‘వెండితెర’ తీస్తే… వనితల మెడలో ఉరితాళ్ళే!!

(ఇంట్రో…

పదిహేనేళ్ళ క్రితం నాటి మాట. నేను అప్పుడు వార్త దినపత్రికకు అసోసియేట్‌ ఎడిటర్‌ వున్నాను. సిల్క్‌ స్మిత చనిపోయిందన్న వార్త న్యూస్‌ ఏజెన్సీల ద్వారా మాకు చేరింది. ఆమె చనిపోవటం కన్నా, చనిపోయిన తీరు నన్ను బాధించింది. ఆ రోజు ఆమె మీదనే సంపాదకీయం రాయాలని నిర్ణయించుకున్నాను. రాసేశాను. ఇంకా అది పేజీల్లోకి వెళ్ళకుండానే, ఎలా తెలిసిందో మార్కెటింగ్‌ విభాగం వారికి తెలిసిపోయింది. అప్పటి జనరల్‌ మేనేజర్‌ అయితే కంగారు పడ్డాడు. ‘ఆమె ఏమన్నా మహానటి సావిత్రా? వ్యాంప్‌ (రోల్స్‌ వేసుకునే ఆమె) మీద సంపాదకీయమా? పరువు పోతుంది.’ అన్నాడు. నేను వినలేదు. యాజమాన్యానికి చెప్పాడు. వారికి నేను నచ్చచెప్పాను. సంపాదకీయం అచ్చయి వచ్చేసింది. మార్కెట్‌లో మంచి స్పందన వచ్చింది. ఈ విషయాన్ని ముందు కంగారు పడ్డ జనరల్‌ మేనేజరే వచ్చి నాకు చెప్పాడు. ఇప్పుడు సిల్క్‌ స్మిత జీవితం ఆధారంగా వచ్చిన ‘డర్టీ పిక్చర్‌’ అనేక రకాలుగా దుమారాలు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా సిల్క్‌ స్మితతో పాటు, ఆమెలా అర్థాంతరంగా రాలిపోయిన మరికొన్ని జీవితాల గురించి చర్చించిన ఈ సంపాదకీయాన్ని మళ్ళీ మీ కోసం.. ఇలా.. – సతీష్‌ చందర్‌)

సిల్క్ స్మిత


కడకు కీర్తి కూడా ఆడవాళ్ళకు ప్రాణాంతకమే అయింది. గ్లామర్‌ ఒక బందిఖానాగా మారింది. సినిమా రంగం అందుకు సంకేతం. సినిమాల్లో మగతారలు తమ భవిష్యత్తును తామే నిర్మించుకుంటారు. కానీ, ఆడతారల జీవితానికి ఇప్పటికీ మగవాళ్ళే దర్శక నిర్మాతలుగా ఉంటున్నారు. మంచి జీవిత దర్శకుడు దొరికితే జయలలితలా ముఖ్యమంత్రి కావచ్చు. దగాకోరు దర్శకులెదురయితే, మహానటి సావిత్రిలా దిక్కులేని మరణాన్ని పొందవచ్చు. చాలా సందర్భాలలో ఈ నటీమణులు సంపాదించే కీర్తీ, ఆకర్షణా, కోట్లాది రూపాయిల డబ్బూ- పిడికెడు ప్రేమకు హామీ పడలేక పోతున్నాయి. అందుకే ఎడారిలో గుక్కెడు నీళ్ళు దొరక్క మరణించినట్లు, ఈ ‘సినీ జనారణ్యం’లో స్త్రీలు సాహచర్యం కరువయి కన్ను మూస్తున్నారు. ఆ వరసలోనే సిల్క్‌ స్మిత ఉరివేసుకున్నారు.

అందరిలాగే ఆమె కూడా కళ(నటన)ను ప్రదర్శించి, హీరోయిన్‌ అవుదామనే పశ్చిమగోదావరి జిల్లా నుంచి మద్రాసు వెళ్ళారు. కానీ కళకు బదులు శరీరాన్ని ప్రదర్శించమన్నారు. ఏవో ‘సీతాకోక చిలుక’, ‘వసంత కోకిల’ వంటి చిత్రాలు మినహా, దాదాపు మూడువందల చిత్రాల్లోనూ శరీరాన్నే ప్రదర్శించారు. ‘సీతాకోక చిలుక’లో అమె పూర్తి వస్త్రాలతోనే కరుణరస భరితంగా నటించారు. తన కళ్ళముందే తమ పనివాడి భార్యతో తన భర్త గదిలోకి వెళ్ళినప్పుడు- అదే సమయంలో వచ్చిన పనివాడు ముందు తన కన్నీళ్ళు దాచుకునే ప్రయత్నాన్ని ఆమె అద్భుతంగా తన నటనలో చూపించారు. కానీ సిల్క్‌ స్మిత పేరు చెప్పగానే – ఆమె నీలి కళ్ళు తప్ప, కళ్ళ నీళ్ళు ఎందుకు గుర్తుకొస్తాయి? ఈ అవకాశం పరిశ్రమ ఇస్తే కదా! ఆమె మరణమప్పుడయినా ఆమెను కేవలం ‘సెక్స్‌ బాంబ్‌’గా తలచుకోకుండా వుంటే అదే పదివేలు. ఏమయితేనేం, ఆమెలోని ‘వసంతం’ వెళ్ళిపోక ముందే ఆమె వెళ్ళిపోయింది. అసలు మగతారలు తమ ‘ప్రతిభ’ను నమ్ముకుంటే, ఆడ తారలు తమ ‘శరీరపు బిగువు’ను నమ్ముకోవాల్సి వస్తోంది.దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లు, వసంతం లాంటి యవ్యవనం ఉన్నప్పుడే స్థిరపడిపోవాల్సి వస్తోంది. తల్లి పాత్రలకు ప్రాధాన్యం వుండే రోజుల్లో వీరికి ఎంతో కొంత అవకాశం వుండేది. ఇప్పుడు అమ్మ పాత్రల స్థానంలో అత్త పాత్రలకూ, ఆంటీల పాత్రలకూ ప్రాధాన్యం పెరిగింది. చివరికి ఈ పాత్రలకు కూడా శరీరపు బిగువు సడలిపోని వాళ్ళనే ఎంపిక చేసుకుంటున్నారు. కాస్త మొరటుగా చెబుతున్నట్లనిపించినా, ఇది కఠిన వాస్తవం.

ఈ దుస్థితి మగమహారాజులకు లేదు. ముడుతలు పడ్డా హీరోలు హీరోలే. కాబట్టి యవ్వనమే- ఆడతారలకు జీవిత కాలపు పెట్టుబడి అవుతోంది. ఈ స్వల్పకాలంలోనే ఏదో రకంగా స్థిరపడాలని అనుకున్నప్పుడు వారి ఇంటిని మరెవ్వరో చక్కబెట్టేస్తున్నారు. ఈ ఆడతారల మీద ప్రియులు చూపించే ప్రేమ ఎక్కువ సందర్బాలలో పెదవులకే పరిమితమవుతోంది. ఈ ప్రేమ ఎండమావి అని తెలిసిన మరుక్షణం తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

తెలుగు-తమిళ సినిమా రంగంలో సిల్క్‌ స్మిత ఆత్మహత్య కొత్త విషయం కాదు. దక్షిణాది ధ్రువతారగా ప్రకాశిస్తున్న సమయంలో దివ్యభారతి రాలిపోయింది. చనిపోయే సమయానికి ఆమెకు నిండా ఇరవయ్యేళ్ళు కూడా లేవు. 1992లో ఆమె సాజిద్‌ నారియా వాలాను పెళ్ళి చేసుకుంది. ఇది కులాంతర వివాహం. శ్రీదేవి, వైజయంతిమాల, మధుబాలల సౌందర్యాలను కలబోసినట్లుండే ఈమె అనతి కాలంలోనే జాతీయ తార అయ్యింది. అదే ఏడాది ఏప్రిల్‌ 5 వతేదీన ఆమె భవంతి మీదనుంచి పడిపోయి చనిపోయింది. ఇది ఆత్మహత్యా, హత్యా- ఇంతవరకూ తేలలేదు. ఈ సంఘటనకు ముందు ఆమె తాగి వున్నట్లు వార్తలొచ్చినా, పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టు ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. పెళ్ళి కాగానే, సినిమాలు వదలి, ఇంటికి పరిమితం కావాలనుకుంది.అయినా సాధ్యం కాకపోవటం వల్ల ఆమెకు మానసిక వత్తిడి పెరిగి వుండవచ్చు. దానికి తోడు, ఆమె కులాంతర వివాహం పట్ల తల్లిదండ్రుల అసంతృప్తి కూడా వుంది.

సిల్క్‌ స్మిత ఆత్మహత్యలో కూడా పెళ్ళి వ్యవహారం లేకపోయినా, ప్రేమ వ్యవహారం వున్నట్లుగా కనిపిస్తోంది. అందుకు ఆమె రాసినట్లుగా చెబుతున్న చివరి ఉత్తరమే సాక్ష్యం. ‘నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నాను. అతను నన్ను మోసం చేశాడు’ అని అయిదేళ్ళ క్రితం పరిచయమయిన ఒక వ్యక్తి గురించి ఆమె ప్రస్తావించారు.

1984 లో ఆత్మ హత్య చేసుకున్న ఫటాఫట్‌ జయలక్ష్మి విషయంలోనూ ఇదే జరిగింది. మద్రాసులో పుట్టి పెరిగిన జయలక్ష్మి డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా తండ్రికున్న పరిచయాల కారణంగా సినిమాలలో సులభంగా ప్రవేశించగలిగారు. బాల చందర్‌ దర్శకత్వం వహించిన ‘అవల్‌ ఒరు తొడరక్కదై'( ఆమే ఒక అంతులేని కథ) చిత్రంలో లెక్కలేనట్టు ప్రవర్తించే పాత్రను పోషించారు. ఇవాళ్టి సినీ పరిభాషలో చెప్పాలంటే ‘టేకిటీజీ పాలసీ’ ఉన్న పాత్ర అది. ఈ చిత్రం తెలుగులో ‘అంతులేని కథ’ పేరుతో వచ్చింది. ఈమె ఎమ్జీఆర్‌ తమ్ముడు చక్రపాణి కొడుకును ప్రేమించారు. అయితే అది పెళ్ళిగా మారలేదు. దాంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. సినిమాలో ఎంతటి ప్రేమనైనా ‘ఫటాఫట్‌’ మని వదలించుకోగల పాత్రను పోషించిన జయలక్ష్మి నిజజీవితంలో ప్రేమను సీరియస్‌గా తీసుకుని కన్ను మూశారు.

అంతకు ముందు కూడా, ఈ సినీ పరిశ్రమలో ఇలాంటి ఘటనలున్నాయి. తమిళ, మళయాళ చిత్రాలలో పేరొందిన విజయశ్రీ అనే నటి 1975లో నల్లుల మందు తాగి కన్ను మూసింది. ఒక తెలుగు నిర్మాత నిర్మించే చిత్రంలో నటిస్తానని సంతకం చేసి, మరుసటి రోజే ఆమె ఈ ఆఘాయిత్యానికి పాల్పడింది. ఈ వార్తను నిర్మాత పత్రికలో చూసి తెలుసుకుని షాక్‌ తిన్నాడు. అలాగే 1977లో ఇదే విధంగా లక్ష్మిశ్రీ అనే నటి బెడ్‌రూమ్‌లో ఫోన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. ఒక పారిశ్రామిక వేత్తతో సంబంధం పెట్టుకుని, పెళ్ళిచేసుకోవాలని ఆశించి, విఫలం కావటంతో ఆమె ఈ పనికి పాల్పడింది. 1979లో కె.శోభ ఒక ప్రముఖఖ సినిమాటోగ్రాఫర్‌తో ప్రణయం సాగించి, అది శాశ్వతం కాదని తెలుసుకుని,ఉరి వేసుకుని చనిపోయింది. ఈమె జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది.

ఫిలిం న్యూస్‌ ఆనందన్‌ ఈ నటీమణుల మీద ఒకే ఒక విశ్లేషణ చేశారు. అందుకు ఆయన రెండు కారణాలను పట్టుకున్నారు. ఒకటి: ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కోవటం రెండు: ఆర్థికంగా దెబ్బతినటం. అయితే మొత్తం ఆత్మహత్యల్ని పరిశీలిస్తే, రెండవ కారణం గోరు చుట్టు మీద రోకటి పోటులాంటిదే తప్ప, అదే మూల కారణం కాదనిపిస్తోంది.

సిల్క్‌ స్మిత కూడా ఇటీవల రెండు చిత్రాలు నిర్మించి నష్టపోయారు. అయితే ఆమె మరణానికి ఇదే కారణం కాదని ఆమె లేఖను బట్టి అర్థమవుతోంది. ‘నా చుట్టూ వున్న వాళ్ళే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. ఇంత సాధించి నాకు మనశ్శాంతి లేదు.’ అని ఆమె అన్న మాటల్లో ఇతరులనుంచి ఆమె కోరుకొంటున్న ఆత్మీయత లభించటం లేదనే అనిపిస్తోంది. అదీకాక- ఆమె సినిమారంగంలో ప్రవేశించటానికి ముందు పడ్డ ఆర్థిక ఇబ్బందులతో పోల్చి చూస్తే, ఇవి లెక్కలోనివి కానే కావు.

కాబట్టి ఇతరులనుంచి ‘గుప్పెడు ప్రేమ’ ను కోరుకోవటమే వీరి మరణానికి హేతువు అవుతున్నదని అర్థమవుతుంది. కీర్తి, కనకం, శరీరం, హృదయాల్లో- ప్రేమింఏ వాడు దేనిని ఆశిస్తున్నాడో వీరికి తెలుసుకోవటం కష్టం. సాధారణంగా మొదటి మూడింటి మీదా మోజుతో వచ్చే వాళ్ళే ఎక్కువ మంది వుంటారు. వీళ్ళల్లో ‘మనసు’ పడేవారెవరో తేల్చుకోవటం కష్టమే కదా! చరిత్రను పరిశీలిస్తే, ప్రేమలో సినీతారలు స్వేఛ్చకన్నా భద్రతనే ఎక్కువ కోరుకుంటున్నారు. కానీ, అదే వారికి దూరమవుతూ వస్తోంది. సినీ పరిశ్రమలో మొత్తం మీద ప్రమాదకరమైన వ్యసనం- పొగడ్తల్ని స్వీకరించటం. అందులో స్త్రీ, పురుష బేధంలేదు. అందుకని వీరాభిమానుల పొగడ్తల మధ్యా, గ్లామర్‌ నడుమా వీరు పెరగటం వల్ల – ఏ మాత్రం ద్రోహం జరిగినా తట్టుకోలేని స్థితికి వెళ్తున్నారు.

సినీ నటి ఆత్మగౌరవాన్ని కించపరచకుండా ప్రేమించే ప్రియుడో, భర్తో దొరకటం చాలా అరుదు. ఒకవేళ దొరికినా ఆమె నటన కొనసాగిస్తానంటే ఒప్పుకునే వాళ్ళు దొరకటం మరింత అరుదు. శరీరపు జిలులుగు చూసి మాత్రమ ప్రేమించిన వాడు, శరీరాన్ని ఆస్తిగానే భావిస్తాడు. ఆ శరీరం మీద వేరే వ్యక్తి చెయ్యవెయ్యడాన్ని భరించడు. ఆ విషయాన్ని పైకి అనలేక పరోక్ష హింసలు మొదలు పెడతాడు. ఇప్పటికీ ‘ప్రణయవ్యవహారం’ మగతారలకు మాత్రమే గర్వకారణం గా వుంది; స్త్రీలకు అవమాన చిహ్నంగా వుంది. ‘చుట్టూ నీరే. తాగటానికి చుక్కలేదు’ అన్న చందంగా, తెల్ల వారి లేస్తే ప్రతీ నటీ మణి మీదా ప్రేమ వ్యవహారాల పుకార్లే! కానీ అంతిమంగా కరువవుతున్నది ప్రేమ మాత్రమే!

వీళ్ళు గ్లిజరిన్‌తో ఏడ్చేది కొన్ని క్షణాలే. గ్లిజరిన్‌ లేకుండా దు:ఖించేంది కొన్ని యుగాలు. ఈ ఆత్మహత్యలు ఇలాగే జరిగితే, ‘కారులో షికారు కెళ్ళే పాల బుగ్గల’ సినీతారలు కూడా, ఈ ఘటనలపై రోడ్డెక్కి ఉద్యమించే రోజు రాక తప్పదు!!

-సతీష్‌ చందర్‌

(బుధవారం, 25 సెప్టెంబరు 1996)

13 comments for “‘వెండితెర’ తీస్తే… వనితల మెడలో ఉరితాళ్ళే!!

  1. 1996 లో చేసిన విశ్లేషణ ఈ రోజుకి ఆసక్తిగా చదువుతున్నామంటే అందులో ఎంతటి విశ్వజనీన విషయముందో అర్ధం చేసుకోవచ్చు. Hats off to you సతీష్ చందర్ గారు! రావూరి భరద్వాజగారు రాసిన ‘పాకుడు రాళ్ళు’ ఎప్పటికీ ‘పాకుడు రాళ్ళే’ ; పాల రాళ్ళు కాలేవు!

  2. superb editorial sir. cinema rangam lone kaadu.. neti samajam lo ekkadaina… ye rangam lo aina “prema” dorakadam dussadhyam.
    mee visleshana ku johaar

  3. సతీష్ చందర్ గారూ ఆనాటి మీ సంపాదకీయంలో కఠోరవాస్తవాలు పలికారు.’వీళ్ళు గ్లిజరిన్‌తో ఏడ్చేది కొన్ని క్షణాలే. గ్లిజరిన్‌ లేకుండా దు:ఖించేంది కొన్ని సంవత్సరాలు’.http://expressbuzz.com/entertainment/Television/shobana-ends-her-life/238762.html

Leave a Reply to Challa Rama Phani Cancel reply