కుర్రదీ, కుర్రాడూ, ఓ తమిళబ్బాయ్‌!

Photo By: watchsmart

ప్రేమ చౌక- అని చెప్పిందెవరూ..? అదెప్పుడూ ప్రియమైనదే. అనగా ఖరీదయినదే.

కాకుంటే ఇప్పుడు ప్రియాతిప్రియమయి పోయింది.

 

‘నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోదామనుకుంటున్నాను.’ అన్నాడు దేవ్‌.

‘అదేమిటీ? నువ్వు ఉగ్రవాదివా?’ఉలిక్కి పడ్డాడు అతడి మిత్రుడు యమ.

ఒకడు దేవలోకాధిపతిననీ, ఇంకొకడు స్వర్గలోకాధిపతినని ఫీలవుతూ అలా పెట్టుకున్నారు లెండి.

‘అవును. ఇక మీదట ప్రేమోగ్రవాదినవ్వాలని నిర్ణయించుకున్నాను.’

‘ఓహో ప్రేమికుడికి ప్రమోషనొస్తే అలా అవుతాడా?’

‘కాదు ప్రేమికుణ్ణి పీడించుకు తింటే ఈ విధంగా మారతాడు’ దేవ్‌ బదులిచ్చాడు

‘ప్రేమోగ్రవాది అయి ఏంచేస్తావ్‌? తాళాలను వెయ్యని, సెక్యూరిటీ పెట్టని బ్యాంకును చూసి దోచేస్తాను.’

‘ఓహో ఈ మధ్య బ్యాంకు వారు దొంగల్ని కూడా కస్టమర్ల లాగా చూస్తున్నారన్న మాట!’

‘దొరికి పోతే..?’ యమకి మిత్రవాత్సల్యం పొంగుకొచ్చింది.

‘నేతల జీవన స్రవంతిలో కలిసిపోతాను.’ ఇలా అన్నప్పుడు దేవ్‌ చాతి గర్వంతో పొంగింది.

‘అంటే..?’

‘ప్రకృతి వైద్యశాల లాంటి చంచల్‌ గుడా జైలుకి వెళ్ళి మన నేతల్లాగే సిక్స్‌ ప్యాక్‌ బాడీతో తిరిగి వస్తాను.’

‘ఒక వేళ నీ దురదృష్టం కొద్దీ దొంగతనం చేసినా కూడా దొరక లేదనుకో…! అప్పుడూ..?’

‘ఖాయిలా పడ్డ నా ప్రేమ పరిశ్రమలో పెట్టుబడి పెట్టి, నా ప్రియురాలిని పోషిస్తాను.’ అని దేవ్‌ అన్నప్పుడు అతడి కళ్ళల్లో వెలుగులు కనిపించాయి.

‘ఒరేయ్‌ పోషించాల్సింది భార్యని కదా? ప్రియురాలినంటావేమిటి?’

ఇది ధర్మ సందేహం కాదు, ‘యమ’ ధర్మసందేహం.

‘ఒరేయ్‌ యమా! ఇవ్వాళా, రేపూ కాపురం చీపే, ప్రేమే ఖరీదు’

 

పేరుకు యంత యమ- అయినా తన కళ్ళ ముందే మిత్రుడి ఎలా నేరస్తుడయి, జైలుకు వెళ్ళటాన్ని తట్టుకోలేక పోయాడు… దు:ఖంతో కాదు, ఈర్ష్యతో. వాడుకూడా రాజకీయ నేతల్లా జైలు వెళ్ళి ‘సెలిబ్రిటీ’ అయిపోతాడన్న కుళ్ళుతో. అందుకే వారించాలనుకుని ‘కౌన్సెలింగ్‌’ మొదలు పెట్టాడు. వాళ్ళ రూమ్‌కి దగ్గరలోవున్న ఖరీదయిన ‘కాఫీడే’ ను చూసుకుంటూ, దాటుకుంటూ వెళ్ళి ఓ ఇరానీ రెస్టారెంట్‌ లో సెటిలయ్యాక, యమ అరిచాడు- ‘దోచాయ్‌’- అని

‘దోచెయ్య మంటావా? బాంకును దోచెయ్యటమే కరెక్టంటావా?’ అని కంగారు పడ్డాడు దేవ్‌.

యమ దేవ్‌ను తేరిపార చూసి- ‘ఇంతకీ నీ ప్రియురాలికేమయిందిరా?’ అని అడిగాడో లేదో, దేవ్‌ దిక్కులు చూసి బావురు మన్నాడు. వెక్కివెక్కి ఏడ్చాడు.

‘పోయిందా?’ అనడిగేశాడు తొందర్లో.. ఎంతయినా యముడు కదా!

దేవ్‌ తన శోకానికి సడన్‌ బ్రేకు వేసి.. ‘పుట్టిందిరా!’ అని మళ్ళీ ఏడుపు అందుకున్నాడు.

‘ఎప్పుడూ..? నీ కన్నా ముందా?’

‘కాదురా! ఇవ్వాళే’ అని అంటూ మళ్ళీ దీర్ఘాలు తీసాడు దేవ్‌

‘దానికేడుపెందుకురా?’

‘స్మార్ట్‌ ఫోన్‌ను బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తానన్నాను.’

‘అంతేనా? ఫ్లోలో ఇంకా ఏమయినా కమిట్‌ అయ్యావా?’

‘ఇంపోర్టెడ్‌ బైక్‌ మీద లాంగ్‌ డ్రైవ్‌కు తీసుకు వెళ్తానన్నాను.’

‘ఇంకా?’

‘ఒక మాంచి ఏసీ రెస్టారెంట్‌లో డిన్నర్‌ హోస్ట్‌ చేస్తానన్నాను.’

‘ఓస్‌ అంతే కదా? ప్రొసీడ్‌. దీనికి ఏడుపెందుకురా పిచ్చిసన్నాసి. పైపెచ్చు మీ ఇద్దరి ప్రేమకీ ఎవరో అడ్డొచ్చినట్లు ప్రేమోగ్రవాదినయిపోతానంటావేమిటి?’ అన్నాడు యమ.

 

‘నువ్వన్నది నిజమే. మా ఇద్దరి ప్రేమకీ ఒకే ఒక వ్యక్తి అడ్డొచ్చాడు.’ అన్నాడు శూన్యంలోకి చూసి, పిడికిళ్ళు బిగిస్తూ.

‘ఎవరూ? వాళ్ళ నాన్నా? మీనాన్నా?’

‘వాళ్ళెవరూ కాదు.’

‘నేను కాదు కదా?’ యమ భుజాలు తడుముకున్నాడు.

‘నీకంత సీను లేదు.’

‘మరెవ్వరూ..?’

‘తెల్లటి పంచె, తెల్లటి చొక్కా వేసుకుంటాడు. దళసరి కళ్ళ జోడు పెట్టుకుంటాడు. ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడతాడు. ఇంకా గుర్తుకు రాలేదా..?’

‘…………..!’

‘చిదంబరం! అవును ఆయనే. రెండువేలు దాటిన సెల్‌ ఫోన్లమీదా వేశారు. బైకుల్నీ కుదిపేశారు. ఏసీ రెస్టారెంట్లనూ వాయించారు.. పన్నుల్తో. ఇప్పుడు నేను ప్రేమించాలంటే ఏం చెయ్యాలి చెప్పు…! నా స్థానంలో నువ్వుంటే ఏం చేస్తావ్‌?’ సీరియస్‌ గా అడిగాడు దేవ్‌

‘నేరం చెయ్యను. విడాకులిచ్చేస్తాను.’

‘రేయ్‌! యమా.. నాకింకా పెళ్ళి కాలేదురా..!?

-సతీష్‌ చందర్‌

(ఆంధ్రభూమి దినపత్రిక 2 మార్చి 2013 వ తేదీ సంచికలో ప్రచురితం)

Leave a Reply