తెలివి ఎక్కువే! తెలుగే తక్కువ!!

బ్రౌన్ ఊహాచిత్రం

తెలివి తక్కువ వాళ్ళ గురించిన బాధేం లేదు.
దిగులంతా ‘తెలుగు తక్కువ’ వాళ్ళ గురించే.

తక్కువయిన వాళ్ళు తక్కువయినట్లు వుంటారా? ఎక్కువ మాట్లాడతారు. అక్కడితో కూడా అగరు. తెలుగును ఉద్ధరించే సాహసానికి కూడా ఒడిగడతారు.

ఈ ఉధ్ధారకులు అన్ని రంగాల్లోనూ వుంటారు. ప్రసార మాధ్యమాల్లోనూ, విద్యాలయాల్లోనూ కాస్త ఎక్కువగా వున్నట్లు అనిపిస్తారు.అందుకు కారణం వారి గొంతులు పెద్దవని కాదు కానీ, వారి ముందు అమర్చిన మైకులు పెద్దవి. తెలుగు నాశనమయిపోతుందని బాహాటంగా బాధపడే అవకాశం, అలా వీరికి దక్కింది..

వీరి ఫిర్యాదు దాదాపు ‘వర్ణం’ దగ్గరే ఆగిపోతుంది. (కంగారు పడనవసరం లేదు. భాషలోని ‘వర్ణమే’ లెండి) అది దాటి ‘పదం’ దగ్గరకి కొందరే వస్తారు. వాక్యం దగ్గరకు మరీ తక్కువ మంది వస్తారు.

దీర్ఘాలూ, వత్తులూ, కొమ్ములూ, మేకులూ- సరిలేవటంటూ ‘వర్ణ’ క్రమం చుట్టూ తిరిగేస్తారు. ఇప్పటికీ పలుపత్రికలు తమ సిబ్బంది కోసం విడుదల చేసే ‘శైలి పత్రాల'(Style Sheets)లో వీటి గొడవే ఎక్కువ.ఆ తర్వాత పదాల గురించి యోచిస్తారు. అవి కూడా ఇంగ్లీషుపదాలకు సరిసమానమైన తెలుగు అనువాదాలు. స్థిరపడ్డ అనువాదాలనే కొత్తగా చేరిన పాత్రికేయుడు వాడుతుంటే చాలు. స్వతంత్ర తెలుగు రచనలోని పదాల సంగతి వీరికనవసరం. ఇకా వాక్యాలంటారా? ఎలా పేనుకుంటూ వెళ్ళిపోయినా, ఎవరూ మాట్లాడరు.

విద్యాలయాల్లోనూ దాదాపు ఇదే తీరు. ఇంకా గ్రాంథికమూ, వ్యావహారికమూ అంటూ, ఇంకా గిడుగు చేసిన ఉద్యమాన్నే తిరిగి తిరిగి చేస్తూ, ‘పత్రాలు’ సమర్పిస్తూ వుంటారు.
మరి వీరే తెలుగును ఉద్ధరించేస్తున్నారని ఒప్పేసుకుందామా?
‘గాడిద గుడ్డే’ం కాదూ..!

సరదాకి వచ్చిన కోపం కాదు సుమండీ. నిజంగానే వీరు ఉద్ధరించలేరని చెప్పడానికి ‘గాడిద గుడ్డు’నే ఆధారంగా తెలుగు వారి ముందు పెట్టాలనుకుంటున్నాను.

గాడిద గుడ్డు పెడుతుందా? లేదా? లేక నేరుగా పిల్లనే పెడుతుందా? ఈ గొడవ నాకనవసరం.
గాడిద గుడ్డు పెడుతుండగా కన్న వారు ఎవరూ లేరు కానీ, విన్న వారు మాత్రం వున్నారు.
తెల్లవారు మన దేశంలోని అన్ని నేలలకు వచ్చినట్లే తెలుగు గడ్డకు కూడా వచ్చారు. అలాంటి ఒకానొక తెల్లవాడు పొద్దున్నే తన బంగ్లా నుంచి గుర్రం మీద బయిల్దేరుతూ, ఒక్క సారి తన భగవంతుణ్ణి తలచుకునేవాడు. వాడు తలచుకోవటం వాడి మాతృభాషయిన ఇంగ్లీషులోనే తలచుకున్నాడు:
‘గాడ్‌ ఈజ్‌ గుడ్‌..కాంకర్‌ పీస్‌'(God is Good..Conquer Peace)
కానీ తెలుగు వాడు దీనిని తన మాతృభాషలో తాను విన్నాడు:
‘గాడిద గుడ్డు.. కంకర పీసు’
కంకర పీసు తెలుగు భాషలో లేక పోయినా సర్దుకు పోయాడు.
కానీ, ఈ దైవ ప్రార్థన అసలు అర్థం గాలికి వదిలేశాడు.
తాను అర్థం చేసుకున్నదానినే ప్రచారంలో పెట్టాడు. ఆ నోటా, ఆ నోటా వెళ్ళి అది తెలుగు వాడికి సామెతయి కూర్చుంది. ఎవరయినా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతుంటే ‘ఆ చెప్పావ్‌ లే గాడిద గుడ్డూ.. కంకర పీసూ’ అని కొట్టి పారేయటం మొదలు పెట్టారు అంతా.

వ్యవహారంలో తమని తాము శిష్టులుగా కీర్తించుకునే వారు కొందరు- ఈ ‘గాడిద గుడ్డు’ను కాశీకి కూడా పంపించారు. ఫలితం లేకుండా తిరిగి వచ్చిన వాడితో ‘కాశీవెళ్ళి, గాడిద గుడ్డు తెచ్చినట్టుంది’ అనటం కూడా వారు మొదలు పెట్టేశారు.

వ్యవహారమే భాష అయితే, అది ఎక్కువ సార్లు కింది నుంచే పైకి వస్తుంది.
సామాన్యుడు ఏది మాట్లాడితే అది భాషయి కూర్చుంటుంది.
ఇది ఒక్క తెలుగు భాషకే కాదు. బహుశా ఏ భాషకయినా వర్తించవచ్చు.
ఈ ముక్క ఇంగ్లీషువాడికి చెబితే, వాడు తడుము కోకుండా ‘ఓకే’ అంటాడు.
ఎందుకుంటే, ‘ఓకే’ అనే మాట కూడా ఇలా ‘వర్ణ క్రమం’ కూడా రాని అతి సామాన్యుడు సృష్టించిందే.
వెనకటికి సైన్యంలో పనిచేసే ఒక ఉద్యోగి ఇంగ్లీషులోAll Correct అని రాయటానికి బదులు Oll Korrect అని రాశాడని, అందుకే రెండు మాటల్లోని మొదటి అక్షరాలనూ కలిపి O.K అని పలకటం మొదలు పెట్టారని చెబుతుంటారు.
ఈ రెండు పొడి అక్షరాలకూ తర్వాత ఒక కొత్త వర్ణ క్రమమేర్పడింది. అది Okay అయింది. క్రియ అయింది. దానికి Okay -Okayed – Okayed అనే Conjugation కూడా ఏర్పడింది.

ఎలా చూసినా సామాన్యుడినుంచే భాష పైకి చేరుతుంది.
సామాన్యుడంటే ప్రకృతితో నిత్యమూ సంఘర్షించే వాడు.

కడలి కడుపులోకి వెళ్ళి వచ్చే పల్లెకారుడూ సామాన్యుడే. చెట్టెక్కి తేనెటీగలను చెదరగొట్టి పట్టుతేనె తీసే వాడూ సామాన్యుడే.

విత్తు పగిలి మొక్క విచ్చుకువచ్చే ప్రకృతి విశ్వరూపాన్ని దర్శించేదీ సామాన్యుడే. కాలితో తొక్కిన మట్టితో కళ్ళకద్దుకునే అన్నం కుండను చేసే కుమ్మరీ సామాన్యుడే.

ఈ సంఘర్షణలో తాను కనుగొన్న ప్రతి ఫలితానికీ, ప్రతి ప్రక్రియకూ నామకరణం చేసేది అంతిమంగా సామాన్యుడే.

ఇలా శ్రమతోనూ, ఉత్పత్తితోనూ సంబంధం లేని సోమరి వర్గాల, వర్ణాల నుంచి వచ్చిన కవుల వర్ణనల్లో సైతం ఈ సామాన్యుడికున్న పదసంపద కనిపించదు.

అందమైన అమ్మాయి కన్నులను వర్ణించటానికి ‘కమలాక్షి’ అనో ‘మీనాక్షి’ అనో అంటూ వచ్చాడు.
చేప ఆకారం వంటి కన్నుల కలది- అని అన్నందుయినా కొంచెం సంతోషిద్దాం.
కానీ, ఏ చేప ఆకారం అంటే ఏమి చెబుతాడు? కొర్రమీను అంటాడా? బొమ్మిడాయ అంటాడా; గొరక పిల్ల అంటాడా? లేక మట్టగిడస అంటాడా?

ఏవో కొన్ని సినిమా పాటల్లో తప్ప ఈ కవుల చూపు ఇంకా ‘మట్టగిడస’ మీద పడలేదు.
తెల్ల చందువ చేపల్లా మెరిసే అందమైన కన్నుల్ని ఇప్పటికీ శ్రామకి వర్గాలనుంచీ, అట్టడుగు కులాలనుంచీ వచ్చిన కవే చూడగలడు.

ప్రకృతితో సంఘర్షణే విజ్ఞాన శాస్త్రమయి, ఆ శాస్త్రం పలు శాఖోపశాఖలుగా విస్తరిస్తున్నప్పుడు, ఇంకా భాషను ఇవేమీ తెలియకుండా పురాణగాధల్నే పుక్కిట పడుతూ వుండే పండితులే ఉద్ధరించాలనుకోవటం అత్యాశ అవుతుంది.

సామాన్యుడు మాట్లాడే భాషలో ఏయే క్రమాలను పాటిస్తున్నాడో, వాక్యాలను ఎన్ని రకాలుగో నిర్మిస్తున్నాడో గమనించి సూత్రీకరించేదే వ్యాకరణం కావాలి. ఈ సూత్రీకరణ ఇవాళ మనం మాత్రమే చేసుకుంటున్నది కాదు.

నవీన ఆంగ్ల వ్యాకరణంలో దిట్ట అయిన ప్రొఫెసర్‌ హోలడే ఆ మధ్య హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ ఆంగ్ల వ్యాకరణ సదస్సుకు హాజరయ్యారు. ఆ సందర్భంగా ఆయన కొన్ని పరిశీలనలు చేశారు. కుహనా భాషాశాస్త్రల భ్రమల్ని పటాపంచలు చేశారు.
వ్యాకరణాన్ని వృధ్ధి చేసేది భాషాశాస్త్రవేత్తలు కారనీ, భాషా,సాహిత్యాలను బోధించే అధ్యాపకులు కారనీ ఆయన సహేతుకంగా తేల్చిపారేశారు.

భాష,సాహిత్యాల కన్నా, విజ్ఞాన శాస్త్రాన్ని బోధించే వారే వ్యాకరణాన్ని ఎలా వ్యాప్తి చేస్తున్నారో కూడా రుజువు చేశారు. భౌతిక శాస్త్ర అధ్యాపకుడి రాసిన పత్రంలోని ఒక పేరాగ్రాఫ్‌ చదివి వినిపించారు. అది అద్దం లక్షణాలను వివరించే వ్యాసంలోని భాగం. అందులో Break అనే మాటను ఎన్ని భాషాభాగాలుగా ఆయన వాడుకున్నాడో వివరించారు.Break, Breakage, Breaking, Break-up ఇలా అనేక రకాలు ఉపయోగించారు.

నాడు సామాన్యులు చేసేపనే, నేడు విజ్ఞాన శాస్త్రవేత్తలు కూడా చేస్తున్నారు. ప్రకృతితో సంఘర్షిస్తున్నారు. అందుకనే వీరి వల్ల భాష అభివృధ్ధి చెందుతోంది.
తెలుగులో విద్యా బోధన చేసేటప్పుడు, ఇలా శాస్త్రవేత్తలు తమ తమ భాషల్లో చేసిన మాటలకి సరయిన తెలుగు పదాలు వెతికేటప్పుడు, ఇక్కడ మన అనువాదకులు తెలుగు పదాలను వాడలేక పోతుంటారు. మళ్ళీ సంస్కృత పదాలనే(తత్సమాలు)గా ఎరువు తెచ్చుకుంటారు.

Photosynthesis అనే మాటకు ‘కిరణజన్యసంయోగక్రియ’ గా అనువాదం
చేశారు.భాష్పోత్సేకం, వక్రీభవనం- ఇలాంటి మాటలే. ఇందులో ఎక్కడా తేటతెలుగుపలుకులు లేవు. కారణమేమిటంటే, ఇంతవరకూ గ్రాంధికమైన తెలుగు చేత శాస్త్రాలను మోయించలేదు. సంస్తృతంతో పాటు ఇంగ్లీషు చదువును కూదా తెలుగులో తామే ముందు చదువుకున్న బ్రాహ్మణ వర్గాలు, ఈ విజ్ఞాన శాస్త్ర పదాలకు సరిసమానమైన వాటిని సంస్కృతంలోనే వెతికి పెట్టారు. అదే అలవాటుగా మారింది. ఆ తర్వాత పత్రికల్లోనూ, రేడియోల్లోనూ ఈ వర్గాలే పీఠం వేసుకుని కూర్చుని, అలాంటి అనువాదాలకే శ్రీకారం చుట్టాయి. ఆ వరవడే ఇప్పటికీ నడుస్తోంది.

విద్యాబోధన మొత్తం తెలుగులోనే జరగాలని గింజుకునే వీళ్ళంతా వేదాలు విన్న తమ చెవులకు ఇంపుగా(పోనీ, శ్రవణ పేయంగా) వుండే అనువాదాలనే వాడుతూ తమకి తాము గ్రాంథికం నుంచి బయిటకు వచ్చినట్లూ, వ్యవహార భాషలో మునిగి తేలుతున్నట్లూ చెబుతన్నారు.
కానీ అసలు వ్యవహారభాషకు కేవలం ‘వ్యుత్పత్తి’ సంబంధాలు కాకుండా, ‘ఉత్పత్తి’ సంబంధాలు కూడా పునాదిగా వుంటాయి అన్న విషయాన్ని వీరు ఇప్పటికీ మరుగు పరుస్తున్నారు.

తెలుగు భాషను ఇప్పుడు శుధ్ధి చెయ్యాలి. పవిత్రపరచాలి.
అందుకు అట్టడుగు వర్ణాల, వర్గాల నుంచి వచ్చిన వివిధ విజ్ఞానశాస్త్ర విభాగాలలోని అధ్యాపకులు, పరిశోధకులూ ఇందుకు నడుము కట్టాలి.
అగ్రవర్ణ సంస్కృతానువాదాలకు, దీటయిన అట్టడుగువర్ణాల, వర్గాల తేటతెలుగు అనువాదాలను, పర్యాయ పదాలను ప్రవేశపెట్టాలి.
శ్రమకు ఎవరు ఆద్యులే, వారే భాషకు సైతం ఆద్యులని నిరూపించాలి.
ఏ పనిని పనిగట్టుకు చేయక పోయినా జరిగిపోతుంది కానీ, కాస్య ఆలస్యమవుతుంది. వేగవంతం చేయటమే భాషా విప్లవం.

ఈ సందర్భంగా టాల్‌స్టాయ్‌ రాసిన ‘గాడ్‌ ఈజ్‌ వేర్‌ లవ్‌ ఈజ్‌’ అనే కథ గుర్తుకొస్తున్నది.
ఆ కథ ముగింపులో చెప్పులుకుట్టే కార్మికుడు, సోమరి వర్గాని చెందిన బోధకుడితో సంబాషణ కీలకమైనది.

‘నువ్వు Man of LETTERS కావచ్చు. కానీ, నేను Man of LEATHERS ను. నేనే నీకు బోధించాలి. నువ్వు నాకు బోధించ కూడదు’ అంటాడు.

అవును. మృత కళేబరాలనుంచి చర్మాన్ని తీయటం, శుధ్ధి చెయటం, దానిని చెప్పుగా మలచటం గొప్ప శాస్త్రం. అంటే అతడు శాస్త్రవేత్త. భాషను పరిపుష్టం చేసి భాషకు భవిష్యత్తు ఇవ్వగలిగింది- అతడు కాక మరింకెవ్వడు..?
– సతీష్‌ చందర్‌
(విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు-2011లో చేసిన సతీష్‌ చందర్‌ చేసని ప్రసంగ పాఠం)

1 comment for “తెలివి ఎక్కువే! తెలుగే తక్కువ!!

Leave a Reply