చినుకంత బతుకు

చిన్నవే. ఎప్పుడూ చూసేవే. అనుక్షణం వినేవే. ఎప్పటిప్పుడు తాకేవే. అను నిత్యం ఆఘ్రాణించేవే. రోజూ రుచి చూసేవే. కొత్తగా, కొత్తగా వుంటాయి. పొద్దుపొడుపు ఎండలో ఆకు మీద మెరిసే మంచు బిందువూ, ప్రశాంత సమయంలో పసిబిడ్డ కేరింతా, రాత్రి పూట మెత్తటి గాలి మోసుకొచ్చిన సంపెంగల సువాసనా, కలత నిద్దురలో నుదుటి మీద అమ్మ చేతి స్పర్శా, నాలుక చివర్న ఉప్పూ,కారం కలిసిన పచ్చిమామిడి కాయ ముక్కా- ఎప్పుడయినా పాతబడ్డాయా? మరి బతుకేమిటి? రెడీమేడ్‌ చొక్కాలా, ఇలా వేసుకుంటే అలా మాసిపోతోంది..!?

Photo By: Andy Mostowski

నీటితో

నీరు మాట్లాడి, మౌనం దాల్చటం

ఎప్పుడయినా విన్నారా?

ముద్దు పెట్టిన చప్పుడు.

అదే చినుకు.

 

అతడూ ఆమె

కొట్లాడుకుని కౌగలించుకోవటం

ఎప్పుడయినా చూశారా?

హరివిల్లు విరిసిన దృశ్యం

అదే బతుకు.

– సతీష్‌ చందర్‌

(ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

 

1 comment for “చినుకంత బతుకు

Leave a Reply to sailajamitra Cancel reply