వేట


ఒక్కొక్కసారి దు:ఖమే కాదు, సంతోషమూ అలజడిని రేపుతుంది. అనుకోని విజయం కలిగిన రోజు కూడా, మనసు కుదురు ఉండదు. కల్లోల సాగరమవుతుంది. అలల్లా కలలు పోటెత్తుతాయి. గొప్పకలలే కావచ్చు. కలవర పరుస్తాయి. ప్రేయసి కనిపించకుండాపోయినప్పడే కాదు, హఠాత్తుగా కౌగిలి చేరినప్పడూ గుండె గిలాగిలా కొట్టుకుంటుంది. అప్పడు ఎవరన్నా వచ్చి దేవత ప్రశాంతతను బహూకరిస్తే బాగుండునని పిస్తుంది. ఆ దేవత వెలుతురే కానక్కర్లేదు, చీకటి కూడా కావచ్చు.

ప్రతి పూటా

ఒక వేట.

కడలిలో

సూరీడి

వెతుకులాట.

వెలుతురి వలలో

ఏదో ఒక

చీకటి చేప

పడక పోతుందా?

వేటముగిసిందంటే-

చేప చిక్కదు

వలే చినుగుతుంది.

మధ్యలోని పెనుగులాటే

మలి సంధ్య.

చిక్కుముడులు విడుచుకున్న

చీకటి చేప

జాలరికి విశ్రాంతినీ,

జగతికి నిద్రనూ

ప్రసాదించింది.

-సతీష్ చందర్

1 comment for “వేట

Leave a Reply to Mercy Margaret Cancel reply