నవ్వు వెనక ఏడుపు!

వివాదం రేపిన శంకర్ పిళ్ళై కార్టూన్

నవ్వూ మందే.

ఇది తెలిసి పోయాక, పార్కుల్లో పువ్వులు బదులు, నవ్వులు పూసేస్తున్నాయి. చెట్లు కాదు, చెట్లంతంటి మనుషులు నవ్వేస్తున్నారు. ఎవరో చచ్చిపోతే, గుమిగూడి ఏడ్చినంత బిగ్గరగా గుండెలు పగిలేలా నవ్వేస్తున్నారు. ఇంకా చీకట్లు విడిపోకుండా, తెల్లవారకుండానే, క్రోటన్‌ పొదల మాటను తెల్లని దుస్తులతో, నిలబడి నవ్వుతుంటే, విఠలాచార్య తీసిన పాత సినిమాల్లో ‘కామెడీ దయ్యాలు’ నవ్వినంత విలాసంగా నవ్వేస్తున్నారు. చెమటోడ్చి, దిక్కులు పిక్కటిల్లేలా నవ్వేస్తున్నారు.

వన్‌, టూ, త్రీ- ఆహ్హహ్హహ్మ… ఆహ్హహ్హహ్హ… అని కాలబద్ధంగా, క్రమశిక్షణతో నవ్వేస్తున్నారు.

కానీ, ఇవి- రంగూ, రుచీ, వాసనా లేని ప్లాస్టిక్‌ నవ్వులు.

నవ్వు కూడా లవ్వు లాంటిదే. ఇలా అంటే అలా పుట్టెయ్యదు. ‘పాడ మంటే పాడేది పాట కాన’ట్లే, నవ్వమంటే, నవ్వేదీ నవ్వు కాదు.

నూరుగురు కొడుకుల్ని కన్న దృతరాష్ట్రుడు ‘కుటుంబ నియంత్రణ గొప్పది’ అన్నాడనుకోండి- కిసుక్కుమని నవ్వుతాం. పది హత్యలు చేసిన గూండా ఇంజెక్షన్‌ సూది దించుతున్నప్పుడు చూడలేక కళ్ళు మూసుకున్నాడనుకోండి.. నవ్వితీరతాం. అప్పుడే లారీలు దిగిన జనానికి ఎంపీ ఆభ్యర్థి బ్రాందీ సీసాలు పంచి వచ్చి, టీవీ చానెళ్ళ గొట్టాల ముందు ‘రాజకీయం పవిత్రమైన వృత్తి’ అన్నాడనుకోండి- తెగించి నవ్వేస్తాం.

ఈ నవ్వులే ‘సైడ్‌ ఎఫెక్ట్‌’లు లేని ఉత్తమ మైన ఔషధాలు. మందుకు ‘ఎక్సయిరీ డేట్లు’ వున్నట్లే, నవ్వుకు కాల పరిమితి వుంటుంది. ‘డేటు’దాటిన మందు వాడితే ‘రియాక్షన్‌’ వస్తుంది.

‘నవ్వే ఆడదాన్నీ, ఏడ్చే మగవాణ్ణీ నమ్మకూడదు’ అన్నది శతాబ్దాల క్రితం సామెత. అప్పుడు నవ్వు తెప్పించే వుండొచ్చు. కానీ ఇప్పుడు ఆగ్రహం తెప్పిస్తుంది. ఇలా అని ఏ అసెంబ్లీలోనో ఓ మగ సభ్యుడున్నాడనుకోండి… మహిళా సభ్యులు చీల్చి, చెండాడేస్తాడు. ఇలా చేస్తే ఆస్తులన్నీ మగవాళ్ళ ఖాతాలోనూ, అప్పులన్నీ ఆడవాళ్ళ ఖాతాలోనూ వేసినంత అన్యాయమని తెలిసి పోయింది.ఈ రోజుల్లో నమ్మకంగా పడివుంటుందని, ఏ మగాడయినే ఏరి,కోరి ‘ఏడుపు ముఖం అమ్మాయి’ని చేసుకుంటాడా? నవ్వుకే, నవ్వు నిర్వచనాలకూ కాలదోషం పడుతుంది.

అందుకే కాబోలు, ఎప్పుడో 1949లో వేసిన ఒక కార్టూన్‌ని 2012లో పార్లమెంటులో చూపిస్తే, నవ్వుకు బదులు కోపం వచ్చింది. అప్పుడు బాగా నవ్వించి వుండొచ్చు. నత్త మీద అంబేద్కర్‌ ప్రయాణిస్తారు. ఆ నత్తే రాజ్యాంగం. వెనుక కొరడా పట్టుకుని నెహ్రూ వుంటాడు. అంబేద్కర్‌ రాజ్యాంగ రచయిత. నెహ్రూ ప్రధాని. విషయం అర్థమయింది కదా! రాజ్యాంగ రచనలో జాప్యం వుందని వేసిన కార్టూన్‌.(రాజ్యాంగ లేఖక సంఘంలో మిగిలిన సభ్యులు పెద్దగా పాలు పంచుకున్నది లేదు.అత్యధిక బాగం అంబేద్కరే రాశారు. ఆ పనిని మరొకరు చేయగలరని అప్పుడే కాదు, ఇప్పుడూ అనుకోలేం.)

ఈ కార్టూన్‌ను నెహ్రూ, అంబేద్కర్‌లు- ఇద్దరూ చదివే వుంటారు. ఆనందించే వుంటారు( వ్యతిరేకించినట్టూ, ఇబ్బందిపడ్డట్టూ ఆధారాలు ఇంత వరకూ బయిట పడలేదు.) ఆ మాటకొస్తే, శంకర్‌ ఆరోజుల్లో నెహ్రూ మీదనే ఎక్కువ కార్టూన్లు వేసేవారు. ‘నన్ను వదలొద్దు(డోన్ట్‌ స్పేర్‌ మీ), శంకర్‌’ అన్న నెహ్రూ స్పందనను నేటికీ పాత్రికేయులూ, వ్యంగ్యరచయితలూ, కార్టూనిస్టులూ స్ఫురణకు తెచ్చుకుంటూ వుంటారు. అంబేద్కర్‌ కూడా హాస్యప్రియులే.

ఇప్పుడూ కార్టూనిస్టు శంరూ లేరు. ఆ ఇద్దరూ నేతలూ లేరు. కానీ, కాలంతో పాటు కొందరి నేతల మీద భక్తి శ్రధ్ధలు పెరుగుతుంటాయి. ‘బహుజనుల’ ఆరాధ్య నేతగా అంబేద్కర్‌ నేడున్నారు.

అప్పటి చరిత్రను చెప్పటానికి ఎన్‌సిఇఆర్‌టీ పాఠ్యపుస్తకంలో అప్పటి కార్టూన్‌ని వేశారు. అది క్లాసురూమ్‌లో ఏమేరకు నవ్వు తెప్పించిందో తెలీదు కానీ, దేశంలోని అత్యున్నత ప్రజాప్రనిథుల సభలో మాత్రం ఆగ్రహం తెప్పించింది. అప్పటి ‘హాస్యం’ , ఇప్పటికి ‘అపహాస్యం’ గా మారింది- తేదీ దాటిన మందులాగే.

స్వరాజ్యం రాక ముందు గాంధీని అప్పటి బ్రిటిష్‌ నేతలు ‘అర్థ నగ్న( హాఫ్‌ నేకెడ్‌) ఫకీర్‌’ అంటే, యూరప్‌ దేశాల్లోని వారే కాకుండా, మన దేశంలో ‘తెల్ల’ విద్య తలకెక్కిన వారు కూడా నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు అదే మాట అంటే ‘నవ్వొ’స్తుందా? కోపం వస్తుందా?

ఆ రోజుల్లో గాంధీ, అంబేద్కర్‌ల మధ్య వాడి, వేడి చర్చలు జరిగేవి. ఊరి వెలుపల నివసించే వారిని ‘అస్పృశ్యులు’గా పిలవటం నచ్చక గాంధీ ‘హరిజనులు'(భగవంతుడి బిడ్డలు) అని పిలిచారు. కానీ మాట చాలా మందికి నచ్చింది. కానీ అంబేద్కర్‌కి నచ్చలేదు. అప్పుడు అంబేద్కర్‌ ఆ సామాజిక వర్గం తరపున మాట్లాడుతూ ‘మేం దేవుడి బిడ్డలమయితే, మీరు దయ్యం బిడ్డలా?’ అని హాస్యాలాడారు. అప్పట్లో ఈ మాటకు నవ్వు వచ్చి వుండవచ్చు. కొన్ని దశాబ్దాల తర్వాత బిఎస్పీ నాయకురాలు మాయావతి ఇదే మాట అంటే పలువురు పార్టీల నేతలు ఆమె మీద విరుచుకు పడ్డారు.

కాలం కొత్త స్పృహలనిస్తుంది.

పాత కాలంలో జోకుల్లాంటి సామెతలు, సామాజిక అట్టడుగు వర్గాల వారిమీదా, స్త్రీలమీదా వుండేవి. అప్పుడు అవి నవ్వులు తెప్పించి వుండవచ్చు. ఇప్పుడూ అవే సామెతల్నీ, ఊత పదాల్నీ యధా తథంగా వాడేస్తామంటే నడవదు. అయినా బాధితుల మీదా, పీడితుల మీదా వారి ప్రతినిథుల మీదా హాస్యలాడటం సాహసం కాదు.

సైనున్నవారిమీదా, వారి పెత్తందారీ వైఖరి మీద వెటకారమాడగలగాలి- హాస్య చతురుడు చార్లీ చాప్లిప్‌, తన సమకాలికుడైన నియంత హిట్లర్‌ పరువుని నిలువునా తీసినట్లు.

ఏ కాలం లో అధిపత్యాన్ని ఆ కాలంలో అలా పరిహసించగలగాలి.

ఏ కాలపు సుయోధనులను చూచి ఆ కాలపు ద్రౌపదులు నవ్వగలగాలి. అంతే కానీ, నేటి రోగానికి, నిరుడి ఔషధం ఎంత మాత్రమూ తగదు.

-సతీష్‌ చందర్‌

——-

Leave a Reply