డియల్‌.. డియల్‌… డియ్యాలో..!!

పేరు : డి.యల్‌. రవీంద్రారెడ్డి 

కేరికేచర్: బలరాం

కేరికేచర్: బలరాం

ముద్దు పేరు : ‘డియ్యాలో’

విద్యార్హతలు : ‘అసమ్మతి’లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌

హోదాలు : నాకే హోదా కొత్త కాదు. శాసన సభ్యత్వమూ కొత్త కాదు.(ఆరు సార్లు మైదుకూరు స్థానంనుంచి ఎన్నికయ్యాను.) మంత్రి పదవి అస్సలు కొత్త కాదు. పలువురు మఖ్యమంత్రుల కేబినెట్ల వున్నాను. ఎటొచ్చీ ఇప్పుడు వచ్చిన హోదా యే కొత్త. అదే ‘తొలగించబడ్డ మంత్రి'( ఈ కొత్త హోదావల్లనే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పరువుతీసి పందిరి వేయగలుగుతున్నాను.)

గుర్తింపు చిహ్నాలు : ఒకటి: ‘కిరణ’మున్న చోట ‘రవి'(సూర్యుడు) వుండడు. రవి వున్న చోట ‘కిరణ’ముండదు. ఇద్దరికీ రేయికీ, పగలకూ వున్న సంబంధం. నేను లేని కేబినెట్‌ ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు.

రెండు: ‘అసమ్మతి’ ఎక్కడ వుంటుందో, అక్కడ నేనుంటాను.

అనుభవం : రాష్ట్రంలో కాంగ్రెస్‌ లో అధికారంలో వున్నప్పుడెల్లా, ముఖ్యమంత్రి, పిసిసి నేతతో పాటు, మూడో ముఖ్యమైన పదవి వుంటుంది. అదే అసమ్మతి నేత పదవి. చెన్నారెడ్డి, జనార్థనరెడ్డి, విజయభాస్కరరెడ్డి లు ముఖ్యమంత్రులుగా వుండగా, ‘అసమ్మతి నేత’ పదవిని సాక్షాత్తూ వై.యస్‌ రాజశేఖరరెడ్డే నిర్వహించారు. వైయస్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆ పదవుల్ని కొన్నాళ్ళు ‘పి.జె.ఆర్‌’, కొన్నాళ్ళు ‘కాకా’లు నిర్వహించారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ‘అసమ్మతి నేత’ పదవికి నేను పోటీ లేకుండా ఎన్నికయ్యాను. ఈ పదవి నిర్వహించే వారికి పార్టీ హైకమాండ్‌ ఆశీస్సులు ఎప్పుడూ మెండుగా వుంటాయి. ఇదీ నా అనుభవం.

వేదాంతం : ఎంత తోమితే మాత్రం ఇత్తడి, పుత్తడి అవుతుందా? యుధ్ధం తెలియిని సైన్యాధిపతి చొక్కాకు ఎన్ని ‘పథకాలు’ తగిలిస్తే మాత్రం వీరుడయిపోతాడా?(కిరణ్‌ కుమార్‌ రెడ్డి అలాగే ఫీలవుతున్నారు.)

వృత్తి : ఒక్కటే వృత్తి. కిరణ్‌ అవునంటే కాదనటం, కాదంటే అవుననటం.( కళంకిత మంత్రుల ప్రాసిక్యూషన్‌కు అనుమతిని కిరణ్‌ కాదంటే, నేను అవునన్నాను.)

హాబీలు :1. పార్టీ ఆదేశిస్తే బలిపశువు కావటానికి కూడా సిధ్దమే. లేకుంటే ఫలితం ముందుగా తెలిసి కూడా జగన్‌ మీద పోటీకి ఎందుకు సిధ్ధపడతాను?

2. నా జూనియర్లు నా కన్నా వున్నత పదవుల్లో వున్నా సరే వారికి ‘పాఠాలు’, ‘గుణపాఠాలు’ చెబుతూనే వుంటాను

 నచ్చని విషయం :‘కళంకిత’ మంత్రులను బయిటకు పంపించిన సందర్భంలోనే ‘అసమ్మతి మంత్రి’ ని కూడా పంపించటం.

మిత్రులు : మంత్రుల్లో నాలాగా ఎందరో. నేను బయిట పడ్డాను. మరొకరు బయిట పడరు.

శత్రువులు : కాంగ్రెస్‌లో వున్న వారికెవరికయినా, శత్రువులను బయిట వెతుక్కోవాల్సిన ఖర్మ ఏర్పడదు.

జపించే మంత్రం : రాష్ట్ర ప్రభుత్వం వన్‌ మ్యాన్‌ షో కాదు.

విలాసం : సీఎల్పీ కార్యాలయమే. కానీ నేను అక్కడకువెళ్ళితే కిరణ్‌ అనుయాయులు ‘తాళాల’తో వచ్చారు. వారికి కిరణ్‌ ముందు ‘తాళం’ వేస్తుంటారు లెండి.

గురువు : జూనియర్లే ‘ముఖ్య’ పదవుల్లో కూర్చున్నప్పుడు, సీనియర్లనూ, గురువులనూ తలచుకునే వీలుండదు.

జీవిత ధ్యేయం : ముఖ్యమంత్రి పదవికి ‘అసమర్థ’ నేతలే కాదు, ‘అసమ్మతి’ నేతలు కూడా అర్హులే!

-సతీష్ చందర్

(గ్రేట్ ఆంధ్ర వార పత్రిక 8- 15 జూన్ 2013 వ సంచికలో ప్రచురితం)

Leave a Reply