Category: Essays

కలసి రాకే, ‘కుల’కలం!

అడుగులు తడబడినప్పుడెల్లా బడుగులు గుర్తుకొస్తారు.

తెలుగు దేశం , కాంగ్రెస్‌ పార్టీలకు నడక సాగటం లేదు. కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దారుణం. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనూ అడుగు తీసి, అడుగు వేయలేక పోతోంది.

టార్చిలైట్‌ వేసి వెతికినా, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వం- అన్నది కానరావటం లేదు.అక్కడ ప్రధాని మన్‌ మోహన్‌ సింగ్‌ ‘ఉన్నారో, లేదో తెలియదు.’ ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి -‘ఉంటారో, ఊడతారో’ తెలియదు.

ప్రధాని తన ముఖానికే బొగ్గు ‘మసి’ రాసుకుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి తన ‘కేబినెట్‌’ ముఖానికి ‘వాన్‌పిక్‌’ తారు పులిమేశారు.

సోనియా కోపం- రాహుల్‌ కోసం!

సోనియా గాంధీ ‘బొగ్గు’ మన్నారు. పార్లమెంటు ‘మసి’బారింది. సమావేశాల్లో మరో రోజు ‘బ్లాక్‌’ డేగా మారింది. ఏమిటో అంతా ‘నలుపే’. బొగ్గు గనుల కేటాయిపుల అవకతకలపై ‘కాగ్‌’ నివేదిక చూశాక కాగి పోవాల్సింది ప్రతి పక్షం. కానీ, అదేమిటో పాలక పక్షం ఊగిపోతోంది. బీజేపీకి ‘బ్లాక్‌ మెయిలింగే బువ్వ’ అన్నారు సోనియా. బీజేపీ నేతలకు – ‘బ్లాక్‌’ మెయిలింగ్‌ లో ‘బ్లాక్‌’ ఒక్కటే అర్థమయింది. నలుపుకు నలుపే సమాధానం అనుకున్నారో ఏమో సమాధానం కూడా ‘నలుపు’తోనే ఇచ్చారు.

‘ధర్మాన’ పీఠం దద్దరిల్లింది!

‘కిరణ’ం ప్రకాశించటం లేదు. రాష్ట్రంలో ఇది వార్త కాదు.

ఎందుకు ప్రకాశించటం లేదు? ఇదీ ప్రశ్న.

ఈ ప్రశ్నకు పలువురూ ఇచ్చే జవాబు వేరు. పార్టీ అధిష్ఠానం వెతుక్కుంటున్న సమాధానం వేరు.

కిరణంలో కాంతి తక్కువయిందని అందరూ అంటారు.

కానీ, పార్టీ హైకమాండ్‌ అలా అనదు. చుట్టూ చీకటి తక్కువయిందీ- అని అంటుంది.

అందుకే కాబోలు- ‘కిరణ్‌’ చుట్టూ చీకట్లు పెంచుతోంది.

కిరణ్‌ మంత్రి వర్గంలో ‘కళంకితుల’ శాతం పెరుగుతున్న కొద్దీ, ఆయన ఉనికి పెరుగుతుందన్నది హైకమాండ్‌ భావన కాబోలు. ఇంతవరకూ మిణుకు మిణుకు మని దిగులుగా మెరుస్తున్న ‘కిరణం’ ఇప్పటికయినా ప్రకాశవంతంగా కనిపించక పోతుందా-అని ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు చిగురంత ఆశ కాబోలు.

జగన్‌ జర్నీలో ‘మజిలీ’స్‌!

జగన్‌ ప్రణబ్‌కు వోటేశారు.

కాంగ్రెస్‌తో ‘మ్యాచ్‌ ఫిక్సింగా’? వెంటనే అనుమానం.

ఇంకేముంది? యుపీయే అభ్యర్థి, కాంగ్రెస్‌లో కీలకమయిన వ్యక్తి ప్రణబ్‌ ముఖర్జీకి వోటెయ్యటమంటే కాంగ్రెస్‌లో కలవటం కాదూ?

నిజంగానే ఇది ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ల సీజన్‌. సంకీర్ణ రాజకీయ యుగంలో- ఇది సహజం.

కానీ, జగన్‌ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ అంటూ వెంటనే చేసుకోవలసి వస్తే, కాంగ్రెస్‌ తో చేసుకోరు. ఒక వేళ అలా చేసుకుని కలిసిపోతే, అది తన పార్టీ(వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ)కి మంచిది కాదు, కాంగ్రెస్‌ పార్టీకీ మంచిది కాదు. నిన్న కత్తులు దూసుకున్న వారు నేడు కౌగలించుకుంటే, అంతే వేగంగా రెండు పార్టీల్లోని కార్యకర్తలూ చెయ్యలేరు.

జూనియర్‌ ఆట అదుర్స్‌!

కోపం జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద.

కేకలు కొడాలి నాని మీద.

తెలుగుదేశం పార్టీ నాయకుల తాజా వైఖరి ఇది. అధినేత చంద్రబాబు నాయుడు ఆంతర్యం కూడా ఇదే.

జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే చంద్రబాబుకు ప్రియమా? భయమా?

తొలుత ప్రియంగా అనే అనిపించింది. కారణం ఒక్కటే. జూనియర్‌ గ్లామరున్న ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుడు.

ఆవేశంలో ఆమె సగం!

సమస్య అంటేనే స్త్రీ. స్త్రీ అంటేనే సమస్య. ఇది ఇంటి భాగోతం.

సమరం అంటేనే స్త్రీ. స్త్రీ అంటేనే సమరం. ఇది వీధి భారతం.

కేవలం రెండే రెండు దశాబ్దాలలో దేశ పోరాట చిత్రపటాన్ని మార్చేశారు స్త్రీలు. ఇలా అనగానే కేవలం స్త్రీలుగా తమ సమస్యలపైనే తాము పోరాటం చేశారనే నిర్థారణకు రావచ్చు. పురుషులు సైతం ఎదుర్కొనే ఇబ్బందుల మీద కూడా పిడికిళ్లు బిగించారు.

కాకుంటే, తమ పోరాటాలను వెను వెంటనే రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని మాత్రం వీరు భావించలేదు. అదే జరిగితే, పాలన మొత్తాన్ని తలక్రిందులు చేయగలుగుతారు.

రెండు కుటుంబాల పోరు

అధినేత వేరు, నేత వేరు.

ఇద్దరికీ మధ్య చెయ్యి ఊపటానికీ, చేతులు జోడించటానికీ వున్నంత తేడా. అది రోడ్‌ షో కావచ్చు, బహిరంగ సభ కావచ్చు. ఇద్దరూ ఆ తేడాను పాటించాలి.

ఉదాహరణకి సోనియా గాంధీ, కిరణ్‌కుమార్‌ రెడ్డీ ఒకే వేదిక మీదకొచ్చారనుకోండి. వారు మాట్లాడే భాషలే కాదు, దేహ భాషలు కూడా వేరు వేరుగా వుంటాయి. జనం వైపు తిరిగి సోనియా చెయ్యి ఊపితే, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏడుకొండలవాడి ముందు చేతులు జోడించినట్టు అదే జనానికి నమస్కరించాలి.

సై- ఆట మళ్ళీ మొదలు

ఆట మళ్ళీ మొదలు.

మామూలు ఆట కాదు. రక్తసిక్తమైన క్రీడ.

ఒకప్పుడు రెండు టీమ్‌లు సరిపోయాయి. ఇప్పుడు మూడు టీమ్‌లు కావాలి. ఆట కోసం ప్రాణాలు అర్పించాలి. రోడ్ల మీద పరుగులు తీస్తూ నిలువునా దగ్థమవ్వాలి. నడిచే బస్సులు భస్మీపటలమయిపోవాలి.

కేకలు. ఆక్రందనలు. నినాదాలు. ఆమరణ దీక్షలు.

ఈ మృగయా వినోదానికి ముహూర్తాలు పెడుతున్నారు ఢిల్లీలో పెద్దలు.

‘హంగే’ బెంగ!

బెంగ.

2012 లాగే 2014 కూడా ఉంటుందన్న బెంగ.

ఉప ఎన్నికల ఫలితాలే, సార్వత్రిక ఎన్నికల్లోనూ వస్తాయన్న బెంగ.

రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీకి బదులు మూడు ప్రాంతీయ పార్టీలు(తెలుగు దేశంతో పాటు, టీఆర్‌ఎస్‌, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు) వచ్చేశాయన్న బెంగ.

2014 లో సీమాంధ్రలో త్రిముఖ పోటీ, తెలంగాణాలో చతుర్ముఖ పోటీ వుంటుందన్న బెంగ( బీజేపీ చతికిలపడింది. లేకుంటే పంచముఖ పోటీ వుండేది.)

అన్నింటినీ మించి రాష్ట్రంలో ‘త్రిశంకు సభ’ (హంగ్‌ అసెంబ్లీ) వస్తుందన్న బెంగ.

వోటరే విజేత

చివరి నవ్వు వోటరే నవ్వాడు.

గెలిచినవారికి పూర్తి ఆనందాన్ని కానీ, ఓడిన వారికి పూర్తి విషాదాన్ని కానీ మిగల్చలేదు.

ఈ ఉపసమరం అద్దంలాగా ఎవరి నిజరూపాన్ని వారికి చూపించింది. పేరుకు 18 అసెంబ్లీ స్థానాలకూ, ఒక పార్లమెంటు స్థానానికీ జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు. కానీ ఫలితాలు మాత్రం రాష్ట్ర రాజకీయ నాడిని పట్టి ఇచ్చాయి.

జనమే జయమా?

జనమంటే ఏ జనం? వచ్చిన జనమా? తెచ్చిన జనమా? ఇది కూడా శేష ప్రశ్నే.

జనం తమంత తాము రావటానికి- గ్లామరో, అభిమానమో, సానుభూతో వుండాలి. ఒక్కొక్క సారి

ఇవేమీ లేకుండా కూడా ‘విచిత్రమైన ఆసక్తి’తో కూడా జనం వస్తుంటారు. ఎన్టీఆర్‌కు ‘వెన్నుపోటు'( కొందరు తిరుగుబాటు అంటారు లెండి) పొడిచి ముఖ్యమంత్రి అయి, తర్వాత పదవీచ్యుతుడయిన నాదెండ్ల భాస్కరరావు కొత్త పార్టీ (ప్రజాస్వామ్య తెలుగుదేశం) పెట్టి ‘రోడ్‌షో’లు నిర్వహిస్తే, ఆయనను చూడటానికి వచ్చారు. ఎన్టీఆర్‌ మరణానంతరం ఆయన భార్య లక్ష్మీపార్వతి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా జనం ఆమెను చూడటానికి వచ్చారు. కానీ వీరిద్దరికీ జనం ఘోరపరాజయాన్ని చవిచూపించారు.

కాంగ్రెస్‌ తదుపరి పాచిక: మహిళా ముఖ్యమంత్రి?

కేవలం ముగ్గురు మహిళల్ని ఎదుర్కోవటానికి కాంగ్రెస్‌ కు ఇతర మహిళా నేతలు అవసరమవుతారు.

ఇప్పటికకే రేణుకా చౌదరి విజయమ్మ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

కానీ, ఆమెకు రాష్ట్రవ్యాపితంగా అంత ప్రజాదరణ వుండక పోవచ్చు.

ఈ ముగ్గురు మహిళల ప్రభంజనం ఇంకా పెరిగితే, ముఖ్యమంత్రి స్థానంలో కూడా మహిళానేతను కూర్చోబెట్టే ఆలోచన కాంగ్రెస్‌ పార్టీ చెయ్యవచ్చు.

తామే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకోవటం కోసమయినా ఈ పని చెయ్యాల్సి వస్తుంది.

మళ్ళీ వచ్చిన ‘మహిళావోటు బ్యాంకు’

నోట్లకే కాదు, వోట్లకూ బ్యాంకులుంటాయి.

కులానికో బ్యాంకు, వర్గానికో బ్యాంకు, మతానికో, ప్రాంతానికో బ్యాంకు -ఇలా వుంటాయి. అన్ని పార్టీలకూ, వాటి అగ్రనేతలకూ అన్ని బ్యాంకుల్లోనూ డిపాజిట్లుండవు.

ఆంధ్రప్రదేశ్‌నే తీసుకోండి. ఒకప్పుడు తెలుగుదేశానికి కమ్మ కులం వోట్లతో, బీసీల వోట్లు వుండేవి. కాంగ్రెస్‌కు రెడ్డి, కాపు, కులం వోట్లతో పాటు షెడ్యూల్డు కులాల, తెగల వోట్లు వుండేవి.

ఇప్పుడు మారిపోతున్నాయనుకోండి. కానీ, ఎప్పుడో కానీ, జెండర్‌ని బట్టి వోటు బ్యాంకు ఏర్పడదు.

వన్-టూ-టెన్ జగనే..జగను

నెంబర్ వన్ జగన్‌, టూ జగన్‌, త్రీజగన్‌… టెన్‌కూడా జగనే. వైయస్సార్‌ కాంగ్రెస్‌లో నాయకత్వ పరిస్థితి అది. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో వైయస్‌ రాజశేఖర రెడ్డి కూడా అలాగే వున్నారు. వోటర్లను సమ్మోహితుల్ని చెయ్యటానికి పార్టీలో అగ్రతార అలాగే కనిపించాలి. ఇదే ఆకర్షణ. కానీ, పార్టీనిర్మాణానికి ఇది అడ్డంకి అవుతుంది. ప్రతీ పనికీ కార్యకర్తలు అగ్రనేత ఆదేశాల కోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి చిన్న విషయంలోనూ అగ్రనేత తల దూర్చాల్సి వుంటుంది. ఈ పనే ఇప్పుడు జగన్‌ చేస్తున్నారు. జగన్‌ ఆస్తుల కేసులో సిబిఐ జగన్‌ను అరెస్టు చేసి, జైలు పాలు చేస్తే, ఆయన తర్వాత ఆ పాత్రని ఏ నేతలు పోషిస్తారు? రాజకీయాల్లో సంక్షోభం కూడా అవకాశమే. దీనిని ఉపయోగించుకోవటానికి జగన్‌ తర్వాత ఎవరు సిద్ధంగా వున్నారు?

వలసలే భయం -ఉప ఎన్నికలు నయం

ఎన్నికలంటే ఏమిటి?

హామీలూ, వరాలూ, తిట్లూ, శాపనార్థాలూ – ఇవి కదా!

కానీ, కేసులూ, ఖాతాల స్తంభనలూ, ఆస్తుల జప్తులూ, అరెస్టులూ… ఇవేమిటి?

ఎన్నికలప్పుడు- పలు అధికారాలు ప్రభుత్వం నుంచి ఎన్నికల కమిషన్‌(ఇసి) కొచ్చేస్తాయి. అందుచేత ఈ వేళల్లో ఆ సంస్థే తీర్పరిగా వుంటుంది. కానీ ఇప్పుటి (18 అసెంబ్లీ స్థానాల) ఉప ఎన్నికలు చూడండి. హడావిడి ‘ఇసి’ కాదు. అంతా ‘సిబిఐ’ దే.

ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షర ఫ్యాక్షనిజం!

చదవం. చదవబడతాం.

వినం. వినబడతాం.

చూడం. చూడబడతాం.

కారణం? మీడియా.

మీకు నచ్చింది పొందలేరు. ఇచ్చింది తీసుకోవాలి.

అది వార్త కావచ్చు. వ్యాఖ్య కావచ్చు.

అందుకే పత్రిక చదివాక, మనకొచ్చే అభిప్రాయాలు మనవి కావు. రెడీమేడ్‌ వస్త్రాలు తయారు చేసినట్టు ముందుగానే అవి తయారు చేయబడతాయి.

‘ఉప’ సమరంలో చంద్ర బాంబులు!

మొన్న అవినీతి!

నిన్న మతం!

నేడు నేరం!

అన్నీ బాంబులే! ‘చంద్ర బాంబులే’! జగన్‌ మీద విసిరిన ‘దీపావళి’ బాంబులే!

ఒక్కటీ పేలలేదు. అన్నీ తుస్సుమన్నాయి.

ఇంకేం చేస్తారు?

పాత పాటే. ‘ఆల్‌ ఫ్రీ’! బియ్యం ఉచితం! నిరుద్యోగులకు నెలకు వెయ్యి. ఇలాంటి హామీలు ఇచ్చేస్తానంటున్నారు. ఇదేదో ఉపకార వేతనం అనుకునేరు! ‘ఉప’ ఎన్నికల వేతనం.

‘నెలవంక’ కత్తి దూసింది!

కవి వస్తాడు.

చూడాలి. ఎదురు చూడాలి.

ఎలా చూడాలి?

సూర్యుణ్ణి దర్శించినట్లు కాదు, చంద్రుణ్ణి వీక్షించినట్లు చూడాలి.

భళ్ళున తెల్లారినప్పుడు, కిటికీలో భానుణ్ణి ముఖం చిట్లించి చూస్తాం. కానీ నెలవంకను చెట్ల కొమ్మల చిగురుటాకుల సందుల్లోంచి చిరునవ్వుల్తో చూస్తాం.

మండే వాడని తెలిసి కూడా రవిని ఒక్క సారి చూసేస్తాం. మెత్తనిదని తెలిసి కూడా జాబిల్లిని వెతుక్కుంటూ, అంచెలంచెలుగా చూస్తాం.

కవిని చందమామను చూసినట్లు చూడాలి.

అజంతా శిసాగర్‌ను అలాగే చూశాడు.

‘హౌస్‌’ ఫుల్‌! ‘బాక్సు’డల్‌!!

రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు దొందూ దొందే. ‘హౌస్‌’లో (శాసన సభలో) నిండుగా కనిపిస్తారు. కానీ ‘బరి’లోకి దించితే ఒక్కరూ మిగలటం లేదు. కానీ వైయస్సార్‌ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు ‘హౌస్‌’ లో ప్రాతినిథ్యం అంతంత మాత్రమే. కానీ ‘ఉప ఎన్నికల బరి’లోకి దించితే ఎన్నికల ‘బాక్సు’లు ఫుల్లు! అందుకే ‘ఉప ఎన్నికల’ంటే ఆ రెంటికీ ప్రాణసంకటం, ఈ రెంటికీ చెలగాటం.రేపు జరగబోయే ఒక పార్లమెంటు,18 అసెంబ్లీ స్థానాలకు జరిగే ‘ఉప ఎన్నికల’ ఫలితాలు ఊహించినట్టే వుంటాయా?

తెలివి ఎక్కువే! తెలుగే తక్కువ!!

తెలివి తక్కువ వాళ్ళ గురించిన బాధేం లేదు.
దిగులంతా ‘తెలుగు తక్కువ’ వాళ్ళ గురించే.
తక్కువయిన వాళ్ళు తక్కువయినట్లు వుంటారా? ఎక్కువ మాట్లాడతారు. అక్కడితో కూడా అగరు. తెలుగును ఉద్ధరించే సాహసానికి కూడా ఒడిగడతారు.
ఈ ఉధ్ధారకులు అన్ని రంగాల్లోనూ వుంటారు. ప్రసార మాధ్యమాల్లోనూ, విద్యాలయాల్లోనూ కాస్త ఎక్కువగా వున్నట్లు అనిపిస్తారు.అందుకు కారణం వారి గొంతులు పెద్దవని కాదు కానీ, వారి ముందు అమర్చిన మైకులు పెద్దవి.