మహరాజునే వెలి వేస్తే….!?

వేదం వినాలనీ, వేదం అనాలనీ..నేడు పెద్దగా ఎవరికీ అనిపించక పోవచ్చు. అర్థం తెలుసుకోవాలనే యావ కూడా ఎవరికీ వుండక పోవచ్చు. పెద్ద పెద్ద ఉత్సవాల్లో, కడకు సర్కారీ ఉత్సవాల్లో వేద మంత్రోచ్చరణలు లేక పోతే వెలితిగా భావిస్తారేమో కానీ, తీరా పఠిస్తే పట్టించుకోరు. మీడియా ప్రతినిథులు కూడా ఉత్సవాల్లో నాయకులేం మాట్లాడతారో వింటారు కానీ, వేద పండితుల మంత్రాలూ, వాటి అర్థాలూ రాయరు. మంత్రాలు నేర్చుకుంటే చింతకాయలు రాలతాయేమో తెలీదుకానీ, ఉద్యోగాలు మాత్రం రాలవు. కష్టపడి నేర్చుకుని అర్చకత్వం స్వీకరిస్తే, పిల్ల నిచ్చేవాళ్ళుండరు.

కానీ ఇదే వేదం ఒకప్పుడు అపురూపం. అందరూ అనకూడదు. బ్రాహ్మణులే అనాలి. అలాగని అందరూ బ్రాహ్మణులూ అన్నీ అనేస్తే ఎలా? గోత్రాన్ని బట్టే నేర్చుకోవాలి. యజుర్వేదమే తీసుకోండి. దీన్నీ పార్ట్‌-1, పార్ట్‌-2 అంటూ రెండు భాగాలుంటాయి. బాహుబలి-1, బాహుబలి-2- ఒకే దర్శకుడు తీసినటు,్ల రెండూ ఒకే గోత్రీకులు చదవ కూడదు. శుక్ల యజుర్వేదం ఒక గోత్రీకులు చదివితే, కృష్ణ యజుర్వేదం మరో గోత్రికులు చదవాలి. ఉత్తరాది బ్రాహ్మణులే శుక్ల పక్షం చదివేశారో ఏమో, అక్కడే ‘శుక్లా’ పేరు గలవాళ్ళు ఎక్కువ వున్నారు. బ్రాహ్మణులంటే బ్రాహ్మణ పురుషులే. వేద పండితుడి స్త్రీ కి వేదంలో ఒక్క ముక్కరాదు. ఒక చాటుగా కూడా వినకూడని వారు అస్పృశ్యులు. తెలిస్తే సీసం పోసేస్తారు.

ఇదంతా అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తూ మహారాజునే వేదం ‘అనవద్దూ’ అన్నారంటే నమ్ముతామా? నమ్మాలా? వద్దా? అనే ఛాయిస్‌ మనకు లేదు లెండి. ఇది చరిత్ర. అనువుగా మార్చుకునే పురాణం చేసేద్దామనుకున్నా నడవదు. మరీ.. ఇటీవలి చరిత్ర. పందొమ్మిదో శతాబ్దం ద్వితీయార్థానికీ, ఇరవయ్యవ శతాబ్దం ప్రథమార్థానికీ మధ్యన జరిగింది. తన కొలువులో పనిచేసే వేదపండితులే, ఆ రాజును వేదం ‘అనడాన్ని’ (వేదోక్తాన్ని) నిషేధించారు. రాజమందిరంలో వేద పరమైన ఏ క్రతువూ చెయ్యకూడదన్నారు. కారణం ఆ రాజు ‘శూద్ర’ రాజని పండితులకు గట్టి అనుమానం. రాజుకు కోపం రాదూ…! వచ్చింది. పండితులకు కొలువులు ఊడిపోయాయి. అప్పుడు మహరాజుకు తిక్క రేగింది. తన కొలువుల్లోకి పనిగట్టుకుని అప్పటి వెనుకబడిన కులాల ( ఇప్పటి ఎస్సీ, బీసీల) వారిని, వెదికి, వెదికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ మేరకు ఫర్మానా జారి చేశాడు. పదో, పదిహేను శాతమో కాదు. ఏకంగా శాతం ఇచ్చాడు. ఇది 1902 లో జరిగింది. దేశంలో రిజర్వేషన్లకు తొట్ట తొలిగా శ్రీకారం చుట్టింది.. ఆ మహారాజే.. ఆయన పూర్తి ఛత్రపతి సాహు మహరాజ్‌. ఇప్పటి మహరాష్ట్రలో వున్న కొల్హాపూర్‌ రాజ్యాన్ని పరిపాలించారు.

రిజర్వేషన్లు కేవలం ఉద్యోగాల్లో ఇచ్చేసి, విద్యలో ఎగవేసే నేటి తరం నేత కాదు. అలా చేస్తే, ఖాళీలు ఖాళీలుగానే వుండిపోతాయి. అందుకని ఈ కులాల్లో కాస్తా, కూస్తో ధనికులయిన వారిని పిలిపించి, ఆయాకులాలకి ప్రత్యేకించి హాస్టళ్ళు తెరిపించాడు. అందుకు సంబంధించి భూమీ, భవనాలు ఇచ్చాడు. (1908 నాటికి కూడా) అస్పృశ్యుల్లో సంపన్నుడనే వాడు మచ్చుకు కూడా లేక పోవటంతో, ఒక బ్రాహ్మణేతరుణ్ణి ఆయనే ఎంచుకుని అతని చేత వారికి హాస్టల్‌ బాధ్యతలు అప్పగించారు.)

కేవలం ఉద్యోగాలు చేస్తేనే సమాజంలో ఈ వర్గాల వారికి ఉనికి వస్తుందని నమ్మలేదు. వ్యవసాయ, వాణిజ్యాల్లోకి కూడా రావాలని కోరుకునే వాడు. దాంతో వారి చేత చిన్న, చిన్న వాణిజ్య దుకాణాలను తెరిపించాడు. మరీ ముఖ్యంగా అంటరానివారు వ్యాపార, వాణిజ్యాల్లోకి రావాలని ఆ రోజుల్లోనే ఆయన కోరుకున్నాడు. ( ఇప్పటికీ ఈ రంగాలు వీరికి దుర్భేద్యంగానే వున్నాయి. అది వేరే విషయం.) కోరుకుని, కలలు కని ఊరుకునే మహానుభావులు చరిత్రలోనూ, వర్తమానంలోనూ వుంటారు కానీ, ఆయన ఆ రకం కాదు కదా! అందుకు సహాయం చేసి, వారి వాణిజ్యాలు రాణించటానికి కూడా ఆయనే ‘బ్రాండ్‌ అంబాసిడర్‌’ గావుండేవాడు.

ఒక సారి ఇలాగే సాహు మహరాజ్‌ ఒక దళితుడికి ( అప్పటి ‘అంటరాని’ కులస్తుడయిన ‘మహర్‌’కి) టీ షాప్‌ పెట్టుకోవటానికి సాయపడ్డాడు. ఆ దళితుడి వ్యాపారం సజావుగా జరుగుతుందని నమ్మాడు. కానీ వాస్తవం ఇంకోలా వుంది. దళితుడి చేత్తో చేసి ఇచ్చిన టీని తాగటానికి ఇతర వర్ణాలు వారు ఎవరూ ముందుకు వచ్చేవారు కారు. మహరాజ్‌ ఇది గమనించి తాను ఆ దారిన మందీ మార్బలంతో వెళ్ళేటప్పుడు పనిగట్టుకుని, ఆ షాపు దగ్గర ఆగే వాడు. టీ ఇమ్మని అడిగి తాగే వాడు. ఆయన కూడా వచ్చిన ‘సర్దార్‌’ లు ఇష్టం లేక పోయినా, చచ్చినట్టు తాగే వారు.

ఈ ఘటన ను శంకర రావు కారత్‌ అనే బౌధ్ధ నాయకుడు రికార్డు చేశాడు. కులాల మధ్య విందుల్నీ, కులాంతర వివాహాల్నీ ఆయన ఒక ఉద్యమంగా చేయించేవారు. ఇలాంటి పనులు చెయ్యటానికి అప్పట్లో ప్రగతిశీలమైన సత్యశోధక తత్వమే ఆయనకు దోహద పడింది. అలా ఆయన హయాంలో ఛాందసుల తిక్క కుదిర్చేశారు.

వేదం వెళ్ళినంతలెక్కా, వెలి వెళ్ళిందని చెప్పటానికి ఒక్క సాహు మహరాజ్‌ ఉదాహరణ చాలు.

(నేడు సాహు మహరాజ్‌ వర్ధంతి. ఆయన 6 మే 1922 న కన్ను మూశారు)

– సతీష్‌ చందర్‌

6 మే 2017

5 comments for “మహరాజునే వెలి వేస్తే….!?

Leave a Reply