయాలనుకున్నట్టు, ‘చీపురు’ను, ‘చీపురు’తో కొట్టాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ.

మిత్రశత్రువులు : కాంగ్రెస్‌ వారు. ఎప్పుడు ‘చెయ్యి’ అందిస్తారో…, ఎప్పుడు ‘చెయ్యి’ ఇస్తారో తెలీదు.

వేదాంతం : కుర్చీ వున్నది కూర్చోవటానికి కాదు. ఉందని చెప్పటానికే. అందుకే అధికారి గానూ ఎక్కువ కాలం కూర్చో లేదు; ముఖ్యమంత్రి గానూ ఎక్కువ రోజులు కూర్చో లేదు.

జీవిత ధ్యేయం : ప్రధానిగా కూడా తొలిసారి 49 వ రోజు రాజీనామా చేసి రికార్డు నెలకొల్పాలన్నది నా జీవిత ధ్యేయం.

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ ఆంధ్ర వారపత్రిక 1-6 నవంబరు 2014 వ తేదీ సంచికలో వెలువడింది.)

Leave a Reply