వాళ్ళు చేతులతో నడుస్తారు!

delhi protest‘రావద్దు ఆలస్యంగా.

పోవద్దు ఒంటరిగా.’

‘ఎందుకనీ..?’

‘బయిట మనుషులు తిరగుతున్నారు.’

‘ఎంత మంది వుంటారేమిటి..?’

‘మన జనాభాలో సగానికి పైగా.’

‘వారిలో అందరూ ప్రమాదకరమేనా?’

‘కాదు. కొందరే.’

‘గుర్తుపట్టటమెలా?’

‘వాళ్ళ చేతులుండవు.’

‘అంగ వికలురా?’

‘కాదు.వాళ్ళకి నాలుగూ కాళ్ళే.’

 

అవును. వీళ్ళే. వీళ్ళని మృగాలతో పోలిస్తే, అవి అవమానం భరించలేక చచ్చిపోతాయి. కాబట్టి మనం మనుషులమైనా, చచ్చినట్టు మనుషులతోనే పోల్చుకోవాలి.

అది రాజధాని నగరం. కాదు. కాదు. ఆ నగరమే రాజధాని. దానికో ముద్దు పేరు వుంది: అత్యాచార నగరం.(రేప్‌ కేపిటల్‌). పేరు ఢిల్లీ. కదిలే బస్సుల్లో కూడా, అక్కడ స్త్రీల మీద అత్యాచారాలు జరుపుతారు.

ఆ రాజధాని నగరంలో, దేశాన్ని పాలించేదీ (పాలింప చేసేదీ) మహిళే(సోనియా గాంధీ). అక్కడి రాష్ట్రాన్ని పాలించేదీ మహిళే(షీలా దీక్షిత్‌). అంతే కాదు, అంతేకాదు దేశాన్నెలా పాలించాలో చట్టాలు చేసే (లోక్‌) సభలో ప్రధాన ప్రతి పక్షనేతా మహిళే(సుష్మా స్వరాజ్‌).ఆ సభకు ఆధ్యక్ష్యం వహించే సభాపతీ మహిళే(మీరా కుమారి).

కానీ ఆనగరమే భారతంలో కీచక పర్వానికి ప్రధాన వేదిక అయ్యింది.

ఇంత మంది మహిళలు అధికార పీఠాల్లో వున్నా, మహిళలపై ఏమిటీ అత్యాచారాలు – అని అలవాటు ప్రకారం మళ్ళీ మహిళలనే తిట్టి పోసేయ వచ్చు.

కానీ, ఆగాలి. మనం ఆగాలి.అక్కడి బస్సులు ఎలాగూ ఆగవు. గుండెల్లో కత్తులు దిగబడ్డ పావురం అరుపులు, హారన్ల మోతల్లో కలిసి పోతాయి. ఆడపిల్ల బస్సు పాసింజరు గానే ఎక్కుతుంది. కానీ ఆమెకు ‘లగేజీ’ టిక్కెట్కు కొట్టి, నెత్తుటి ముద్దగా మడిచి, మెట్లమీదనుంచి తన్ని దించేస్తారు. అదీ కూడా కదిలే బస్సులోనుంచే. అప్పుడు కూడా బస్సు ఆగదు. అందుకే మనమే ఆగుదాం.

మన చెల్లెళ్ళతో, కూతుళ్ళతో, భార్యలతో ఏమంటున్నాం మనం?

రావద్దు ‘ఆలస్యంగా’. పోవద్దు ‘ఒంటరిగా’.

ఏం ఈ సూచనలు స్త్రీలకే ఎందుకు? ఈ ప్రశ్న అడుగుతున్నది ఆడపిల్లలు.

వాళ్ళకి ఈ సూచనలు దేహాల్ని కప్పే ‘ముసుగుల్లా’గా, ‘పరదాల్లా’గా , బంధించే ‘బేడీల్లాగా’, ‘ఇనుప కచ్చడాల్లా’గా కనిపిస్తున్నాయి.

ఎప్పుడూ ‘సూక్తి ముక్తావళి’ స్త్రీలకేనా? పురుష పుంగవులకు లేదా?

కొంగు తప్పుకుంటే చాలు ‘చొంగ కార్చుకునే’ చూపులు చూసే కొడుకులకు ఇళ్ళల్లో ఒక్క సూచనయినా చేశారా? అలా చేసి వుంటే, కవి చెప్పినట్లు ‘గాంధీ గారి దేశంలో (దేశ రాజధానిలో) గజానికొక గాంధారీ పుత్రుడు’ ఎందుకు కనిపిస్తాడు?

పనుల్లో లింగ విభజన, ప్రవర్తనలో లింగ విభజన, పారంపర్యంలో లింగ విభజన.

మనం, మార్కెట్టూ, మీడియా- ఉగ్గు పాలతో పోసి రోడ్లు మీదకు వదలుతున్నాం.

అందుకే-

ఆఫీసులో ఆడవాళ్ళు కింద ఉద్యోగులుగానో, సహోద్యోగులుగానో కాకుండా, పైన ఉన్నతోద్యోగులుగా వుంటే నచ్చదు.

పరికిణీ బదులు, ఆడపిల్ల ప్యాంటూ చొక్కా వేసుకు వస్తే నచ్చదు.

అలసిపోయిన ఇంటికొచ్చిన భర్తకు, అంతకంటే ముందు అలసి పోయి ఇంటికి చేరిన భార్య వెచ్చటి కాఫీ ఇవ్వక పోతే, (టీవీ సీరియల్‌ రచయితకు) నచ్చదు.

కోపం. అక్కసు.

అందుకే ఆడదాన్ని వగలాడిలాగానో, మోసగత్తెలాగానో- చిత్రించుకుంటే మగ మనసుకు ఊరట.

స్త్రీ, పురుషుడితో సమానమని అనుకోవాల్సి వచ్చినప్పుడెల్లా కలిగే ఉక్రోషమిది.

ఆమె మేధస్సు స్థాయికి చేరలేని వాడు, మనసును తాక లేని వాడు… ఏం చేస్తాడు.

కుంచించుకు పోతాడు. తనని తాను పురుగులాగా, పిపీలకంగా ఊహించుకుంటాడు.

ఆమె అనుమతిలేకుండా ఆమె దేహం మీద పడతాడు.

అది ఒక చోట ఆసిడ్‌ దాడి అయితే, మరొక చోట అత్యాచారమవుతోంది.

స్త్రీలు ఉన్నత హోదాల్లోకి వెళ్ళినా ఇవి జరటం కాదు, వెళ్తున్న కొద్దీ ఇవి జరుగుతున్నాయి. అందుకే సూక్తులూ, సూచనలూ వుంటే కొడుకుల కివ్వండి.

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 24 డిశంబరు2012 వ సంచికలో  ప్రచురితం)

1 comment for “వాళ్ళు చేతులతో నడుస్తారు!

Leave a Reply to youngfemiistsdavidraj Cancel reply