రాష్ట్ర విభజన కాదు, పార్టీల విభజనే!

Sushil-Kumar-Shindeరాష్ట్ర విభజన కాదు, పార్టీల విభజనే!

అదే సీన్‌: అఖిల పక్షం: షూటింగ్‌ స్పాట్‌: ఢిల్లీ. తేదీ: 28 డిశంబరు 2012

సినిమాటోగ్రాఫర్‌: సుశీల్‌ కుమార్‌ షిండే.

కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సోనియా గాంధీ

ఒక్కో పార్టీకి ఒక్క పాత్రే వుంటుంది. కానీ ఇద్దరేసి పోషించాలి. అదికూడా ఒకరి తర్వాత ఒకరు కాదు. సమాంతరంగా ఒకే సమయంలో పోషించాలి. ఒకరు ‘అవునూ’ అంటూంటే, ఒకరు ‘కాదూ’ అనాలి.

సీన్‌ ఆంతర్యం ఈ పాటికి అర్థమయ్యే వుండాలి. ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేయటం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కొక్క పార్టీనీ రెండేసి ముక్కలు చేయటం. ఇలా తరగటంలోనూ ఒక క్రమం వుంది. ముందుగా వైరి పక్షాలుగా వున్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీలను విభజించాలి.

వైయస్సార్‌ కాంగ్రెస్‌ సీమాంధ్రలో బాగా బలంగానూ, తెలంగాణలో బలం పుంజుకుంటూనూ వుంది.

తెలుగుదేశం పార్టీకి ఇలాంటి ‘అసమాన అభివృద్ధి’ లేదు. రెండు చోట్లా ఒకే రీతిలో బలహీనంగా వుంది.

వీటినుంచి పాల్గొనే పార్టీలు ‘తెలంగాణ’ మీద రెండేసి మాటలు చెప్పకుండా ఒకే మాట చెప్పేస్తే..?! చెప్పేస్తే కాదు, అలా చెప్పాలన్నదే కాంగ్రెస్‌ కోరిక.

పరకాల ఎన్నిక తర్వాత వైయస్సార్‌ కాంగ్రెస్‌ లోనూ, బాబు పాద యాత్ర తర్వాత తెలుగుదేశం పార్టీలోనూ తెలంగాణ పై వైఖరులు మారాయి.

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా వైయస్సార్‌ నేతలూ మాట్లాడారు, చంద్రబాబూ లేఖ రాశారు. ‘తెలంగాణ ఇవ్వటం మా చేతిలో లేదు.’ ( ఉంటే, ఇచ్చేసే వాళ్ళం అనే భావన) అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ స్పష్టం చేస్తే, తెలంగాణ ఏర్పాటుకు తమ మద్దతును చంద్రబాబు ప్రకటించారు.

ఈ రెండు పార్టీల మీదా ఒకప్పుడు ప్రచారంలో వున్న అంచనాలు వేరు.

ఎప్పుడో జగన్‌ ఇంకా పార్టీ పెట్టక ముందు, సాటి సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎం.పీలతో పాటు పార్లమెంటులో ‘సమైక్యాంధ్ర’ ప్లకార్డును పట్టుకున్న మాట వాస్తవమే. అలాగే ఓదార్పు యాత్రను తెలంగాణలో తలపెట్టినప్పుడు, తెలంగాణ వాదులు ప్రతిఘటిస్తే వెనుతిరిగిన విషయమూ వాస్తవమే.

కానీ ఇప్పుడు అలా కాదు. (తెలంగాణలోని) పరకాలలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థినిగా కొండా సురేఖ, గట్టిపోటీ ఇచ్చి టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ముచ్చెమట్లు పోయించారు. తర్వాత విజయమ్మ సిరిసిల్ల వెళ్ళి చేనేత కార్మికులను పరామర్శించగలిగారు. షర్మిల పాద యాత్ర చేయగలిగారు.

ఈ స్థితిలో అఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన అనుకూల వైఖరి చెబుతుందనే కాంగ్రెస్‌ వ్యూహకర్తలు ఎదురు చూస్తున్నారు. అలా చెప్పిన మరుక్షణం, సీమాంధ్రలో ‘సమైక్యాంధ్ర’ ఉద్యమాన్ని రేపి, అక్కడ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఇరుకున పెడదామని- యోచిస్తున్నారు.

చంద్రబాబుకు కూడా గతంలో తెలంగాణ వ్యతిరేక ముద్ర వుండేది. తనకు రెండు ప్రాంతాలు సమానమని ( రెండూ రెండు కళ్ళులాంటి వని) చెప్పినందుకే, ఆయన రెంటికీ చెడ్డ రేవడి అయ్యారు. మరీ ముఖ్యంగా తెలంగాణకు వ్యతిరేకి అన్న ముద్ర తెచ్చుకున్నారు. ఫలితంగా తెలంగాణకు చెందిన తెలుగుదేశం నేతలు ఒక దశలో ఆయన ఫోటోకూడా లేకుండా తెలంగాణ ప్రాంతలో యాత్రలు చేశారు. కానీ, ఇప్పుడు నేరుగా ఆయనే ఈ ప్రాంతంలో పాద యాత్ర చేయగలిగారు. ఆయన ఎంతగా మారినా, ఆపార్టీనుంచి ‘జంప్‌ జిలానీలు’ పెరుగుతూనే వున్నారు. తెలంగాణ పై తన ప్రతినిథులు ‘స్పష్టంగా’ చెప్పినా ‘అస్పష్టంగా’ చెప్పినా ఆయనకు అదనంగా వచ్చే నష్టమేమీ లేదు.

కాంగ్రెస్‌, సీమాంధ్రలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ను చూసి భయపడ్డట్టే, నిన్నటి వరకూ తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను చూసినా భయపడేది. కానీ, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ను చూసి అంతగా భయపడటంలేదు. ఈ విషయం టీఆర్‌ఎస్‌కు కూడా తెలిసి పోయింది. ఎందుకంటే, యుపీయేను కాదని, ఎన్డీయే వైపు టీఆర్‌ఎస్‌ వైపు తిరిగిపోయినా, కాంగ్రెస్‌లో చలనం లేదు. కారణం చిన్నదే. పూర్వం తెలంగాణ సెంటిమెంటుకు ఏకైక హక్కుదారుగా టీఆర్‌ఎస్‌ వుండేది. ఇప్పుడు పలుపార్టీలు వచ్చేశాయి. ఈ ప్రాంతంలో జరిగిన చిట్టచివరి ఉప ఎన్నికల ఫలితాలు- ఇదే అంశాన్ని బలపరచాయి. కాబట్టి ఈ సారి తెలంగాణ ఉద్యమం ఉధ్ధృతమయినా, ఆఫలితాలను అన్ని పార్టీలూ తీసుకుంటాయి. అఖిల పక్షంలో టీఆర్‌ఎస్‌నుంచి ఇద్దరు వెళ్ళినా ఒకే అభిప్రాయం చెబుతారు.

గతంలో అభిప్రాయం చెప్పకుండా దాటవేసిన మజ్లిస్‌ కూడా ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అది కూడా వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభిప్రాయానికి విలువ ఇవ్వాల్సి వుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్‌నుంచి దూరమయి వైయస్సార్‌ కాంగ్రెస్‌ వైపు ఆ పార్టీ జరుగుతోంది.

ఇక బీజేపీకీ ఇప్పటికీ సీమాంధ్రలో పట్టులేదు కాబట్టి, ప్రత్యేక తెలంగాణ పై ఒకే మాట చెబుతుంది. సిపిఐ ఇప్పటికే సీమాంధ్రలో ఒక గొంతూ, తెలంగాణలో ఒక గొంతూ పలుకుతోంది. సి.పి.ఎం ఇంకా ‘సమైక్యవాదాన్నే’ జపిస్తూ, ‘ఇస్తే అడ్డుకోమన్న’ దారిలో వెళ్తోంది. హైదరాబాద్‌లోని కుకట్‌ పల్లిలో సీమాంధ్రుల మద్దతుతో ఒకే ఒక్క అసెంబ్లీ సీటును గెలుచుకున్న లోక్‌ సత్తా, తెలంగాణ మీద విస్పష్ట ప్రకటన చేస్తుందనటం అత్యాశే అవుతుంది.

షూటింగ్‌ ముగిశాక, ఎప్పటిలాగే తెలంగాణకు ‘నువ్వు శత్రువు’ అంటే ‘నువ్వు శత్రువు’ అంటూ ఒక పార్టీని ఒక పార్టీ తిట్టుకుంటాయి.

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 14-20 డిశంబరు 2012 వ సంచిక లో ప్రచురితం)

2 comments for “రాష్ట్ర విభజన కాదు, పార్టీల విభజనే!

  1. This what it is, what it should be and what it will be. Probably Congress High Command this time has taken the best course of action. Why should AP issue be resolved at all? Status quo is the best policy.

Leave a Reply