విశ్వాసానికి విడాకులు

విశ్వాసం వుండాల్సింది కుక్కలకీ నక్కలకీ కానీ, మనుషులకెందుకు చెప్పండి?
ఇప్పుడు ఉంటున్న ఇంటికి తాళం వేస్తున్నారు. ఒకప్పుడు ఉంచుకున్న ఒంటికి తాళం వేసే వారు. ఎందుకూ? అవిశ్వాసం? మనుషుల్లో దొంగ మనుషులుంటారనీ, వారు కన్నం వేస్తారనీ- గొప్ప అవిశ్వాసం.
కుక్కలతో అలాంటి పేచీలేదు. వాటిల్లో మహాఅయితే పిచ్చికుక్కలు వుంటాయేమో కానీ, దొంగ కుక్కలు వుండవు.
అందుకే అవిశ్వాసమన్నది ముమ్మాటికీ మానవ ప్రవృత్తి.
కోతి నుంచి మానవుడు అవతరించే పరిణామ క్రమంలో, మెల్లిగా తోక అంతరించిపోతూ, దాని స్థానంలో అవిశ్వాసం పెరుగుతూ వచ్చింది.
అందుకే నిండయిన మానవుడికి, సంపూర్ణమైన అవిశ్వాస ముంటుంది. అతడు నిర్మించుకున్న సమస్త అనుబంధాలూ, వ్యవస్థలూ అవిశ్వాసమే కేంద్రంగా నడుస్తుంటాయి.
ఉదాహరణకి ప్రేమలో పడ్డ మనిషిని చూడండి. ప్రియురాలిని క్షణం కూడా వదలడు. పొద్దున్నే ‘వేకప్‌ కాల్‌’ చేసి ‘రాత్రి కలలోకి నేనే వచ్చాను కదా?’ అని ఆరా తీస్తాడు. ఆమె కాలేజ్‌కు వెళ్ళే వేళకు బస్‌ స్టాప్‌కు బైకు మీద వచ్చి ‘లిఫ్ట్‌ ఇవ్వటానికి వేరే ఎవ్వరూ రారు కదా?’ రూఢిపరచుకుంటాడు.. లంచ్‌ బ్రేక్‌లో ఆమె బాక్స్‌ తెరుస్తుండగా ‘నేనొక్కణ్ణే కదా షేర్‌ చేసుకునేది?’ స్పష్టం చేయమంటాడు. కడకు రాత్రి పడుకునేటప్పుడు గుడ్‌నైట్‌ చెప్పేసి ‘ఇక మొబైల్‌ స్విచాఫ్‌ చేస్తావు కదా?’ అని ఆందోళన తగ్గించుకుంటాడు.
ఇలా రోజంతా ఆమె ధ్యాసతోనే గడపగల ఈ ప్రేమ వెనుక రహస్యమేమిటి? అవిశ్వాసం. తనని కాకుండా ఆమె మరెవర్నయినా తగులుకుంటుందేమోనన్న అపనమ్మకం.
గొప్ప గొప్ప దాంపత్యాల వెనుక దాగి వున్న రహస్యం కూడా ఈ అవిశ్వాసం.
భర్త ఏమో దొండపండులాగా వుంటాడు. భార్య కాకి నలుపు. అయితేనేం? ఎక్కడ చూసినా వాళ్ళిద్దరే కనిపిస్తారు. గుడిలో సినిమాహాల్లో, షాపులో, ఆఫీసులో, ఫంక్షన్‌లో – ఒక్క బార్బర్‌ షాపులో తప్ప- అన్ని చోట్లా జంటగానే కనిపిస్తారు. చూడ్డానికి రెండు కళ్ళూ చాలవనుకోండి. ఇంతటి అన్యోన్యతకు కారణం? అపనమ్మకమే. అనుమానమే. అందమైన భర్తను కట్టుకున్న నేరానికి ఆమె బాడీగార్డులా మారిపోయింది.
ఇద్దర్ని ముడివేసే ప్రేమ, పెళ్ళిళ్ళలో మాత్రమే కాదు. లక్షల, కోట్ల మందిని మెలివేసే ప్రజాస్వామ్యానికి కూడా కేంద్ర బిందువు అవిశ్వాసమే.
వోటు విలుయినదీ- అంటారు. తప్పు! వోటు ఖరీదయినది. వోటు వెయ్యటానికి ఒక రేటు, వోటు వెయ్యకుండా వుండటానికి ఒక రేటు. అలాగని నమ్మేసి రేటు ఇచ్చేస్తే…? లీడర్లలోనే కాదు… వోటర్లలోనూ జగత్‌ కంత్రీలు వుండవచ్చు. మనసొకరికచ్చి, మనువు ఇంకొకరితో కానిచ్చే ‘నీతిమాలినతనం’ వోటర్లకు మాత్రం ఎందుకు ఉండకూడదు? కాబట్టే దేవుడి బొమ్మ మీదో, లేక బిడ్డల నెత్తిమీదో ప్రమాణాలు తీసుకుంటారు. అంటే ప్రజాస్వామ్యం పుట్టుకే అవిశ్వాసంతో మొదలవుతుంది.
ఇలాంటి అవిశ్వాసంతో గెలుపొందిన ఒక ఎమ్మెల్యే హఠాత్తుగా తన భార్యను ప్రేమించెయ్యటం మొదలు పెట్టాడు. ఇంకా విచిత్రం! భార్యను మించి భార్య ఎంగిలిని ఎక్కువ ప్రేమించటం మొదలు పెట్టాడు. ఆమె కాఫీ తెచ్చినా, పాయిసం తెచ్చినా సరే ‘ నువ్వు ఎంగిలి చేసి ఇవ్వు దాని రుచి ఇంకా పెరుగుతుంది.’ అనటం అలవాటు చేసుకున్నాడు. ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ఆమెకుకూడా రాజకీయాల మీద ఆసక్తి పెరిగిందట. అతడు పోతే, సానుభూతితో ఆమెకే పార్టీ టికెట్టు ఇస్తుంది. అతడు పోవాలంటే… తాగే దాంట్లోనో, తినే దాంట్లోనో కాస్త విషం కలిపితే…? ఈ మాత్రం అవిశ్వాసం చాలదూ, అతడికి తన భార్య ఎంగిలి మీద ప్రేమ పుట్టటానికీ..!?
ఇలాంటి ఎమ్మెల్యేల మద్దతు మీద ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి ఏ స్థాయిలో అవిశ్వాసం వుండాలో ఊహించుకోవచ్చు.
అందుకే వాళ్ళను కంటికి గాగుల్స్‌ లా( రెప్పలా కాదు) చూసుకుంటాడు. వాళ్ళ ప్రతీ కదలిక మీద కూడా నిఘా పెడతాడు. ఒక్కొక్క సారి ఒక్కో ముఖ్యమంత్రికి తన శాసన సభ్యుల మీద ముచ్చట పెరిగిపోతుంది. అప్పుడు కాకులు దూరని ఖరీదయిన హొటళ్ళలో నిర్బంధపు విందులూ, వినోదాలూ ఏర్పాటు చేస్తాడు. ముఖ్యమంత్రికీ, శాసన సభ్యులకీ, లేదా మంత్రులకీ శాసనసభ్యులకీ మధ్య అనుబంధం పటిష్టంగా వుండాలంటే వారి మధ్య విశ్వాసం కన్నా, అవిశ్వాసమే ముఖ్యమని అడుగడుగునా నిరూపణ అవుతూనే వుంది.
ఆ మాటకొస్తే, ప్రజాస్వామ్యాన్ని బతికించేదే అవిశ్వాసం. మన దేశంలో స్వరాజ్యం వచ్చిన కొత్తలో నేతలమీదా, పార్టీల మీదా ప్రజలకి తక్కువ అవిశ్వాసం వుండేది. కాబట్టే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ తిరుగులేని మెజారిటీలతో ప్రభుత్వాలను కూర్చోబెట్టేవారు. కానీ తర్వాత తర్వాత ప్రజలకు అవిశ్వాసం పెరిగి, పార్టీలకు బొటాబొటీ మెజారిటీలను ఇవ్వటం ప్రారంభించారు. దాంతో సంకీర్ణ ప్రభుత్వాలొచ్చాయి. సంకీర్ణమంటే మరేమీ కాదు. ఒక పార్టీకీ, మరొక పార్టీ మధ్య వుండే సంపూర్ణ అవిశ్వాసం. వెనకటికి కేంద్రంలో పార్టీలు ‘కుడి’ ‘ఎడమ’ల్ని పక్కన పెట్టి వీపీ సింగ్‌ సర్కారుకు మద్దతు నిచ్చాయి.
ఇలా అవిశ్వాసం ‘మూడు వెన్ను పోట్లు’ , ‘ఆరు తిరుగుబాట్లు’ గా భాసిల్లుతున్న సంకీర్ణ యుగంలో మళ్ళీ ప్రత్యేకించి ‘అవిశ్వాస తీర్మానాలు’ పెట్టుకోవాల్సిన అవసరం వుంటుందా?
వివాహేతర సంబంధానికి విడాకులు కోరినట్లు లేదూ?!
కోరినట్లేమిటి? కోరేశారు.
సభ్యత్వం ఒక పార్టీలోవుండి, సాహచర్యం మరొక పార్టీతో వున్న ఎమ్యెల్యేలుండవచ్చు.
వీరికి ‘ఇలాగే వోటెయ్యండి’ అని జారీ చేసిన విప్పు ‘విడాకుల’తో సమానమే.
పాలక పక్షానికీ, ప్రతిపక్షానికీ మధ్య ఉండాల్సినంత వైరం లేదని నిన్న కాక మొన్నొచ్చిన ఒకాయన అంటే, కడుపు మండిపోయిన ప్రతిపక్షం ‘అవిశ్వాసం’ పెడుతుంది.పాలక పక్షానికి సభలో ‘విశ్వాసం’ వుందని నిరూపిస్తుంది.
దాంతో తన కడుపు చల్లబరచు కుంటుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టానని మురిసి పోతుంది.
ఎప్పుడూ అంతే…
హింస ద్వారానే అహింస గెలుస్తుంది!
అవిశ్వాసం ద్వారానే విశ్వాసం గెలుస్తుంది!!

– సతీష్‌ చందర్‌
3-6-11

Leave a Reply