నిన్నటి కలలే నేటి అలలు!

శ్రీశ్రీ పక్కన నిలుచున్నా, సముద్రపు వొడ్డున కూర్చున్నా ఒక్కటే. చిరుకోపం వుంటే మహోద్రేకమవుతుంది. కొంచెం దు:ఖమే కావచ్చు. దావాలనమవుతుంది. చిన్ననవ్వే పెనుసంబరంగా మారుతుంది.
శ్రీశ్రీ సముద్రమంతటి ఉత్ప్రేరకం. వామనుడికి సైతం విశ్వరూపాన్ని ప్రదర్శించగల శక్తి అది. శ్రీశ్రీ చైన్నైలో వున్నా, విశాఖలో వున్నా సముద్రాన్ని ప్రేమించేవాడు. సముద్రంలేని చోట వుండటానికి ఇష్ట పడేవాడు కాడు.
డెరెక్‌ వాలకాట్‌కి సముద్రమంటే ఎంత ఇష్టమో, శ్రీశ్రీకీ సముద్రమన్నా అంతే ఇష్టం. సముద్రాన్ని కోల్పోవటం చిన్న విషయం కాదు. ‘సముద్రాన్ని కోల్పోయిన జీవితం దేహాన్ని కోల్పోయిన వస్త్రం లాంటింద’న్నాడు వాల్‌కాట్‌ చమత్కారంగా.
శ్రీశ్రీని కోల్పోవటమూ అంతే. శ్రీశ్రీ లేని ఆధునిక తెలుగు కవిత్వం ఆత్మ లేని అక్షరం లాంటిది. నిజం చెప్పాలంటే శ్రీశ్రీ తెలుగు కవితకు ఆత్మనే కాదు. ఆకృతిని కూడా ఇచ్చాడు.
అంత వరకూ ‘నాలుగు పాదాలా’ నడిచే జీవి, హఠాత్తుగా ముందు కాళ్ళు పైకెత్తి ‘నేను మానవుణ్ణి’ అని ప్రకటించినట్లు, శ్రీశ్రీ వచ్చాక తెలుగు కవిత్వం, ‘చందో బందోబస్తులను చటఫట్‌ మని తెంచేసు’కుని వెన్నెముక మీద నిలబడింది.
అందుకే శ్రీశ్రీ కవిత్వం ఒక ఉత్సవం. కవిత్వం పరిణామ క్రమంలో ఒక పెను ఘట్టం.
శ్రీశ్రీ పుట్టి వందేళ్ళు కావచ్చు. ‘ఆకలి దశకం'(హంగ్రీ థర్టీస్‌)లో పుట్టిన ‘మహాప్రస్థాన’ గీతాలకు ఏడు పదులూ నిండవచ్చు.
కానీ, శ్రీశ్రీ నీకూ, నాకూ సమకాలికుడు. నీకూ, నాకే కాదు, చందమామలో రొట్టె ముక్కను చూసే కుర్ర బిచ్చగాడికి కూడా సమకాలికుడు.
శ్రీశ్రీ మానవుణ్ణి కొలిచాడు. ఎవడ్రా మానవుడు? ప్రకృతి మలచుకున్న అపురూప శిల్పం మానవుడు. భూమి పొరల్లోని కోట్ల సంవత్సరాల జ్ఞాపకం మానవుడు. సప్త సముద్రాలూ కలిసి కచేరి చేస్తే పుట్టే సంగీతం మానవుడు.
‘మానవుడే నా సంగీతం’ అన్నాడు.
అవును. శ్రీశ్రీకి మానవుడే శ్రుతీ, లయా. ఈ రెంటినీ శ్రమలోనే చూశాడు. కమ్మరి కొలిమి లోని ‘లోహ సంగీతం’, కుమ్మరి చక్రంలోని ‘నిశ్శబ్ద తరంగం’, ‘జాలరి పగ్గం’లోని ‘ప్రవాహ గానం’, ‘సాలెల మగ్గం’ లోని ‘మృదంగ ధ్వనీ’ చెవులారా విన్నాడు.
శ్రమే సౌందర్యం. శ్రమే సంపద.
ఈ రెంటి మీదా చెయ్యి వేసే హక్కు సోమరులకు లేదు. ఈ రెంటినుంచి శ్రామికుణ్ణి వేరు చేశారో… సంఘర్షణ తప్పదు. అదే చరిత.
‘పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను.’
ఈ చరిత్రను తిరగరాస్తున్న వారికి శ్రీశ్రీ కవిత్వం కొత్త నెత్తురు.
… … …
శ్రీశ్రీ రాసిందే రాస్తేనో, శ్రీశ్రీ చేసిందే చేస్తేనో, కొత్త నెత్తురు వృధా అయ్యేది. శ్రీశ్రీ యుగం తర్వాత, కొత్త యుగాలు ఆవిర్భవించేవి కావు.’పరపీడన పరాయణత్వాని’కి కొత్త కోణాలు వచ్చేవి కావు.
‘పురుష పీడన’ను నిరసిస్తూ ‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తున్నారు’ అని స్త్రీలు మరో యుగాన్ని ఆవిష్కరించే వారు కారు.
‘బలవంతులు దుర్బల జాతిని బానిసల్ని గావిస్తుంటే’…’పంచముడంటే అయిదు వేలు లేని వాడేనా?’ అని దళితులు ప్రశ్నించి ఆత్మగౌరవ యుగావిష్కరణ చేసే వారు కాదు.
‘సమస్త వృత్తుల సమస్త చిహ్నాలూ’ అవమాన సూచికలుగా మారినప్పుడు ‘వెనుకబడిన కులాలే, వెంటాడే కలాలుగా’ బహుజనశకానికి శ్రీకారం చుట్టేవారు కారు.
శ్రీశ్రీ ని తలవటమంటే శ్రీశ్రీని దాటి రావటం. శ్రీశ్రీ చరిత్రను మలుపు తిప్పిన మైలురాయి. మన ప్రయాణం మహోద్వేగంతో సాగిపోతోంది.
శ్రీశ్రీ వెంట మనమూ, మన వెంటే శ్రీశ్రీ సాగి పోతున్నాం.
అవును. ‘మానవుడే మా సంగీతం’ అని నినదిస్తున్న ‘ప్రజాసాహిత్య వేదిక’ కవులకు కూడా శ్రీశ్రీ సహచరుడే.
ఈ సంకలనంలోని కవే (నవీన్‌) అన్నట్లు,
‘నేల కూలిన వాడి చేత
కవాతు చేయించే కవిత్వమే’ నేడు వస్తున్నది.
నావాడా! నా శ్రీశ్రీ! నా మహాకవీ! ఇంతకన్నా ఏమున్నది నీకు నివాళి!?
(‘ప్రజాసాహిత్య వేదిక’ ప్రచురించిన ‘మానవుడే సంగీతం’ అనే కవితా సంకలనానికి ముందుమాట)

– సతీష్‌ చందర్‌
15 ఫిబ్రవరి 2009

3 comments for “నిన్నటి కలలే నేటి అలలు!

Leave a Reply to Babji Cancel reply