రాజకీయమే ‘కుటుంబ’ కథా చిత్రం!

టాపు(లేని) స్టోరీ:

    నాభి మీద కొడితే రావణాసురుడు కూలి పోతాడు.

    నాభి దాటి వచ్చి తొడల మీద కొడితే దుర్యోధనుడు కూలిపోతాడు.

    రెండూ ‘బిలో ది బెల్ట్‌’ పధ్ధతులే.

    యుధ్ధనీతి తప్పటమే రాజనీతి!

    పోతూ, పోతూ.. రావణాసురుడు పదితలల్లోని పదినోళ్ళతో రాజనీతి చెప్పాడంటారు. ఏమి చెప్పాడో? అప్పుడు ఏమో కానీ, ఇప్పుడయితే, రాజకీయాల్లో దెబ్బతిన్న ఏ

    రాజనీతిజ్ఞుడయినా చెప్పే నీతి ఒక్కటే వుంటుంది:

    కనకం, కులం, కుటుంబం- ఏ మూడూ కలిస్తేనే రాజకీయం. కట్నం లేకుండా పొరపాటు న పెళ్ళిళ్ళయితే కావచ్చు. కానీ పైసలు లేకుండా పాలిటిక్సు వుండదు. కానీ పైసలే పాలిటిక్సు

    కాదు. కులం వుండాలి. అవును పాలిటిక్సు కుల వృత్తే. మన రాష్ట్రమే తీసుకోండి. రెండు మూడు కులాలే ఈ వృత్తిని చేపట్టాయి. ఆ కులానికి చెందకుండా పైసలు ఖర్చు చేస్తే, గుడ్డు

    లేకుండా ఆమ్లెట్‌ వెయ్యటమే. ఈ రెండూ వుంటే, రాజకీయమనే పద్మవ్యూహంలోకి దర్జాగా వెళ్ళవచ్చు. కానీ, అంతే దర్జాగా ఛేదించుకుని రాలేం. ధనమూ, కులమూ మాత్రమే వున్న

    వారు అభిమన్యులు. మూడోది, అంటే, కుటుంబం కూడా వున్నవారు అర్జునులు. వాజ్‌పేయీ లాగా, నెహ్రూ కూడా బ్రహ్మచారి అయివుంటే, దేశ రాజకీయమే మారిపోయేది. వారసులు.

    వారసులకు వారసులు.. ఇలా వచ్చి ఇప్పటి రాజకీయాలను మనకు మిగిల్చే వారు కారు.( కుటుంబరావులన్నాక- వారసుల్ని ఏదో రకంగా దించుతారు. ఇదే ప్రధాని పదవిని వెలగ

    బెట్టిన మురార్జీ దేశాయ్‌ కాంతీ దేశాయ్‌నీ, దేవెగౌడ కుమార స్వామినీ తేలేదూ..? పీవీ నరసింహారావు కూడా తన సంతానానికి రాజకీయ మార్గం చూపారు. మన్‌మోహన్‌ సింగ్‌ కూడా

    ఇదే పని చేసేవారేమో కానీ, ఆయన వచ్చేసరికి ప్రధాని పదవి యుపీయే చైర్‌పర్సన్‌ పదవి ముందు చిన్నబోయింది.)

    అందుకనే రాజకీయాల్లో చేరే వారు ఇంటి దగ్గర ఒక ప్రతిజ్ఞ చేసివస్తారు: ‘నేను గొప్పవాణ్ణే. కానీ నా కన్నా నా కుటుంబం గొప్పది, నా కుటుంబం కన్నా నా కులం గొప్పది, నా కులం కన్నా

    వీటినడ్డుపెట్టుకుని నేను సంపాదించబోయే ధనం గొప్పది’.

    ఈ సూత్రం తెలిసిన వారే రాజకీయాల్లో రాణిస్తారు. అందరూ డబ్బు గురించీ, కులం గురించీ ఎక్కువ మాట్లాడతారు కానీ, కుటుంబం గురించి తక్కువ ప్రస్తావిస్తారు. అనుకోకుండా

    ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారంలో కుటుంబాల ప్రస్తావన తెచ్చారు. టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు కుటుంబం తెలంగాణ ఉద్యమం పేరిట

    దోచుకుతింటుందని చెప్పటమే కాకుండా, -‘కూతురో జిల్లా, కొడుకో జిల్లా, అల్లుడో జిల్లా ‘ కైంకర్యం చేస్తున్నారని తెగించి ఆరోపించేశారు.

    సీన్‌ను ఇక్కడ కట్‌ చేసినా చేయక పోయినా-

    కొన్ని రోజుల క్రితం ఇదే కిరణ్‌ కుమార్‌ రెడ్డి ‘నేనూ ఫలానా చిట్‌ఫండ్‌ కంపెనీలో చేరాను. నేనూ ఒక స్కూటరు కొనుక్కున్నాను’ అన్నతీరులో ‘నాకూ కుటుంబ వారసత్యం వుంది. నన్ను

    రాజకీయాల్లోకి తెచ్చింది రాజశేఖరరెడ్డి కాదు. మా నాన్నే.’ అని చెప్పుకున్నారు. కులం ఒక్కటే సరిపోదు- కుటుంబం తోడుండాలని ఆయనా నిరూపించేశారు. ఇప్పుడీ ఉప ఎన్నికలు

    వచ్చింది కూడా (రాజశేఖ రెడ్డి)కుటుంబం వల్లనే కదా! ప్రధాన ప్రతిపక్షానికీ (ఎన్టీఆర్‌) కుటుంబం వుంది. రాజకీయాల్లో ‘కుటుంబ నియంత్రణ’ వస్తే అన్ని పార్టీలకూ కష్టమే!!

    న్యూస్‌ బ్రేకులు:

‘దరిద్రా’భివృధ్ధి
తెలంగాణలో అభివృధ్ధి జరిగిందని నిరూపిస్తే పరకాల చౌరస్తాలో చెప్పుదెబ్బ తినేందుకు నేను సిద్ధం. నిరూపణ చేయకపోతే అందుకు నీవు(కిరణ్‌కుమర్‌ రెడ్డి) సిధ్ధమేనా?

-కె.చంద్రశేఖర రావు, టీఆర్‌ఎస్‌ అధినేత

అంతమాట అనేస్తారా? ఈయన(కిరణ్‌కుమార్‌ రెడ్డి) వచ్చాక, సమన్యాయం పాటించారు. మీరు ఒప్పుకోక పోతే ఎలా? దరిద్రాన్ని మూడు ప్రాంతాలకీ సమానంగా పంచారు. అధిక

ధరలూ, కరెంటు కోతలతో ఒకే రకంగా బాదారు. బాదుతున్నారు.

జగన్‌ ఆలోచనల్లో ‘బీసీ’ అంటే బ్రీఫ్‌ కేసులు, ‘ఎస్‌.సి’ అంటే సూట్‌ కేసులు

-లగడపాటి రాజగోపాల్‌, విజయవాడ

ఎం.పి

మరి ‘ఎయిర్‌’ బ్యాగ్‌లు ఎవరివి? అవేనండి ‘గాలి’ మూటలూ!?

ట్విట్టోరియల్‌

    ‘ఊకొట్టారా? ఉలిక్కిపడతారా?’

    నాడు ‘ఊకొట్టారా?’ నేడు ‘ఉలిక్కిపడతారా?’ సినిమా పేరు కాదు. ఇది పాలిటిక్స్‌ తీరు. దర్యాప్తు సంస్థలే కాదు, పలు రాజకీయ పక్షాలు కూడా ఈ ప్రశ్నలు (ఐఎఎస్‌) అధికారులకు

    వేస్తున్నాయి. వై.యస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా ఆయన కానీ, ఆయన మంత్రులు కానీ ఏపని చెబితే ఆ పనికి ‘అయ్యా! ఎస్‌'( ఐఎ ఎస్‌ కు ఈ అర్థం వుంది లెండి!)

    అని ఊకొట్టారే తప్ప, ‘మేం ఎందుకు ‘అవును- అనాలి'(వై..యస్‌?) ? అని ఈ అధికారులు ప్రశ్నించారా? మరి ఇప్పుడు సిబిఐ ఉచ్చు బిగిస్తుంటే, ‘ఉలిక్కి పడతారెందుకు?’ పాపం ఈ

    ప్రశ్నలకు వారి వద్ద సమాధానాలు లేవు? అలా ‘ఊ’ కొట్టకపోతే, బదిలీలు, సస్పెన్షన్లు వంటి ‘అక్రమశిక్షణా చర్యల’కు నాడే ఉలిక్కి పడేవారు. ఏమైనా ‘తందానా’ అన్నందుకు

    అధికారులను శిక్షించాల్సిందే. కానీ వారి కన్నా ముందు ‘తానా’ అన్న మంత్రివర్యులను ముందు శిక్షించాలి కదా!? ఇందుకు సమాధానం వుండదు లెండి!!

    ‘ట్వీట్‌ ‘ఫర్‌ టాట్‌

‘ముఖ’ మాటం!

రామ్‌గోపాల్‌ వర్మ, చిత్ర దర్శకుడు : టీవీ వచ్చి కుటుంబాలకు చేసిన గొప్ప మేలు ఒకటి వుంది. కుటుం సభ్యులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవటం మానేసారు.

కౌంటర్‌ ట్వీట్‌: ఈ రూలు కేవలం బుల్లి తెరకేనా? వెండి తెరకు వర్తించదా? మీరు తీసిన సినిమా ఇంటర్వెల్‌లో, తల్లివైపు కొడుకూ, కూతురు వైపు తండ్రీ చూడగలరా?

ఈ- తవిక

    ‘తొడలు’ పులకరించెనే!

    తొడ కొట్టిన

    వాడెల్లా హీరో మాత్రమే కాదు-

    ప్రేక్షకుడూ అవుతాడు.

    కోపంతో తన తొడను తాను కొట్టే వాడు హీరో.

    ఆనందంతో పక్కవాడి తొడను చరిచే వాడు ప్రేక్షకుడు.

    బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

ప్రజాస్వామ్య మంటే పెట్టుబడుల చేత, పెట్టుబడుల కోసం, పెట్టుబడుల యొక్క ప్రతీకార చర్య.

కొట్టేశాన్‌( కొటేషన్‌):

    ‘బుర్ర’కథ: కొన్ని బుర్రల్ని తినవచ్చు, కొన్నింటిని తాగవచ్చు. అతి కొద్ది బుర్రల్ని మాత్రమే వాయించుకోవచ్చు. అవే నేతల బుర్రలు!!

    -సతీష్ చందర్
    ( ఈ కాలమ్ సూర్య దినపత్రిక 22 మే 2012 తేదీ సంచికలో వెలువడింది)

Leave a Reply