‘నల్లాని’ కిరణం!

 

కేరికేచర్: బలరాం

పేరు: నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి

దరఖాస్తు చేయు ఉద్యోగం: ఎన్నికల ముఖ్యమంత్రి.( ఇప్పటికయితే ముఖ్యమంత్రిగా వున్నాను. కానీ 2014 ఎన్నికలకు జనాకర్షణ వున్న వ్యక్తిని నియమిస్తారని ఊహాగానాలు వున్నాయి. కానీ నేనయితే నమ్మటం లేదు. ఎందుకంటే నాకున్నంత జనాకర్షణ కాంగ్రెస్‌లో మరెవరికి వుంది. చీకటి రాత్రుల్లో కూడా (కరెంటు పీకేశాను కదా!) నేను ప్రకాశించటం లేదూ..!? అందుకే ఎన్నికల ముఖ్యమంత్రిగా నన్ను మించిన నేత కాంగ్రెస్‌కు మన రాష్ట్రంలో దొరకరని చెబుతున్నాను.)

ముద్దు పేర్లు : కి.కు (నా పేరును ఎత్తి కుదేస్తే కి.కు అవుతుంది. అసలు రాష్ట్రం కాంగ్రెస్‌లో ‘క’ గుణింతానికి ప్రత్యేకత వుంది. ‘కాకా’ వున్నారు.’కేకే’ వున్నారు. నేను ‘కికు’ని.) నల్లాటి కిరణం( నలనల్లాని చీకట్లో తెలతెల్లాటి కిరణాన్ని)

విద్యార్హతలు : లా.లా.లా.లా( వెటకారం కాదు. నేను చదివింది ‘లా’.అందుకే నా పని కూడా ‘చట్టం’ చేసుకు పోతోంది. కాబట్టే కదా- సాటి మంత్రుల మీద కూడా ‘కేసు’లు!)

హోదాలు : నా ముఖ్యమంత్రి హోదాను గుర్తించటానికి నిన్నటి దాకా నా మంత్రివర్గ సహచరులే ముఖమాట పడ్డారు. కానీ నేను చూడండి. ముద్దాయిలనయినా సరే మంత్రుల్ని మంత్రులుగా గౌరవిస్తున్నాను.)

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: నేను స్టార్‌ క్రికెటర్‌ లాంటి వాణ్ని. ఆట గెలవటం నాకు ముఖ్యంకాదు. నేను సెంచరీ కొట్టానా? లేదా. అదే ముఖ్యం.

రెండు: జీవ వైవిధ్యానికి నిత్య కృషి చేస్తుంటాను. ఏ రాష్ట్రంలో నయినా ఒకే రకం దోమలుంటాయి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల దోమలున్నాయో. వాటి ఫలితాలు కూడా అంతే వైవిధ్యభరితంగా వుంటాయి.

అనుభవం : నా సగం రాజకీయ జీవితం ‘హౌస్‌’ అరెస్టులోనే ముగిసి పోయింది. (హౌస్‌ అంటే ఇల్లు కాదు, అసెంబ్లీ. ముందు చీఫ్‌ విప్‌ నయ్యా. తర్వాత స్పీకర్‌ నయ్యా. ఇన్నాళ్ళకు విముక్తమయి సెక్రటేరియట్‌కు వచ్చా.)

సిధ్ధాంతం : నాకు నచ్చనది ఆశ్రిత పక్ష పాతం. నేను అందర్నీ సమానంగా చూస్తాను. కాబట్టే నష్టం చెయ్యాల్సి వస్తే, నన్ను ఆశ్రయించిన వారికి చేస్తాను.

వృత్తి : హాస్టళ్ళలో నిద్రలు, గ్రౌండ్లలో ఆటలు.

హాబీలు :1. దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించటం.

2. వేళకాని వేళలో తెలంగాణ మీద ప్రకటనలు ఇవ్వటం.

 మిత్రులు : ఎవరికయినా మేళ్ళు చేస్తే కదా- మిత్రులుండటానికి. వోటర్లను మిత్రులుగా మార్చుకుందామనుకుని, కిలోబియ్యం రూపాయికిచ్చాను. వండుకోవటానికి గ్యాసేదీ అంటున్నారు వాళ్ళు. కిరోసిన్‌ మీద వండుకోవటం చాలా మంది మానేశారు లెండి! ఇదే ప్రగతి!!

శత్రువులు : ఎక్కడయినా వుండొచ్చు. ప్రతిపక్షాల్లో వుండొచ్చు. మిత్రపక్షాల్లో వుండొచ్చు. సొంత పార్టీలో వుండొచ్చు. సొంత కేబినెట్లో వుండొచ్చు. అందుకే అనుమానం వచ్చినవాళ్ళందరి మీదా ఒక ‘చార్జ్‌ షీట్‌’ తయారవుతుంది.

మిత్రశత్రువులు : నాకూడా వుంటూనే ‘ముఖ్యమంత్రిని మారుస్తారు’ అని ప్రచారం చేసేవారు.

వేదాంతం : ‘రామా’ అంటే రానిది, ‘కోదండరామా’ అంటే మాత్రం వస్తుందా?( నేనంటున్నది తెలంగాణ నుద్దేశించి కాదు.)

జీవిత ధ్యేయం : కేబినెట్‌ను సమూలంగా మార్చుకోవటం( కానీ ఎంత మంది తమంతట తాము ఖాళీ చేస్తారు. వాళ్ళ మీద కేసులు వుంటే తప్ప. అప్పటికీ నా సౌకర్యార్థం ఒకరిద్దరు ఆ దారిలో వున్నారు. మేడమ్‌ను కలసి వచ్చాను కదా! ఫలితం చూస్తారు.)

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 19-26 అక్టోబరు 2012 వ సంచికలో ప్రచురితం)

 

 

 

Leave a Reply