‘శంకల’ అయ్యర్‌!

కేరికేచర్: బలరాం

పేరు :మణి శంకర్‌ అయ్యర్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: కేంద్ర వివాదాస్పద వ్యాఖ్యల శాఖా మాత్యులు. (బీజేపీ ఎలాగూ ఇవ్వదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక, ఇలాంటి శాఖను ఏర్పాటు చెయ్యటానికి వెనకాడదు కానీ, ఆ పదవి నాకివ్వటానికి ఇష్టపడదు. ఇంకేదన్నా సర్కారు వస్తే ఇస్తుందేమో చూడాలి.)

వయసు : ఏం? ఎందుకా సందేహం? వయసుకు తగ్గట్లు మాట్లాడటం లేదేమిటనా..? ‘తలలు బోడులయిన.. తలపులు బోడులవునా’ అని మీ తెలుగులో అంటారు. ఏడుపదులు దాటినవి నాకు కానీ, నా నాలుకకు కావు. (కావాలంటే మోడీజీ చెబుతారు. అదేమిటో.. సరిగ్గా ఎన్నికల ముందే ఆయన్ని ఏదో ఒకటి అనాలని అనిపిస్తుంది. నా చేత అనిపించుకోవటం ఆయనకు ఇష్టమో, లేదో తెలీదు కానీ, బోలెడంత లాభం. ‘ఆయన ప్రధానికి పనికి రాడు. మహా అయితే ఎఐసిసిలో ఛాయ్‌ అమ్ముకోవటానికి పనికొస్తాడు’ అన్నాను. దాంతో ‘ఛాయా వాలా’ గా తనను తాను చెప్పుకుని ఎన్ని వోట్లు సంపాదించుకున్నాడో లెక్కలేదు.)

ముద్దు పేర్లు : ‘శంకల’ అయ్యరు.( నాకన్నీ అనుమానాలే. వాటినే కామెంట్లుగా చేస్తుంటాను. నాకూ ములాయం సింగ్‌కు పోలిలున్నాయని అనుమానం. దాంతో స్త్రీలు అభ్యంతరం చెప్పే వ్యాఖ్యలు చేసేశాను.) నారద ‘ముని’ శంకర్‌ ( కలహ భోజనుడిగా నాడు నారదుడికున్న పేరునే, నేనూ గడిస్తున్నాను. కిట్టని వాళ్లు తిట్టుకుంటే నేనేం చేసేదీ..!?)

విద్యార్హతలు : ఎకానమీ చదివాను. నోట్లను పొదుపు గా ఖర్చుచేస్తాను కానీ, మాటలను దుబారా చేస్తాను. నేను క్రీడా మంత్రిగా వున్నప్పుడు(2007లో) ఢిల్లీలో ‘యాసియాడ్‌’ ఆటల మీద పైసలు ఎందుకు వృధా చెయ్యాలీ అన్నాను. పేదలమీద ఖర్చు చెయ్యవచ్చు- అని హితవు పలికాను.

గుర్తింపు చిహ్నాలు :ఒకటి: నాకు కమిట్‌మెంట్‌ ఎక్కువ. నేను ఏ పార్టీలో వుంటే ఆ పార్టీకే నష్టం చేస్తాను కానీ, వేరే పార్టీకి నష్టం చేశాను. ( ఇంత వరకూ నా వ్యాఖ్యలన్నిటి వల్లా, నేను కాంగ్రెస్‌ పార్టీకే ఎక్కువ నష్టం కలిగించాయి.)

రెండు: నాకు నాలుకే కాదు, కలం కూడా వాడిగా వుంటుంది. అప్పుడెప్పుడో తమిళనాడులో జయలలిత గురవయ్యూరు దేవాలయానికి ఏనుగును బహూకరిస్తానన్నారు. అప్పుడు నావంతుగా నేను జయలలితను బహూకరిస్తానని రాసి పారేశాను.(గొడవలు మామూలుగా వస్తాయా..?)

సిధ్ధాంతం : చులకన వాదం. ఎంత పెద్ద హోదాలో వున్నవారినయినా క్షణంలో చులకన చెయ్యటమే నా సిధ్ధాంతం. ఆ రకంగా వారిని నేల మీదకు దించేస్తుంటాను. మోడీని అదే చేశాను.

వృత్తి : నోరు జారటం. ఇంతకు మించి ప్రధాన వృత్తి ఏముంటుంది..?

హాబీలు :1.కింద నుంచి పైకొచ్చిన వాళ్ళని గుర్తించటం. ‘ఛాయ్‌ వాలా’ నుంచి దేశ ‘ప్రధాని వరకూ ఎదిగిన నరేంద్ర మోడీని గుర్తించి పొగడ లేదూ..!?

2. మత సామరస్యం గురించి పాకులాడతాను. అందుకే కదా. ముస్లిం నేత అయిన మహ్మద్‌ అలీ జిన్నాకీ, హిందూ నేత అయిన వీర్‌ సావర్కర్‌కీ పెద్ద తేడా లేదన్నాను. భక్తి ఉన్మాద స్థాయికి చేరాక ఒకే లా మండుతుంది కదా! ( కానీ విమర్శల పాలయ్యాను.)

అనుభవం : ఎన్నికల్లో ఘన విజయాల్నీ చూశాను; డిపాజిట్లనూ కోల్పోయాను.

మిత్రులు : నేను చేసింది ‘ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌’ కదా- ఐడియాస్‌ అన్నీ యూనివర్శల్‌ గా వుంటాయి. కాబట్టి ఫ్రెండ్స్‌ కూడా అలాగే వుంటారు.

శత్రువులు : నేను అన్నది నరేంద్ర మోడీని. కానీ నన్ను సస్పెండ్‌ చేసింది కాంగ్రెస్‌ పార్టీ వారు. శత్రువులు ఎవరని చెప్పాలి?

మిత్రశత్రువులు : నా భాషను వక్రీకరించే వారు. .

వేదాంతం : భావాన్ని చెప్పటానికి భాష సరిపోదు. నరేంద్ర మోడీని ‘నీచ్‌ ఆద్మీ’ అన్నాను. అప్పుడు తెలసింది.. నాకు తెలిసిన హిందీ రాజకీయాలకు సరిపోదని. ‘నీచ మనస్తత్వం వున్న మనిషి’అనే ప్రయత్నం చేస్తే. ‘తక్కువ తరగతులకు చెందిన మనిషి’ అని వాళ్ళు అర్థం తీసుకున్నారు. ఆశ్చర్యం! మా కాంగ్రెస్‌ వాళ్ళకు కూడా అలాగే అర్థమయ్యిందట!

జీవిత ధ్యేయం : 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కూడా మోడీని ముచ్చటగా మూడో కామెంట్‌ చేసి మరో మారు ఆయన్ని గెలిపించాలని. (2014 ముందు ‘చాయ్‌ వాలా’ కామెంట్‌ చేశానా? ఎలా గెలిచారో చూశారు కదా! ఇప్పుడు గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా ‘నీచ్‌ ఆద్మీ’ కామెంట్‌ చేశాను కదా! మోడీ బీజేపీని గెలిపిస్తారనే ఆశిస్తున్నాను. వోటర్లు ఎన్నికల ‘బూతు’లకు వెళ్ళే వేళ, ‘నీతి చంద్రిక’ చదివినా ‘బూతు’ మాటలాగే వుంటుంది.)

-సతీష్‌ చందర్‌

(గ్రేట్ఆంధ్ర వారపత్రిక లో ప్రచురితం)

1 comment for “‘శంకల’ అయ్యర్‌!

Leave a Reply