శ్రీశ్రీ: అందరి కవి! అందని రవి!

శ్రీశ్రీ ఎవరు? మహాకవి.

ఈ విషయం నాకూ, మీకూ, మనందరికీ తెలియకముందే ఆయనకు తెలిసిపోయింది-

తాను తారనయ్యానని ఒక నటుడికి ముందే తెలిసిపోయినట్లు.

అందుకనే ‘ఈ శతాబ్దం నాది’ అని ఇరవయ్యవ శతాబ్దం మీద తన పేరు ముందుగా రాసేసుకున్నాడు.

ముప్ఫయ్యవ దశకం వరకూ ఆధునిక తెలుగుకవిత్వాన్ని తాను చెయ్యిపట్టుకుని నడిపిస్తే, ఆ తర్వాత దాన్ని తాను అదే ఆధునిక తెలుగు కవిత్వాన్ని చెయ్యిపట్టుకుని నడిపించానన్నాడు.

నిజమే కదా! ఒక నటుడు తారగా మారేవరకూ పాత్రలో తాను ఒదగాలని ప్రయత్నిస్తాడు. కానీ ఆతర్వాత పాత్రలే ఆతారలో ఒదుగుతుంటాయి. (రజనీ కాంత్‌ స్టార్‌ అయ్యేంత వరకూ పాత్రల్లో ఒదుగుతుండే వారు. తర్వాత పాత్రలే ఆయనలో ఒదుగుతుంటాయి. ఆయన ఆటో డ్రైవర్‌ వేషం వేస్తే, ఆ పాత్ర ఒక స్టయిలిష్‌ ఆటో డ్రైవర్‌గా మారిపోతుంది.)

ముందు శ్రీశ్రీ ఇది ‘పద్యం’ అని అనిపించటానికి కవిగా ప్రయత్నం చేసేవాడు. కానీ తాను మహాకవి అయిపోయాక, ‘అరిస్తే పద్యం’ అయిపోయింది.

తాను మహాకవికి అరంగుళం తక్కువ స్థాయిలో కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. తనకొచ్చిన గుర్తింపును దాచుకునేంత మహాభినయానికి కూడా ఎప్పుడూ ఒడిగట్ట లేదు.

ఈ ఆత్మవిశ్వాస ప్రకటనలో గోరాశాస్త్రికి తాను తక్కువేమీ కానని ఒక చోట రాసేసుకున్నాడు కూడా:

‘ఒక మారు గోరాశాస్త్రి నాతో, ”శ్రీశ్రీ! నువ్వేమిటన్నా అనుకో. నా ఉద్దేశ్యం మాత్రం ఇది! ఈ నాడు ఇండియాలోని రచయితలందరి కన్నా, నేనే గొప్పవాణ్ణి” అన్నాడు. ‘నా ఉద్దేశం కూడా అదే!’ అన్నాన్నేను – అని శ్రీశ్రీ చెబుతాడు.

ఒక్కసారి మహాకవి అయ్యాక ఎవరిని ఎంతమాటన్నా చెల్లిపోతుంది. పైపెచ్చు ఆయన అభిప్రాయానికి విలువ కూడా పెరిగిపోతుంది.

విశ్వకవీ, నోబెల్‌ పురస్కార గ్రహీతా రవీంద్రనాథ్‌ ఠాగూరు దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎందరికో ఆరాధ్యుడు. శ్రీశ్రీకి కూడా ఆయనంటే అంతే గౌరవం. కానీ, ఆయన రాసిన గీతాంజలి కన్నా ‘వాడే వీడు’ డిటెక్టివ్‌ నవల గొప్పదని తేల్చి పారేస్తాడు. దాని మీద దర్జాగా చిరు వ్యాసం కూడా రాసేస్తాడు.

అలాగే తెలుగు సాహిత్యంలో ఆయనన్నా ముందు పుట్టిన కవి విశ్వనాథ సత్యనారాయణ మీద కూడా గౌరవమే. ఆయన రాసిన ‘వేయిపడగలు’ ఎంత ప్రసిధ్దమయినదో అందరికే తెలిసిందే. కానీ ఆరచనను పట్టుకుని ‘వేయిపడగలు,లక్ష పిడకలు, కాగితప్పడవలు, చాదస్తపుగొడవలు’ అని హాస్యంగా కొట్టిపారేస్తాడు.

ఏ సాటికవి మీద ఏ వెక్కిరింత లిఖితపూర్వకంగా చేసినా శ్రీశ్రీకి అడ్డుచెప్పిన వారు లేక పోయారు. తాను ఒకప్పుడు వెర్రిగా అభిమానించిన కృష్ణశాస్త్రిని పట్టుకుని ‘విగ్గేల కృష్ణశాస్త్రికి, సిగ్గేల భావకవి’కి అని ఆట పట్టించాడు.

ఇక ప్రభుత్వాలనూ, పత్రికలనూ, ప్రజాస్వామ్యంలోని సకల సౌధాలలో కూర్చున్న వారిని ఎంతమాట బడితే అంత అనేశారు.

ఒక నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావును ‘బానిసకొక, బానిసకొక బానిసవోయ్‌ బానిసా’ అన్నాడు. ‘కట్టుకథకూ, పెట్టుబడికీ పుట్టిన విషపుత్రికలు’ అని మీడియాను విమర్శించారు.

ఇలా ఇంత మంది మీద జంకూ, గొంకూ లేకుండా మాట్లాడినా, ఎదురు చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకూ?

మహాకవి కున్న అధికారం అలాంటిది.

శ్రీశ్రీ వచ్చాక కానీ సాహిత్యం ఇలాంటి పోస్టు ఒకటి వుంటుందని ఎవరికీ అర్థం కాలేదు. ఆ తర్వాత శ్రీశ్రీ కుర్చీ మీద చాలా మంది కన్నేశారు. కానీ అది మామూలు కుర్చీ కాదు. చరిత్ర వేసిన సింహాసనం.

అయినా సరే ప్రయత్నించారు. శ్రీశ్రీలాగే తమని తాము మహాకవులుగా భావించుకున్నారు. కానీ చరిత్ర ఆమోద ముద్ర వెయ్యలేదు. కొన్నాళకు అసలు ‘మహాకవి’ పోస్టు అన్నది తెలుగులో వుందా? రద్దయ్యిందా? అని అనుమానం వచ్చింది.

దీనికి తోడు కవి అజంతా ‘శ్రీశ్రీకి ముందు శూస్యం, వెనుక శూన్యం’ అని వేరే ధోరణిలో ప్రకటిస్తే చాలా మంది ఉడుక్కున్నారు. ముఖ్యంగా ఈ పోస్టుకు ప్రయత్నించిన వాళ్ళు ఎక్కువ మంది ఇబ్బందిపడ్డారు కూడా.

ఇంతకీ ఇప్పుడు ఈ ‘మహాకవి’ పోస్టు ఉన్నట్టా లేనట్టా…? శ్రీశ్రీ పుట్టి నూరేళ్ళు కావస్తున్న సందర్భంగా ఈ ప్రశ్న మరోసారి వేసుకోవచ్చు.

xxx                                         xxx                                           xxx

ఇంతకీ మహాకవి అంటే ఎవరు? ఈ మాటకు నిర్వచనం వుందా? ఉండకేం?

‘ఏ కవి ఆవిర్భావం వల్ల సమాజం ఒక్క అడుగయినా ముందుకు వేస్తుందో, ఆ కవే మహాకవి’

ఇలా నిర్వచించింది కూడా వేరే ఎవరో కాదు. అది కూడా శ్రీశ్రీయే.

మరి శ్రీశ్రీ ఆవిర్భావం వల్ల సమాజం ఎన్ని అడుగులు ముందుకు వేసింది? అడుగులేం ఖర్మ. పరుగులు తీసింది. మార్పు తీరిగ్గా నడిచినట్టుంటే కూడా శ్రీశ్రీకి నచ్చదు. ఉరలు పెట్టాల్సిందే. లేకుంటే ఊరుకోడు.

‘పదండి ముందుకు, పదండి తోసుకు. పోదాం పోదాం పైపైకి’ అన్నాడు.

అవును. అదే వేగం. అదే దూకుడు.

శ్రీశ్రీ కవిత్వం చదివి మళ్ళీ కవిత్వంలోకే వచ్చిన వారికన్నా, ఉద్యమాల్లోకి దూకిన వారు ఎక్కువ.

అలాంటి అవకాశంలేక సాధారణ సంసారులుగా మిగిలిపోయిన వారిలో కూడా పూర్ణమానవులుగా మారిన వారు మరీ ఎక్కువ.

ఇంత మందికి శ్రీశ్రీ ఎలా పరిచయమయ్యాడు?

అసలు ఇది ప్రశ్నే కాదు. ఒకవేళ ఎవరయినా ‘నాకు శ్రీశ్రీ తెలియదు’ అంటే ”శ్రీశ్రీని ఎలా తప్పించుకోగలిగారు?’ అని అడగాలి.

శ్రీశ్రీ కవిత్వం ‘మహాప్రస్థానా’న్ని చదివితేనే పరిచయం కావాలని రూలు లేదు. ఎలాగయినా పరిచయం కావచ్చు.

అడవిలోనూ తారసిల్లవచ్చు. మైదానాల్లోనూ పలకరించవచ్చు.

బహిరంగసభల్లోని ఉపన్యానాల్లోనూ, పత్రికల, ఛానెళ్ళ శీర్షికల్లోనూ, ఎక్కడయినా శ్రీశ్రీ ఎదురవ్వవచ్చు.

శ్రీశ్రీ అంటే గోడమీద రాత కావచ్చు. సినిమాలో పాట కావచ్చు.

‘తెల్లవాడు నిన్న నిన్ను భగత్‌సింగు అన్నాడు.

నల్ల వాడు నేడు నిన్ను నక్సలైటు అన్నాడు.

ఎల్లవారు రేపు నిన్ను వేగు చుక్క అంటారు.

ఊగరా… ఊగరా…’

అవును గోడ మీద ఎర్రని రంగుతో ఈ అక్షరాలు చదివినప్పుడు ఎవరి పద్ధతిలో వారు ఊగిపోతారు.

డెభ్భయి, ఎనభయ్యవ దశకాల్లో అయితే విద్యార్థులు ఊగిపోయి అరణ్యమార్గం పట్టేవారు. పోలీసులయితే అదే స్థాయిలో ఊగి పోయి, రాసిన వాడి మీద కుట్రకేసు పెట్టాలనుకునేవాడు.

కానీ రాసిన వాడిదేమో మహాకవి పోస్టు. రాజ్యాంగంలో రాసి లేనిది.

ఇలాఊగిపోకుండా నిమ్మళంగా ‘పుట్టుకతో వృధ్దుల్లాగా, పేర్లకీ, పుకార్లకీ, ఫకీర్లకీ’ నిబధ్ధుల్లాగా వుండే కుర్రవాళ్ళూ వుంటారు. వీళ్ళు కూడా శ్రీశ్రీని తప్పించుకోలేక పోయారు.

ఎనభయ్యవ దశకం ప్రథమార్థంలో వచ్చిన ‘ఆకలి రాజ్యం’లో కమలహాసన్‌ అడుగడుగునా తమిళయాసలో శ్రీశ్రీ మహాప్రస్థాన పద్యాలు చదివాడు. ప్రతీ కవితకూ చప్పట్లు. సరదాగా జీవితాన్ని లాగించేస్తున్న కుర్రవాళ్ళే కొట్టారు. అప్పుడు వాళ్ళంతా శ్రీశ్రీ అంటే హీరోలకు హీరో కాబోలు అనుకున్నారు.

కడకు సినిమాలు కూడా చూడకుండా పూర్తి భక్తి మార్గంలో వుండే వాళ్ళకు కూడా ఏ స్వాతంత్య్ర దినోత్సవం నాడో రేడియోలోనుంచి-

‘ఎవడు వాడు? ఎచటి వాడు? ఇటువచ్చిన తెల్లవాడు? తగిన శాస్తి చేయరా? దీక్షబూని సాగరా?’ అనే పాట వస్తుంటే అలా, ఆగిపోతారు.

ఈ వెర్రి కేకల కుర్రవాళ్ళ గొడవలు నాకెందుకని. ఒక పెద్దాయన ఏ పాత సినిమా ‘కన్యాశుల్కం’ లోనే కూర్చుంటే అక్కడ సావిత్రి నృత్యం చేసే ఆనందం అర్ణవమయతే, అనురాంగ అంబరమయితే, ఆనందపుటంచులు చూద్దాం’ అన్నపాటలో తెలియకుండా లీనమయిపోతాడు.

అందుకే శ్రీశ్రీని తప్పించుకోవటం ఎవరికీ సాధ్యం కాదు.

కారణం శ్రీశ్రీ మన భాషలో ఇంకిపోయిన జాతీయం.

తిట్టుకు శ్రీశ్రీ. ఒట్టుకు శ్రీశ్రీ. పడి కట్టుకు శ్రీశ్రీ

శ్రీశ్రీ ఎన్ని రాసినా, శ్రీశ్రీ అంటేనే ‘మహాప్రస్థానం’. దాని ముందు ఎవరూ నిలవలేరు. ఒక్క చలం తప్ప. ఆయనే దండం పెట్టేశాడు. నేను దీనిని ‘తూచలేనన్నాడు’. కానీ, ఒక డొంక దారి కనిపెట్టాడు. ‘అనుభవించి పలవరించాడు’ . దానినే ”శ్రీశ్రీ యోగ్యతా పత్రం” గా స్వీకరించాడు. ‘తెలుగు కవిత్వాన్ని ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే అపూర్వ శక్తి’ ‘మహాప్రస్థానం’ లో వుందన్నాడు. ఇలాంటి పనులు చేసే వాడు మాంత్రికుడు కావాలి.

శ్రీశ్రీ మాంత్రికుడు. ఏమిటా మంత్రం. ‘కవిత్వమొక ఆల్కెమీ. దాని రహస్యం కవికే తెలుసు’. శ్రీశ్రీ దేన్నయినా కవిత్వం చేయగలడు, కుక్క పిల్లను వెంట తిప్పుకోగలడు. సింహాన్ని ఆడించగలడు.

‘నరక లోకపు జాగిలమ్ములు

గొలుసు త్రెంచుకు

ఉరికి పడ్డాయి

కనక దుర్గా, చండ సింహం

జూలు దులిపీ

ఆవులించింది’

చెయ్యితిరిగిన చిత్రకారుడి దగ్గరకు వెళ్ళి కాగితం మీద, మీరే ఒక పిచ్చిగీత గీసి ఇవ్వండి. దానిలోనుంచి అలవోకగా ఒక చిత్రాన్ని సృష్టిస్తాడు. మీరు వొంపుగా గీసిన గీత- వంగిన విల్లుగానో, మెరిసే హరివిల్లుగానో మారిపోతుంది.

‘హీనంగా చూడకు దేన్నీ, కవితామయమేనోయ్‌ అన్నీ.’ అన్నాడు.

ఇలా అన్నాడు కదా- అని సాటి కవులు కూడా ‘పిచ్చి గీతల్ని మహాచిత్రాలు’ గా మలిచే ప్రయత్నం చేశారు.

‘అగ్గిపుల్లల మీదా, కుక్క పిల్లల మీదా, అరటి తొక్కల మీదా’ కవిత్వం రాయబోయారు. కానీ చాలా మందికి అగ్గిపుల్లలు, తడిసిన అగ్గి పుల్లలుగానే మిగిలి పోయాయి.

కారణం వారికి ‘ఆల్కెమీ’ తెలియక పోవటమే.

శ్రీశ్రీ తనకు ముందున్న కవిత్వాన్నీ, ప్రపంచ కవిత్వాన్నీ అనుభవించాడు. దాని ‘నాభి రహస్యాన్ని’ తెలుసుకున్నాడు,

పైకి మామూలు మాటే. సాధారణ వాక్యమే. ‘చందో బందోబస్తులను చట్‌ ఫట్‌ మని తెంచెయ్యటమే’ అని శ్రీశ్రీ లాగే కొంత మంది తెగబడ్డారు.

‘ఎముకలు క్రుళ్ళిన

వయసు మళ్ళిన

సోమరులారా! చావండి

నెత్తురు మండే

శక్తులు నిండే

సైనికులారా! రారండి.’

ఈ మాత్రం మాటలు మనమూ అనలేమా అనుకున్నారు. కానీ అంతటి తపోశక్తిని ప్రసాదించిన ఆ ఋషి ఎవరన్న అంశం మీద ఆసక్తి చూపలేదు.

అక్కడికీ శ్రీశ్రీ చెబుతూనే వున్నాడు. నాకు సాహిత్యంలో ఋషి త్రయం వున్నారు. వారు ‘బొదిలేర్‌, మొపాసా, ఎడ్గార్‌ ఎలెన్‌ పో’ అని. వీరే కాదు. ప్రపంచ ఆధునిక సాహిత్యంలోని అగ్రతారలు స్విన్‌ బర్న్‌, బ్రెహ్ట్‌, నెరూడాలు ఎందర్నో గమనించాడు, వారి కవిత్వ వ్యూహాలను స్వీకరించాడు. దాంతో ప్రపంచ కవిత్వ అభివ్యక్తి ఆయన్ని ఆవహించింది. దానిని తట్టుకుని, తేరుకుని, ఆ అభివ్యక్తిని తెలుగు జాతీయంగా చేశాడు. శ్రీశ్రీ ఎవరి నుంచి ఏ శిల్పాన్ని, ఏ సౌందర్యాన్ని, ఏ సంగీతాన్ని తీసుకున్నాడో దాచుకోలేదు. అయినప్పటికీ ఆయన మీద కొన్ని ‘అనుకరణ’ అపవాదులు లేక పోలేదు.

‘తాజ్‌ మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెందరు? ‘ అంటూ ప్రశ్నించిన ‘దేశచరిత్రలు’ లాగానే బ్రెహ్ట్‌ రాసిన’Questions from a worker who reads’ అనే కవితలో ‘Who built Thebes of the seven gates?’ ప్రశ్న ఒకే లాగున్నాయంటారు. ఏక కాలంలో రాస్తున్న కవులు ఒకేలా దోపిడీని ప్రశ్నించ కూడదన్న రూలేమీ లేదు.

కొంత మంది శ్రీశ్రీని అనువదించి, ప్రపంచానికి పరిచయం చెయ్యాలనుకుంటారు. ఇది శ్రీశ్రీకి సంబంధించిన ప్రాజెక్టు కాదు. తెలుగు జాతికి సంబంధించిన కార్యక్రమం మాత్రమే. మన గడ్డమీద ఇంకా పుట్టని ప్రపంచపుటూహల్ని మనకి పరిచయం చెయ్యటానికే ఆయన తపనంతా. కాబట్టి మళ్ళీ ఆయన్ని ఆనువదిస్తే, మన కవి అవే ఊహల్ని, ఇంకెంత అందంగా మన జాతీయంలో చెప్పాడో పరిచయం చెయ్యవచ్చు.

కానీ శ్రీశ్రీ గొప్పతనం తెలుగుజాతిలో భాగం కావటంలో వున్నది. ఆయనలాగా దిగివచ్చిన కవి మరి ఒకరు లేరు. ఎదిగి వచ్చిన కవీ లేరు.

‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదన్న’ గొప్ప రహస్యం చెప్పటానికే ఆయన కవిత్వం రాశాడు.

శ్రీశ్రీ శ్రమ మీద ప్రేమను పెంచాడు. మోజును పెంచాడు. ఎంత మోజును పెంచాడంటే, ఆ శ్రమలో భాగమడిగే సోమరులను తిట్టిపోసేటంతగా పెంచాడు.

అందుకే శ్రీశ్రీ శ్రామిక వర్గాలకు దగ్గరయిన కవయ్యాడు.

‘కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,

జాలరి పగ్గం, సాలెలల మగ్గం

శరీర కష్టం స్ఫురింప చేసే

గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి

సహస్ర వృత్తుల సమస్త చిహ్నాల’ను పొగిడాడు.

శ్రామికుల ఉత్పత్తి సాధనాలను, దేవుళ్ళ ఆయుధాలను కీర్తించినట్టు కీర్తించాడు.

ఇదే కవిత్వానికి చివరి వస్తువని అందరూ భావించారు. శ్రీశ్రీ మహాప్రస్థాన గీతాలకు యాభయ్యేళ్ళు వచ్చే వరకూ అలాగే అనుకున్నారు.

xxx                                   xxx                             xxx

కానీ శరీర కష్టంలో స్త్రీల శరీర కష్టం వుందనీ, శ్రామిక వర్గాలే కాదు, శ్రామిక కులాలూ వున్నాయనీ, ఆ మాట కొస్తే ఈ శ్రమ నుంచి వెలివేయబడి, సౌందర్యాన్ని చూడలేని , తిరస్కరించబడిన వృత్తులు చేసే వారున్నారనీ, కవులు కొత్త గొంతుకతో వచ్చేశారు. వీరంతా శ్రీశ్రీ అభిమానులే. శ్రీశ్రీ వారసులే. శ్రీశ్రీ మార్గంలో నడచిన వారే. కానీ శ్రీశ్రీని సైతం ఎదరించారు. శ్రీశ్రీ కవిత్వ వస్తువునకు పరీక్ష పెట్టారు; పదును పెట్టారు. ఒకే ఒక్క మహాకవి పరిపాలించే శకానికి తెర దించారు. ప్రజాస్వామిక అస్తిత్వ యుగాన్ని ఆవిష్కరించారు.

‘పాడుకలలో తల్లికింకా పేగు కదిలిందో లేదో’ అన్న శ్రీశ్రీ లో కూడా ‘తన శరీరంలోనే తాను బందీగా వున్న స్త్రీ’ ని చూడ లేక పోయాడన్నారు.

మరో ఉత్తుంగ తరంగంలా శ్రీశ్రీ పక్కనే పారుతున్న పెను ప్రవాహం జాషువా. శ్రీశ్రీ వర్గ దోపిడిని ప్రశ్నిస్తుంటే, అంతకు ముందుగానే వర్ణ వివక్ష మీద నిప్పులు చెరుగుతున్నాడు జాషువా. ‘కసరి బుసకొట్టు నాతని గాలి సోక నాల్గుపడగల హైందవ నాగరాజు’ అని అస్పృశ్యుల ఆగ్రహానికీ, ఆర్తికీ అభివ్యక్తిని ఇస్తున్నాడు. కానీ ఆ జాషువా కవిత్వాన్ని గుర్తించనట్టే శ్రీశ్రీ చూశాడని ఆయన మీద అభియోగం మోపారు.

ఇప్పుడేకంగా మైనారిటీల, వెనుకబడిన కులాల స్వాభిమానం నుంచి పెనుకవిత్వం పుడుతున్నది. శ్రీశ్రీ తనదని ప్రకటించిన శతాబ్దంలోకి, ఈ సమూహాలు ప్రవేశించాయి. ప్రజాస్వామ్యం వచ్చాక ఏక ఛత్రాధిపత్యాలు వుండవు. ఒకే ఒక్క తార వుండడు; పలు తారలుంటాయి. అందుకే శ్రీశ్రీ తరహా ‘మహాకవి’ పోస్టు ఈ శకంలో రద్దయింది.

కానీ, వీరి ఆవిర్భావానికి కూడా శ్రీశ్రీ దోహద పడ్డాడు. ముందెళ్ళి కంచె నరికి రోడ్డు వేశాడు.

అలాగని శ్రీశ్రీకి ముందు శూన్యం కాదు.

ఆయన కోసం గురజాడ రోడ్డు వేశాడు. ఆయన తర్వాత ఈ సమూహాలున్నాయి.

ఇలా కవిత్వాన్ని భూమార్గం పట్టించినందుకు…

నా వాడా, నా శ్రీశ్రీ, నీకిదే ఈ తరం సైనిక వందనం.

-సతీష్ చందర్ 

-వార్త, జూన్‌, 2010

(సతీష్‌ చందర్‌ ‘నిగ్రహవాక్యం'(సాహిత్య విమర్శ) నుంచి)

2 comments for “శ్రీశ్రీ: అందరి కవి! అందని రవి!

Leave a Reply to Bolloju Baba Cancel reply