Category: ఈ-పేపర్

‘గాంధీ’ని చూపితేనే, వోటు!!

అభ్యర్థి జేబులోని అయిదువందల రూపాయి నోటు తీసి, వోటరు చేతిలో పెట్టి- ‘చూస్కో గాంధీ వున్నాడో? లేదో?’ అంటాడు. తళ తళ లాడే నోటును కళ్ళ దగ్గర పెట్టుకుని, బోసినవ్వుల గాంధీని చూసుకుని- ‘ఇప్పుడు నమ్ముతాను నువ్వ గాంధేయ వాదివని. నా వోటు నీకేలే ఫో!’ అంటాడు.

అవును. మరి. గాంధీ ముఖం చూసి వోటేస్తున్నారు కానీ, అభ్యర్థుల్ని చూసి వేస్తున్నారా?

రాబందుల ‘లెక్కల’ చప్పుడు!

విపత్తు!

జనానికి శాపం. నేతలకు వరం.

నేతల్లో ఆపక్షమూ, ఈ పక్షమూ అని కాదు, ఏ పక్ష నేతలకయినా సదవకాశమే.

ఒక గుడిసె అంటూ వుంటే, గుడిసెలో ఓ విద్యుత్తు బల్బనో, అందులో గ్యాస్‌ పొయ్యనో, వంటనూననో- ఇలాంటి కోరికలు జనానికి పుడతాయి.

అదే వరదొచ్చి గుడిసే పోయిందనుకోండి. దానితో పాటు మంచం, కంచం, బర్రే, గొర్రే, పగ్గం, మగ్గం- కూడా అన్నీ కొట్టుకు పోయాయనుకోండి.. అడగటానికి ఏముంటుంది?

కడుపు నింపుకోవటానికి ఓ ఆహార పొట్లాం. కప్పుకోవటానికి ఓ పాత దుప్పటీ.

ఇవి పంచిన వాడు దేవుడు.

ప్రజాస్వామ్యంలో రాచరికం!

దేవుడు లేక పోతే ఏమయింది? వెంటనే ఒక దేవుణ్ణి సృష్టించండి. ఇదో పాత సూక్తి. రాజులేక పోతే నష్టమేముంది? వెంటనే రాజునో లేక రాజునో సృష్టించండి. మన దేశ వర్తమాన చరిత్రను చూసినప్పుడెల్లా ఈ సూక్తిని ఇలా కొత్తగా మార్చుకోవాలనిపిస్తుంది. ఆలోచించటానికి బధ్ధకమయినప్పుడో, మృత్యువుభయపెట్టినప్పుడో-కొందరు నిజంగానే దేవుడుంటే బాగుండుననుకుంటారు. ఉన్నట్టు విశ్వసిస్తారు. ప్రజాస్వామ్యం వచ్చేశాక కూడా, రాచరికం మనస్సులో వుండి పోతుంది. కారణం కూడా అంతే.

‘వెనకబడ’తారు!’అంటు’కుంటారు!!

ఏ పార్టీకయినా హఠాత్తుగా ‘అంటరానివారు’ గుర్తొచ్చారంటే, ఆ పార్టీని వోటర్లు ‘వెలి’ వేశారని అర్థం చేసుకోవాలి. అలాగే ‘వెనుబడిన వారు’ గుర్తొచ్చారంటే ఆ పార్టీ వోట్లవేటలో ‘వెనుకబడిందీ’ అని అర్థం. ఆ లెక్కన చూసుకుంటే, పార్టీలన్నీ అయితే ‘అంటరాని’వో లేక, ‘వెనుకబడినవో’ అయినట్లే.

కిరణ్‌-పాల్‌ గ్యాస్‌ ట్రాజెడీ!

వెనకటికి, ఒక హాలీవుడ్‌ తార పనుల హడావిడిలో పడి, తన పెళ్ళికి తాను హాజరు కావటం మరచిపోయిందట. కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి కూడా ఈ మధ్య తన సన్మాన సభకు తాను గైర్హాజరయ్యారు. ఆయనకూ పనుల హడావిడే నంటే నమ్ముతారా? నమ్మరు. ‘అంతా. గ్యాస్‌’ అంటారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నిండా ‘గ్యాసే’. పడని ఇద్దరి కాంగ్రెస్‌ నేతల మధ్య ‘గ్రాసే'(పచ్చగడ్డే) వేయ నవసరం లేదు. కొంచెం ‘గ్యాస్‌’ వేసినా చాలు. భగ్గు మంటుంది.

‘ఖాకి’ వన్నె లేళ్ళు!

ప్రజాస్వామ్యం కూడా నలుగు రంగులు వుంటాయి. అది కూడా ఒక రకంగా చూస్తే చాతుర్వర్ణ వ్యవస్థే. శాసన శాఖ ‘పచ్చ’గా వుంటుంది. అక్కడికి గెలిచి వచ్చేది ‘పచ్చ’ నోట్లతోనే కదా! న్యాయశాఖ నల్ల గా వుంటుంది. న్యాయవాదులూ, న్యాయమూర్తులు వేసుకునే (కొందరి విషయంలో జేబులో వేసుకునే) ‘కోట్ల’ సాక్షిగా ‘నల్ల’గా వుంటుంది. మరి ‘మీడియా’? ఏ రంగులో చూస్తే ఆరంగులో కనిపిస్తుంది. ఇంతకీ ప్రజాస్వామ్యం కీలకమైన ‘కార్యనిర్వాహక’ వాఖ (గవర్నమెంటు) ఏ రంగులో వుంటుంది? ఈ ప్రశ్న సాధారణ పౌరుణ్ణి అడగాలి. తడుముకోకుండా ‘ఖాకీ’ రంగులో వుంటుందని చెబుతాడు.

మధ్యతరగతి ‘మెట్టు’ వేదాంతం!

అదేమిటో కానీ, గట్టెక్కిన వాడు నీళ్ళలో వున్న వాడికీ; పై మెట్టు మీద వున్న వాడు, కింద మెట్టు మీద వున్న వాడికీ- పాఠం చెప్పేయాలని తెగ ఉత్సాహపడిపోతాడు. సంపన్నుడు మధ్య తరగతి వాడికీ; మధ్య తరగతి వాడు, పేదవాడికీ ఇలా నీతిని బోధించాలని తెగ ఉబలాట పడిపోతారు. ఈ మధ్య కాలంలో మధ్యతరగతి వారి ఉత్సాహం కట్టలు తెంచేసుకుంటోంది. ఏ ఐటీ చదువో వెలగబెట్టి, అంతకు తగ్గ కార్పోరేటు కొలువు పట్టేస్తే చాలు- కింద వారికి చెప్పడానికి నీతి కథలు తన్నుకుంటూ వచ్చేస్తాయి. అలాంటి నీతి పాఠాల్లో, తొలి నీతి పాఠం- ‘అవినీతి పాఠం’.

‘ఈ ఏడుపు మాది’

ఏడుపు ఏడుపే. దానికేదీ సాటి రాదు. ఏడుపుకున్న మార్కెట్టు నవ్వుకు వుండదు. ఎవరన్నా ఏడుపుగొట్టు సినిమా తీయటం- పాపం, ఎదురు డబ్బిచ్చి, టిక్కెట్టు కొని ఏడ్చి వస్తాం. సినిమావాళ్ళకు అనవసరమయిన విషయాల్లో సిగ్గెక్కువ. ఏడుపును ఏడుపని అనరు. సెంటిమెంటు- అంటారు. త్రీడీ సినిమాలు చూడటానికి కళ్ళజోళ్ళు పంచినట్లు, సెంటిమెంటు సినిమాలు చూడటానికి చేతిరుమాళ్ళు పంచిన సందర్భాలు కూడా వున్నాయి.

మరీ ఫిలాసఫీ అనుకోకపోతే- ఏడుపులేకుండా, పుట్టుకా లేదు, చావులేదు. కాకపోతే మనిషి పుట్టినప్పుడు తానేడుస్తాడు, చచ్చినప్పుడు ఇతరులు ఏడుస్తారు. నడమంతరపు సిరి నవ్వు. మధ్యలో వచ్చి మధ్యలోనే పోతుంది.

యెడ్డి తగవుకు ‘షెట్టర్‌’ వేశారు!

‘కమలం’మీద ‘యెడ్డి’ పడ్డా, ‘యెడ్డి’ మీద కమలం పడ్డా, నలిగేది ‘కమలమే’. కర్ణాటకలో బీజేపీ నలిగి పోయింది. కారణం ‘బిఎస్‌’ యెడ్యూరప్ప.

ఇక్కడ యెడ్యూరప్పకూ, బీజేపీ మధ్య ఒక తగవు నడుస్తోంది. అది ‘చెట్టు ముందా? కాయ ముందా?’ లాంటి తగవు. ఈ తగవు మొదలయి నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇంకా తేల లేదు. 2008లో కర్ణాటకలో బీజేపి గెలిచింది. నమ్మడం కష్టం అయింది అందరికీ, బీజేపీ జాతీయ నేతలయితే ఒక సారి తమను తాము గిచ్చుకుని చూసుకున్నారు. నిజమే. కలకాదు. ‘గెలిచాం’ అనుకున్నారు.

అలకే అంతర్గత ప్రజాస్వామ్యం!

అలకల్లేని కాపురం- అలల్లేని సముద్రం వంటిది. అంటే మృతసాగరం(డెడ్‌సీ) అన్నమాట. ‘మా ఆవిడ అలగనే అలగదు’ అని ఏ మగడయినా అన్నాడంటే అతడి మీద జాలి పడాలి. కారణం- అమెకు అతగాడి మీద రవంత ప్రేమ కూడా లేదన్నమాట.

అలకల్లేని కాపురాలు లేనట్టే, అసమ్మతి లేని పార్టీలూ వుండవు. ‘మా పార్టీలో ‘అసమ్మతి’ అన్న ప్రశ్నే లేదు’- అన్నారంటే అది పార్టీయే కాదన్నమాట. ఒక వ్యక్తి కేంద్రంగా నడిచే సమూహమన్నమాట. అక్కడ ప్రజస్వామ్యన్నదే లేదన్నమాట. ప్రేమ లేని కాపురాలు- కాపురాలు ఎలా కావో, ప్రజాస్వామ్యం లేని పార్టీలు కూడా పార్టీలు కావు.

‘కాల్‌’ యములున్నారు జాగ్రత్త!

‘డాడీ! డాడీ! మమ్మీ కాల్తోంది!’

‘ఎక్కడుంది?’

‘కిచెన్లో!’

కంగారు పడాల్సిన పనేలేదు. ‘తెంగ్లీషు’ కదా అలాగే వుంటుంది. ‘మమ్మీ పిలుస్తోంది’ అని కూడా చెప్పవచ్చు. కానీ మామూలుగా పిలవట్లేదు. ‘మొబైల్లో’ పిలుస్తోంది. దాన్ని పిలుపు అంటే బాగుండదనీ, ‘కాల్‌’ అనే అనాలనీ మొబైల్‌ కంపెనీ వాళ్ళే తేల్చేశారు- టీవీ ప్రకటనల సాక్షిగా.

కోటికి ఒకడు.. కూటికి లక్షలు!

ఒక్కడు.. ఒకే ఒక్కడు.. నూటికొక్కడు.. కోటికొక్కడు.

సినిమాలకే కాదు, రాజకీయాలకు కూడా మంచి టైటిల్సే. అలాఅని పోరాడే భగత్‌సింగో, అల్లూరి సీతారామ రాజో కోటి మందిలో ఒక్కడు వుంటాడని కాదు. నడుస్తున్నవి పూర్తిగా ఉద్యమ రాజకీయాలయితే, అలా అనుకో వచ్చు. కానీ కాదు. ఇవి పచ్చి అధికార రాజకీయాలు. ఇక్కడ కోటికి ఒక్కడు అంటే, కోటిలో ఒక్కరికి పీట వేసి, కోటి మందినీ సుఖపెట్టిన కీర్తిని కొట్టెయ్యటం.

సెటిలర్లు కారు.. వారు ‘షటిల’ర్లు!

వలసలు.వలసలు. నిన్నటి వరకూ ప్రాంతం నుంచి ప్రాంతానికి. నేడు పార్టీనుంచి పార్టీకి.

మొదటిరకం వారికి ‘సెటిలర్లు’ అనే ముద్దు పేరు వుండేది. ఎందుకంటే వారు చుట్టపు చూపునకు వచ్చి సెటిలయిపోయేవారు. అయితే రెండోరకం వారికి ఏం ముద్దు పేరు పెట్టవచ్చు? బహుశా ‘షటిల’ర్లు – అంటే సరిపోతుందేమో! ఎందుకంటే ఆ పార్టీనుంచి ఈ పార్టీకే కాదు, ఈ పార్టీనుంచి ఆ పార్టీకి కూడా వెళ్ళ వచ్చు.

తారలు ‘దిగి వెళ్ళిన’ వేళ!

పట్టపగలు తారలు కనిపిస్తాయా? సినిమా తారలూ అంతే. సినిమాల్లో రాత్రయినా, పగలయినా వేషం వెయ్చొచ్చు. కానీ రాజకీయాల్లో మాత్రం పగటి వేషమే నడుస్తుంది. ‘ఈ వేషం మేం వెయ్యలేమా?’ అని నిన్న మొన్నటి వరకూ సినిమా తారలకూ పోటీ పడ్డారు. వెయ్చొచ్చు. ప్రచార రథాలెక్కి తొడలు చరచవచ్చు. మీసాలూ మెలివేయనూ వచ్చు. ఆ తర్వాత…? ఎవరి డైలాగులు వారు రాసుకోవాలి. చెప్పాలి.

మారు మనువుకు బాజాలెక్కువ

మొదటి సారి పెళ్ళి చేసుకుంటున్నాను. మీరు తప్పకుండా రావాలి’ అని పిలిచిన వాడు-నిజంగా కాలజ్ఞాని. పెళ్ళనేది జీవితంలో ఒక్క సారే జరుగుతుందనుకునే అమాయకుడు కాడు అతను. విడాకులు ఇచ్చే చాకచక్యముండాలనే కానీ, ఎన్ని సార్లయినా మూడేసి ‘జారు’ ముడులు వేయవచ్చు. జన్మకో శివరాత్రి వుంటే వుండొచ్చు కానీ, ఇంత బతుక్కీ ఒకే ఒక్క తొలి రాత్రా? ఇలా ఆలోచించే నిత్య పెళ్ళికొడుకులున్న ఇంట ఎప్పుడూ పచ్చతోరణాలే.

రాజకీయమే ‘కుటుంబ’ కథా చిత్రం!

నాభి మీద కొడితే రావణాసురుడు కూలి పోతాడు.

నాభి దాటి వచ్చి తొడల మీద కొడితే దుర్యోధనుడు కూలిపోతాడు.

రెండూ ‘బిలో ది బెల్ట్‌’ పధ్ధతులే.

యుధ్ధనీతి తప్పటమే రాజనీతి!

పోతూ, పోతూ.. రావణాసురుడు పదితలల్లోని పదినోళ్ళతో రాజనీతి చెప్పాడంటారు. ఏమి చెప్పాడో? అప్పుడు ఏమో కానీ, ఇప్పుడయితే, రాజకీయాల్లో దెబ్బతిన్న ఏ

రాజనీతిజ్ఞుడయినా చెప్పే నీతి ఒక్కటే వుంటుంది:

కనకం, కులం, కుటుంబం- ఏ మూడూ కలిస్తేనే రాజకీయం.

‘చేతులు’ కాలాక ‘పువ్వులు’!

వోటర్లకు చేతులు కాలాయి. ఏం పట్టుకోవాలి? తమిళ వోటర్లయితే ‘ఆకులు’ పట్టుకున్నారు.( జయలలిత పార్టీ అన్నా డిఎంకె గుర్తు రెండు ‘విడాకులు’ లెండి.) తెలుగు వోటర్లయితే .. అందునా తెలంగాణ వోటర్లయితే ‘పూలు’ పట్టుకోవచ్చు. అయితే ఏ పూలు పట్టుకోవాలన్నది సమస్య. మొన్నటి దాకా తెలంగాణ మొత్తానికి ఒకే ఒక పువ్వు వుండేది. అదే (టీఆర్‌ఎస్‌) ‘గులాబీ’ ఇప్పుడు ఇంకొక పువ్వొచ్చి పడింది. అదే (బీజేపీ) ‘కమలం’. అయితే తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన ‘జేయేసీ’ కోదండ రామునికి కొత్త సమస్య వచ్చింది. తెలంగాణ తల్లి దగ్గర నిలబడి దగ్గర వారం రోజులుగా ఒకే కీర్తన ఆలపిస్తున్నారు.