Category: పద చిత్రం

బాగా ఉక్కబోస్తున్నప్పుడు, అలా కిటికీ లోంచి మెత్తని గాలి ముఖాన్నితాకి వెళ్ళిపోతుందే, అలా ఏదో ఒక భావన మనసుని తాకి వెళ్ళి పోతుంది. కాస్సేపు కూడా నిలవదు. దానిని పట్టుకోలేను. విడవ లేను. అనుభవించటం తప్ప వేరే ఏమీ చేయలేను. అదుగో అలాంటి భావనలే ఇలా ’పదచిత్రాలు’ అయ్యాయి. పొందింది, పొందినట్లు పొందుపరిచాను. నేను కొన్ని దినపత్రికలకు సంపాదకుడిగా వున్నప్పడు, ఎడతెరపిలేని రాజకీయ వార్తలూ, విశ్లేషణలూ, సంపాదకీయాల మధ్య, ఈ ఊహలే నన్ను సేద తీర్చేవి.

సంక్షిప్త మరణం

క్షణం కూడా కాలమే. ఒక్కొక్క సారి క్షణమే శాశ్వతమైన చిత్తరువయిపోతుంది. చెరిపేద్దామన్నా చెరగదు. అందుకే నుదుటి మీద చెమట బొట్టును విదల్చేసినట్టు క్షణాన్ని విసిరేయకూడదు. అది ఎవరో ఒక అపరిచితురాలు అలా నవ్వుతూ చూసిన క్షణం కావచ్చు. లేదా, అమ్మ తన పని తాను చేసుకుంటూ తలను నిమిరి వెళ్ళిన క్షణం కావచ్చు. లేదా, కేవలం ఆత్మగౌరవం కోసం రాజీనామా పత్రాన్ని యజమాని ముఖం మీద కొట్టిన క్షణం కావచ్చు. బతికిన క్షణమంటే అదేనేమో కూడా..!

మొలచిన కల

(ఏడ్చి ఏడ్చి ఊరుకున్న కళ్ళల్లోకి చూడండి. ఒక మెరుపు. ఒక ఆశ. ఒక ఇంధ్రధనువు. మాటా, మాటా అనుకున్న ప్రతీసారీ, ఈ అనుబంధం ఇలా ముగిసిపోతుందనే అనుకుంటాం. కానీ, మరుసటి రోజు ఇద్దరి కరస్పర్శతో ఓ కొత్త ఉదయం! అంత పెద్ద చెట్టు కూలి పోయిందనే భావిస్తాం. కానీ కాస్సేపు విత్తనం లో దాక్కొని విరాట పర్వానికి తీస్తుంది. చినుకు పడగానే విచ్చుకొని మెల్ల మెల్లగా విశ్వరూపం ధరిస్తుంది.)

అగ్ని దేహం

(ఏదీ గొప్ప కాదు. ఏదీ వింత కాదు. అలవాటయితే అన్నీ పాతవే. అసలు అలవాటే పాతదనం. పేదరికమూ భరించగా భరించగా పాతపడిపోతుంది. వాడెవడో వీపున కొరడా తీసుకుని కొట్టుకుంటాడు- పిడికెడు మెతుకుల కోసం. వాడికి దెబ్బలు పాతపడిపోయి వుంటాయి. సన్మానాలంత పురాతనమయిపోయి వుంటాయి. కానీ వాడిని కన్నతల్లికి మాత్రం ప్రతీ దెబ్బాకొత్తదే.)

అనుకరణ

అనుకుంటాం కానీ,మనసును కూడా పెట్టుకుని వెళ్ళటం-అంటే పసిపిల్లాడిని వెంటతీసుకుని వెళ్ళటమే.ప్రతి చిన్న వస్తువూ వాడికి వింతే. పువ్వు పూసేయటమూ, కోకిల కూసేయటమూ, పండు రాలిపడటమూ- ఏది చూసినా అక్కడ ఆగిపోతుంటాడు. మనల్ని ఆపేస్తాడు. మనసూ అంతే. ఎక్కడ పడితే అక్కడ తాను పడిపోతుంది.మనల్ని పడేస్తుంది.

ఏమవుతారు?

(విడివిడిగా వుంటే చుక్కలే.కలిపితేనే కదా ముగ్గు? చెల్లాచెదురుగా వుంటే ఉత్త పదాలే?కలిపితేనే కదా వాక్యం? ఎడమ ఎడమగా వుంటే ఏకాకులమే. కలివిడిగా వుంటేనే కదా సమూహం? అందమయినా,ఆనందమయినా వుండేది కలయకలోనే. నన్నునిన్నుతో హెచ్చవేస్తేనే కదా- అనుబంధమయినా, పెనుబంధమయినా…)

తడారిన ఎడారి

రోజూ చూసేవే, కానీ చూడనట్లు చూడాలనిపిస్తుంది.ఎరిగిన దారే.ఎరగనట్లుగా వెతుక్కోవాలనిపిస్తుంది. అప్పుడే అంతా వింత వింతగా, కొత్త, కొత్తగా… వుంటుంది. లేకపోతే, బతికిన బతుకే తిరిగి తిరిగి బతకుతున్నట్లుంటుంది.

స్వప్నాంతరం

జీవితానికి ముసుగు తత్త్వవేత్తకూ నచ్చదు. కవికీ నచ్చదు.తత్త్వవేత్త మొత్తం ఆ ముసుగు తీసి వేస్తాడు.కవి కూడా అదే పని చేస్తాడు. కానీ భావుకతతో మేలి ముసుగు వేస్తాడు.పొద్దున్నే పొడుచుకొచ్చే సూర్యుడి కి మబ్బులు అడ్డొస్తే ఊరుకోడు. కానీ,తాను మాత్రం పల్చని మంచుతెర మాటునుంచి చూస్తానంటాడు.సౌందర్యం గొప్పది కదా..

వెన్నెల ముద్ద

ఒకరి కన్నీళ్ళు ఒకరు తుడుస్తున్నప్పడు చూశారా? గొప్ప్ర సన్నివేశం కదూ.వాన వెలిశాక హరివిల్లు విరిసినట్లుంటుంది. ఈ హరివిల్లేమో, ఈ కొండ నుంచి ఆ కొండకు విస్తరించినట్లువుంటుందా! ఓదార్పు కూడా అంతే, ఈ గుండెనుంచి ఆ గుండెవరకూ …హరివిల్లు వెళ్ళిపోతుంది. ఆ చిత్రం మనసులో నిలిచిపోతుంది.ఇలాంటిదే ఒక పదచిత్రం ’వెన్నెల ముద్ద’..

మెట్ల వేదాంతం

ఆమె నా ముందే వుంది. కానీ ఏం లాభం? రెప్పవేయదు.పెదవులు విరవదు. మెడ కూడా తిప్పదు. కదిలితేనే కదా, చెలి జాడ? పాకటం, నడవటం, ఎగరటం, దూకటం- అన్నీ కదలికలే. ఎటు నుంచి ఎటన్నది తర్వాత విషయం.చలనమే జీవితం. చలనమే కవిత్వం.

సజల నేత్రి

అటూ, ఇటూ, ఎటో చూస్తూ వుంటూంటాం. కన్ను దేని మీదయినా పడవచ్చు. అది గడ్డిపరక కావచ్చు. గగనమూ కావచ్చు. మనల్ని అందులో చూసుకుంటాం. కాదు.. కాదు.. దానిని మనలా మార్చుకుంటాం. అందుకోసం ఉత్తినే నోటికొచ్చిన నాలుగు మాటల్ని వాడుకుంటాం. పాపం! పిచ్చి మాటలు! వాటికి తెలియకుండా అవి కవిత్వమయి కూర్చుంటాయి.

ఆమె పేరు ప్రకృతి

తెల్లని కాన్వాసు మీద, పచ్చని రంగులో ముంచిన కుంచెతో, అలా దురుసుగా ఇటునుంచి అటు రాసి చూడండి. ఏదో ఒక రూపం. అనుకోకుండా వచ్చిన రూపం అనుకుంటాం కదా. కానీ, ఎక్కడో, ఎప్పుడో, ఆ రూపాన్ని స్వప్నించే వుంటాం. మనకు తెలియకుండా మనముందు సాక్షాత్కరించేదే కళయినా, కవిత్వమయినా.

రెండు గీతల నడుమ…!

అప్పుడే నవ్వుతాం. అంతలోనే ఏడుస్తాం.ఎంత బావుంటుంది. కానీ ఇలా ఎప్పుడుంటాం. చిన్నప్పుడే. పెద్దయ్యాక, ఏదీ పెద్ధగా చెయ్యం. పెదవులు పెద్దగా కదప కుండా నవ్వాలని, కళ్ళు పెద్దగా తడవకుండా ఏడ్వాలనీ ప్రయత్నిస్తాం.కడకు నవ్వని,ఏడ్వని నాగరీకులంగా మారిపోతాం. గాంభీర్యం అంతటా వచనంలా ఆక్రమించుకుంటుంది. కడకు జీవితంలోంచి ముఖ్యమయినది ఒకటి ఎగిరిపోతుంది. ఏమిటది

మహావృక్షం

బాగా ఉక్కబోస్తున్నప్పుడు, అలా కిటికీ లోంచి మెత్తని గాలి ముఖాన్నితాకి వెళ్ళిపోతుందే, అలా ఏదో ఒక భావన మనసుని తాకి వెళ్ళి పోతుంది. కాస్సేపు కూడా నిలవదు. దానిని పట్టుకోలేను. విడవ లేను. అనుభవించటం తప్ప వేరే ఏమీ చేయలేను. అదుగో అలాంటి భావనలే ఇలా ’పదచిత్రాలు’ అయ్యాయి. పొందింది, పొందినట్లు పొందుపరిచాను. నేను కొన్ని దినపత్రికలకు సంపాదకుడిగా వున్నప్పడు, ఎడతెరపిలేని రాజకీయ వార్తలూ, విశ్లేషణలూ, సంపాదకీయాల మధ్య, ఈ ఊహలే నన్ను సేద తీర్చేవి. ముందు‘మహావృక్షం’తో మొదలు పెడదాం.