బూటుకాలి కింద ‘బూడిద’ లేదంటారా?

తలుపు తెరిచే వుంది. ఏం లాభం? అడ్డుగా కర్టెన్‌. పేరుకే పారదర్శకత. కానీ అంతా గోప్యం. ఇదీ మన ప్రజాస్వామ్యం. అన్నీ వ్యవస్థల్నీ అనలేం కానీ, కొన్నింటిలో అయితే మామూలు తెరలు కావు, ఇనుప తెరలు వుంటాయి. అలాంటివే రక్షణ, న్యాయ వ్యవస్థలు. అవి సామాన్యమైన వ్యవస్థలా? ఒకటి దేశాన్ని కాపాడేదీ; మరొకటి వ్యక్తిని కాపాడేది. వారి నియామకాలు, బదలీలు, క్రమశిక్షణా చర్యలూ అంతా గోప్యమే. ఎవరయినా ‘ఇనుప తెర’ను తొలగించే ప్రయత్నం చేశారా..చిక్కుల్లో పడ్డట్టే.

’తెర‘ తీశాక…‘ఉరి’తాడా..? 

సైన్యంలో అతికింది స్థాయి జవాన్లు ఇద్దరు ఇటీవల( ఈ ఏడాదే) ఈ ‘తెర’ తీసే ప్రయత్నం చేశారు. ప్రాణాలకు తెగించి సరిహద్దులు వద్ద కాపలా కాసే తమకు, తమ శాఖ ఎంత ‘గొప్ప’ తిండిపెడుతుందో(ఉడికీ ఉడకని చపాతీలు, పాచిపోయిన పప్పూ) వివరిస్తూ ‘సోషల్‌ మీడియా’ లోఒక వీడియోను వదిలాడు తేజ్‌ బహదూర్‌ యాదవ్‌. జవానుల్లో ‘ఆర్డర్లీ’ల (సహాయకుల) చేత చెయ్యిస్తున్న ‘దేశ’ సేవ ( పై అధికారుల కుక్కల్ని వ్యాహ్యాళికి తీసుకు వెళ్ళటం, వాళ్ళ పిల్లల్ని బడుల్లో దించటం వగైరా..) ను దృశ్యమానం చేస్తూ మరో వీడియో లో దర్శనమించ్చాడు ఇంకో జవాను రాయ్‌ మాథ్యూ. అధిక శాతం ‘నెటిజన్లు’ ‘అయ్యో.. పాపం’ అన్నారు. కానీ వారి పై అధికారులు ఈ తెగింపును ‘క్రమశిక్షణా రాహిత్యం’ అన్నారు. సరే.. ఇంతకీ ఈ ‘ఇనుప తెర’లు తీసినవారు ఏమయ్యారు? యాదవ్‌ ఉద్యోగం కోల్పోతే, మాథ్యూ ప్రాణమే కోల్పోయాడు.(ఉరికి వేళ్ళాడుతూ కనిపించాడు.) ఇక్కడే చిన్న వివరణ: పై అధికారుల మీద లేని పోని నిందలు వేసానన్న అపరాధ భావనతో మాథ్యూ ఆత్మహత్య చేసుకున్నాడని సైన్యం తరపున అధికారిక వాదన వచ్చింది. ఎవరూ ముక్కు మీద వేలేసుకోవాల్సిన పనిలేదు. సైనిక చట్టం తన పనిని తాను ఇలాగే  ‘సైలెంట్‌’ గా చేసుకు పోతుంది.

ప్రజాస్వామ్యానికి ఎడమగా  న్యాయస్వామ్యం

న్యాయవ్యవస్థలోపల జరిగే న్యాయం కూడా అత్యంత గోప్యమైనది. నిజం చెప్పాలంటే మనదేశంలో న్యాయవ్యవస్థ ‘స్యయంభువు’. తనను తానే సృష్టించుకుంటుంది. నాయ్యమూర్తులతో ఏర్పాటయిన ‘కొలీజియమే’ న్యాయమూర్తులను ఎంచుకుంటుంది. అబ్రహాం లింకనే బతికి వుండి, భారత దేశం వచ్చి, ఇక్కడి న్యాయవ్యవస్థను చూస్తే-న్యాయమూర్తుల కోసం, న్యాయమూర్తుల చేత, ఏర్పడే న్యాయమూర్తుల స్వామ్యమే న్యాయస్వామ్యం అని నిర్వచించే వాడేమో! అంటే దేశ ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ కీలకమే కానీ, అందులోని అత్యున్నతమైన పార్లమెంటుకు చిక్కకుండా అతి జాగ్రత్తగా ‘స్యీయ పాలన’ను అనుభవిస్తోంది ఈ న్యాయ(మూర్తుల) వ్యవస్థ. తనకు తానుగానే ‘కొలీజియం’ వ్యవస్థను ఏర్పరచుకుని, న్యాయమూర్తులతో న్యాయమూర్తులను ఎంపిక చేసుకుంటోంది. పాపం మధ్యలో కేంద్రం.. పార్లమెంటు పరిధిలోకి తెచ్చి ‘ నేషనల్‌ జ్యూడిషియల్‌ అప్పాయింట్‌ మెంట్‌ కమిషన్‌ ‘(ఎన్‌జెఎసి) ద్వారా నియమకాలు చేద్దామని చేసింది. కానీ న్యాయమూర్తుల వ్యవస్థ, కేంద్రం పప్పులు ఉడకనివ్వలేదు.

పారదర్శకత లోపించిన చోట సహజంగానే ‘పక్షపాత వైఖరి’ వుందనే అపోహలు వస్తాయి. అవి నిజమో కాదో, నిగ్గుతేల్చే మరో వ్యవస్థ వుండనే ఉండదు. అలాంటప్పుడే, కొందరు ‘గిరులు’ దాటే ప్రమాదం వుంటుంది. రక్షణ వ్యవస్థ మీదా, న్యాయ వ్యవస్థ మీదా నమ్మకం సడలి పోకూడదు. అలా జరిగితే పౌరుల మనుగడకే ప్రమాదం. అవి పటిష్టంగా వుండాల్సిందే. కానీ తమ పటిష్టతకు,ప్రతిష్ట కూ తామే భంగం కలిగించుకునే స్థితికి ఆ వ్యవస్థలు వెళ్ళినప్పుడు, మనంగా ఎన్నుకున్న పార్లమెంటు చేతులు ముడుచుకుని కూర్చోకూడదు.

కొరకు రాని కొయ్యగా జస్టిస్ కర్నన్
నేడు కోల్‌కొతా హైకోర్టు జడ్జిగా వున్న జస్టిస్‌. సి.ఎస్‌ కర్నన్‌ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. ఆయన మీద కోర్టు ధిక్కార అభియోగాన్ని ధ్రువీకరిస్తూ, ఆయనకు ఆరు నెలల కారాగార శిక్ష విధించింది. ఆ మేరకు ఆరెస్టు కోసం పోలీసులు వెళ్ళారు. ఆయన కనపడక పోగా, ఆయన తరపు న్యాయవాది, సుప్రీం ధర్మాసనం వేరే కేసు విచారిస్తుండగా ప్రత్యక్షమయ్యారు. ఇలా సర్వీసులో వున్న హైకోర్టు జడ్జి పై ఈ తరహా చర్య తీసుకోవటం ఇదే ప్రథమం. నిజంగానే న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక జడ్జి ఇంత ‘పెంకె’ గా వుండటం ఇదే మొదలు కావచ్చు. అందుకు కర్నన్‌ తగిన ‘శాస్తి’ జరిగిందని న్యాయకోవిదులు భావించనూ వచ్చు. కానీ ఈ చర్యతో నిజంగానే క్రమశిక్షణా రాహిత్యం ఆగిపోతుందా?

జస్టిస్‌ కర్నన్‌ లేపిన దుమారం ఇప్పటిది కాదు. ఇది ఆరేళ్ళ చరిత్ర. మద్రాసు హైకోర్టు జడ్జిగా వుంటుండగా(2011లో) ఆయన జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్‌( ఎన్‌సిఎస్‌సి) కు ఒక ఫిర్యాదు చేశాడు. అప్పటి వరకూ ఆయన ‘దళిత సామాజిక వర్గం’ నుంచి వచ్చినట్లు లోకానికి తెలియదు. తాను ఒక ఫంక్షన్‌ లో వున్నప్పుడు తన పక్కన ‘సోదర న్యాయమూర్తి’ బూటు తనకి రాసుకునేట్టుగా కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. తాను దళితుడు కావటం వల్లనే, న్యాయమూర్తిగా వున్నప్పటికీ, ఇలా అవమానించారన్నది ఆయన ఫిర్యాదు సారాంశం. ఇలా ‘బూటు రాపిడి’ తో మొదలయిన వివాదం.. చిలికి, చిలికి గాలివానయింది. జస్టిస్‌ కర్నన్‌ అక్కడితో ఆగలేదు. న్యాయమూర్తుల నియామకాలపై వచ్చిన ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని( పిల్‌ని) మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ విచారిస్తుండగా, జస్టిస్‌ కర్నన్‌ హఠాత్తుగా కోర్టు హాలులో ప్రత్యక్షమయి ‘న్యాయమూర్తుల నియామకం న్యాయబధ్ధంగా లేదు’ అని కామెంట్‌ విసిరి వెళ్ళిపోయారు. ఇంకో సారి మరో జడ్జి  ‘ఇంటెర్న్‌’ గా వున్న మహిళా జడ్జిని లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపణలు కూడా చేశారు. ఆ తర్వాత ఆయన తనకు అప్రధానమైన బాధ్యతలు అప్పగించారని సెలవు మీద వెళ్ళటమూ, ఆయన్ని కోల్‌కొతా హైకోర్టుకు బదలీ చెయ్యటమూ, న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రధానికి లేఖ రాయటమూ చకచకా జరిగి పోయాయి. ఆయన పై సుప్రీం ఒక తీర్పు చెబుతూ, తాను కూడా సుప్రీయం న్యాయమూర్తుల పై మరో తీర్పు చెప్పటమూ, అంతిమంగా అరెస్టు వరకూ రావటమూ కూడాముగిసి పోయాయి.

’మతి‘ తప్పిందా..?

జస్టిస్‌ కన్నన్‌ రాష్ట్రపతి చేత ‘ఉత్తమ ఉపాధ్యాయుడి’ గా అవార్డు పొందిన టీచర్‌ తనయుడు. విద్యార్ధి దశలోనే కాకుండా, న్యాయవాదిగా మంచి రికార్డు వున్న వ్యక్తి. ఈ న్యాయమూర్తి ‘క్రమశిక్షణా రాహిత్యం’ అడుగడుగునా కనిపించ వచ్చు. కానీ ఆయన లేవ నెత్తిన ‘బూటు కాలి’ అవమానం అడుగున పడిపోయింది. ఆయనకు మతి భ్రమించిందో లేదో తెలుసుకోవటం ‘గోప్యమై’న న్యాయవ్యవస్థకు ఎంత ముఖ్యమో, తన సొంత గూటిలో ‘కుల వివక్ష’ వుందో లేదో తేల్చుకోవటం అంతే ముఖ్యం.

ఉన్న నిబంధనల ప్రకారం సైన్యంలో వున్న అట్టడుగున ఆ ఇద్దరు జవాన్లు ఏ ‘తప్పు’ చేశారో,,, న్యాయవ్యవస్థలో వున్న జస్టిస్‌ కన్నన్‌ కూడా అదే ‘తప్పు’ చేశారా…!?

-సతీష్ చందర్

12 మే 2017

4 comments for “బూటుకాలి కింద ‘బూడిద’ లేదంటారా?

  1. ఆయనకు మతి భ్రమించిందో లేదో తెలుసుకోవటం ‘గోప్యమై’న న్యాయవ్యవస్థకు ఎంత ముఖ్యమో, తన సొంత గూటిలో ‘కుల వివక్ష’ వుందో లేదో తేల్చుకోవటం అంతే ముఖ్యం.
    నిజం. .