వీధిలో వోటు! ఖైదులో నోటు!!

రోడ్డెక్కిన జనం
Photo by Jaipalsingh

‘హలో! మధ్యాహ్నం పూట ఫోన్‌ చేస్తున్నాను. మీ నిద్ర చెడగొడుతన్నానేమో’
‘ఆయ్యో! అంత భాగ్యమా?’
‘అదేం పాపం? ఎక్కడున్నారేమిటి?’
‘ఇంట్లోలోనే తగలడ్డాను. ఇదేన్నా ఆఫీసా.. ప్రశాంతంగా కునుకు లాగటానికి?’
ఇది ఒక నిద్రమొఖం సర్కారీ ఉద్యోగి కొచ్చిన కష్టం
…. ….. ….
‘ఏరా! బైక్‌ తీయకుండా, ఈ పాదయాత్ర ఏమిటి?’
‘ఎందుకురా… పెట్టుబడి దండగ?’
‘ఏం? ఎవరూ లిఫ్ట్‌ అడగటం లేదనా?’
‘అడుగుతున్నారు? అందరూ నీలాంటి పోతురాజులే..! ఆడపిల్లలు అడ్రసే లేరు.’
ఇది ఒక నిబధ్ధ రోమియో కొచ్చిన విపత్తు.
…. …. ….
‘ ఎన్ని ఇంటి తాళాలు బద్దలు కొట్టావో చెప్పు.. లేక పోతే ఈ లాఠీ చెప్పిస్తుంది.’
‘రామ! రామ! కొట్టలేదు మొర్రో అంటే వినరేమిటండీ!’
‘ఎం-దు-కు బ-ద్ద-లు కొ-ట్ట-లే-దు?’
‘ఎ-వ-రూ ఇ-ళ్ళ-కు తా-ళా-లు వె-య్య-లే-దు’
ఇది ఒక బిజీ దొంగ కొచ్చి పడ్డ ఉపద్రవం.

వారానికి ముడు ధర్నాలూ, ఆరు భైటాయంపులతో ఆఫీసులు తెరిచినా తెరవనట్టే వుంటున్నాయి. ఇంటి దగ్గర కష్టపడి ఆఫీసులో కాస్త విశ్రమిద్దామనుకున్న వారి కష్టం అంతా ఇంతా కాదు.
కాలేజే లేకుంటే, జీన్‌ ఫ్యాంట్లెందుకు? రేబన్‌ కళ్ళజోళ్ళెందుకు? హైహీల్స్‌ ఎందుకు? లిప్‌స్టిక్కు లెందుకు? కేంపస్‌ల నిండా, ప్లకార్డులు, బేనర్లూ, ఆందోళనలూ, పోలీసులే వుంటే, చదువుల సంగతి సరే..సరదాలేవీ? దాంతో అలా స్టయిలిష్‌ సిగరెట్‌ వెలిగించే, వీలయిన కార్నర్‌లో అలా వాలుగా బైకును ఆపి, దమ్ము మీద దమ్ము లాగాలనుకునే స్టూడెంట్‌ కుర్రాళ్ళకు ఎంత కష్టం.. ఎంత కష్టం..!
ఇలా కొడితే అలా పగిలే తాళాలను ఇళ్ళకు వేసుకుని, ఆఫీసులకు వెళ్ళే పెద్దలు, ఆఫీసులకీ; స్కూళ్ళకీ, కాలేజీలకూ వెళ్ళే వాళ్ళు, కాలేజీలకు వెళ్ళితే కదా- ఎంత చేతకాని దొంగయినా ఇళ్ళకు కన్న వెయ్యగలడు? మరి వాడి కొచ్చిన నష్టాన్ని ఎవరు పూడ్చగలరు. పని దొంగలకు సైతం భృతి కల్పించ గల ‘ఉపాధి పథకాలు’ వుంటాయి కానీ, కోల్పోయిన దొంగల పనిదినాలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు?
ఉద్యమాల పేరిట ప్రాణాలిచ్చే వాళ్ళూ, నిరసనల కారణంగా హింసలపాలయ్యే వాళ్ళూ మాత్రమే కాదు,
వీటిని చూసి, విసుక్కునే వాళ్ళు సైతం కూడా సమాజం లో వుంటారు.

ఏదయినా ఒక ప్రదర్శనో, నిరసనో రోడ్డు మీద ఎదురయి, అయిదు నిమిషాల సేపు ట్రాఫిక్‌ ఆగిపోతే, ‘ ఇలా రోడ్డెక్కే వాళ్ళకి పనీ పాటా ఏమీ లేదు. ఇదో వేలం వెర్రి అయిపోయిందండీ’ అంటాడు, కారు అద్దం దించి, పక్కనే స్కూటరు మీద వెళ్ళున్న పెద్ద మనిషితో. పాపం స్కూటరు మీద పెద్దమనిషి చిన్నగా నవ్వి ఊరకుంటాడు. అయినంత మాత్రాన ‘కారు’ కూతలు ఆగుతాయా?
‘అక్కడ ప్రదర్శన వుందని చిన్న చిన్న వీధుల్లో చుట్టు తిరిగి, తిరిగి, ఇంత దూరం వచ్చాను. ఎంత పెట్రోలు ఖర్చో చెప్పండి.’ అని కొనసాగిస్తాడు.
‘ అయ్యా! వీళ్లు ప్రదర్శన చేస్తున్నది కూడా పెట్రోలు గురించే నండీ. పెట్రోధరలకు నిరసనగా చేస్తున్నారు. అంత తొందర్లో వున్నారు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళున్నారేంటీ?’
‘ ఏముందీ ఆఫీసు లేదని, క్లబ్బుకి వెళ్తున్నాను.’
పెట్రోధరలు తగ్గాలని కారు బాబుకీ వుంటుంది. కానీ తాను అడగడు. అడిగేవాళ్ళంటే అసహ్యం.

కుర్రవాళ్ళలో కూడా తాము మాత్రమే బుధ్ధిమంతులమని ఫీలయ్యేవారుంటారు.
‘ఇలా ఉద్యమాలూ, అలజడులనీ, ఎన్ని విద్యాసంవత్సరాలు పోగొట్టుకుంటాం. మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి డబ్బు పంపిస్తున్నారు? రాజకీయాల మీద తగలెయ్యమనా?’ అంటాడు.
‘చదివే ఏ చేస్తావురా? ‘ అంటాడు అప్పుడే నినాదాలిచ్చి ఇచ్చి అలసిన వాడి రూమ్‌ మేట్‌.
‘డీసెంట్‌ జాబ్‌!’
‘అలాగా? ఈ డీసెంట్‌ జాబ్‌లన్నీ మనలాంటి బడుగులకు దక్కాలనే ఈ ఉద్యమం. తల్లి దండ్రుల డబ్బు తగలేసి, నిరుద్యోగిగా మిగలకూడదనేరా- ఈ ఉద్యమం?’
‘అయితే విద్యా సంవత్సరం నష్టం కాదా?’
‘కావచ్చు. కానీ, ఒక ఉద్యమ సంవత్సరం లాభం.’
వాడికీ ఉద్యోగం కావాలి. కానీ దానిని వాడు అడగడు. అడిగే వాళ్ళంటే అసహ్యం.

ఇలా సమాజంలో అలజడుల పేరిటా, ఆందోళన పేరిటా మేల్కొని వుంటే, అందరికన్నా ఎక్కువ కోపం వచ్చేది దొంగలకి.
‘ఎవడూ నిద్ర పోకుంటే ఎలా దోచుకుంటాం రా?’ అంటాడు ఓ చిన్నదొంగ.
‘అవును. తెగించి దోచుకుంటే దొరికిపోతాం.’ అంటాడు ఇంకాస్త పెద్ద దొంగ.
నిజం కదా! దేశంలో పెద్ద పెద్ద దొంగలంతా ఒకరి తర్వాత ఒకరు దొరికి పోవటం లేదూ..!?
‘వోటు’ బాబులు మేల్కొని వుంటే , ‘కోటి’ బాబులు పట్టుబడాల్సిందే. మరో మార్గం లేదు. ప్రజాస్వామిక ఉద్యమాల రూలు అది.
– సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 17-9-2011 సంచికలో ప్రచురితమయినది)

1 comment for “వీధిలో వోటు! ఖైదులో నోటు!!

Leave a Reply