గోరా శాస్త్రి: పాత నాటకంలో కొత్త పాత్ర

గోరా శాస్త్రి రేడియోనాటికలు దూరాన్నే కాదు కాలాన్ని కూడా జయించాయి. పేరుకు శ్రవ్యనాటికలు కాని వాటినిండా దృశ్యాలే.

పాత పుస్తకంలో కొత్త వాక్యం దొరికింది. – పాత పెట్టెలో ప్రియురాలి ఫొటో దొరికనట్లు.

నిద్రపోతే ఒట్టు. తడిసిన కళ్లలాంటి పదాలు!

కవిత్వమా? కాదు. పరమ పవిత్రమైన వచనం. జీవితాన్ని రక్తమాంసాలతో చూపించగలిగేది ఒక్క వచనమే కాబోలు!

ఇక తెలుగు వచనం అంటారా? గురజాడ, శ్రీపాద మల్లాది రామకృష్ణశాస్త్రి, చెలం, రావి శాస్త్రి- వీళ్లందర్ని మురిపించి, మాయచేసి, పిచ్చివాళ్లని చేసింది. కోలుకున్నారన్న దాఖలాలు కూడా లేవు. గుర్రం పరుగెత్తడం మీద పందెంకాసి జీవితాన్ని ఖర్చు చేసుకున్నట్లు- వాళ్లువచనం మీద ఖర్చు చేసుకున్నారు. ఏం మిగిల్చారని? గుండెల్ని కుదిపేసే గుర్రపు డెక్కల చప్పుడు తప్ప.

అలాంటి జల్సా రాయుడే గోరా శాస్త్రికూడా. ఆయన వచనం దశాబ్దాల క్రితమే పరుగెత్తింది. ఆ చప్పుళ్లు వింటూ ఇప్పుడు తీరిగ్గా జడుసుకుంటున్నారు.

ఇప్పుడు ‘ఉద్యోగగ్రస్త’ జీవితాలని గడిపే రచయితలకి తడివచనంతో పని తీరిపోయినట్లు కనిపిస్తోంది. ‘జీసస్‌ వెప్ట్‌’ అనే వాక్యాన్ని చూసి బెంగపెట్టుకున్నాడో మహాకవి. అది చెమ్మగిల్లిన వ్యాక్యం.

ఇలాంటి వాక్యాల్నే- శ్రీపాదా, చెలం స్త్రీల దగ్గర్నుంచి దొంగిలించారు. చూడబోతే గోరాశాస్త్రి అదే పని చేసినట్లనిపిస్తుంది.

ఆయన రాసిన రేడియో నాటికల్లోనూ స్త్రీలే ఎక్కువగా మాట్లాడతారు. మాట్లాడడమంటే- ఇప్పుడొస్తున్న వ్యాపార నవలల్లోలాగా ‘వాగడం కాదు. మాట్లాడడ మంటే మనసులోకి ప్రవేశించడమే. నాటక రచనకిది ఆరోప్రాణం. అలాంటి మాటల్తొనే కదా-‘మధురవాణి’ మన మనసుల్ని దోచిందీ?

గోరాశాస్త్రి ”సెలవుల్లో…” అనే సీరియల్‌ నాటికలో రెండు పాత్రలుంటాయి. ఒకటి: లలిత రెండు: లలిత భర్త. లలిత మాట్లాడి మనసు దోచుకుంటే, లలిత భర్త మాట్లాడకుండా మనసు దోచుకుంటాడు. లలిత స్వభావం చిత్రమైనది. తనకు కావలసినవాళ్లు ఎవ్వరూ, ఎప్పుడూ నోచ్చుకోకూడదు. అందుకు ఎంతో సర్దుబాటు చేసుకుంటుంది కానీ ఎక్కడా రాజీపడదు. పువ్వులాంటి మనసు; రాయిలాంటి నిబ్బరం.

ఆ లక్షణాలన్నీ ఆమె మాటల వల్లే మనకి కనిపిస్తాయి. తనను విడిచి అత్తారింటికి వెళ్లొద్దన్న తల్లితో- ”ఈ స్వార్థాలకి అంతెక్కడమ్మా? నన్నిక్కడే ఉండిపొమ్మనడం నీ స్వార్థం కాదా?” అని ప్రశ్నిస్తుంది. ఇందుకు పూర్తి భిన్నమయినది ఆమె భర్త పాత్ర. ఎవర్నీ ఏ విషయంలోనూ నొప్పించడు. భార్య అంటే వల్లమాలిన ప్రేమ. సంస్కారం పుట్టి తర్వాత అతను పుట్టాడేమో అనిపిస్తుంది. అతన్ని చూడాలనిపిస్తుంంది. అతని మాటలు వినాలనిపిస్తుంది. కాని ఏ సందర్భంలోనూ రంగం మీదకు రాడు. నాటకం చివరి వరకూ గోరా శాస్త్రిగారు ఆ పాత్రను తాయిలంలా దాచిపట్టే ఉంచుతాడు. కాని అతను మాట్లాడతాడు. అతికొద్ది మాట్లాడతాడు. ఆ మాటలు సహ పాత్రలకి తప్ప శ్రోతలకి వినపడవు. ఆ పాత్ర నోరువిప్పడం కోసం సహ పాత్రలు తపించిపోతాయి. తాను చేసిన డాన్సును లలిత భర్త పట్టించుకోకపోతే ”ఆ మాత్రం కర్టెసీ ఉండక్కర్లే? మరదలు డాన్సుచేస్తుంటే చూడనైనా చూడకుండా పారిపోతాడా?”అని లలిత చెల్లెలు ఏడుస్తుంది. మనకి నవ్వొస్తుంది. గొప్పతనం ఆమె బావది.

ఇలా ఒక ముఖ్యపాత్రను పూర్తిగా మరుగు పరచి రక్తికట్టించడం దృశ్య నాటకంలోనే సాధ్యం. అలాంటి పనిని శాస్త్రిగారు శ్రవ్యనాటికలో చేశారు. పరమరహస్యాల్ని గుప్పిట పట్టడం చేతనైనవాడే నాటకాన్ని నడిపించగలడు. చివర్లో ‘డామిట్‌! కథ అడ్డం తిరుగుతుంది’ అన్న విషయాన్ని తెలిసి కూడా గురజాడ అమాయకంగా నాటకాన్ని మొదలు పెట్డడూ? అలా అన్నమాట.

పిరికి వాళ్ళు కాపురాలు చెయ్యడానికి పనికొస్తారేమో కాని ప్రేమకు పనికి రారు. పౌరుష హీనులు దేశాన్ని పరిపాలించగలరేమోకాని ప్రేమించలేరు. పది కొరడా దెబ్బలకు సిద్ధపడ్డ వాడు ఒక ప్రేమలేఖ రాయవచ్చు. యుద్ధంలో వంద కుత్తుకల్ని తెగనరికిన వాడు ఒక పాలపిట్టను ప్రేమతో నిమరవచ్చు. ఇలా… ఎంతో చెప్పవచ్చు. కాని జాలిగొలిపే పిరికి ప్రేమికుణ్ణి చిత్రించమంటే ఇద్దరే ఇద్దరు ముందుకొస్తారు. ఒకరు చిత్రకారుడు. మరొకరు నాటక రచయిత.

ఆ పిరికి ప్రేమికుడికి సంపెంగలంటే భయం.

నాదస్వరమంటే భయం

నీలిరంగు చీరంటే భయం

వాడికి ఏది ఇష్టమో అదంటే భయం. ఇదే పిరికితనం. సౌందర్యాన్ని చూసి జడుసుకోవడం కన్నా పెద్దజబ్బు మరొకటి ఉండదు. ఈ జబ్బు మధ్య తరగతి వాళ్లకి ఎక్కువ వస్తుంది. అందుకే వాడిపోయిన జీవితాల్ని గడుపుతుంటారు. అలాంటి ఒకానొక సగటు శేేషగిరిరావు అందాల పకుళాన్ని ప్రేమిస్తాడు. వకుళాన్ని పాము కరుస్తుంది. పిరికివాడు పాముకే కాదు పాము కరచిన వకుళానికి కూడా దూరంగా పారిపోతాడు. చచ్చిపోయిందని నమ్మడానికి ప్రయత్నిస్తాడు. వకుళానికి కోపం రాదూ? వచ్చింది. ఒకానొక భర్తాగ్రేసరుణ్ణి పెళ్లాడి, పిల్లల్ని కనేసింది. పిల్లల్ని కొట్టడానికీ, ముద్దాడడానికీ మధ్య వుండే సున్నితమైన సరిహద్దుని చెరిపేసుకుంది. పిరికి వాడికి నిజాయితీ ఒకటి ఏడ్చింది, ముసలావిడ పెదాల మీద లిప్‌స్టిక్‌ లాగా. ఆ నిజాయితీతో తీరిక దొరికినప్పుడల్లా పశ్చాత్తాపపడతాడు. ఒకసారి పెద్దఎత్తున పశ్చాత్తాప పడతాడు. అప్పటి వరకూ బతికున్న వకుళం అప్పుడే చచ్చిపోతుంది. పిరికివాడు తెగ ఏడుస్తాడు. పిరికి వాడి పరిచయస్తుడొకడు (స్నేహితులుండరు కదా!) ఈ ఏడుపును చూసి చక్కటి మాటంటాడు.

”నిన్ను చూసి జాలిపడుతున్నాను శేషగిరీ! కాని నీ దుఃఖాన్ని చూసి జాలిలేదు”

ఈ మాటలు గోరాశాస్త్రిగారు అనిపించారు. ”కొమ్మనంపెంగ’ అనే నాటికలో. పిరికితనాన్ని మించిన పెద్ద బీభత్సం ఏ ప్రపంచంలోనూ ఉండదు.. ఉండబోదు. నిజానికి పిరికి శేషగిరి పాత్రని శాస్త్రిగారు అంత కక్షతో చిత్రించలేదు. కాని నాటిక విన్నా, చదివినా శ్రోత/పాఠకుడికి మాత్రం అంతకోపం వస్తుంది.

తడవడం మించిన అనుభూతి మరొకటి ఉండదు. ఆ మాటకొస్తే తడవడమే అనుభూతి. నిండా మునగడమే అనుభూతి. వర్షంలో ఒక్కరే గొడుగు వేసుకు వెళ్లడం చూస్తే ఏమి అనిపిస్తుంది? ఎవరి బతుకు వారే బతికేస్తుంటే ఏమనిపిస్తుంది గనకా? ఒక గొడుగును ఇద్దరు పంచుకోవడం మాత్రం ఎప్పుడూ ఒక అద్భుత దృశ్యమే. పొడిగా ఉండడం కోసం కాదు;  సమంగా తడవడం కోసమేనేమో అనిపిస్తుంది. అదే జీవన సౌందర్యం! శ్రావణ వర్ష సౌందర్యం! ”ఒక సుందరి వర్షంలో తడుస్తుంటే వాననాపేస్తానం”టాడు ఓ వెర్రివాడు. గొడుగుపట్టుచాలు- అంటుందామె. అప్పుడు కానీ తెలీదు- కొన్ని గొడుగులు తడిపేందుకే ఉంటాయని. చెట్టుకిందకి వెళ్లాక తత్వం బోధపడుతుంది. ఆ కొద్ది అనుభూతుల్నే జీవితాంతం దాచుకుని బెంగగా బతుకుతుంటాడు. ఆ శ్రావణ సుందరే ఏళ్లు గడిచాక కలుస్తుంది. గుర్తు పట్టినా పట్టకపోయినా ఒక్కటే. పంచుకున్న క్షణాలే విలువైనవి. ఈ చిత్రాన్ని ఆయన ‘శ్రావణ సుందరి’ నాటికలో చెబుతాడు. ఏ మొపాసా కథలోనో కానీ, ఇలాంటి సూక్ష్మ విశ్లేషణ కనిపించదు.

రాజీనామాలో ‘రాజీ’ అన్నమాట నేతిబీరకాయలో నెయ్యిలాంటిది. రాజీ కుదరనప్పుడే రాజీనామాలొస్తాయి. వైదొలగిపోవడం రాజీనామా? దేని నుంచి? ఒక చట్రం నుంచి, ఒక వృత్తం నుంచి, ఒక యాంత్రికత నుంచి వైదొలగిపోవాలి. ఒక రామారావు ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు. ఎందుకని? గోరాశాస్త్రిగారి నడిగితే రెండే కారణాలు చెబుతారు. ఒకటి, అవసరం కోసం, రెండు: ఆత్మ గౌరవం కోసం. ఒకటి సుఖాన్నిస్తే, రెండవది శాంతినిస్తుంది. కాని ”శాంతి సుఖాలు ఖరీదైన సరుకు. మనబోటివాళ్లం కొనుక్కోలేం అంటుంది” రామారావు భార్య. అంటే వెనక ఎవరో తరుముకొస్తున్నట్లు జీవించే ‘ఉద్యోగగ్రస్త’ జీవితాల్లో ఈ సరుకులు లభ్యం కావు. ఎదుగూ బొదుగూ లేని ఉద్యోగాలు మనుషుల్ని ‘ఒంటెద్దు గానుగల్ని చేస్తున్నాయి. అలాంటి ఉద్యోగుల్లో ఒకడైన రామారావుకి ఒక రోజు కోపం వచ్చి రాజీనామా చేస్తాడు. అదే రోజు ఇంటికి తమ్ముడూ, తమ్ముడి భార్యా నెల రోజులు ఉండిపోవాలని వస్తారు. మామూలు నాటకాల లెక్కల్లో అయితే ఈ నాటకం దుఃఖాంతం కావాలి కాని అది సుఖాంతంమని రసజ్ఞుడికి తెలుస్తుంది. నాటక రచయిత రసజ్ఞులకు రసజ్ఞుడు.

”ఇంకా భవిష్యత్తా? వర్తమానం అంత పాడుగా ఉండదు కదా. ముందు అందరం కలిసి ఉందాం ఒకరికొకరు అండగా ఉంటే, ఎలాగైనా బతకొచ్చు” అంటుంది ఇంటికొచ్చిన మరదలు.

దు:ఖాన్ని పంచుకోవడమే గొప్ప సుఖానుభూతి. అసలు జీవితం అంటేనే పంచుకోవడం. గోరాశాస్త్రి మనకి గొప్ప నాటక సాహిత్యాన్ని పంచారు.

-సతీష్ చందర్

– సుప్రభాతం, 1994

(గోరాశాస్త్రి శత జయంతి వేడుకలు జరపుకుంటున్న నేపథ్యంలో పాతికేళ్ళ క్రితం నేను రాసిన వ్యాసాన్ని నా  ఈ వెబ్ సైట్లో పంచుకుంటున్నాను. అప్పటికి నేను ‘సుప్రభాతం‘ పత్రిక బాధ్యతలు చేపట్టాను. అందులో ఈ వ్యాసం తొలుత ప్రచురితమయ్యింది. తర్వాత నా విమర్శ గ్రంథం ’నిగ్రహవాక్యం‘ లో నాటక విభాగం కింద అచ్చువేశాను.)

2 comments for “గోరా శాస్త్రి: పాత నాటకంలో కొత్త పాత్ర

  1. భలే బాగుంది ఎన్ని కొత్త విషయాలు తెలిసాయో ధన్యవాదాలు సతీష్ చంద్ర గారు

Leave a Reply to Swathi prasad Kavi Cancel reply