Month: May 2012

ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షర ఫ్యాక్షనిజం!

చదవం. చదవబడతాం.

వినం. వినబడతాం.

చూడం. చూడబడతాం.

కారణం? మీడియా.

మీకు నచ్చింది పొందలేరు. ఇచ్చింది తీసుకోవాలి.

అది వార్త కావచ్చు. వ్యాఖ్య కావచ్చు.

అందుకే పత్రిక చదివాక, మనకొచ్చే అభిప్రాయాలు మనవి కావు. రెడీమేడ్‌ వస్త్రాలు తయారు చేసినట్టు ముందుగానే అవి తయారు చేయబడతాయి.

‘డాను’ కిరణ్‌

పేరు : భాను కిరణ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘డాను’ కిరణ్‌( అవును. డాన్‌ను కావాలనుకున్నాను.)

ముద్దు పేర్లు : ‘గన్ను’ పోటు దారు.(నమ్మిన వ్యక్తిని వెనకనుంచి పొడిచినప్పుడు, రాజకీయాల్లో అయితే వెన్నుపోటు అంటారు. మా మాఫియా భాషలో ‘గన్ను’ పోటు అంటారు. కానీ రాజకీయంగా ‘మామ’ను పొడిచిన అల్లుళ్ళు కూడా నన్ను ఆడిపోసుకుంటున్నారు. అదే నాకు బాధగా వుంది.

‘ఉప’ సమరంలో చంద్ర బాంబులు!

మొన్న అవినీతి!

నిన్న మతం!

నేడు నేరం!

అన్నీ బాంబులే! ‘చంద్ర బాంబులే’! జగన్‌ మీద విసిరిన ‘దీపావళి’ బాంబులే!

ఒక్కటీ పేలలేదు. అన్నీ తుస్సుమన్నాయి.

ఇంకేం చేస్తారు?

పాత పాటే. ‘ఆల్‌ ఫ్రీ’! బియ్యం ఉచితం! నిరుద్యోగులకు నెలకు వెయ్యి. ఇలాంటి హామీలు ఇచ్చేస్తానంటున్నారు. ఇదేదో ఉపకార వేతనం అనుకునేరు! ‘ఉప’ ఎన్నికల వేతనం.

బాబా! బాబా! బ్లాక్‌ షీప్‌!!

ఎదగ వచ్చు.

ఎవ్వరు ఎలాగయినా ఎదగ వచ్చు. నిలువుగా ఎదగవచ్చు. అడ్డంగా ఎదగవచ్చు.

లేదూ ముందు అడ్డంగా ఎదిగి, తర్వాత నిలువుగా ఎదగ వచ్చు.

ఎదగటం- ముఖ్యమనుకుంటే చాలు.

పదోతరగతి తప్పిన కుర్రాడు బస్సెక్కుతాడు. అతని కళ్ళ ముందే ఒక పెద్దాయన తన స్టాపులో గబగబా దిగిపోతుంటాడు. పర్సుజారి కుర్రాడి కాళ్ళ మీద పడుతుంది. తీసి కళ్ళకద్దు కుంటాడు. ‘తిరిగి పెద్దాయనకు ఇచ్చే వాణ్ణే కానీ, దిగి వెళ్ళిపోయాడు కదా!’ తనకు తాను సంజాయిషీ ఇచ్చుకుంటాడు. పర్సులో వెయ్యి. తర్వాత ఇలాగే బస్సు ఎక్కుతుంటాడు. ఎవరూ అతని కోసం పర్సు పారేసుకోరు. ఈ సారి తనే ఎవరి పర్సో కొడతాడు. పని తేలికయి పోయింది. తర్వాత కొంపలు కొడతాడు. అలా దొంగ పర్మిట్లూ, దొంగ కాంట్రాక్టులూ కొట్టి శత కోటీశ్వరుడయి పోతాడు. ఇంత వరకూ ఎదిగింది నిలువుగా.