కిరణ్‌ కేబినెట్‌లో ‘లీకు’ వీరులు!!

టాపు(లేని) స్టోరీ:

kiran kumarపథకాలు కూడా సినిమాల్లా అయిపోయాయి. సినిమాలకు ఉన్నట్టే వీటికీ ఫార్ములాలు వుంటాయి. ఫార్ములాను తప్పి ఎవరన్నా పథకం పెడితే, దాని భవిష్యత్తు చెప్పలేం.

సినిమాలకు స్ప్రిప్టు రైటర్లున్నట్టే, పథక రచయితలు కూడా వుంటారు. అసలు రచయితలు అసలు కనపడనే కనపడరు. కనిపిస్తే జనం దడుచుకుంటారు. అందుకే వారిని ‘ఘోస్ట్‌’ రైటర్లూ అంటారు. మరీ అనువాదం తప్పదంటే ‘భూత’ రచయితలనుకోవచ్చు.

అయితే ఒక్కొక్క సారి నిర్మాణంలో వుండగా సినిమా కథ కానీ, టైటిల్‌ కానీ లీక్‌ అయితే, అసలు బయిటకు రాకుండానే కాపీ పథకాలను పోటీ పార్టీల వారు ప్రకటించేసి ‘మానిఫెస్టో’లను విడుదల చేసేస్తారు. అధికార పక్షంలో వున్న వాళ్ళకి ఈ ‘కాపీ’ భయం చాలా వుంటుంది. తీరా ప్రతిపక్షాల వాళ్ళు కానీ అలాంటి పథకం ఒక టి ప్రకటించేశారనుకోండి, ఆ తర్వాత ప్రభుత్వం అదే పథకాన్ని అమలు చేయటం మొదలు పెట్టినా, అది తమ వత్తిడి వల్లే చేశారని ప్రతిపక్షాలు జనంలోకి వెళ్ళి పోతాయి.

అందుకే ప్రకటించేటంత వరకూ పరమ జాగ్రత్తగా వుంటారు. అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ జాగ్రత్త మితి మీరి పోయింది. తన కేబినెట్‌ సహచరులకు కూడా చెప్పటం మానేశారు. వాళ్ళు కూడా చానెళ్ళలో చూసి ‘అవునా!’ అనుకుంటున్నారు. అంతే కాదు. తమని తాము గిల్లికూడా చూసకుంటున్నారు. ‘ఈ వార్త నిజమేనా?’ అని తెలుసుకోవటానికి కాదు. ‘తామూ ప్రభుత్వంలో భాగమే కదా- అని అనుకోవటానికి!

కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ మధ్య మాంచి ‘సెంటిమెంటు’ తెలుగు చిత్రానికి పనికొచ్చే టైటిల్‌ పెట్టారు ‘బంగారు తల్లి’. (సీరియల్‌ కు ఇంకా బాగుంటుందనుకోండి. కానీ సినిమావాళ్ళు చప్పరించి వదిలేశాక కదా సీరియల్‌ వాళ్ళు తీసుకునేది!)

చదువుకునే ఆడపిల్లలకు కాలేజీ కొచ్చాక ఒక సారి, డిగ్రీకి వచ్చాక ఒక సారి ప్రోత్సాహక నగదు బహుమతులు ఇచ్చుకుంటూ వెళ్ళే ఈ పథకానికి ఆయన ఈ పేరు పెట్టారు. బంగారం ధర తగ్గు ముఖం పట్టిందని ఈ పేరు పెట్ట లేదు. అలాగని బంగారం మీద మోజుతో కూడా ఈ నామకరణం కాదు.( అంత మోజుండటానికి ఆయన స్వగ్రామం బళ్ళారీ కాదు, ఆయన ఇంటి పేరు ‘గాలీ’ కాదు.) బంగారం ఆస్తి అని మాత్రం ఆయనకు తెలుసు. ఆడపిల్లల పుడితే ‘అప్పు’ అని అనుకోకుండా ‘ఆస్తి’ అని భావించాలన్న ఉద్దేశంతో ఈ పేరు పెట్టారు.

ఆయన ఇంత కష్ట పడి ఆ పేరు పెడితే -‘బంగారు తల్లా? ఆవిడెవరూ!’ అని.

ఈ స్క్రిప్టు ఇంత గొప్పగా వున్నా, ఇది ఒరిజినల్‌ కాదు. గతంలో ఆడ పిల్ల పుట్టగానే ‘అయిదువేలు రూపాయిలు’ రిజిస్ట్రేషన్‌ చేస్తానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

కిలో బియ్యం పథకం మాత్రం ఒకరి సొంతమా? ఏమిటి? తమిళనాడులో ఎమ్జీఆర్‌, తెలుగు నాట ఎన్టీఆరూ పెట్టారు. అన్నీ ‘రీమేకు’లే.

అంతెందుకు? కేంద్రంలో కాంగ్రెస్‌ డప్పు వేసుకుంటున్న ‘నగదు బదలీ’ గురించి గతంలో చంద్రబాబు ప్రకటించిందే . ఆప్పుడాయన దీనిగురించి మాట్లాడితే కూడా ‘నేరుగావోటరుకు లంచం ఇచ్చేస్తారా?’ అని నోళ్లు నొక్కుకున్నారు.

కాపీ చేసుకోవచ్చు. కానీ కాస్త ఆగి చేసుకోవచ్చు. అదే ఎన్నికల కాలానికి చేస్తే ప్రయోజనం పోతుంది. బహుశా కిరణ్‌ కుమార్‌ రెడ్టి అనుమానం ఏమిటంటే ,’లీకు వీరులు’ కాంగ్రెస్‌ పార్టీలో కూడా వుంటారని. వాళ్ళే శత్రు పక్షాలకు ‘లీక్‌ ‘ చేస్తారని!

సొంత పార్టీలో, సొంత సర్కారులో, సొంత మంత్రి వర్గ సహచరులనే నమ్మలేని ముఖ్యమంత్రి మరింకెవర్ని నమ్ముతారో!

న్యూస్‌ బ్రేకులు

మరి ‘చెయ్యి?’

కర్ణాటకలో అవినీతిలో కూరుకుపోయిన బీజేపీ ఓటమి ఖాయం

-పురంధేశ్వరి, కేంద్ర మంత్రి

అలాగాయితే అక్కడ పోయేది ‘పువ్వు’, ఇక్కడయితే ‘చెయ్యి’.

వికలాంగుల హక్కుల ను రాష్ట్ర ప్రభుత్వం కాల రాస్తోంది.

-మంద కృష్ణ, ఎం,ఆర్‌.పి.ఎస్‌ అధినేత

అక్కడికి ‘సకలాంగుల’ హక్కులను రక్షిస్తున్నట్లు!!

ట్విట్టోరియల్‌

నడిచేస్తే పోయేవి దూరాలు కాదు, ‘పొట్టలు’!

రాజకీయాల్లో ముందు ‘ఆహార్యాలు’ (వస్త్ర ధారణలు) మారాయి. తర్వాత ‘ఆకారాలు’ కూడా మారాయి. మారుతున్నాయి కూడా. ఒకప్పుడు ‘పంచె, లాల్చీ, కండువా’ వుండేది. ఇప్పుడు ‘పంచెలు’ కట్టే వారు తగ్గారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో, రాజకీయ నాయకుల సగటు వయసును మార్చేశారు. అంతవరకూ అరవయి పైబడితేనే కానీ తమ ‘అవశేష జీవితాన్ని’ జాతికి అంకితం చేయటానికి ముందుకు వచ్చే వారు కారు.కానీ ఆయన పుణ్యమా- అని పాతిక, ముప్ఫయిలలో వాళ్ళు కూడా రాజకీయప్రవేశం చేశారు. వాళ్ళు పంచెల స్థానంలో ‘ఫ్యాంట్లు’ ధిరించి వచ్చారు. కానీ ‘పొట్టలు’ మామూలే. తర్వాత ‘ఆకారాలు’ కూడా మారాయి. కారణం పాద యాత్రలు. అందరూ నడిచి నడిచి ‘స్లిమ్‌’ అయిపోతున్నారు. నాలుగువందల కిలోమీటర్లు నడిస్తేనే ‘నాయకుడు’ కాలేడు- అన్నది నానుడిగా స్థిరపడేటట్లు వున్నది.

‘ట్వీట్‌ ఫర్‌ టాట్‌

విచార వదనుడు

పలు ట్వీట్స్‌: భారత ఖైదీ సరబ్‌ జిత్‌ మీద దాడి చేస్తే ప్రధాని మన్‌మోహన్‌ ఏం చేస్తున్నారు?

కౌంటర్‌ ట్వీట్‌: దాడి చేయక ముందునుంచే విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఈ- తవిక

‘అత్యాచారా’ బాద్‌!

నిజమే.

ఎవరూ చెయకుండానే

హైదరాబాద్‌ దేశానికి

రెండవ రాజధాని అయిపోయింది.

అత్యాచారాల్లో,

ఢిళ్లీ తర్వాత స్థానం

భాగ్యనగరానిదే.

వెక్కివెక్కి గర్విద్దామా?

బ్లాగ్‌ (బ్లాక్‌) స్పాట్‌:

‘సిబిఐ కి బొగ్గు అంటుకున్నదట కదా!’

‘ముందు నల్ల కళ్ళ జోడు తీసి మాట్లాడు’

కొట్టేశాన్‌( కొటేషన్‌):

వ్యవసాయాన్ని వదలేస్తే ఏమవుతారు? మహా అయితే బతికి పోతారు.

-సతీష్ చందర్

(సూర్యదిన పత్రిక 7 మే 2013 తేదీ సంచికలో ప్రచురితం)

 

Leave a Reply