పొరపాట్లలో అలవాటు!

చితగ్గొట్టవచ్చు.. ఎముకలు ఏరివేయవచ్చు, కాళ్ళూ చేతులూ విరిచెయ్యవచ్చు, కడుపు చించెయ్యొచ్చు. పార్టులు తీసేయవచ్చు. అడిగేవాడుండడు.
కానీ, చిన్న షరతు- ముందు మాత్రం మత్తు ఇవ్వాలి. (క్లోరోఫారం, ఎనెస్తీషియా అంటారే అవి అన్న మాట)
దేహం మొత్తానికివ్వాలని రూలు లేదు. సగానిక్కూడా ఇవ్వొచ్చు. వెన్నులో ఇస్తే నడుము కింద భాగం శరీరం వున్నట్టే అనిపించదు. తీసే పార్టును బట్టి మత్తు వుంటుంది.
అలాగే ఒకే సారి రాష్ట్రం మొత్తానికి మత్తు ఇవ్వొచ్చు, లేదా ఒక ప్రాంతానికి ఒక సారీ, మరో ప్రాంతానికి ఇంకొక సారీ ఇవ్వొచ్చు.
వ్యక్తికిచ్చినంత సులువుగానే మందికీ మత్తు ఇవ్వొచ్చు.
మందికిచ్చే మత్తు పేరును జనాగ్రహం(మాబ్‌ ఫ్యూరీ).
క్లోరోఫారం, ఎనెస్తీయా ఏ మోతాదులో వుండాలన్నది ఎనెస్తీషయన్‌ నిర్ణయిస్తారు. అసలు ఆపరేషన్‌కు ఇతడే కీలకం.కత్తులు పట్టే సర్జన్‌దేముంది? కోసి అవతల పారేస్తాడు.
ఈ జనాగ్రహం ఎప్పుడు ఎంత మోతాదులో వుండాలన్నది నిర్ణయించే వాడే అసలు రాజకీయ వైద్యుడు.
కంప్లయింటు లేకుండా, పేషెంటు ఆపరేషన్‌ బల్ల ఎక్కడు.
జనమూ అంతే, కారణం లేకుండా రోడెక్కరు.
ఒక్కసారి బల్ల ఎక్కాక, ఏం చెయ్యాలన్నది పేషెంట్‌ నిర్ణయించడు. డాక్టర్లు నిర్ణయిస్తారు.
రోడ్డెక్కడం వరకే జనం వంతు. ఒక్కసారి ఎక్కాక, ఏం చెయ్యలన్నది రాజకీయ ‘మత్తు’ వైద్యులు తేలుస్తారు.
జనానికి అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ప్రతినిథులు కొందరు చేతికి తొడుగులూ, మూతికి మాస్క్‌లూ ధరించి వస్తారు. వీరే పార్టులు తీసే ‘కోత’ వైద్యులు.
కంప్లయింటు వున్న జనానికి వీళ్ళు ఏ భాగం తీస్తున్నారో తెలీదు.
జనం రోడ్డెక్కడానికి వచ్చే కంప్లయింట్లు రకరకాలుగా వుండొచ్చు. తమకిష్టమైన నేతకు అవమానం జరగటం, లేక ఆ నేతే మరణించటం- ఇలాంటివి కూడా వుండొచ్చు. ఇలాంటప్పుడు బాధతో కుమిలిపోతూ రోడ్డెక్కుతారు.
ఇందిరాగాంధీని హత్య చేసినప్పుడు ఢిల్లీ లోనూ, వంగవీటి మోహన రంగా చనిపోయినప్పుడు బెజవాడ లోనూ ఇలాగే జనం రోడ్లెక్కారు. కానీ అసలు జనాన్ని వెనక్కి తోసి, ‘కోత’ వైద్యులొచ్చారు. ఢిల్లీలో ఒక మతం వారినే వెతికి ‘కోసేస్తే’, బెజవాడ ఒక వర్గం వారి షాపుల్నే వెతికి లూటీలు చేశారు.
జనానికి ముందు చీమ కుట్టినట్టు కూడా లేదు. మత్తు( జనాగ్రహం) విడి పోయాక చూసుకుంటే, అన్నీ కుట్లూ, గాయాలే. అప్పుడు మాత్రం ఒక్క వైద్యుడూ కనపడడు.
గత ఏడాది కాలంగా రాష్ట్రంలో ఇలాంటి శస్త్ర చికిత్సలు మొదలయ్యాయి.
రాష్ట్రం మొత్తానికి ఒకేసారి ఎనెస్తీషియా ఇవ్వకుండా- ఒక సారి సీమాంధ్రకి, ఇంకొకసారి తెలంగాణాకి మార్చి మార్చి ఇస్తున్నారు.
అయితే జనానికి రెండో చోట్లా కంప్లయింట్లుండే రోడ్లెక్కారు. ఆ తర్వాత ఏ వైద్యులు చెయ్యాల్సిన పనిని వారు చేసుకు పోయారు. ఆగ్రహాన్ని పెంచాల్సి వచ్చినప్పుడు పెంచి, తగ్గించాల్సి వచ్చినప్పుడు తగ్గించుకుంటూ వచ్చారు ‘మత్తు’ వైద్యులు. ఏ పార్టు కొయ్యాలంటే ఆ పార్టుని కోసుకుంటూ వచ్చారు ‘కోత’ వైద్యులు.
జనం ఎన్నుకున్న తమ ప్రాంతపు ప్రతినిథుల్ని సైతం ఎగిరెగిరి తన్నించారు; చెప్పుల్ని వేయించారు: బతికుండగానే శవ యాత్రలు చేయించారు. అందర్నీ అనుకునేరు. వెతికి వెతికి కొందరినే ఇలా చేశారు. ‘కోత’ వైద్యులు తమకు కావలసినవే కోసుకుంటారు. ఇక విధ్వంసాలూ, దాడులూ మాములే.
ఒక్క మనుషులకే కాదు విగ్రహాలకు కూడా ఈ విచక్షణ( పక్క ప్రాంతం వాళ్ళు వివక్ష అంటారనుకోండి. అది వేరే విషయం) పాటించారు. నచ్చిన రాయిని ‘దేవుడ’నుకున్నారు. నచ్చని ‘దేవుణ్ణి’ రాయి గా భావించారు. ఆవిధంగా కడుపులోంచి ‘రాళ్ళు’ తొలగించిన వైద్యుల్లా సంబరపడ్డారు.
ఎంత అనుభవజ్ఞుడయిన ‘మత్తు’ డాక్టరయినా, ఒక్కొక్కసారి ఎనెస్తీయాను మేనేజ్‌ చెయ్యలేడు. మధ్యమధ్యలో కొంచెం తగ్గుతుంటుంది. అప్పుడు జనానికి వచ్చీ రాని స్పృహ వస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే, రాజీనామాలు చెయ్యటానికి తటపటాయించిన బడుగు వర్గాల ఎమ్మెల్యేలూ, ఎంపీలే ఎక్కువ ‘కోతల’కు గురయి వున్నారు.
తెలంగాణాలోనూ. సీమాంధ్రలోనూ ఇదే తంతు.
తెలంగాణ రాదేమోనని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ప్రాంతం నిజంగానే జనం ఆవేదనతో రోడ్డెక్కుతారు. అది సహజం.
కానీ ఈ ‘జనాగ్రహం’ ఎలాగూ వుంది కదా, అని వెతికి వెతికి ఒక ఉద్యోగి పై చెయ్యిచేసుకున్నారు ఒక అగ్రశ్రేణి ప్రాంతీయ నేత. కొట్టాక కానీ, ఆయనకు తెలీలేదట- పాపం! తాను కొట్టింది దళితుణ్ణని.
‘కడుపు కోసాక కానీ తెలియలేదు – అతడు రోగి కాదని’ డాక్టరు గారన్నట్లు లేదూ. ఫర్వాలేదు లెండి ‘పొరపాట్లలో అలవాటు’ . సామెత తప్పుగా వాడినట్లున్నాను.
‘సారీ!’
ఆ ఆగ్రశ్రేణి ప్రాంతీయ నేత కూడా చెయ్యిచేసుకున్నా ఈ రెండక్షరాల మాటతోనే తప్పును సరిదిద్దుకున్నారు.

-సతీష్‌ చందర్‌
(ఆంధ్రభూమి దినపత్రికలో 24 జులై2011నాడు ప్రచురితమయినది)

Leave a Reply